10_007 కరోనా కాలం

ఇక్కడ ఓ శ్వాస  ఆగింది.

ఎవరూ వచ్చి ఓదార్చరేం?

దుఃఖమయ వదనాన్ని..

వాల్చి రోదించడానికి..

ఓ బుజమైనా ఇవ్వరేం?

గుండె బరువు దించుకోవడానికి..

ఓ ఆసరా అవ్వరేం?

ఆప్తులెవరైనా..

అసువులు బాసినప్పుడు..

అశ్రువులు రాల్చడానికి..

ఇంట… బయట..

బాంధవులు..

గుంపులుగా చేరతారుగా!

కానీ..

ఇప్పుడు…ఇక్కడకు..

ఎవరూ రాలేదు. 

వచ్చిన ఒకరిద్దరూ…

ముఖాలకు..

ముసుగులు తొడుక్కున్నారు.

వాటి వెనుక..

అర్థం తెలియని భావాలు…

అగుపించని భయాలు! 

ఓదార్చినా..

వెక్కి వెక్కి రోదించినా..

అన్నీ..దూరవాణిలోనే !

శాంతి వచనం.. శ్రద్దాంజలి.. ముఖపుస్తకం లోనే!

హే రామ్!

కలిసి బ్రతకడం కోసం..

కష్టానికైనా..

కలికాలానికైనా సిద్ధపడ్డాం.

కరోనా కాలానికి కాదు!!

****************************