11_003 ఆనందవిహారి

.

ఘనంగా

“తూమాటి వరివస్య”,

కందుకూరి కావ్యద్వయం”

గ్రంథాల ఆవిష్కరణ

.

ఇదొక అపూర్వ ఘట్టం – వక్తలు

.

విజయవాడ నగరం ఒక అపూర్వమైన సాహితీ వేడుకకు వేదికైంది. ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమి నిర్వహణలో స్థానిక బాలోత్సవ భవనంలో గాంధీ జయంతినాటి (శనివారం)  సాయంత్రం “తూమాటి వరివస్య”, “కందుకూరి కావ్యద్వయము” గ్రంథాల ఆవిష్కరణ జరిగింది. మొదటిది ప్రముఖ భాషావేత్త, రచయిత తూమాటి సంజీవరావు (చెన్నై) 40 ఏళ్ళపాటు చేసిన సాహిత్య సేవను గుర్తించి తోటి సాహితీవేత్తలు, భాషాభిమానులు ఆత్మీయంగా వెలువరించిన వ్యాసాల సంపుటి. కాగా, రెండవది “కందుకూరి కావ్యద్వయం” పేరిట వీరేశలింగం పంతులు రచించిన రెండు కావ్యాలపై సంజీవరావు సంపాదకత్వంలో వెలువడిన వ్యాఖ్యానాల గ్రంథం. 

.

కార్యక్రమాన్ని నిర్వహించిన అకాడమి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు అతిథులందరినీ వేదిక మీదికి ఆహ్వానించారు. సంస్థ పరంగానైనా వ్యక్తిపరంగానైనా రెండు పుస్తకాలను ఆవిష్కరించడం ఒక రికార్డేనని ఆయన ప్రశంసించారు. 

జాషువా రాసిన ఒక దేశభక్తి పద్యాన్ని కొండపల్లి మాధవరావు రాగయుక్తంగా వినిపించడంతో కార్యక్రమం మొదలైంది. తరువాత బివి సీతారామమూర్తి, కరుణశ్రీ రచించిన ఒక దేశభక్తి పద్యాన్ని ప్రార్థనా గీతంగా ఆలపించారు. అనంతరం దిట్టకవి దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి అతిథులు వారికి నివాళులు అర్పించారు.

.

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రొటెం చైర్మన్  విఠపు బాలసుబ్రహ్మణ్యం “తూమాటి వరివస్య”ను ఆవిష్కరించి కొంగితల శ్రీహరికి మొదటి ప్రతిని అందజేశారు. “కందుకూరి కావ్యద్వయం”ను ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు, పేరొందిన కవి సోమేపల్లి వెంకటసుబ్బయ్య ఆవిష్కరించి మొదటి ప్రతిని వెన్నె వల్లభరావుకు అందజేశారు. సభకు హాజరైన వ్యాస రచయితలు కూడా ప్రతులను అందుకున్నారు.

.  

నారాయణరావు మాట్లాడుతూ… అనారోగ్యంతో ఉన్న తల్లిని కాపాడుకోవాలని ప్రయత్నించే కుటుంబ సభ్యులలాగా భాషను కాపాడుకొనే విషయంలో అందరూ అనుకోవాలని అటువంటి ఆలోచన చేయడంలో సంజీవరావు మొదటివారని పేర్కొన్నారు. ఆయనతోపాటు… సభలోనే ఉన్న సామల రమేష్ బాబు, మరికొందరు కృషీవలుల మీద, వాళ్ళని త్రికరణశుద్ధిగా అనుసరించేవాళ్ళ మీద తరువాతి తరాలకు మన భాషా సంస్కృతులను, సారస్వతాన్ని అందించడం అనేది ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డారు. విద్యాపరంగా ప్రభుత్వం చేయాల్సినది కొంత ప్రలోభంతో గాని కొంత అశక్తతతో గాని ప్రయివేటుపరం చేసిన వ్యవస్థ మనదని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వ్యవస్థను తిరిగి గాడిలో పడేయడానికి ఇటువంటి పుస్తకాలు, పరిశోధనలు, పాతతరం అందించిన స్వర్ణమయమైన సాహిత్యం ఉపయోగపడగలవని ఆశిస్తున్నానని నారాయణరావు వెల్లడించారు.

