.
కళ్ళు ఎందుకు ఎందుకు
ముందుకు ఉన్నాయీ ?
చెవులు ఎందుకు ఎందుకు
వెనక్కి ఉన్నాయీ ?
.
ముందుకు సాగేయీలోకంలో
ముందుకె ముందుకె చూడు మనీ !
చెవులు విన్నదే నిజ మని నమ్మక
కన్నులతోనూ చూడు మనీ !
.
కళ్ళూ చెవులూ రెండే సున్నా
నో రొక్కటియే ఉం దేమీ ?
.
రెండుకళ్లతో కన్ననూ కానీ
రెండుచెవులతో విన్నను కానీ
ఒక్కనోటితో పలుకు మని-
మితముగానే మాటాడు మని !
.
ద్వారానికి శుభకార్యములప్పుడు
తోరణ మెందుకు కట్టాలి ?
.
పలువురు విడిచేపనికిరానిఆ
గాలిని పీల్చేటందుకని !
.
కాపుర ముండేయింట్లో గడపకు
పసుపు రాయటం ఎందుకని ?
.
పైపైఅందంమాట అటుంచీ-
పురుగు దొలవకుండేందుకని !
.
అందా లొలికేతామరపువ్వులు
అలా బురదలో ఉన్నా యేమీ ?
.
కుల మేదైనా గుణము చూడు మని
తెలియనివారికి తెలుపు మని !
.
—-(0)—-