10_011 తో.లే.పి. – డా. కె. ఎస్. సుబ్బరామప్ప

.

కథాకాలం : 1967.. 

1963 లో కాకినాడలో ఇంజినీరింగ్ చదువు పూర్తిచేసి, ఆ వెంటనే ఉద్యోగంలో ప్రవేశించి శ్రీశైలం ప్రాజెక్ట్ లో జూనియర్ ఇంజినీర్ పదవీ సింహాసనాన్ని అధిరోహించాను. అయినా ఏమి లాభం ? సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి గారికి ఉండే బాధ్యతల లెవల్ లో నా ఉద్యోగ బాధ్యతలు ఉండేవి. ఎటొచ్చీ ఆయన భోగాలు మాకు అంటకపోయినా, అంతకుమించి బాధ్యతలు, శారీరక, మానసిక శ్రమలు మాత్రం పుష్కలంగా సదా మమ్మల్ని వెన్నంటి ఉండేవి. ఫీల్డ్, ఆఫీస్ పనులతో ఇలా నేను దాదాపు రెండేళ్లపాటు నరకయాతనను అనుభవించాకా, ఇక పాపాల చాఫ్టర్ ముగిసింది కాబోలు – ఒక శుభదినాన భువిపై స్వర్గ ద్వారం తెరుచుకుని నన్ను  లోనికి రమ్మనమని నిండుమనసుతో ఆహ్వానించింది. ఫలితంగా, చీఫ్ ఇంజినీర్ ఆఫీస్ కి బదిలీ అయ్యాను. అయితే, ఆఫీస్ పని అవడం తో కాస్తంత వెసులుబాటు దొరికేది అన్నమాట. నేనప్పటికి ఒక ఘోటక బ్రహ్మచారిని… అంటే ఏకాకి ని అన్నమాట ! ఏ బరువు, బాధ్యతలు ఉండేవి కావు. మా అమ్మ, నాన్నగారు, తమ్ముళ్లతో కలిసి అందరం శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో మా నాన్నగారికి అలాట్ అయిన క్వార్ట్రర్స్ లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు అక్కడే ప్రాజెక్ట్ హైస్కూలు లో లెక్కల మాస్టారు గా పని చేసేవారు. ఇది ఇలా ఉండగా, కృష్ణానది కి రైట్ బ్యాంకు ( కర్నూలు జిల్లా ) లో ఈగలపెంట లో ఉండే ఆఫీసు ని, లెఫ్ట్ బ్యాంకు లో దోమలపెంట ( మహబూబ్ నగర్ జిల్లా ) కు మార్చడం జరిగింది.. సరే — ఇదీ ఒకందుకు బానే ఉందిలే అని సరిపెట్టుకున్నాను. మరి మార్పుల విషయం వచ్చేసరికి, అంతయూ మన మేలుకే అని కదా అన్నారు మన పెద్దలు. లెఫ్ట్ సైడ్ కాలనీ లో నాకు నా పదవి దృష్ష్ట్యా లంకంత సైజ్ లో ఇండిపెండెంట్ క్వార్ట్రర్స్ అలాట్ చేసారు. ఇంటా, బయటా హాయిగా ఆడుతూ, పాడుతూ ఆనందం గా గడుపుతూ ఉండేవాణ్ణి. నా  చిన్నతనం లో మా టీచర్లు మాలో వెలిగించిన సాహితీ దీపాన్ని ఇంతకాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం జరిగింది… ఇప్పుడు, మళ్ళీ నాకు లభించిన ఒక సువర్ణావకాశం ఏమంటే ఆ దీపం వెలుగులో, నా సాహితీ ప్రస్థానాన్ని తిరిగి కొనసాగించడం… సాహిత్యం, సంగీతం అంటే సాహితీ గోష్టులు, సంగీత కార్యక్రమాలు, నాటకాలు ఇలా వాటిలో తరచుగా పాల్గొంటూ ఉండడం.. పుస్తకాలను విరివిగా చదువుతూ పఠనాసక్తి ని పెంపొందించుకుంటూ ఉండడం. 

ఇదుగో.. అలాంటి ఒక సందర్భం లో నా అభిమాన గ్రంథాలలో ఒకటైన శ్రీకృష్ణదేవరాయ విరచిత ఆముక్త మాల్యద ను గురించి వినడం జరిగింది. దీని వెనుక ప్రేరణను కలిగించిన మహానుభావులు ఎవరంటే డాక్టర్ శ్రీ కె. సుబ్బరామప్ప గారు. వారు అప్పట్లో మైసూరు విశ్వవిద్యాలయం లో తెలుగు శాఖ లో ఆచార్యులు గా, అధిపతి గా ఉండేవారు. ఎన్నాళ్ళగానో దీక్షగా సాహితీ వ్యవసాయం చేస్తూ, అలుపు..విరామం ఎరుగని కృషీవలుడు అయన. ఆయన గురించి నేను అంతకు ముందే విని వున్నాను. నా సాహితీ పిపాస ను నేను ఆయనకు ఉత్తరం ద్వారా తెలియజేస్తూ, ఆముక్తమాల్యద కావ్యం గురించిన కొంత సమాచారాన్నికోరగా, ఆ ఉత్తరానికి ఆయన తక్షణం స్పందిస్తూ, కొన్ని వివరాలతో నాకు ప్రత్యుత్తరాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తరం లోని ప్రతీ అక్షరం వెనుకా ఆయన సౌజన్యం నాకు గోచరించింది. ఆ ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. దయచేసి తిలకించండి. కాగా, ఇక్కడ  విశేషమేమంటే, ఈ పిట్ట ఒక వయసు మళ్ళిన పిట్ట.. దీనిది 53 సంవత్సరాల వయసు…. ఇది ఏమైనా సామాన్యమయిన విషయమా.. మీరే  చెప్పండి. ! 

<><><>***ధన్యవాదములు…నమస్కారములు***<><><>