12_006

ప్రస్తావన

అనివార్య కారణాల వలన గత నెలలో సంచికలు వెలువడలేదు. గత కొన్ని సంవత్సరాలుగా పక్ష పత్రికగా నెలకు రెండు సంచికలుగా వెలువడుతున్న ‘ శిరాకదంబం ‘ కొన్ని అనుకోని పరిస్థితుల వలన ఇకపైన మాస పత్రికగా నెలకు ఒక సంచిక ప్రతి నెలా 15వ తేదీన వెలువడుతుంది.  దయచేసి పాఠకులు, శ్రేయోభిలాషులు, రచయితలు, చందాదారులు…. అందరూ గమనించ ప్రార్థన.

కాలగమనంలో మరో సంవత్సరం పూర్తయింది. క్రొత్త సంవత్సరం రాబోతోంది. ప్రతి నూతన సంవత్సర ప్రవేశంలో ప్రతి ఒక్కరి మనసులో ఎన్నో ఆశలు చిగురిస్తూ ఉంటాయి. పూర్తవుతున్న సంవత్సరంలో ఎదుర్కొన్న కష్టసుఖాలు, ఎక్కివచ్చిన ఎత్తుపల్లాలను పునశ్చరణ చేసుకుంటూ కష్టాలు తగ్గి సుఖాలు పెరగాలని, పల్లాలనుంచి ఎత్తులకు ఎదగాలని కోరుకుంటూ, అదే ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏ సంవత్సరం అయినా కొన్ని కష్టాలు, నష్టాలు ఎప్పుడూ తప్పవు. అయినా మనిషి ఆశాజీవి. ఆ ఆశే మనిషిని నడిపిస్తుంది. అందుకే గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన కరోనా వంటి మహమ్మారుల జాడ క్రొత్త సంవత్సరంలో కనబడకూడదని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ క్రొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.

క్రొత్త సంవత్సరంలో వచ్చే మొదటి, పెద్ద పండుగ ‘ సంక్రాంతి ‘.  గతంలో సంక్రాంతి అనగానే పంట ఇంటికి చేరడం, ఊళ్ళో ఉన్న అన్ని వృత్తుల వారికీ రైట్లు తమ పంట లో భాగాన్ని కొలవడం, ఇంటిల్లపాదీ కలవడం, క్రొత్త అల్లుళ్లు రావడం, రైతుకు వ్యవసాయంలో నిత్యం సహకరించే పశువులకు, పనిముట్లకు, వాహనాలకు పూజలు చెయ్యడం, భోగి మంటలకు పనికిరాని కలప వగైరాలు సేకరించడం, సంక్రాంతి పిండివంటలకు అన్నీ సిద్ధం చేసుకోవడం, కనుమ పండుగకు అందంగా అలంకరించిన పశువులను, వాహనాలను ఊరంతా తిప్పడం, రకరకాల తిరునాళ్ళు, తీర్థాలు, సంబరాలు, అనేకరకాల ఆటలు, పోటీలు…. ఒకటేమిటి ? ఒకటే సందడి….కోలాహలం.

ఇప్పుడు కూడా అదే సందడి… అదే కోలాహలం కనబడుతున్నా అప్పటి సందడి లోని అప్యాయతలు కరువై పోతున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు సంక్రాంతి వస్తోందంటే నగరాలు దాదాపుగా ఖాళీ అయిపోతున్నాయి. అందరూ పల్లెబాట పడుతున్నారు. అయితే పల్లెలన్నీ జనంతో నిండిపోవడం లేదు. కొన్ని పల్లెల్లో మాత్రమే…. అదీ ఊరికి దూరంగా తోటల్లో…. ఖాళీ అయిన పొలాల్లో ఉంటున్నారు చాలామంది. ఒకప్పుడు సంక్రాంతి రోజుల్లో ఆటవిడుపుగా భావించిన కొన్ని ఆటల్లో కోడి పందేలు ఇప్పుడు అన్నిటిలాగే కార్పొరేట్ హంగులు సంతరించుకుంటున్నాయి. విదేశాల్లో ఉండి వచ్చిన వారు, వెళ్ళి వచ్చినవారు అక్కడ నేర్చుకున్న జూదక్రీడ ల తాలూకు వాసనలను ఈ కోడి పందెలకు కూడా అంటించారు. అక్కడ నగరాల్లో కనిపించే కాసినో సంస్కృతి సంక్రాంతి రోజుల్లో మన పల్లెటూళ్లలో కూడా మరో రూపంలో కనిపిస్తోందనిపిస్తోంది.

జూద సంస్కృతి నుంచి ఈ కోడి పందేలను బయిట పడవేసి, మళ్ళీ ఆటవిడుపుగా ఆడుకునే సంస్కృతి, గంగిరెద్దులు, హరిదాసులు, జంగం దేవరలు వంటి నిజమైన సంక్రాంతి సంస్కృతి తిరిగి రావాలని కోరుకోవడం తప్పు కాదేమో !

 

——– ( 0 ) ——-

మనవి : చందా గడువు ముగిసిన మిత్రులు దయచేసి తమ చందాను వీలైనంత త్వరగా పునరుద్ధరించి సహకరించవలసిందిగా మనవి.

చందా వివరాలకు Menu లో ఉన్న subscription form ( link ) చూసి, వివరాలు పూర్తి చేసి ( Submit ) పంపవచ్చును.

మీ మిత్రులను, బంధువులను కూడా చందాదారులుగా చేర్పించవచ్చును.

Please Subcribe & Support

Please visit this page