10_010 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – అమ్మనే… జగదంబనే…

ఏమిటీ..నాతో గుడికి రావడానికి మీరు రెడీగా ఉన్నారా, నాదే ఆలస్యం అంటారా?

ఇదిగో! చీర కట్టుకోవడం అయిపోయింది. పళ్ళు-పూలు బుట్టలో సర్దేసి క్షణంలో వచ్చేస్తున్నా!

అయ్యొయ్యో! ఏమిటండీ ఈ అవతారం? ఇలాగా దైవదర్శనానికి వెళ్లటం? మిమ్మల్ని చూస్తుంటే గుడికి వెళ్ళేవాళ్ళలా లేరు. సామర్లకోట స్టేషన్ లో సామాన్లు మోసేవాళ్ళలా ఉన్నారు! లూజులూజుగా ఆ పొట్టిలాగు…దసరాబుల్లోడికి మల్లె పూలచొక్కా.. నెత్తిమీద ఆ క్యాపు.. బొడ్లో సెల్‌ఫోను తో భలే ఉన్నారండి! ఈ గెటప్‌లో మీరు గుడికి వెళ్తున్న పెద్దమనిషిలా లేరు. చెత్త సినిమాలు తీసే చచ్చు డైరక్టరు లా ఉన్నారు.

ఏమిటీ…సమ్మర్ టైములో ఇలా ఉంటే హాయిగా ఉంటుందా…ఇట్లా వెళ్తే తప్పేమిటీ అంటారా?

ఇకనేం, రోజు ఆఫీసుకు కూడా ఈ అవతారంలోనే వేంచేయవచ్చు కదా? ముచ్చెమటలు పోస్తున్నా పొట్టలు బిగించి పాంట్లు, మెడకు ఉరితాడల్లే టైలు వేసుకుని వెళ్తారెందుకో?

ఏమిటీ… ఇలా వెళ్తే ఉద్యోగం ఊడపీకి ఇంటికి దయచేయమంటారా ?

నాకు తెలీక అడుగుతా, ఈ అవతారం ఆఫీసుకు పనికి రాదు, కానీ… ఆలయానికి మాత్రం పనికొస్తుందన్నమాట. మీకు రాను రాను మతిపోతోంది. వెనకటికి మీలాంటి వాడే చదువుకోకముందు కాకరకాయ అని, చదువుకున్నాక కీకరకాయ అన్నాట్ట!

“ బీ రోమన్ ఇన్ రొమ్ ” అంటూ ఎక్కడుంటే అక్కడికి తగ్గట్టు ప్రాపర్ గా డ్రెస్ అవ్వాలంటూ వెనకటి రోజుల్లో మా ఆడాళ్ళకు ఉపదేశాలు చేసారు గుర్తుందా? ఆ సూత్రం మీకు గుడికెళ్ళేటప్పుడు గుర్తుండదా?

అసలు మీకు చేసే పనిమీద శ్రద్ధ ఉంటే కదా? ఎప్పుడు ఆలయానికి వచ్చినా అక్కడికి నన్నేదో ఉద్ధరిస్తునట్లు బయలుదేరుతారు. అక్కడికెళ్ళాక ఆ దేముడికేదో ఫేవర్ చేస్తున్నట్లు మొక్కుబడిగా ఓ నమస్కారం పడేయటం, ఇక అక్కడినుంచి ఎప్పుడు బయటపడదామా అని చూడ్డం. లేకపోతే చిన్న పిల్లలకు మల్లే “ ఆకలేస్తోంది.. దాహమేస్తోంది ” అంటూ మొదలు పెడతారు.

మీరు గుడికి ఎందుకు వస్తారో నాకు బాగా తెలుసు. అసలు మీ భక్తి అంతా ప్రసాదాల మీద, దేవాలయం  కెఫటీరియాలో దొరికే దోశెల మీద! దేముడి ముందు ఒక్క నిముషం కూడా నిలబడలేరు, కానీ..అక్కడ దొరికే  చక్రపొంగలి కోసం ఓపిగ్గా లైన్లో నిలబడతారు!

“ చూపులు దేముడిమీద చిత్తం చెప్పులమీద ” అన్నట్టు మీలాంటి వాళ్లకు మనసంతా ఫుడ్డు మీద! గుళ్ళో ఆఫీసుకు ఫోన్లు చేసే మీబోటి వాళ్ళు “ గుడి ఎన్నింటికి తెరుస్తారు? ఇవ్వాళ ప్రత్యేక పూజ ఏమిటీ? ” లాంటి విషయాల కోసం కాదు “ కాఫిటీరియా ఎన్నిటికి తెరుస్తారు? ఈ రోజు లంచ్ స్పెషల్ ఏమిటీ? శివరాత్రినాడు రాత్రంతా, కెఫటీరియా కూడా తెరిచి ఉంటు౦దా ?” అని ఎంక్వయిరీలు! మొన్నామధ్య గుడి ఆఫీసులో క్యాలండర్ కొనుక్కునేందుకు లైన్లో నుంచున్నాను. నా ముందరాయన “ అర్చన విత్ఔట్ కోకోనట్ ” అనబోయి  “ అర్చనా వితౌట్ ఆనియన్స్! ” అన్నాడు శనివారం ఉల్లిపాయ ముట్టని మహాభక్తుడు!

