ఇంకా నిద్ర పోకుండా ఏమిటీ ఆలోచిస్తున్నావ్ అంటారా ?
నాకు నిద్ర రావడం లేదండీ ! ఇవ్వాళ జరిగిన మన రాహుల్ “గ్రాడ్యుయేషన్” సెర్మనీ గురించి ఆలోచిస్తున్నానండీ.
వాడి స్పీచ్…………ఆ చప్పట్లు………… నా చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి! ఎంత చక్కగా మాట్లాడాడో నా చిట్టి తండ్రీ !
ఏమిటీ… వాడికి అంతా మీ పోలిక వచ్చిందంటారా? !
అవునవును! మీ మనవడిలాగే మీరూ మీ అమ్మగారి అరచేతికి సరిగ్గా సరిపోయేవారుట ! కాళ్ళ మీద పడుకో పెట్టుకుని నీళ్ళు పోస్తుంటే మధ్య నుంచి ఎక్కడ జారి పడిపోతారో అని భయపడి పోయేవారుట !!
ప్రీ మెచ్చుర్ గా ఎలక పిల్లల్లే పుట్టిన వీడు బతికి బట్ట కడతాడా అని దిగులు పడ్డాం. అలాంటి వాడు అప్పుడే హైస్కూల్ అయిపోయి, కాలేజీకి వెళ్తున్నాడంటే ఆశ్చర్యం వేస్తోంది.
నా మటుకు నాకు, మనం నిన్నో.. మొన్నో ఈ దేశం వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ! అయిన వాళ్ళందరిని వదిలి ఎక్కడో పరాయి చోటుకు వెళ్తున్నామని, మన వాళ్ళందరు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. రాము-రమ్య ఎయిర్ పోర్టులో ఒకటే ఏడుపు. మీ అమ్మగారి దగ్గర బాగా అలవాటు అయిన పిల్లలు “ మామ్మను కూడా మనతో ఊలికి తీసికెల్దాం “ అంటూ పేచీపెట్టారు. పిల్లల్ని చూసుకుని మురిసిపోయే అత్తగారు కూడా ఒకటే బాధ పడ్డారు పాపం.
నా అన్న వాళ్ళు లేకుండా మొండి ధైర్యంతో ఈ దేశం వచ్చి పడ్డాం. అందరి మధ్యా ఉండటం అలవాటయిన పిల్లలు ఇక్కడికి రాగానే బెంగ పెట్టుకున్నారు. రాము అయితే “ ఇక్కడ రిక్షాలు లేవు ఈ ఊరు ఏం బాలేదు, మనింటికి వెళ్లి పోదాం “ అని గొడవ చేసేవాడు గుర్తుందా ? కొద్ది రోజుల తర్వాత ఇద్దరు బుడి బుడి అడుగులేసుకుంటూ కొత్త స్కూలుకు వెళ్లటం మెదలు పెట్టారు. మనమూ తడబడుతూ.. భయపడుతూ అమెరికాలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాం.
అప్పట్లో పిల్లలకు మనకు పెద్ద తేడా ఏమీ ఉండేది కాదు. వాళ్లది పసితనంతో కూడిన అమాయకత్వం అయితే మనది అజ్ఞానంతో కూడిన అమాయకత్వం !
మొదటిసారి ఇద్దరం కలిసి పేరెంట్స్-టీచర్ కాన్ఫరెన్స్ కెళ్ళినప్పుడు మన రాము టీచర్ మిసెస్. జాన్సన్ మనల్ని చూసి “ యూ బోత్ లుక్ లైక్ ఇండియన్స్, బట్ రామ్ టోల్డ్ మి “ మై మామ్ ఈజ్ వైట్, మైడాడ్ ఈజ్ బ్లాక్“ “ఆర్ యు ద రియల్ పేరెంట్స్ ? “ అంటూ ఏవేవో ప్రశ్నలు వేసింది.
ఆవిడ ఏమంటున్నదో తెలియక, మనం తలకాయలు ఊపుతూ తెల్లమొహలేసాం ! ఆ తర్వాత బెనర్జీ గారు వివరించి చెప్పాక గాని, మనకు విషయం అర్ధం కాలా ! మన పెళ్ళిలో అందరూ, మీరు రంగు తక్కువ అని “ కాకి ముక్కుకు దొండపండు “ అనీ అంటుంటే, వీళ్ళకెందుకు చేసుకుంటున్నది నేనైతే అని విసుక్కున్నాను. కానీ మనకు పుట్టబోయే వాడు, మన రంగులుకి “ కలరుపూసి “ మనల్ని అలా ఇరకాటంలో పెడతాడని ఊహించ లేకపోయాను !
