13_007 మందాకిని – వృక్షో రక్షతి రక్షితః

ప్రకృతిలో గాలి, వెలుతురు,నీరు,పచ్చదనం,వెచ్చదనం అన్నీ వున్నాయి. మనకు భగవంతుడు ప్రసాదించిన వరం ఈ నదులు, సముద్రాలు,కొండలు,గుట్టలు,అడివి,జంతుజాలం,పగలు,రాత్రి,వెన్నెల…. అన్నీ!

ప్రకృతిలో ప్రజలు మమేకమై యిదివరకు ఎలా జీవించారు ? ఇప్పుడు ఎలా జీవిస్తున్నారు. ఒకసారి చూద్దాం !

పూర్వం ఏవూరులో చూసినా పచ్చని పైర్లు గాలికి ఊగుతూ ఆహ్వానం పలికేవి. వాటిమీద నుంచి వచ్చే గాలిని పైరుగాలి అంటారు. అలాగే పల్లెలలోనే కాదు పట్టణాలలో కూడా చుట్టూ ప్రహరీతో ముచ్చటైన ఇళ్ళు కట్టుకొనేవారు. ప్రతి ఇంట్లోనూ ముందువైపు,పెరటివైపు,సందులోను రకరకాల పూలమొక్కలు,కూరగాయలు కనువిందుచేస్తూంటే,కొబ్బరి,వేప, మామిడి చెట్లు పహరా కాస్తున్నట్లుండేవి.

నూతి పళ్ళెం లోంచి బయటకు పోయే నీటిని సన్నగా కాలువల్లాగా చేసి,చెట్లకి,పాదులకి మళ్ళించేవాళ్ళు. నీరు వృధాపోయేది కాదు. వాన నీరు పడ్డది పడ్డట్లుగా భూమిలోనికి ఇంకిపోవడంతో బావిలో జలధార నిరంతరం ఇబ్బంది లేకుండా లభించేది.

సాయంత్రం అయేసరికి విచ్చుకొన్న పూలు పరిమళాలు జల్లుతూంటే పిల్లలు బయట చప్టా మీద కూర్చుని చదువుకొనేవారు. ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడంతో,చదివినవన్నీ బాగా జ్ఞాపకం వుండేవి. ఇప్పటి పిల్లలకి ఆరుబయట ఆటా లేదు,ప్రశాంత వాతావరణం అంతకంటే లేదు. చదువు, రాంకులు,కాస్త ఖాళీ దొరికితే చరవాణి ముచ్చట్లు-అంతే !

“తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.

రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి. పల్లెటూళ్ళల్లో కూడా ఈ జాడ్యం మొదలయింది. ఇక పావురాల సంగతి తలుచుకొని బాధ పడటమే మిగిలింది. ఈ కాంక్రీట్ జంగిల్ లో వాతావరణ కాలుష్యంతో బతుకుతున్నాం.

ఇటీవల కొందరు నడుం కట్టడంతో మొక్కలు నాటాలనే తపన మళ్ళీ మొదలైంది. మొక్కల మీద ఆపేక్ష వున్నవాళ్ళు బాల్కనీలలోను, ఆకాశహర్మ్యాల పైన ఖాళీ జాగాలలో పచ్చదనం నింపుతున్నారు.

హరితహారం,వనమహోత్సవం,హరితవనం అంటూ రకరకాల పేర్లుపెట్టి అనే ఒక లక్ష్యంగా లక్షలేసి మొక్కలు నాటుతున్నారు. అందులో లక్షణంగా పెరిగిన మొక్కలను మాత్రం వ్రేళ్ళమీద లెఖ్ఖ పెట్టవచ్చు.

వృక్షాలవల్ల మనకు కావలసినంత ప్రాణవాయువు లభిస్తుంది. మొక్కలకి ప్రాణం వుంటుందా? అని చాలా మందికి అనుమానం. మొక్కలకి ప్రాణం వుండబట్టి అవి పచ్చగా వుండి,గాలికి తలలు ఊపుతూ,మనకి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అవి ఎండిపోతే అందులో జీవం పోయినట్లే !

ఉదాహరణకి వేప చెట్టు కింద పడుకొన్నప్పుడు వున్న,హాయి,చల్లదనం,ఆరోగ్యం,ఈ ఎ.సి. గదుల్లో దొరుకుతుందా ? రోగాలు కొని తెచ్చుకోవడం తప్ప.

మీకొక చిత్రం చెపుతాను. రెండు ఒకే రకమైన మొక్కలను కొంచెం దూరంగా వుండేలా నాటండి. ఒక మొక్కకి నీళ్లు పోస్తూ చక్కగా పొగుడుతూ, మంచి మాటలు చెబుతూ నీరు పొయ్యిండి.

రెండో మొక్కని తిడుతూ నీళ్లు పొయ్యండి. పర్యవసానం ఆగి చూడండి. ముందుగా పొగిడిన మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది. తిట్టినది జీవం లేకుంగా మాడిపోతుంది. వృక్ష శాస్త్రం తెలిసిన వాళ్ళు చెపుతూంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది. నిర్లియన్ ఫోటోగ్రఫీతో ఫోటోతీసి నిరూపించారు కూడాను.

మొక్కలు పెంచాలనే ఉద్యమం చాలా చక్కటి పరిణామమే। మొక్కలు కొల్లలుగా వెళ్లి నాటుతున్నారు. కాని వాటి ఆలనా, పాలనా ఎంతమంది చూస్తున్నారు ? ఆ మొక్కలలో ఎన్ని పెరిగి పెద్దవుతున్నాయి? పట్టించుకోనే నాథుడు లేడు. ఇది మాత్రం చాలా బాధాకరంగా వుంటున్నది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఫోటోలకు,విడియోలకు పరిమితం చెయ్యకుండా, మొక్కలు నాటిన తరువాత వాటిని పెంచి పెద్ద చేసే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకొన్న రోజున మన పల్లెలు, పట్టణాలు నందనవనాలే అవుతాయి.

­ ***************************

 

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page