గతసంచిక తరువాయి…….
ఆనంద్ తో చర్చించిన తరువాత, నారాయణ కి కూడా అవే విషయాల మీద తెలుసుకోవాలని కుతూహలం కలిగింది.
ఒకరోజు ఇద్దరూ కలిసి పరాశర స్వామి ని వారి ఇంట్లో కలిశారు. వీళ్ళిద్దరినీ సాదరం గా ఆహ్వానించి కూర్చోపెట్టి వచ్చిన పని అడిగారు.
నారాయణ ఇద్దరి సందేహాలు వివరించి మీరు సరి అయిన వివరణ ఇస్తారని వచ్చాము. శ్రమ ఇస్తున్నందుకు క్షమించాలి అన్నాడు.
దానికి స్వామి ” మీరు ఎప్పుడూ అలా అనుకోకండి . మీకు తెలియదు. ఇలా అడిగేవారు వచ్చినప్పుడు మాకు ఎంత ఆనందంగా ఉంటుందో. ఎప్పుడూ ప్రపంచం వ్యవహారాలలో అనేక కోరికలు ఎలా తీర్చుకోవచ్చు ఆలోచించే వాళ్ళే కానీ , మీలా ఆధ్యాత్మిక కుతూహలం తో వచ్చేవాళ్ళు అరుదు. మీలాంటి వాళ్ళ కోసమే నేను ఎదురు చూసేది. సమయం, సందర్భం పట్టించుకోకుండా మీరు ఎప్పుడయినా నన్ను కలవవచ్చు. అసలయిన ఆనందం ఏమిటో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుని అనుభవం లోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. అలాంటి ఆనందాన్ని ఎంతమందికయినా పంచాలని, దానిని పొందిన వాళ్ళకి అనిపిస్తుంది ” అన్నారు స్వామి.
ఆయన మాట్లాడిన పద్ధతికి ఆనంద్ ముగ్ధుడయిపోయాడు. సరి అయిన వ్యక్తి దగ్గరికి వచ్చామని అతనికి మనసులో అనిపించింది.
” ఆధ్యాత్మిక పరిజ్ఞానం నిత్య జీవితం లో ఒడుదుడుకులు తట్టుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందని మీ మొదటి ప్రశ్న. చాలా బాగుంది.
చాలామంది కొన్ని తప్పుడు అభిప్రాయాలలో ఉన్నారు. ఆధ్యాత్మికం అనేది ఉద్యోగ విరమణ తరవాత మాత్రమే పట్టించుకునేది అని, కొండల లోకి, గుహల లోకి పోయి తపస్సు చేస్తేనే లభిస్తుందని, గృహస్థాశ్రమం కాకుండా సన్యాసం తీసుకుంటేనే అది లభిస్తుందని, సంస్కృతం నేర్చుకుని శాస్త్రాలు చదివుతేనే అది లభిస్తుందని, సరి అయిన అవగాహన లేని వాళ్ళు అభిప్రాయం పడుతూ ఉంటారు. మూఢ నమ్మకాలను అధిగమించి జీవితాన్ని ఆనందమయం ఎలా చేసుకోవచ్చో చెప్పే రహస్యాలు అనేకం ఉపనిషత్తులలో ఉన్నాయని చాలా తక్కువమందికి తెలుసు ” అన్నారు స్వామి సుదీర్ఘ వివరణ ఇస్తూ…..
” చాలామంది చేసే భజనల వల్ల, పూజల వల్లా ఉపయోగం ఏమీ లేదా ? , అందరూ మహర్షి చెప్పిన జ్ఞానం కోసమే ప్రయత్నం చేయాలంటారా ?? ” నిజాయతీ తో కూడుకున్న శ్రద్ధతో అడిగాడు నారాయణ.
” మీరు చేసే పూజలు, జపాలు, భజనల వల్ల ఉపయోగం లేదా అని అడిగారు ? “ ఎందుకు ఉండదు ? పరమాత్మని ఒక్క మాటు, ఒక్క క్షణం తలచుకున్నా దాని ఫలితం వృధా పోదు. కానీ భయం వల్ల కానీ, కోరికలు తీర్చుకోవడం కోసం కానీ దైవ ప్రార్థనలు చేస్తే పెద్ద ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండకపోవచ్చు.