క్లాసులో అందరూ పిండి బొమ్మల్లా ఉంటే తను మాత్రమే ఎందుకు వేరుగా ఉందో తెలియని మన అమ్మాయి ఇంటికొచ్చి “ వాళ్ళందరిలా తెల్లగా నేనూ ఎప్పుడు అవుతాను ? “ అని అడుగుతుండేది !
ఇక మనం సరేసరి !
హైవే మీద వెళ్తూ ఉన్నట్టుండి “ నో షోల్డర్ “ అన్న సైను చూసి బుజాలు లేవంటాడేమిటి? ఈ ఊళ్ళో రోడ్లకు కాలర్లు, షోల్డర్లు ఉంటాయి కాబోలు అని ఒకటే నవ్వుకున్నాం ! ఓ గంట తర్వాత “ డబ్ డబ్.. “ అంటూ మన కారు ఆగిపోయిన తర్వాత షోల్డర్ అంటే ఏమిటో తెలిసొచ్చింది !
మీరు జాబులో చేరిన కొద్ది రోజులకు మీ బాస్ డేవిడ్, ఆయన వైఫ్ లూసి తో కలిసి డిన్నర్ కు వెళ్ళాం. తాగడానికి మనం కోక్ ఆర్డర్ చేస్తే ఆవిడ “ ఐ వాంట్ డాక్టర్ పెప్పర్ ” అంది. “ తినే చోటుకు వచ్చి డాక్టర్ కావాలంటుందేమిటీ ఏమైనా మెంటలా ?” అని ఇద్దరం మనసులోనే నవ్వుకున్నాం !
మనం వచ్చిన రెండేళ్లకు మీ ఫ్రెండు మోహన్ గారు, భార్యా-పిల్లల్ని ఇండియాలోనే ఉంచి ముందు ఆయన ఒక్కరే వచ్చారు. వచ్చిన రెండోరోజే ఆయనకు జాబ్ ఇంటర్వ్యూ ఉండటంతో, ఎక్కడ దిగాలో అక్కడినుంచి ఎలా వెళ్ళాలో అన్నీ వివరంగా చెప్పి, తీసుకెళ్ళి మోహన్ రావ్ గార్ని మీరు న్యూయార్క్ వెళ్ళే బస్ ఎక్కించారు.
మళ్ళీ ఆ సాయంకాలం మీరు ఆయన్ను పికప్ చెయ్యడానికి బయలుదేరబోతుంటే రొప్పుకుంటూ ఆయనే వచ్చేసారు గుర్తుందా ? మనం కంగారు పడుతూ “ బస్ స్టాప్ లో వెయిట్ చెయ్యకుండా ఎందుకు అలా నడిచి వచ్చారూ ?” అని అడిగాం .
ఆయన ఏం చెయ్యనూ ఆ వెధవలు మరి “ నో స్టాండింగ్ ఎట్ ఎనీ టైం “ అని రాసారు. ఇక్కడ రూల్ అంటే రూలే అని మీరేగా చెప్పారు. అందుకే ఎక్కడా ఆగకుండా నడుచుకుంటూ వచ్చాను అని అంటే మనం కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వాము !!!
ఏమిటో ఇంకా మనం తట్టా-బుట్టా, ఇల్లు-వాకిలి అమర్చుకుంటున్నట్టే ఉంది, అప్పుడే అమెరికా వచ్చి నలభయి ఐదేళ్ళు అయిపోయింది అంటే నమ్మలేకుండా ఉన్నాను! చూస్తూ ఉండగానే పిల్లలు చెక చెకా ఎదిగిపోయారు, మన కళ్ళ ముందరే వాళ్ళు కూడా తల్లిదండ్రులై పోయారు.
ఆరోజుల్లో మనం తికమక పడుతూ అయోమయంగా మన పిల్లల్ని పెంచాం. మన పద్దతులు, అలవాట్లు వాళ్ళకు నేర్పాలనే ఆరాటంలో వాళ్ళను తికమక పెట్టేవాళ్ళం ! పిల్లలు అన్నింటికీ “ వైయ్ “ అంటూ అడిగే వారు ! వాళ్ళు అడిగే ఏ ప్రశ్నకు మన దగ్గిర సరయిన సమాధానం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పిల్లలు వాళ్ళ పిల్లల్ని పెంచుతున్న తీరు వేరు. పిల్లల వయసుకు, మనస్తత్వానికి తగినట్టుగా వాళ్ళకు అన్నీ వివరించి చెప్పగల నేర్పు-పరిజ్ఞానం ఈ తరం వాళ్ళకు ఉంది.