సభకు అధ్యక్షత వహించిన వేదాంతం శరత్చంద్రబాబు దిట్టకవి దంపతుల ఔన్నత్యాన్ని గుర్తు చేశారు. దిట్టకవి శేషాచార్యుల వృత్తి, ప్రవృత్తి రెండూ పాండిత్యమేనని, ఆయన పాఠం చెప్తుండగా విద్యార్థులు మైమరచి వినేవారని అన్నారు. కళ్ళెదుట అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆయన కన్నెర్రజేసేవారని పేర్కొన్నారు. అడగకపోయినా ఎదుటివారి అవసరాన్ని గుర్తించి సహాయమందించిన గుణ సంపన్నుడని, ఆయన శ్రీమతి లక్ష్మీ తాయారు ఆయనకు అక్షరాలా సహధర్మచారిణి అని కొనియాడారు. అటువంటి ఆదర్శ దంపతుల స్మృత్యర్థం తూమాటి కృతుల సమర్పణ జరగడం ముదావహమని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన, దిట్టకవి, తను నలభై ఏళ్ళుగా స్నేహం నెరపుతున్నామన్నారు. దురదృష్టవశాత్తు దిట్టకవి తొందరగా కాలం చేశారని, భగవంతుడు అలా నిర్ణయించాడని వ్యాఖ్యానించారు.

.

ఆంధ్రా లయోల కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన గుమ్మా సాంబశివరావు పుస్తక సమీక్ష చేశారు. తూమాటి పంచభాషా ప్రవీణులని ప్రశంసించారు. “తూమాటి వరివస్య” అనేది ఆయన సాహిత్య సేవకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ఆయన సాహిత్య సేవ రెండు పాయలుగా ప్రవహిస్తుందని…. ఇతర రచయితల సామర్థ్యమెరిగి వారి చేత రాయించిన వ్యాసాలకు, పుస్తకాలకు సంపాదకత్వం వహించడం అందులో ఒకటైతే, భాషా వ్యాకరణాల గురించి తను సొంతగా వెలువరించిన సాహిత్యం రెండోదని వివరించారు. ఆయనకి కేంద్రస్థాయిలో గుర్తింపు రావాలని ఆశిస్తున్నానని సాంబశివరావు వెల్లడించారు. 

.   

చెన్నైలో ఉంటున్నా నిత్యం తెలుగును శ్వాసిస్తున్న సంజీవరావు ధన్యులని సోమేపల్లి కొనియాడారు. పెద్దలు చెప్పినట్టుగా, ప్రాచీన కావ్యాల సౌందర్యాన్ని, సౌరభాన్ని తెలుసుకొని ఆనందించాలంటే వాటి అర్థం, తాత్పర్యం తెలియాలన్నారు. కందుకూరి కావ్యాల విషయంలో ఆ పని సంజీవరావు చేశారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, కందుకూరి వ్యక్తిత్వాన్ని తెలియజేసే చిలకమర్తి పద్యాన్ని ఉటంకించారు. 

 .

గాఢమైన భాషాభిమానం, తన్నుకొచ్చే వేదన, చదువులను నిర్వహిస్తున్న తీరు చూసి ఆక్రోశం… ఇవి లేకపోతే సమాజం ఇంత దూరం ముందుకు ప్రయాణం చేసి ఉండేదే కాదని విఠపు బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా కాక ప్రపంచం ముందు, అందరినీ కలుపుకుపోయే ఉద్యమంలా చేయడానికి నిర్వహణ శక్తి ఉండాలని, ఇదొక ప్రత్యేక కళ, ప్రత్యేక శక్తి అని విడమరిచి చెప్పారు. సాధారణంగా భాషోద్ధరణ విషయంలో కనిపించని ఈ కళ తూమాటి సంజీవరావుకున్నదని, ఇది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అంశమని మెచ్చుకున్నారు. ఐదారేళ్ళుగా సంజీవరావుతో తరచూ ఏదొకటి చర్చిస్తున్నానని తెలిపారు. 

.