” కోరికలు తీరడం కోసం, ఆపదల పాలవకుండా ఉండడానికి ప్రార్థించడం తప్పు అంటారా స్వామిజీ ? అడిగాడు నారాయణ.
” ఇతరులు చేసే పనులు తప్పు అని అనడం అజ్ఞానం. కాని మీరు గమనిస్తే ఒకటి విశదమవుతుంది. నీ కోరికల గురించి అసలు దేముడిని ప్రార్థించడం ఎందుకు ? ఎవరికీ ఏది అవసరమో భగవంతుడికి తెలియదా ? నువ్వు అడిగితే ఇచ్చి, అడగకపోతే ఇవ్వడా ? అడిగితేనే, లేదా ప్రార్దిస్తేనే ఇస్తాడనుకోవడం, మానవుడి లక్షణాలని భగవంతుడికి ఆపాదించడం వల్ల జరుగుతుంది. భగవత్ తత్వం తెలియకపోవడం వల్ల జరుగుతుంది. ఎప్పుడయితే ఈ రహస్యం తెలుస్తుందో, అప్పుడు ఆధ్యాత్మికం గా ఎదిగి, పరమాత్మని నిస్వార్థంగా కొలవడం ప్రారంభమవవుతుంది ” వివరించారు స్వామి.
స్వామి చెప్పినది వింటే ఆనంద్ కి కుతూహలం పెరిగింది. వాళ్ళ సంభాషణ వింటూ కూర్చున్నాడు.
” కోరికలు పెట్టుకోకుండా ఏ విధంగా మనసుకి నచ్చితే ఆ విధంగా భగవత్ ప్రార్థన చేయాలన్నమాట ” అన్నాడు నారాయణ.
” భగవంతుడి గురించి కొద్దిగానయినా సరి అయిన అవగాహన వస్తే ఆ మానసిక స్థితి వస్తుంది ” అన్నారు స్వామి.
” పూర్తి అవగాహన రానక్కరలేదంటారా ? ” అమాయకంగా అడిగాడు నారాయణ
” పూర్తి అవగాహన అంటే జ్ఞాన మార్గం లో తప్ప వేరే జరగదు. అందుకు అర్హత, కర్మ, భక్తి, యోగం వంటి వాటి ద్వారా పొందాలి. ఇప్పుడు మీరు భగవంతుడు మీకు అన్యం గా ఉన్నాడని మీరు నమ్ముతున్నారు కాబట్టి, ఆ పరిధి లోనే అవగాహన ఏర్పరుచుకుని ఈ ప్రపంచంలో ఆనందంగా ఎలా గడపాలన్నది తెలుసుకోవాలి ” చెప్పారు స్వామి.
” అవగాహన అంటే ఏమిటి, అదెలాగా ఏర్పడుతుంది ? ” అడిగాడు నారాయణ.
” ఇప్పుడు మీకు భగవంతుడు అంటే ఏ అవగాహన ఉంది ? “
” ఆయనే, సృష్టి, స్థితి, లయాలకి కారకుడనీ, సర్వ శక్తిమంతుడనీ అనుకుంటాము కదా ? ” గ్రంధాలు చదివిన జ్ఞానం తో అన్నాడు నారాయణ.
” అంటే ప్రపంచంలో ఏది జరిగినా దానికి కారణం భగవంతుడనుకునే ఒక అదృశ్య శక్తి అని నమ్ముతారా ? ” అడిగారు స్వామి.
” నమ్ముతాను కానీ, ఒక సందేహం ఉందండి. ఆ పరమాత్మ లేదా అదృశ్య శక్తి, అసలు కష్టాలు ఎందుకు కల్పించాలి ? ప్రమాదాలలో, ఉపద్రవాలలో, సునామీలలో, యుద్ధాలలో ఎంతోమంది చనిపోతూ చాలామంది దుఃఖానికి కారణం అవుతోంది కదా ? అసలు ఈ కష్టాలు లేకుండా మొత్తం ప్రపంచం లో అందరూ ఎల్లప్పుడూ ఆనందంగానే ఉండేలా ఆ శక్తి చేయవచ్చు కదా ? ” అడిగాడు నారాయణ.