మన మనవలు-మనవరాళ్ళ ముద్దు ముచ్చట్లు చూసే అవకాశం, వాళ్ళలో మనల్ని చూసుకునే అదృష్టం గ్రాండ్ పేరెంట్స్ గా మనకు దొరికాయి. టెన్నిస్ చాంపియన్ని అంటూ గొప్పలు చెప్పుకునే మీరు, మీ మనవడి చేతిలో ఎప్పుడూ ఓడిపోవటమే ! నేను ఎప్పుడో నేర్చుకున్న సంగీతాన్ని మళ్ళీ నా మనవరాలికి నేర్పుతానని నేను కలలో కూడా అనుకోలేదు. శ్రావ్య “ ఐ లవ్ ఇండియన్ మ్యూజిక్ అమ్మమ్మా “ అంటూ గొంతు విప్పి తియ్యగా పాడుతుంటే నాకు నా చిన్నతనం గుర్తుకు వస్తుంది !
ఊహ తెలిసీ తెలియని వయస్సులో మన పిల్లలు ఇక్కడకు వచ్చి మీ వాళ్ళకు,నా వాళ్ళకు దూరంగా పెరిగారు. పాపం మీ అమ్మ గారికి, మన పిల్లల చిన్నతనం జ్ఞాపకాలే మిగిలాయి. తన మనవడు పెద్ద డాక్టర్ అవ్వాలని అంటుండేవారు! ఆవిడ అన్నట్టుగానే వాడు పెద్ద డాక్టర్ అయి, మంచి పేరు తెచ్చుకున్నాడు! అప్పట్లో అత్తగారు అక్కడ, మనం ఇక్కడ అవడంతో తన ముద్దుల మనవడి అభివృద్ధి కళ్లారా చూడకుండానే వెళ్లి పోయారు.
ఈ రోజు నా మనవడు రాహుల్ “ వేలడిక్టోరియన్ “ గా అందరి ముందు నిలబడి మాట్లాడుతుంటే ముందు సీట్లో కూర్చుని వినే అదృష్టం నాకు దక్కింది. నాకు ఇన్ స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళలో మా నానమ్మ కూడా ఒకరు అంటూ చిట్టితండ్రి నా పేరు చెప్పినప్పుడు మీ అమ్మగారే నా కళ్ళలో మెదిలారు !
ఆ సమయంలో ఆవిడ తన ముని మనవడిని పైనుంచి ఆశీర్వదిస్తున్నట్టే అనిపించిందండీ!!!
తొలి ప్రచురణ సుజనరంజని 2011
********** ************* ***************
గ్రాండ్ పేరెంట్స్- నేపధ్యం
ఒకసారి మా ఫ్రెండ్ ఒకాయన చాలా రోజుల తర్వాత కనిపించినప్పుడు మావారు “మీ అబ్బాయికి దగ్గరగా మూవ్ అయ్యారుకదా ఎలా ఉందీ ? ” అని అడిగారు. ఆయన నవ్వుతూ “చాలా బావుందండీ గ్రాండ్ పేరెంట్స్ గా మేము ఎంజాయ్ చేస్తున్నాము గ్రాండ్ చిల్డ్రన్ గా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు!” అని అంటూ “రెండు, నాలుగు ఏళ్ళ వయసులో ఇక్కడికి వచ్చిన మా పిల్లలు, ఇండియాలో ఉన్న మా పేరెంట్స్ ఈ అనుభవాన్ని మిస్ అయ్యారు” అని అన్నారు. ఆయన అన్న ఆమాట ఈ ముచ్చటకు ప్రేరణ అయింది. 1950 ల్లో, 60 ల్లో 70 ల్లో వచ్చిన వారు అప్పటి పరిస్థితుల కారణంగా ఇండియాకు తరచు వెళ్ళలేకపోవడం వలన.. భాషలు రాని కారణంగా… ఫోన్ల వసతులు లేని కారణంగా గ్రాండ్ పేరెంట్స్ – గ్రాండ్ చిల్ద్రన్ మధ్య ఉండే ఆ తియ్యని అనుబంధాన్ని ఒక తరం కోల్పోయిన మాట వాస్తవం. అలాగే పాత రోజుల్లో వచ్చిన ఆ తరం అమెరికా దేశంలో వాడే పదాలు, వాటి అర్ధం.. వాడే సందర్భం తెలీక, జరిగిన అవకతవకల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటారు/ఉంటాం!
********** ************* ***************