10_016 ఆంధ్ర జానపద, సంగీత, సాహిత్యాలు

.

ఆంధ్ర జానపద, సంగీత, సాహిత్యాలు – తీరుతెన్నులు

.

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్రవంతి లో (Main Stream) సాగే సంగీత సాహిత్యాలకు సమాంతరంగా జానపద ( Folklores ) సంగీత సాహిత్యాలు సాగాయి. ఈ వాస్తవం భారతీయ సంగీత సాహిత్యాలకీ అందులో అంతర్భాగమైన తెలుగు వారి సంగీత సాహిత్యాలకీ కూడా వర్తిస్తుంది.
ప్రధాన స్రవంతి లో సాగే సంగీత, సాహిత్యాల కి కొన్ని ప్రామాణికాలు ( Standards ) ఉంటాయి. అయితే ఇవి పరిమితులు కావు.
సంగీతమంటే స్వరాల కూర్పు, స్వరాల ఆలాపన సాహిత్యాన్ని ఆలంబనగా చేసుకుని ఉంటుంది. ఇది సంగీతం యొక్క ప్రాథమిక లక్షణం సంగీత సాహిత్యాలు పరస్పరాశ్రయాలు. అందుచేతనే వీటి అధిదేవతను ” సంగీత సాహిత్య సమలంకృతే ” అని కీర్తిస్తారు.
శాస్త్రీయం, జానపదం అనే వర్గీకరణ జన బాహుళ్య సౌలభ్యం కోసం ఏర్పరచిన వర్గీకరణ మాత్రమే. సంగీతానికి మూలం సామవేదం.
ఇదే నియమం / న్యాయం సాహిత్యానికీ వర్తిస్తుంది. గ్రాంధికం లో రాసినా వ్యావహారికంలో రాసినా ఆ  సాహిత్య సృష్టి కి మూలాలు  ఆర్షధర్మ వేద వాఙ్మయాలలోనే ఉంటాయి.
ప్రధాన స్రవంతి లేదా శాస్త్రీయ సంగీత పద్ధతిలో కొన్ని నియమాలకు లోబడి సంగీత సృష్టి జరిగింది. ఈ రకమైన సంగీతాన్ని విని ఆనందించడానికి మానసికంగా ఒక స్థాయీ, నేర్చుకోవడానికీ, ఇంకా పై స్థాయి,సాధన కి సమయం కావాలి. అందువలన ఈ  సంగీతం కొద్దిమందికే పరిమితం అయింది. అదే విధంగా ఈ సంగీతానికి ఆలంబనం అయిన సాహిత్యం కూడా.
ఈ పద్ధతి ఆనుసరించిన వారు సంగీత సాహిత్యాలు దైవ దత్తములని మనసా వాచా కర్మణా నమ్మడం చేత తమ కృతులను భగవదార్పణం చేశారు.

