సంగీతంతో పవిత్రమైన ఊరు
శ్యామశాస్త్రి ( 1762 – 1827 ), త్యాగరాజస్వామి ( 1767 – 1847 ), ముత్తుస్వామి దీక్షితులు ( 1775 – 1835 )... కర్ణాటక సంగీతానికి జవసత్వాలనిచ్చి సుసంపన్న రూపాన్నిచ్చిన త్రిమూర్తులు. సంగీత జ్ఞానానికి, సాహిత్య వైభవానికి, అనన్య భక్తికి చిరునామాగా నిలిచి ఎందరో శిష్య ప్రశిష్యులకు మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పటికీ సంగీత ప్రియుల నీరాజనలందుకుంటున్నారు.
వారు కాలం చేసిన తరువాతే “ సంగీత త్రిమూర్తులు ” గా పేరు గాంచినా, వారికి మాత్రం ముందే తెలిసిందేమో…. తాము కారణ జన్ములమని, అందుకే ముగ్గురూ ఒకే ఊరిలో, అది కూడా ఒకే ఆలయానికి దగ్గరలో జన్మించారు. ఒకే కాలంలో జీవించి సమకాలికులయ్యారు. ఆ పుణ్యభూమే తమిళనాడులోని తిరువారూరు. వారు పుట్టిన తరువాత వారి వారి కుటుంబాలు తిరువయ్యూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్ళినా చరిత్రకు ఆనవాళ్ళుగా, సంగీత విద్యార్థులకు తీర్థ యాత్రా స్థలాలుగా ఇప్పటికీ ఆ మహా వాగ్గేయకారులు జన్మించిన ఇల్లు వెలుగొందుతున్నాయి. తిరువారూరులో శివుడికి నెలవైన త్యాగరాజస్వామి ఆలయం నుంచి నడిచే దూరంలోనే ఉన్న ఆ ఇళ్లపై కథనం.
త్రిమూర్తులలో పెద్దవారైన శ్యామశాస్త్రి జన్మించిన ఇల్లు ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇందులో ఎంతో చక్కని చిత్రాలు, విగ్రహాలు నెలకొన్నాయి. ఆయన జన్మించే ముందు ఆయన తల్లికి వారి ఇంటి దగ్గరలోని ఒక భక్తుడు చెప్పారట…. నీకు ఒక గొప్ప భక్తుడు, సంగీతజ్ఞుడు జన్మిస్తాడు…. అని. ఆయన చెప్పింది నిజమైంది. నిజానికి శ్యామశాస్త్రికి పూర్వం ఆ వంశంలో వేద పండితులు, పురోహితులే కానీ సంగీత విద్వాంసులే లేరట. శ్యామశాస్త్రిని కూడా ఆయన తండ్రి తెలుగు, సంస్కృతాలలో నిష్ణాతుడిని చేశారు. చిన్నప్పుడు మేనమామ వద్ద సంగీతంలోని ప్రాథమికాంశాలు నేర్చుకున్న ఆయన 18 ఏళ్ల వయసులో తమ ఇంట చాతుర్మాస్య వ్రతం చేసిన ‘ సంగీత స్వామి ” వద్ద శిక్షణను పొంది ఆయన నుంచి సంగీత శాస్త్ర గ్రంథాలను అందుకున్నారు. “ వెంకట సుబ్రహ్మణ్య”డని తల్లిదండ్రులు పేరు పెట్టినా తదనంతర కాలంలో “ శ్యామశాస్త్రి ”గా పేరుగాంచారు.
త్యాగరాజ స్వామి పుట్టిన ఇల్లు అప్పట్లో ఒక గది మాత్రమేనట. తరువాతి కాలంలో ఇంటిని విస్తరించడం జరిగింది. ఆయన పుట్టిన గదిలో ఒక బల్ల మీద ఆయన విగ్రహాన్ని ఏర్పరిచారు. తల్లివైపు, తండ్రి వైపు కూడా సంగీత విద్వాంసులవడంతో త్యాగరాజస్వామికి సంగీతం ఉగ్గుపాలతోనే అలవడింది. మాతామహుల వద్ద వీణ కూడా నేర్చుకున్నారు. యుక్త వయసులోనే సొంతంగా కీర్తనలను కూర్చేవారు. స్థానిక దేవుడైన త్యాగరాజస్వామి పేరును, అంటే శివుడి పేరును తల్లిదండ్రులు ఆయనకు పెట్టారు. ఆయన కూడా ఆ శివుడి వలె నిరంతరం రామ నామ తత్పరుడై అనేక కృతులు, కీర్తనలను రాముడిపై సృజించారు.
సంగీత త్రిమూర్తులందరిలోకి పిన్న వయస్కుడైన ముత్తుస్వామి దీక్షితులు జన్మించిన ఇల్లు ప్రస్తుతం ఒక ప్రదర్శన శాల గా మార్చబడింది. ప్రవేశ ద్వారం పైన శ్యామశాస్త్రి, త్యాగరాజ, ముత్తుస్వామి దీక్షితుల విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి. లోపల దాదాపు మూడు వందలమంది కూర్చోనగలిగేంత హాలు, అందులో ఒక వేదిక ఉన్నాయి. ఈ హాలులోనే ఒక పక్కగా ముత్తుస్వామి దీక్షితుల విగ్రహం ఏర్పాటు చేశారు. వీణావాదనకు, మంత్రయుక్తమైన కృతుల కూర్పుకు పేరుగాంచిన ముత్తుస్వామి దీక్షితులకు సంగీత ప్రియులు, విద్యార్థులు ఇక్కడే నివాళులర్పిస్తారు.
****************************************
గమనిక : ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.
పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023
***************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి