10_004 మహాత్మాగాంధీ శతజయంతి – ఒక జ్ఞాపకం

                  1969 వ సంవత్సరంలో శ్రీ మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాలు యూకే లోని లండన్ లో ఉన్న సెయింట్ పాల్స్ కేథీడ్రల్ లో జరిపారు. 

                 ఈ ఉత్సవానికి స్వతంత్ర భారత దేశపు చివరి గవర్నర్ జనరల్ శ్రీ లార్డ్ మౌంట్ బ్యాటన్ గారు అధ్యక్షత వహించారు. బ్రిటన్ భారతదేశ రాయబారి తో సహా ఇరవైఐదు దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. 

                ఈ ఫంక్షన్ కి నన్నూ, కీ.శే. శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారినీ గాంధీజీ ప్రియ భజనలు పాడమని అడిగినప్పుడు నా ఆనందం వర్ణనాతీతం. ఆరోజుల్లో మేము లండన్లో నివసిస్తూ ఉండటం నా అదృష్టంగా భావిస్తాను నేటికీ. నేను ” హరి తుమ్ హారో జన్ కీ భీర్ ” అనే భజనను సోలోగా సింధుభైరవి రాగంలో పాడాను. ” వైష్ణవజనతో ” అనే భజనను సూర్యకుమారి గారు పాడారు. మూడవ భజన ” రఘుపతి రాఘవ రాజారామ్ ” ఇతర గాయనీ గాయకులతో కలిసి బృందగానంగా అందచేశాము. ఈ పూర్తి కార్యక్రమాన్ని బీబీసీ వారు చిత్రికరించి తరువాత బీబీసీ 2 ఛానెల్ లో ప్రసారం చేశారు. ఈ ప్రసంగాలు, పాటలు అన్నీ కూడా తదుపరి ఈ. ఎం. ఐ. రికార్డింగ్ కంపెనీ వారు ఎల్. పీ రికార్డ్ గా రూపొందించి మాకు అందచేశారు.

              ఈ రోజుల్లో గ్రామఫోన్ ప్లేయర్లు లేనందువలన అవి వినటం ఇంతవరకూ నాకూ సాధ్యం కాలేదు. జనవరి, 2021 నాటికి దానిని కూడా సీడీ గానో లేదా పెన్ డ్రైవ్ లోనో పొందుపరచగలనని ఆశిస్తున్నాను. 

              సెయింట్ పాల్స్ కాథెడ్రల్ ఒక చారిత్రాత్మక కట్టడం. పెద్ద చర్చ్. ఈ స్థలంలో నిలిచిన నాలుగవ చర్చ్ ఇది. దీనికున్న డోమ్ ప్రపంచంలోనే అతి పెద్దది. అతి చిన్న రహస్యాన్ని కూడా డోమ్ చివరి భాగానికి చేరవేసే విస్పరింగ్ గ్యాలరీ ఇందులో ఉంది. మార్టిన్ లూథర్ కింగ్ ఈ చర్చ్ లో ఒకసారి తమ సందేశాన్ని ఇచ్చారు..

లైబ్రరీ అఫ్ కాంగ్రెస్ గురించి….  

              అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ లో గల అతి పురాతనమైన  సాంస్కృతిక సంస్థ. ఇది అమెరికన్ నాగరికతలో ఒక అనుపమానమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. మొట్టమొదట లెజిస్లేటివ్ లైబ్రరీగా 1800 లో స్థాపించబడి, 19 వ శతాబ్దం నాటికి ఒక జాతీయ సంస్థగా ఎదిగి, అమెరికా సంస్కృతికి ప్రతీక గా నిలిచింది. IIవ ప్రపంచ యుద్ధం నాటికి ఇదొక అంతర్జాతీయ వనరుగా అద్వితీయమైన పరిమాణానికి చేరుకొని, ప్రపంచంలోనే అతి పెద్ద లైబ్రరీ గా పేరుగాంచింది. ఈ సంస్థ యొక్క సేకరణలలో 39 మిలియన్ల కేటలాగ్ చేయబడిన పుస్తకాలు, 470 భాషలలో ఇతర ప్రింట్ మెటీరియల్స్, 73 మిలియన్ల వ్రాతప్రతులు, నార్త్ అమెరికా నుంచి అతి పెద్ద పుస్తక సేకరణలు మరియు లీగల్ మెటీరియల్స్, ఫిల్ములు, మ్యాపులు, షీట్ మ్యూజిక్ మరియు సౌండ్ రికార్డింగ్స్ సహితంగా 170 మిలియన్ విషయాలపై సేకరణలు కలిగి ఉంది. ఇందులో పేర్కొనబడటం, ఒక మహత్తరమైన విజయంగా భావించబడుతుంది.

ఈ కార్యక్రమాన్ని ఒక బృహత్ సాంస్కృతిక కార్యక్రమంగా భావించి, లైబ్రరీ అఫ్ కాంగ్రెస్ తమ వద్ద భద్రపరుచుకుని, ఆ ధ్రువీకరణ పత్రాన్ని పాల్గొన్న వారికి అందచేశారు.

               యూకే లోని లండన్ లో ఉన్న సెయింట్ పాల్స్ కేథీడ్రల్ లో జరిగిన మహాత్మాగాంధీ శతజయంతి ( 1969 ) ఉత్సవంలో కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు ఆనాడు ఆలపించిన భజన్….  ఈనాడు మరోసారి ‘ శిరాకదంబం ’ పాఠకుల కోసం….