తెలుగు ప్రభుత్వాల నుంచి ఆదరణ లేక ఇతర రాష్ట్రాలలోని తెలుగువాళ్ళు అత్యంత నిరాదరణకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ళ నిరుత్సాహం ఫలితంగా తమ పిల్లలకి తెలుగు నేర్పడం లేదని తెలుసుకున్నానన్నారు. ప్రస్తుతం తెలుగుది అరవై శాతం మునుగుతూ నలభై శాతం తేలుతూ ఉన్న పరిస్థితని, అయితే, ఇటువంటి పుస్తకాల విడుదల కార్యక్రమాలు… మళ్ళీ ఎవరో పుట్టి భాషోద్ధరణ చేస్తారనే ఆశను రేపుతాయని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో “ఈనాడు” దినపత్రిక రోజూ కరోనాపై కవితలు అచ్చు వేయడం అభినందనీయమన్నారు. ఆ పోటీ కోసం బడిపిల్లలు మొదలుకొని లబ్ధప్రతిష్టుల వరకు దాదాపు ఇరవైఆరు వేలమంది కవితలు రాసి పంపించేవారని తెలుసుకొని విస్మయం చెందానన్నారు. తమను కదిలించిన పరిస్థితులను వ్యక్తీకరించడానికి సొంత భాషను మించినది లేదనడానికి ఇదొక ఉదాహరణనన్నారు. ఈ క్లిష్ట సమయం భాషోద్ధరణకు ఉపయోగపడిందని, గత రెండేళ్ళ కాలంలో తనే 90 – 95 పుస్తకాలు చదివానని చెప్పారు. ప్రస్తుతం చాలా పుస్తకాలు అంతర్జాలంలో లభ్యమవుతున్నాయని, రాబోయే కాలంలో అందులో తెలుగు వెలుగుతుందని వ్యాఖ్యానించారు. 

.

 

తనకు లభించిన ఆత్మీయతకు తూమాటి సంజీవరావు స్పందిస్తూ… ముఖ్య, ఆత్మీయ అతిథులకు, సభాధ్యక్షులకు, సమీక్షకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం కోసంగా హాలును ఇచ్చిన లక్ష్మయ్య గారికి, తనమీది అభిమానంతో విచ్చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

.

150 ఏళ్ళ క్రితం రాసిన పద్యకావ్యాలు ఈనాడు అంతగా అర్థం కావు, రుచించవు కూడా అని వ్యాఖ్యానించారు. అందువల్ల 80 ఏళ్ళకు పైబడినవారిచేత వాటి వ్యాఖ్యానాలు రాయించానని వెల్లడించారు. “అభాగోపాఖ్యానం” కావ్యానికి మవ్వ వృషాద్రిపతి,”సరస్వతీ నారద విలాపం”కు కె. సర్వోత్తమరావు వ్యాఖ్యానాలు రాశారని తెలిపారు. 2019లో కందుకూరి శత వర్ధంతి సందర్భంగా సెమినార్ నిర్వహించమని కేంద్ర సాహిత్య అకాడమివారిని తను కోరగా, జయంతి మాత్రమే నిర్వహిస్తామని బదులిచ్చారని, అయితే, భారతీయార్ శత వర్ధంతి సందర్భంగా ఇటీవల సెమినార్ నిర్వహించారని అన్నారు. ఈ విషయాన్ని గురించి వారికి లేఖ రాయబోతున్నట్టు తెలియజేశారు. 2022 జనవరి నుంచి ఏప్రిల్ వరకు, కరోన ఇబ్బంది లేకపోతే, నాలుగు అంశాలపై సెమినార్లు రెండేసి రోజుల చొప్పున తను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. “తెలుగు సాహిత్యంలో దేశభక్తి, తెలుగువీర లేవరా”, “కందుకూరి”, తెలుగుకు ప్రాచీన భాష గుర్తింపు లభించినప్పుడు తను వెలువరించిన 3 పుస్తకాలు, “తెలుగు భాషా దోషాలు” అన్నవి ఆ నాలుగు అంశాలని తెలిపారు. ఇప్పటివరకు తలపెట్టిన అన్ని కార్యక్రమాలూ సజావుగా సాగాయని, ముందుముందు కూడా అన్నీ ఇలాగే విజయవంతం కాగలవన్న ఆశాభావాన్ని సంజీవరావు వ్యక్తం చేశారు. 

.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా రావాల్సిన ఆదాయపన్ను శాఖ విశ్రాంత ముఖ్య కమిషనర్ (చెన్నై) ఎమ్. శ్రీనివాసరావు అనివార్య కారణాల వలన హాజరు కాలేకపోయారు.

.

****************************************************

.

మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు

& 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

 

.

సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు  & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  అత్యంత విజయవంతంగా జరిగింది.