ఆమధ్య గుళ్ళో మా పెదనాన్నగారి మనవడు, ఇలాగే షార్ట్స్, టీషర్టు వేసుకుని కనిపించాడు. “ ఏరా శివం ! మీ ఆవిడా పిల్లలు బాగున్నారా….ఎక్కడా వాళ్ళు? ” అంటే “ బాగున్నారు పిన్నీ! నేను పార్క్ లో జాగింగ్ కు వెళ్ళి వస్తూ ఇక్కడ ఆగాను. ఇక్కడి ఇడ్లీ, వడలు, పొంగల్ మాకు చాలా ఇష్టం. కింద టేక్‌ఔట్ కు ఆర్డరిచ్చి దేముడికి దండం పెట్టుకుందామని పైకి వచ్చాను ” అని అంటుంటే ఏమనాలో తెలీలేదు.

అన్నట్టు చిత్తం చెప్పుల మీద అంటే గుర్తొచ్చింది.. మనుషుల్లో సివిక్‌సెన్స్ ఇంత అధ్వాన్నంగా ఉందేమండీ?

ఆలయంలోకి వచ్చిన వాళ్ళు చెప్పులు షెల్ఫ్ లో పెట్టకుండా ఇష్టం వచ్చినట్లు నేలమీద విడిచేస్తారెందుకూ?

ఆ షెల్ఫ్ ఏదో నొచ్చుకుంటుందన్నట్లు దాన్ని ఖాళీగా వదిలేసి దాని ముందరే అడ్డదిడ్డంగా వదిలేస్తారు.  చక్కగా చెప్పులు లోపల పెట్టచ్చు కదా? అక్కడికి వచ్చేవాళ్ళందరు మళ్ళీ పెద్ద పెద్ద చదువులు చదివినవారే. అలాంటి వాళ్ళే ఇలా చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది సుమండీ!

ఏమిటీ…మిగిలిన చోట్ల ఎవరూ ఇలా ఉండరా.. మన గుడే కదా అని ఈ రూల్స్  ని ఎవరూ పెద్దగా పట్టించుకోరంటారా?

ఇకనేం..అలా ఇష్టం వచ్చినట్లు విడిచిన ఆ చెప్పులన్నీ గార్బేజిలో పడేసి “ మీ చెప్పులు చెత్తకుండీలో పడేసాం, పట్టించుకోకండి ” అని అంటే అప్పుడు తెలిసొస్తుంది అందరికీ.

ఇదిగో! మీకు చివరిసారిగా చెప్తున్నా….

భగవంతుడి మీద నిజమైన భక్తి లేనప్పుడు, దేవాలయానికి వెళ్ళే పద్ధతి మీద గౌరవం లేనప్పుడు, గుళ్ళో పెట్టిన రూల్స్ ని పాటించాలన్న విచక్షణాజ్ఞానం లేనప్పుడు మీకు ఆలయానికి వచ్చే అర్హత లేదు. అసలు మీరు రావద్దు కూడా. మీకు కావలసింది పిచ్చాపాటి, చిరుతిండే అయితే, ఇలాంటి బట్టలు వేసుకుని ఏ రెస్టారెంటుకో వెళ్ళండి. అంతేకాని ఇలా గుడికి వస్తే ఊరుకునేది లేదు.

ఏమిటీ… నన్ను చూస్తుంటే చిన్నప్పుడు తప్పుచేస్తే కోప్పడిన మీ అమ్మ, ఫ్రెండ్స్ తో కలిసి కలకత్తాలో చూసిన కాళికామాత గుర్తుకొస్తున్నారా?!

ఇకనుంచి బుద్ధిగా.. గుడ్ బాయ్ లాగా గుడికి వస్తారా? గాడ్ ప్రామిస్సా !

అలా రండి దారికి… మాట తప్పారో నేను “ అమ్మను…జగదంబ ” ను గుర్తుంచుకోండి!!!

******************************

.

అమ్మనే జగదంబనే - నేపథ్యం

మా న్యూజెర్సీ లో కొద్ది సంవత్సరాల క్రితం“ వెంకటేశ్వరస్వామి దేవాలయం” కట్టినప్పుడు అందరం ఎంతో ఆనందపడిపోయాం! ఆలయం ఎప్పుడూ భక్తులతో చక్కగా కళకళలాడుతూ ఉండటంతో, దేవాలయం కమిటీ కూడా అందరికీ వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వచ్చారు. ఒకసారి మాతో గుడికి వచ్చిన మా అమ్మాయి “ ఇదేమిటీ? చాలామంది ఏ బీచ్ కో, బేస్ బాల్ గేముకో వెళ్తున్నట్టు వచ్చారు ” అంటూ ఆశ్చర్యం ప్రకటించింది. ఆ తర్వాత నేను ఈ సంగతి మా ఫ్రెండ్స్ తో అంటే, వాళ్ళ పిల్లలు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారని తెలిసింది.  టెంపుల్‌కు ప్రాపర్‌గా డ్రెస్ అవకుండా రావడం, “ డోంట్ లీవ్ షూస్ ఆన్ ద ఫ్లోర్ ” అని బోర్డ్ పెట్టినా నిర్లక్ష్యం చెయ్యటం... గుళ్ళో పెద్దగా మాట్లాడటం... వేరే పనులమీద వెళ్తూ దారిలోనే కదా అని గుడిలో ఉన్న కాఫిటీరియా ఫుడ్డు కోసం వచ్చే వారిని చూస్తున్నప్పుడు మనసులో ఎక్కడో బాధగా అనిపిస్తుంది. దేవాలయం కమిటీలో మెంబర్ గా ఉన్న మా ఫ్రెండ్ ఒకరు “ మీరు ఈ సబ్జెక్ట్ మీద ఓ ముచ్చట రాయండి... కొంతమందైనా మారుతారు! ” అని నాతో అన్నప్పుడు నిజమే ఎందుకు రాయకూడదూ అని అనిపించి రాసిన ముచ్చట ఇది !