10_020 తో. లే. పి. – ఓలేటి వెంకటరత్నం

.

నా జీవిత నౌకకు చుక్కాని ఆయన… వారే మా నాన్నగారు… నిజానికి ఎవరి జీవితాన్నైనా మొదటి నుండి తీర్చిదిద్దేవారు వారి తల్లిదండ్రులే. ఇది తిరుగులేని సత్యం. అందువలననే ఆది గురువులు తల్లిదండ్రులే అంటారు మన పెద్దలు… 

జీవితం అంటే అసలు ఏ మాత్రం అవగాహన లేని వయసులో దానికి ఒక ఒరవడిని దిద్ది, దానిని సక్రమమైన పంధాలో నడిపించే తల్లిదండ్రులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. 

మా నాన్నగారు ఆ రోజులలో అంటే 1935-40 మధ్య కాలం లో స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజీ లో చేరి బి.ఎస్.సి… అటు పిమ్మట బి. ఇడి. పూర్తి చేసి భీమవరం లో కొంతకాలం ఉపాధ్యాయుడు గా పనిచేసి, అటు పిమ్మట అప్పట్లో నైజాం సంస్థానానికి చెందిన హైదరాబాద్ నగరం లో శ్రీ మాడపాటి హనుమంత రావు బాలికల పాఠశాల లో లెక్కల టీచరు గా ఉద్యోగం చేసారు. మా అమ్మ నాకు మూడేళ్ళ వయసులో కాలం చేసింది. నేనూ, మా అన్నయ్య, మా అమ్మానాన్నలకు సంతానం. ఆ పిమ్మట కొంతకాలం మా నాన్నగారు ఆ ఉద్యోగంలోనే కొనసాగారు. మా ఆలనా పాలనా ని ఇంట్లో ఒకే ఒక పెద్దావిడ మా బామ్మ గారు చూసుకునేవారు. కాగా ఆవిడకి వయసు మీద పడడం తో చిన్నపిల్లలమైన మా మంచి చెడులను ఒక్కర్తీ చూసుకోవడం మహా ఇబ్బందికరంగా  ఉండేది… దీనితో ఆవిడ మా నాన్నగారిని మళ్ళీ పెళ్ళికి ఒప్పించడానికి శతవిధాలా ప్రయత్నం చేసి ఆదిలో విఫలతఁ చెందినా– ఒక దశలో పట్టుబట్టి ఆయనను పునర్వివాహానికి ఒప్పించగలిగింది. ఇలా ఉండగా నైజాం లో రజాకార్ల విప్లవం చెలరేగి అందరి జీవితాలను అతలాకుతలం చేసింది. కాగా మా జీవితం లో మళ్లీ వెలుగును నింపడానికి మరొక అమ్మ మా కుటుంబం లో అడుగు పెట్టింది. ఆవిడ మమ్మల్ని కడవరకూ అభిమానం గా చూసుకునేది. క్రమంగా మా కుటుంబం లో ముగ్గురు తమ్ముళ్లు ప్రవేశం చేసారు. రజాకార్ల విప్లవ దాడుల్లో దౌర్జన్యం, క్రూరత్వం చోటు చేసుకుని నైజాం విడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడడంతో, తన మిత్రుడొకరు చేసిన సూచనను అనుసరించి, హైదరాబాద్ ని వీడి గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి తన స్నేహితుని చూడడానికి రావడం, పరిస్థితుల ప్రభావంతో మా నాన్నగారు అక్కడ స్కూల్ లోనే లెక్కల మాస్టారుగా చేరడం జరిగింది. మా ఇద్దరి చదువులు అటు తరువాత మా తమ్ముళ్ల చదువులు ప్రాధమిక దశ లో చేబ్రోలులోనే కొనసాగాయి. మా నాన్నగారు ఇందుకు అన్నవిధాలా సహకరించి, మా అందరికీ ప్రొత్సాహాన్ని అందించారు. మా అమ్మ కూడా తన వంతుగా తల్లి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ మా బంగారు భవిష్యత్తు కి బాటలు వేసింది. ఏది ఏమైతేనేం .. మా జీవితాలలో ఏ ఒడుదుడుకులు లేకుండా అవి సాఫీ గా సాగిపోవడానికి దోహదకారి అయ్యాయంటే అందుకు ఒకటే కారణం.. అది మా అమ్మానాన్నలు స్వయంగా ఆచరించి చూపిన జీవన సూత్రాలు ! అందుకు మేమంతా వారికి ఆజన్మాంతం ఋణపడి ఉంటాము …. 

.

.

                                         <><><>*** నమస్తే… ధన్యవాదములు ***<><><>

.

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾

******************************************************