10_016 మహర్నవమి గడలు

.

ఒకప్పుడు పల్లెటూర్లలో దసరానవరాత్రుల సమయంలో వీధిబడులలో పంతుళ్లు పిల్లలను ఇంటింటికీ త్రిప్పి ఆ పిల్లలు అంతవఱకూ చదివిన చదువును ప్రదర్శింపజేసి కొంత డబ్బు కాని, బియ్యం పప్పులని కాని దండుకొనేవారు. ఇదొక ఆచారం.

.

                   పావలా అయితేను పట్టేది లేదు

                   అర్థరూపాయైతే అంటేది లేదు

                   విచ్చురూపాయైతే పుచ్చుకుంటాము

.

అంటూ పాడుకొంటూ, రూపాయి మాత్రమే దండుకొంటూ గడప గడపకూ వెళ్ళి తమ శిష్యుల విద్యను వాళ్ల తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శింపజేసేవారు ఒకనాటి గురువులు. ఈ సందర్భంలోనే గురుశిష్యులు కలిసి పట్టుకొని వెళ్ళే ఒక విధమైన గడలను ప్రస్తావించారు విశ్వనాథ తన నవలల్లో. పంతుళ్లు ఈ గడలను పుచ్చుకొని, క్రొత్తబట్టలు ధరించి కళకళలాడుతున్న తమ విద్యార్థులతో గడపగడపకూ వెళ్ళటం అక్కడ కొన్ని పద్యాలు ఈ పిల్లల చేత చెప్పించటం ఆచారం. గురుశిష్య సంబంధాన్ని ప్రజలకు తెలియజెప్పే ఒక సంప్రదాయమిది. అంతేకాదు ఆ కాలంలో గ్రామాలు వ్యవసాయాధారితాలు కనుక పెద్దలు సాధారణంగా అవిద్యావంతులుగానే ఉండేవారు. పిల్లల చదువులను తెలిసికొనే అవకాశం తల్లిదండ్రులకు ఈ సమయంలో మాత్రమే కలిగేది. అంతేకాదు గురుశిష్య సంబంధాన్ని, గురుశిష్య పరంపరను, అందులో పవిత్రతను ప్రజలకు తెలియజేయటానికి దసరా సమయంలో ఈ మహర్నవమి గడలు పుచ్చుకొని ఇంటింటికీ వెళ్ళి పిల్లలచేత పద్యాలు వల్లెవేయించేవారు. అలా వారు అప్పటి వరకూ చదువుకొన్న చదువును ప్రదర్శించేవారు. అంటే ఈ కాలం భాషలో చెప్పుకోవాలంటే ఇది parent teacher meet అన్నమాట! ఈకాలంలో తల్లిదండ్రులు పిల్లల పాఠశాలకు వెళ్ళి తమ తమ పిల్లల చదువు ఎంతవరకు వచ్చిందో కనుక్కొంటున్నారు. అయితే ఆకాలంలో ఉపాధ్యాయులే పిల్లలను వారి ఇళ్లకు తీసికొని వెళ్ళి తల్లిదండ్రుల ఎదుట, చుట్టాలుపక్కాల ఎదుట వారి విద్యలను ప్రదర్శింపించేవారన్నమాట!

.

ఇంతకీ మహర్నవమి గడలు అంటే ఏమిటి? వీటి వర్ణన విశ్వనాథవారు ‘‘వేయిపడగలు’’ నవలలోనూ, ‘‘శార్వరి నుండి శార్వరి దాకా’’ నవలల్లోనూ చాలా విస్తృతంగానే వివరించారు. వీటి నిర్మాణాన్ని గూర్చిన వివరణ ఇలా ఉంది. మంచి వెదుళ్ళు తెచ్చి సన్నని కోలలుగా చేసి, స్వస్తికలుగా నిర్మించి, తెలుపు నలుపు, పసుపు, ఎరుపు, ఊదా, నీలిరంగుల దారాలు తెచ్చి, దానిని పటాలుగా కుడతారు. రెండు దెసలను, పైభాగమునను మిగిలిన కఱ్ఱల యందు మరల చిన్ని చిన్ని పటాలు కడతారు. కొన్ని పటాలకొక్క ముఖమే ఉంటుంది. కొన్ని పటాలు ద్విముఖాలుగా ఉంటాయి. వాటికి చిలుకలను, బియ్యపు దారాలను పోసి కడతారట. బియ్యపుదారాలంటే తెల్లదారంతో మరో రంగుదారాన్ని కలిపి పేనిన దారం అన్నమాట! ఇప్పుడు ఒక గడను తీసికొని దాని చివర ఈ పటాన్ని బిగిస్తారు. తాటాకులతో బుట్టలుగా అల్లినదానినొకదాన్ని, శ్రీ చక్రంలా అల్లినదాన్నొకదాన్ని ఒకదాని తరువాత మరొకదాన్ని పై గడకు గుచ్చుతారు. ఈ బుట్టలలో రాళ్ళు పోస్తారు.ఈ శ్రీ చక్రాకృతి మత్తాళీదళ విచిత్రనిర్మిత శుకాకృతులకు చివర్ల రంగురంగుల చిలుకల వ్రేలాడింతురు. వాని నడుమ నడుమ గడకు రంగుల గుడ్డలు చుట్టుదురు. దానిని మహర్నవమి గడలందురు.1 అంటారు ‘ శార్వరి నుండి శార్వరి దాకా ’ అనే నవలలో.