స్వర్గీయ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వబడిన ఈ సాహితీ సదస్సుని కెనడా లోని ఆల్బెర్టా రాష్ట్ర మంత్రి గౌ. శ్రీ ప్రసాద్ పండా గారు ప్రారంభిస్తూ తన రాజకీయ ప్రస్థానం లో అక్కడి వారికి తెలుగు భాష గురించి చెప్పే అవకాశం తనకు లభించింది అనీ, ఇటువంటి సదస్సుల నిర్వహణ ఉభయ దేశాలలో తెలుగు భాష మనుగడకి దోహదం చేస్తాయి అనీ ప్రశంశించారు. ప్రముఖ రచయిత, నటుడు శ్రీ తనికెళ్ళ భరణి నిర్వాహకుల ప్రశ్నలకి సమాధానాల రూపం లో తన సందేశాన్ని వినిపిస్తూ ఇండియాలో ముందు ముందు తెలుగు నేర్చుకోవాలి అంటే కెనడా-అమెరికా దేశాలలోని తెలుగు వారి నుంచే నేర్చుకునే పరిస్థితి వస్తుందేమో అని చమత్కరిస్తూ, తెలుగు రాష్ట్రాలలో భాషా సాహిత్యాల పరిస్థితిని వివరించారు. మొదటి రోజు ప్రారంభ సభలో కెనడా తెలుగు సాహిత్య వికాసం గురించి శ్రీమతి సరోజ కొమరవోలు సాధికారంగా సమీక్షించగా, సాహిత్య పోషణ లో తాత్వికత చోటు చేసుకోవలసిన ఆవశ్యతని డా. శారదా పూర్ణ శొంఠి వివరించారు. కెనడాలో అధికార భాష అయిన ఫ్రెంచ్ బాష లోనే కాక తెలుగులో కూడా ప్రావీణ్యత ఉన్న ఫ్రెంచ్ పౌరుడు, ప్రొఫెసర్ డెనియల్ నెజెర్స్ మాట్లాడుతూ ఆ రెండు బాషల అనువాద ప్రక్రియలో తన నిరంతర కృషిని సాదోహరణగా వివరించారు.  కెనడా రచయితల తొలి కథా సంకలనం “కెనడా కతలు”, “డయాస్పోరా తెలుగు కథానిక-15వ సంకలనం ఈ ప్రారంభ సభలో ఆవిష్కరించబడ్డాయి.

రెండవ రోజు ప్రారంభ సభలో ప్రముఖ సినీ కవి సుద్దాల అశోక్ తేజ మహాకవి దాశరధి గారి కవిత్వం, వ్యక్తిత్వ మీద ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఇంటర్ నెట్ సదుపాయం లేని చోట ఉన్నా, ఆ ఆటంకాన్ని అధిగమించి శ్రీ భువన చంద్ర వీడియో ద్వారా రెండు గ్రంధాలు ఆవిష్కరించి, ఈ సదస్సు ప్రాముఖ్యతని గుర్తించి ప్రసంగించడం ఆయన సహృదయతకి నిదర్శనం. ఈ వేదికలో చరిత్ర, స్వీయ అనుభవం, ఆవేదన అన్నీ కలగలిపి ఉన్నమాట ఉన్నట్టుగా ఈ నాడు ప్రసారం అవుతున్న వెబ్ సీరీస్ లో తెలుగు భాష దిగజారుతున్న వాస్తవాన్ని శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది.

ఇక “తెలుగు సాహిత్యం లో హాస్యం వ్యంగ్యం” (దామరాజు విశాలాక్షి), కథల కన్న అమెరికా జీవితాలు (భాస్కర్ పులికల్), డయాస్పోరా కవిత్వం-స్థానికత” (డా. కె.గీత) అసలు మంచి కథ అంటే ఏమిటి?(దీప్తి పెండ్యాల) వాడుక భాషకు గొడుగు గిడుగు” (తోటకూర ప్రసాద్), వర్తమాన తెలుగు కథ – కొన్ని ఆలోచనలు (కల్పన రెంటాల), నేటి కాలపు తెలుగు కవిత్వము-ఒక పరిశీలన (ఇంద్రాణి పాలపర్తి) ఫెమినిజంతో నా ప్రయాణం-కవయిత్రిగా (మహెజబీన్), ఓరుగంటి గోపాల కృష్ణ గారు అత్యంత అద్భుతంగా చదివిన స్వీయ రచన  “ప్రక్షాళనం” కథ, రామ్ డొక్కా నిర్వహించిన “ఆధునిక కవితా రీతులు” చర్చా వేదిక లో “కవిత్వం -కొన్ని అవసరాలు” అనే విన్నకోట రవిశంకర్ అద్భుతమైన ప్రసంగం, ప్రముఖ సాహితీవేత్త స్వాతి శ్రీపాద “”అనువాద ప్రక్రియ” మీద స్వానుభవంతో చేసిన ప్రసంగం, “హనుమ శతకం” అనే పేరిట ఎంతో హాస్యమూ, సామాజిక స్పృహా ఉన్న కవితలని మనసుకి హత్తుకు పోయేలా వినిపించిన హనుమంత రావు కరవది గారి స్వీయ రచనా పఠనం, తను ఆంగ్లం, మనవరాలు తెలుగు నేర్చుకునే అంశం మీద అల్లిన లక్ష్మీ సుగుణవల్లి చీమలమఱ్ఱి గారి “అక్ష్రరాభ్యాసం” కథ, “ప్రపంచ కథా సంప్రదాయాలు” అనే అంశం మీద డాక్టరేట్ స్థాయి పరొశోధన తో భాస్కర్ రాయవరం ప్రసంగం,  మంతెన గ్రామం స్వచ్కమైన తెలంగాణా మాండలీకం లో “ పిల్ల లగ్నం” అనే కథని వింటూ అందరినీ మంత్రముగ్ఢుల్ని చేసిన చేసిన శ్రీమతి విజయ లక్ష్మి సువర్ణ గారి స్వీయ కథా పఠనం…ఇలా చెప్పాలంటే 20 గంటలకి పైగా జరిగిన ఈ సదస్సులో సుమారు 100 ప్రసంగాలూ వేటికవే వాటి ప్రత్యేకత ని చాటుకున్నాయి…అన్నీ సావకాశం గా వినాల్సివే..విని ఆనందించాల్సినవే… అభినందించాల్సినవే….

