ఎడదగుడిలో దేవు డున్నాడు !
ఇదిగొ ! నామాట విను మన్నాడు !
మనిషిగా పుట్టేవు
మనిషిగా పెరిగేవు
మధ్యలో అసురుడుగ
మారవ ద్దన్నాడు !
అంతరాత్మలపిలుపు
అలకించిననాడు
అపజయము నీకు లే దన్నాడు
నీకు అవనిలో ఎదు రుండ దన్నాడు !
జీవుడూ దేవుడూ
వేఱు కా రన్నాడు
ఇద్దఱును ఒకటని
యెఱిగికొ మ్మన్నాడు !
అంతరాత్మప్రబోధ
మనుసరించిననాడు
మనీషియే దేవుడుగ
మారు నన్నాడు !
భంగపాటులలోన
క్రుంగవ ద్దన్నాడు !
మది పొంగులో తన్ను
మఱువవ ద్దన్నాడు !
నవ్వుతూ యితరులను
నవ్వింపు మన్నాడు !
ఆనందమే జీవ
లక్షణం బన్నాడు !
ఎడదగుడిలో దేవు డున్నాడు !
ఇదిగొ ! నామాట విను మన్నాడు !
——- ( 0 ) ——-
Please visit this page