.

‘వేయిపడగలు’ నవలలో కూడా ఈ మహర్నవమి గడలు, ఈ గడలు కట్టే విధానాన్ని ధర్మారావు ముఖతః చెప్పించారు విశ్వనాథ. గజము పొడుగు చీల్చిన వాసపుబద్ధ తీసికొని క్రింద అడుగు వదిలి పెట్టి రెండడుగుల చిన్నబద్ద తెచ్చి నడుమున సరిగా సగం సగం అయ్యేట్లు కలిపి కట్టి దానిచుట్టూ దారమల్లుతారు. అల్లినదారం చదరంగా పటానికి ముఖమేర్పడేటట్లు చేసి, ఎరుపు నలుపు, పసుపు, ఆకుపచ్చ రంగు దారాలతో రెండు వేళ్ళ వెడల్పున ఒక్కొక్క రంగు వచ్చేట్లు అల్లుతారు. పటానికి రెండు ప్రక్కల మిగిలిన కఱ్ఱలకు మరల అడ్డుపుల్లలను వేసి చిన్న చిన్న పటాలను అల్లుతారు. ఎరుపు తెలుపు దారాలను కలిపి పెనవేసిన దానిని బియ్యపుదారమని అంటారు. చిన్న చిన్న కుచ్చులు చిలకలు దానికి వ్రేలాడదీసి పటానికి చుట్టూ కడతారు.వేరొక గజము పొడవు గల వాసము తెచ్చి, దానికి తాటియాకులతో గుండ్రముగా గొన్నియు, గొసలు వచ్చునట్లు కొన్నియు గిలకలల్లి, గుండ్రపు గిలకలలో రాళ్ళు పోసి, యీ వాసమునకు దొడిగి, గిలకల మధ్య నున్న వాసమునకు రంగుగుడ్డ లల్లెదరు. ఆ పటము వాసమునకు బిగింతురు. దీనిని మహానవమి గడయనెదరు.”2 అంటారు ‘ వేయిపడగలు ’ నవలలో. ఈ గడలు పుచ్చుకొని ఉపాధ్యాయుడు పిల్లలను వారి బంధువుల ఇళ్లకు నడిపించి తీసికొని పోతాడు. పదేళ్ల పిల్లలకు ఇది కూడా విద్యాభ్యాసమే. పది ఊళ్లు చూడవచ్చు, మనుష్యప్రకృతి తెలిసికొనవచ్చు, వారిలో ఉన్న బెదురును దూరం చేయవచ్చు. అంతేకాదు ఈ పటాల వల్ల పిల్లలకు పసితనమప్పుడే వాని నేత్రములకు వర్ణసామరస్యము (కలర్ హార్మనీ) తెలియును.3 అని మహర్నవమి గడల నిర్మాణాన్ని, వాటి అంతరార్థాన్ని, వాటి వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు. ఈ కాలంలో మాంటిసోరీ అనే విద్యాపద్ధతిలో చిన్నపిల్లలకు ఇంచుమించు ఇదే పద్ధతిలో విద్యాబోధన జరుగుతుందని వింటున్నాం. ఇందులో పిల్లలు వారంతట వారే తమ తమ పనులనూ చేసికొనేట్లు విద్యాబోధన జరుగుతుంది. అయితే ఒకప్పటి పల్లెటూర్లలో ఇది సర్వసామాన్యమైన విద్యాపద్ధతి. పిల్లలకు సామూహికంగా పని చేయటమూ తెలుస్తుంది. కలిసి చేయటం, కలిసి వెళ్ళటం వల్ల పిల్లల మధ్య సామరస్యము, ఐకమత్యము పెరుగుతాయి. ఇలా నేర్చికొన్న పాఠం మనసుకి హత్తుకొనటంతో మరచిపోయేందుకు అవకాశం ఉండదు.

.

ఒకప్పటి పండుగ ముచ్చట్లు, అందులో ఇమిడి ఉన్న సంప్రదాయం, గురుశిష్య సంబంధం, ఆ సంబంధానికి గల గుర్తింపు, దాని వల్ల ఒనగూరే ప్రయోజనం ఇటువంటి పండుగల్లో ప్రతిఫలిస్తున్న భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఈ నవలల ద్వారా విశ్వనాథ ఇలా ఆవిష్కరించారు.

.

  1. శార్వరి నుండి శార్వరి దాక, పుట – 76.
  2. వేయిపడగలు, పుట – 867,
  3. అదే, పుట – 867 

*************************************

Dr. Gummuluri Indira

Visakhapatnam

Ph : 9985386444, Email id: indiragummuluri@gmail.com

.

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

______________________________________________________