” చాలా మంచి ప్రశ్న వేశావు నారాయణా ! చాలామందిని వేధించే ప్రశ్న ఇది. దీనికి మీకు సరి అయిన జవాబు, పూర్తిగా భగవత్ తత్వాన్ని అవగాహన తెచ్చుకుంటేనే లభిస్తుంది. అది జ్ఞాన మార్గం లో తప్ప జరగదు. ఇప్పుడు మీరు ఉన్న స్థితి లో అది ఎందుకు జరగదో కొంచం వివరిస్తాను. మీరు చెప్పిన ఉపద్రవాలన్నీ మీరు చూసే ప్రపంచం లో జరుగుతున్నాయి. అవునా ? ”’
” ప్రపంచం అంటే ? కనపడేది అంతానా ? ” అడిగాడు నారాయణ.
” నువ్వు సబ్జెక్ట్ గా నీకు తెలిసేది, నువ్వు చూసేది అంతా ప్రపంచమే. దీనిని సంబంధిత ( రిలేటివ్ ) ప్రపంచం అంటాము. అంటే అన్నిటి మధ్యా ఒక సంబంధం ఉంటుంది. నువ్వు చూస్తేనే ప్రపంచం ఉంది. లేదా ప్రపంచం ఉంటేనే నువ్వు చూస్తున్నావు. ఇప్పటికి అది గుర్తు పెట్టుకో.
ఎందుకు ఈ తేడా చెబుతున్నానంటే, పరమాత్మ తత్వం జ్ఞానం ద్వారా గుర్తిస్తే అంతా ఒకటే. రెండు ఉండవు. మనం ఆ స్థితి లో కాకుండా ( పూర్తి జ్ఞానం ) అజ్ఞాన స్థితి లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి నువ్వు సబ్జెక్ట్ గా నువ్వు చూసే ప్రపంచం గురించి అడిగావు కాబట్టి, ఆ తేడా చెప్పవలిసి వచ్చింది. ఇదంతా నువ్వు అడిగిన ప్రశ్న కి జవాబు కోసం చెప్పినది. ఇటువంటి సంబంధిత ప్రపంచం లో నువ్వు మూడు విషయాలు ముఖ్యంగా గమనించాలి.
- అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది.
- అందులో అంతులేని వైవిధ్యం ( చిత్రాతి చిత్రమయిన వెరైటీ )
- దాని పూర్తి స్వరూపం మానవ మేధకు అందదు ( ఇంటెలెక్ట్ కి అందదు. అందుకే శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూనే ఉన్నారు )
ఇవన్నీ కాకుండా ఇంకో ముఖ్య విషయం ఉంది. నువ్వు చూసే ప్రపంచం లో, ఏదయినా కార్యానికి ( ప్రభావం లేదా ఎఫక్ట్ ), కారణం ఫలానాది ఒక్కటే అని చెప్పలేము.
ఉదాహరణకి, ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. ఇది ఒక కార్యం లేదా ఎఫెక్ట్. దీనికి కారణం ఏమిటి ?. ఆనంద్ నీ దగ్గరికి రావడం అదొక్కటే కారణం అని చెప్పగలమా ? ఆనంద్ నీ దగ్గరికి రావడం కార్యం అయితే, దానికి కారణం ? మీరిద్దరూ కంపెనీ లో కలవడం. దానికి కారణం. ఆ కంపెనీ పెట్టడం. ఇలా చూసుకుంటూ పోతే అనంతం లో పడతావు తప్ప ఎక్కడా ఆగడం ఉండదు. ఇప్పుడు నువ్వు అడిగిన ఉపద్రవాలు, ఏ ఒక్కటయినా తీసుకో. అది కార్యం అయితే దానికి కారణం నీకు దొరకదు. అది అనంతమయిన కార్య కారణ సంబంధాల సముద్రం ” సుదీర్ఘ వివరణ ఇచ్చారు స్వామి.
తరువాయి వచ్చే సంచికలో……..
***********************