సాహిత్యము వరకూ వస్తే  గ్రాంధిక భాష లో వ్రాయబడిన సాహిత్యం పై వర్గాల వారి కోసమనీ, వ్యావహారిక భాషలో రాయబడిన సాహిత్యం దిగువ వర్గాల వారి కోసం అనీ ఒక అపోహ ఉన్న విషయం మనకి తెలిసినదే కదా. రచన గ్రాంధికం లో సాగినా, వ్యవహారికం లో సాగినా విషయ ప్రతిపాదనలోనూ, విషయం వివరించే విధానం లోనూ లోటు ఉండదు. గ్రాంధిక భాషలో వ్రాయబడిన గ్రంధాలు చదవడం వలన బాష పైన పట్టు పెరుగుతుంది. ఇదే ప్రధానమైన తేడా.
అదికవి వాల్మీకి శ్రీ మద్రామాయణాన్నికుశలవుల చే  ప్రచారం చేయించే సందర్భం, హనుమత్ దర్శనం పొందిన తులసీదాసు గోస్వామి సాహిత్యం, రామానుజుల వారి సాహిత్యం, పాల్కుర్కి సోమనాధుల వారి శైవ సాహిత్యం, అన్నమయ్య, హరిదాస సాంప్రదాయ సంగీతం, భద్రాచల రామదాసు, సంత్ తుకారం జ్ఞానేశ్వర్, ఏకనాథ్, నామదేవ మహరాజ్, సంత్ కబీరుదాసు, ఇటీవలి కాలం లో సంగీతత్రయం… ఇలా అసంఖ్యాకంగా ఉన్న, మనకి సదా ప్రాతఃస్మరణీయులైన సంగీత, సాహిత్య కారులని అవలోకనం చేసుకున్నప్పుడు, పై వాదన సత్య దూరం అని సులభం గా గ్రహించవచ్చు.
జానపదుల జీవన శైలి జానపదుల సంగీత సాహిత్యాల కి వెన్నెముక వంటిది. వారి సాహిత్యం అంతటికీ వారి అనుభవాలే మూలం, వారి జీవిత అనుభవాల్ని సాహిత్యం లో సంక్షిప్తం చేసి, ప్రచార నిమిత్తం తదదుగుణమైన సంగీతాన్ని వాడుకున్నారు.
అయితే ఈ సంగీత సాహిత్యాలకీ మూలాలు శాస్త్రీయ సంగీత సాహిత్యాలవే.  
64 మేళకర్తల రాగాలు, తాళాలూ, శృతి లయ సంప్రదాయాలను పాఠించే విషయం లో శాస్త్రీయ, జానపద సంగీతాల మధ్య తేడాలు ఉండవు. జానపద సంగీత సాంప్రదాయం లో సులువు గా అలాపించడానికి వీలుగా స్వరస్థానాల అమరిక ఉంటుంది. అలాగే తాళాల విషయం కూడా. మనం క్లాసికల్ వాయిద్యం గా భావించే మృదంగం  పైన చేసే లయ విన్యాసం జానపద సంగీతం లో ఉపయోగించే డప్పు వాయిద్యం పైన కూడా చేయవచ్చు.
అదే విధంగా సాహిత్యం గ్రాంధికం అయినా జానపదం / వ్యవహారికం అయినా ఆ సాహిత్యాల మూలాలు వేద వాఙ్మయాలే అన్న విషయం ఎవరూ కాదనలేని నిజం. విదురుల వారి నీతినే వేమనగారూ ప్రతిపాదించారు కాకపోతే భాషే తేడా !
చతుస్సష్ఠి కళలలోని అధిక శాతం కళలలో సంగీత సాహిత్యాలు అంతర్లీనంగా ఉంటాయి .
ఆయా సందర్భాలని అనుసరించి సంగీత సాహిత్యాల మోతాదు స్వల్పంగా మారుతుంది.
దీనివలన కొందరు సంగీత సాహిత్యాలని శాస్త్రీయ, జానపద, నాటక, లలిత, సినిమా సంగీత సాహిత్యాలని అంటూ వర్గీకరణలు చేశారు. కానీ ఇది సరి కాదు.
ప్రదర్శన కి అనుగుణంగా ఉన్న అన్ని రకాల కళా రూపాలలో సంగీత సాహిత్యాలు ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అభినయకర్తల భావ ప్రకటనకు ఇవి ప్రధానమైన అంగాలు .
తెలుగునాట ప్రదర్శనానుకూలమైన కళారూపాల, వాటికి అనుగుణమైన సంగీత సాహిత్యాల సృష్టి, అత్యుత్యమ స్థాయిలో జరిగింది. వాటిని అతి సమర్థులైన కళాకారులు తమ అభినయ కౌశలం తో అజరామరం చేశారు. వీటి పరిధి చాలా పెద్దది. యక్షగానం నుంచి వీధి నాటకం వరకూ వ్యాపించింది.
Agility, Adaptability అనగా కాలానుగుణం గా జరిగే మార్పులను గ్రహించి లోపల ఇముడ్చుకుని తదనుగుణం గా మారడం అనే సిద్ధాంతం జీవుల మనుగడకు మూలం. అదే సిద్ధాంతం కళలకి కాదు కానీ కళా రూపాలకి వర్తిస్తుంది. జీవులు కాలానుగుణం గా జీవన విధానం మార్చుకున్నప్పటికీ తమ మనుగడకు ఆయువు పట్టైన మూల విలువలు ( Core Values ) మారవు. దానికి కారణం అవి కాలం పెట్టిన పరీక్షలని తట్టుకుని నిలబడినవి కావడమే.
కళల మనుగడ వరకూ వస్తే సహజమైన ప్రక్రియలో స్వాభావికంగా జన జీవన క్రమంలో ఒక భాగమైన కళలు జనాదరణకు నోచుకుంటూనే ఉన్నాయి. వారి జీవితం లో అవి ఒక విడదీయలేని భాగం. దీనికి గొప్ప ఉదాహరణ అమ్మ పాడే లాలి పాటలు.