ఈ సదస్సుకి పరాకాష్టగా రెండు అంశాలు ప్రధానంగా నిలుస్తాయి. మొదటిది..మొదటి రోజు ఆఖరి సమావేశంగా జరిగిన జీవన సాఫల్య పురస్కార వేదిక.  పురస్కార గ్రహీత అయిన డా. తిరుమల కృష్ణ దేశికాచారి గారి స్వగృహం లోనే జరిగిన ఈ వేడుకని దేవి చౌదరి, మైత్రి కల్లూరి, సరోజ & రావు కొమరవోలు దంపతులు, సత్యం పోతంశెట్టి & విజయ తదితరులు మంగళ వాద్యాల మధ్య పుష్పగుచ్చం, దుశ్శాలువా, కర్పూర దండ, పురస్కాత జ్ణాపిక, ప్రసంశాపత్రం, పారితోషికాలతో పండిత సత్కారం చేశారు. రెండవ రోజు ముగింపు సభ నిర్వహించిన శారద కాశీవఝ్ఝుల (వేలీ వేదిక వ్యవస్థాపకురాలు) తన అసాధారణ ప్రతిభతో రూపొందించిన “సరదా సాహిత్యం పోటీ” లో ఈ సదస్సులో ప్రసంగించిన వక్తలు సుమారు అందరూ మళ్ళీ పాల్గొని తమ విషయ పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.

12 వేదికలలో జరిగిన ఆయా వేదికల నిర్వాహకులుగా డా. కె.గీత, మధుబాల కరవది, , దీప్తి పెండ్యాల, సూర్యకుమారి ఉపాధ్యాయుల, సాయి సోమయాజుల,  శ్రీవాణి ముప్పాళ్ళ, వాణి ఉప్పుల, రాధిక నోరి, శారద కాశీవఝుల మొదలైన వారు వ్యవహరించగా శ్రీనివాస్ గాదె, రఘు ధూళిపాళ,  వేణు కూరెళ్ళ, శ్రీనివాస్ కస్తూరి, ప్రవీణ్ కోరుకొండ, శశి పట్లోళ్ల, సత్యం పోతంశెట్టి మొదలైన వారు సాంకేతిక నిపుణులుగా సదస్సు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు.

రెండు రోజుల ఈ సదస్సు ప్రధాన నిర్వాహకులుగా వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ, త్రివిక్రమ్ సింగరాజు, మధు చెరుకూరి వ్యవహరించగా సింగపూర్ కి చెందిన  RK Videography (రాధాకృష్ణ గణేశ్న & కాత్యాయని) పూర్తి సాంకేతిక బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారం అత్యున్నత స్థాయిలో జరగడానికి ప్రధాన బాధ్యత వహించి సదస్సుని విజయవంతం చేశారు.

మొట్టమొదటి కెనడా-12వ అమెరికా సాహితీ సదస్సులలో కొన్ని ఈ క్రింద యూట్యూబ్ చానెల్ లో చూడవచ్చును.

. https://www.youtube.com/channel/UCX9tl92zikUSpHp0MuNTiLQ