13_003 సాక్షాత్కారము 06

 

ద్వితీయాశ్వాసము

 

తే. గీ.     “ తీపితలపులు పులకింప తేనె లొలికి

            వలపు లెగజిమ్మునీపూలపాప మేమి ?

            ప్రొద్దుటనె విచ్చుకొన్నవి ప్రొద్దు క్రుంకు

            వేళకే వాడి నేలపై రాలిపోవు ! ”

            అని కపోతియు నొక్కనా డడిగె పతిని –

            ౙ౦ట సంభాషణం బిట్లుసాగిపోయె : 

 

తే. గీ.     “ అ ట్లనకు ప్రియా ! పూవు లున్నంతవఱకు

            పరులకోసమె తమవల పంత యొసగి

            తేనియలు పంచు – త్యాగములోన విరుల

            కన్న నెవ్వరు గొప్ప యీక్ష్మాతలమున ? ”

 

తే. గీ.     ‘ ఓ ప్రియా ! నాకు సందేహ మొకటి కలదు –

            అక్కటా ! ఒకజీవి యింకొక్కజీవి

            నొడిసిపట్టి మ్రందించుచు కడుపు నింపు

            కొనెడుదుర్గతి యేమొ యీకుతలమందు ? ”

 

తే. గీ.     “ పెద్దచేపలు తమపొట్ట బెట్టుకొనును

            చిన్నచేపల – నటులనే జీవి యొకటి

            ఆయయొ ! యింకొకజీవి కాహార మగుట

            సృష్టిధర్మము – కా దను టెవరితరము ? ”

 

తే. గీ.     అనుచు మగపావురము తోచినంతలోన

            ప్రేయసికిని సందేహనివృత్తి చేసి

            పొంగినయెడందతో ముక్కు ముక్కు కలిపి

            ప్రేమ ప్రకటించుకొన్నది ప్రియ మెలర్ప !

 

´వనితా ! నీకోర్కి యేమి ?

వాకొనుమీ నాతో ” అని

సాదరముగ అడుగుపతికి

సతీతిలక మన్న దిట్లు :-

 

            “ నేను బ్రతికి యున్నంతకు

            నీతోడుగ ఉండా లని –

            నీకష్టసుఖాలలోన

            నీనీడగ ఉండా లని –

 

ధర్మములో అర్థములో

కామములో నిరంతరము

కలసి మెలసి నీతోనే

కైవల్యము నందా లని

 

            ఉన్న దొకేకోర్కి నాకు

            విన్నావా ? ప్రాణప్రియ !

            కాంతుడ ! నీతోడు లేని

            కైలాసమ్మైన వలదు ! ”

 

అని యుద్వేగమున పలుకు వనితామణికనుగొనల

అపుకొంద మనుకొన్నను అశ్రుధార లుప్పొంగెను !

 

“ నీకన్నను ముందుగ నే

నే కను మూసినచో మఱి ? ”

అనుపతినోటికి తనము

క్కడ్డముగా నిడి కపోతి

 

            “ నాథ ! అవాచ్యపుమాటలు

            నాకడ ని ట్లాడదగున ?

            వల దిక నెన్నడు నీ విటు

            పలుకకు నామీద ఒట్టు !

 

నీ వుండనిలోకములో

నేను నిముస ముండలేను !

నమ్మెదవో లేదొ కానీ

నామనసునమాట వినుము –

 

            నేను బ్రతికియున్న దొక్క

            నీకోసమె ప్రాణసఖా !

            నీవు లేనిగూటిలోన

            ఎవరికోస మని ఉందును ?

 

నీయనురాగోక్తులు విన

కెవరిమాట లిక విందును ?

ఆమాటకు వచ్చినచో

నామాటను విను మొక్కటి ;

 

            నిజముగ నీ వన్నట్లే

            నీ కేమైనను జరిగిన

            నీకన్నను ముందుగానె

            నే పరలోకమును చేరి

             నీరాకకు ఎదురు చూచి

            నిలుచుందును జీవితేశ ! ”

 

అని వాపోయెడుసతిఁ గని

మనసు చివుక్కురు మనగా

హృదయేశ్వరి నెడద జేర్చి

యి ట్లన్నా డావిభుండు ;

 

            “ నేను నవ్వుటాల కన్న

            నింతవగపు నీ కేలా ?

            నిన్ను విడిచి నే నెక్కడి

            కేగెదనే ప్రాణసఖీ ! ”

            అని పతి అనుచుండగనే

            అన్న దిట్టు లాకపోతి :

 

“ తననోటిమాట

తననుదుటివ్రాత !

అని పెద్ద లందు

రదె నాకు భయము ”

 

            అని గోలుగోలు

            మని యేడ్చుసతికి

            కన్నీరు తుడిచి

            అన్నాడు సఖుడు :

 

“ లేనిపోనిఅనుమానము

లేలె నీకు ప్రాణసఖి !

బ్రతికిన ౘచ్చినను మనల

నెవ్వరు విడదీయగలరు ?

 

            నీకన్నులకట్టెడుటనె

            నేను ఱాయివలె నున్నా

            నిపు డే మైనది అని నీ

            కింతబాధ ? ఓ ప్రియతమ !

 

నాతోనే ఉండిపోవె !

నాలోనే నిండిపోవే !

నాబ్రతుకే పరిమళింప

నాముందే వెలిగిపోవె ! ”

 

            ఆసంభాషణ మంతట

            ఆగిపోయె – నింతలోన

            భళ్ళున తెలతెలవారెను –

            పక్షులు గూండ్లను వీడెను.

తరువాయి వచ్చే సంచికలో…..

***********

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

 

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page