అదే విధంగా పాలకులకు కళలని పోషించి, కళా వికాసానికి, కళాకారుల వికాసానికీ తోడ్పడి చేయూతనిచ్చే నైతిక బాధ్యత ఉంది. ప్రస్తుత ప్రజా ప్రభుత్వాలు ఈ విషయంలో తమ బాధ్యతను సక్రమంగానే నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ నిర్వహణ లో ఉన్న AIR, దూరదర్శన్, కొన్ని అకాడమీలు, ఇతర సంస్థలు దీనికి ఉదాహరణ. వీరికి లాభనష్టాల ప్రసక్తి లేదు. అనేకమంది అర్హులైన కళాకారులకు జీవనోపాధి కలుగుతోంది. అదే విధంగా టీటీడీ వంటి ధార్మిక సంస్థలు, కొన్ని ప్రయివేట్ సంస్థలు కూడా కళాకారులకు తమ సంస్థలో ఆశ్రయం కల్పిస్తున్నాయి.  
మిగిలిన platforms / వేదికగా జరిగే కళా వికాసం అది నాటక రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు. వీరి ప్రధాన పరమార్ధం ధనార్జనే. అది సరి అవునో కాదో చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం కాదు. కానీ జనాదరణ పేరుతో కొంత వక్రీకరణ జరుగుతోంది. అశ్లీలత పాళ్లు పెరుగుతున్నాయి.

ఇదే విషయం మరో కళారంగమైన సాహిత్యానికీ వర్తిస్తుంది. అదే విధంగా రాజకీయాలు ముఖ్యం గా జన నాట్యమండలి వారు కళలని తమ సిద్ధాంతాల ప్రచారం కోసం ఉపయోగించారు.
అన్ని కళా రూపాలూ జనంలో నుంచే. వారి అనుభవాలలోనుంచే పుడతాయి. జన హితమే వాటి లక్ష్యం పరమ ప్రయోజనం. అందుచేత వాటి మనుగడకూ, అభివృద్ధికీ  ఏ రకమైన ప్రమాదమూ లేదు. కళా వ్యాపారుల బారి నుంచి కళలను మలినం కాకుండా చూసుకోవాల్సిన భాద్యత మాత్రం ప్రజలదే.
దైనందిన జీవితం లో ప్రతి రోజూ కొంత సమయం తమకు  అభిరుచి ఉన్న కళారూపాల కోసం కేటాయించడం వలన మానసిక వికాసం కలుగుతుంది. దాని వలన వ్యక్తి అంతర్ముఖుడవుతాడు. అంతర్ముఖత్వం సత్సాంగత్వానికి దారి తీస్తుంది. ” సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ” అని సర్వ మానవాళికీ  ముక్తి మార్గ నిర్దేశం చేసిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల ఉవాచ.

.

శుభం భూయాత్.

Narasimhadevara Venugopal

Kochi, Kerala

Mobile : 8547 8534 08, Mail id narasimhadevaravenu@rediffmail.com

.

____________________________________________________

ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.

_____________________________________________________