10_009 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – తప్పించుకు తిరుగువాడు

ఏమిటీ…మనం కూడా ఇండియాలో ఇల్లు కొనుక్కుందామా?

ఇప్పుడు ఇండియాలో ఇల్లెందుకు…ఇక్కడ నిక్షేపంలా ఇల్లు పెట్టుకుని?

ఏమిటీ…కృష్ణారావు గారు ఇండియా వెళ్ళి అక్కడ కింగులా బతికేస్తున్నారా. మనమూ ఇండియా వెళ్ళి దర్జాగా కాలుమీద కాలువేసుకుని బతుకుదాం అంటారా?

ఇప్పుడు మీ దర్జాకు లోటేమోచ్చిందిటా? అస్తమానం నన్ను డ్రైవింగ్ సీటులో కూర్చోపెట్టి, మీరు కాలుమీద కాలేసుకునే కదా తిరుగుతుంటా?

ఏమిటీ..అక్కడికెళ్తే హాయిగా పనివాళ్ళను పెట్టుకుని అన్ని పనులు వాళ్ళతో చేయించుకుంటూ, నేను మహారాణిలా ఉండచ్చు అంటారా?!

అవునవును! ఇదే మాట ముప్పైమూడేళ్ళ కిందట అన్నారు. గుర్తుందా?

నేను “అమెరికా వద్దండీ..అయిన వాళ్ళ మధ్య ఇక్కడే ఉందామని” అన్నాను. మీరు “అమెరికా వెళ్తే అక్కడ హాయిగా, దర్జాగా ఉండచ్చన్నారు. అందులోనూ ఆడవాళ్ళకు అమెరికాలో లైఫు మూడు పూలు-ఆరుకాయలుగా ఉంటుందీ” అని తియ్యటి తియ్యటి కబుర్లు చెప్పి నన్ను ఇక్కడకి తెచ్చి పడేసారు.

నేను అమెరికా అక్కరలేదన్నానని మీకు నామీద కోపం వచ్చింది. ఇండియాలో ఉంటే ఇలా అంటగిన్నెలు తోముకుంటూ, పచారీ షాపులో వెచ్చాలు తెచ్చుకుంటూ బతుకులు గడిపేయాలని నన్ను బెదరగొట్టారు.

మీరు గమనించారో లేదో, నేను అమెరికా వచ్చి కూడా అంటగిన్నెలు తోముకుంటూనే ఉన్నాను..షాపుకెళ్ళి వెచ్చాలు తెచ్చుకుంటూనే ఉన్నాను. అందులో మార్పేమీ లేదు. ఇండియాలోనే ఉన్నట్టయితే, అప్పట్లో నా గిన్నెలు నేను తోముకున్నా ఆ తర్వాత నెమ్మదిగా పనివాళ్ళను పెట్టుకుని సుఖపడేదాన్ని. మీరు నన్ను ఇక్కడికి తెచ్చి నాకు ఒరగపెట్టిందేమి లేదు. అమెరికా వస్తే అన్నిపనులు ఆటోమాటిక్ గా అయిపోతాయని…అంచేత ఆడవాళ్ళకు ఆవగింజంతైనా వర్రీ ఉండదని నన్ను నమ్మించారు. కానీ అమెరికాలో ఆడవాళ్ళకు, అందులోనూ నాబోటి వాళ్లకు అన్నీ వర్రీలే అని ఇక్కడకు వచ్చాకగానీ తెలీలేదు.

అమెరికా వచ్చి రోజూ ఆఫీసుకెళ్తే చాలు, మీ బాధ్యత తీరిపోయిందనుకునే మహానుభావులు మీరు. మీకు తెలిసిందల్లా మీపాటికి మీరు దర్జాగా బతికేయడం. అలా బతికేయడానికి మీరు ఏమైనా చేస్తారు. అప్పుడు సుఖపడటానికి అమెరికా వెళ్దాం అన్నారు. ఇప్పుడు సుఖపడటానికి ఇండియా అంటున్నారు. కానీ మీ సుఖానికి వెనక ఓ ఆడదాని కష్టం, కృషి, సహనం, త్యాగం ఉన్నాయని మీకు తెలీదు. ఒకవేళ తెలిసినా తెలియనట్టు నటిస్తారు.

ఇన్నేళ్ళలో ఈ సంసారం కోసం నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంత శ్రమించానో, ఎన్ని నేర్చుకున్నానో తెలుసా? అమెరికా అంటే ఐడియల్ ప్లేసు అని అనుకున్నారే తప్ప అమెరికా అంటే “ అంతా అయోమయం” అని మీకు తెలీదు. దేశంలోనే ఉంటే నావాళ్ళ మధ్య ఉంటూ, నేను పెరిగిన సమాజంలో నాకున్న తెలివితేటలతో తేలిగ్గా పిల్లల్ని పెంచేదాన్ని. ఇక్కడ పిల్లల్ని పెంచడానికి, వాళ్ళను సరైన దోవలో ఉంచడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు తెలుసా?

మీ ఉద్యోగం పేరిట మీరు ఎప్పుడూ ఊళ్ళు పట్టుకుని తిరగడమే కదా? పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళతో ఆటలాడింది నేను. వాళ్ళను స్కూళ్లకు తీసికెళ్ళింది నేను. పిల్లలకు అనారోగ్యాలొస్తే డాక్టర్ల చుట్టూ తిరిగింది నేను. వాళ్ళ చదువుల గురించి విచారించేది నేను..కాలేజీలకు అప్లికేషన్లు పంపుతుంటే దగ్గరుండి చూసింది నేను..వాళ్ళను కాలేజీల్లో దింపేది నేను..వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు మంచీ-చెడ్డా కనుక్కుంటున్నది నేను.

ఇన్నేళ్ళుగా నేను ఈ సంసారాన్ని లాక్కొస్తూ మీకు అన్నీ అమర్చిపెడుతుంటే ఏ చింతా లేకుండా మీ కెరియర్ లో అంచెలంచెలుగా పైకి వెళ్ళి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రిటైర్ అయి ఇంట్లో నెల రోజులుగా ఉంటూ ఒక్కసారి కళ్ళుతెరిచారు. ఎంత చేస్తే ఇల్లు సజావుగా నడుస్తుందో ఇప్పుడిప్పుడే మీకు తెలిసొస్తోంది. అందుకే హడిలిపోయి ఇండియా వెళ్ళి పోదాం అంటున్నారు! ఇక్కడే ఉంటే ఇవన్నీ మీ నెత్తిమీద పడతాయని బెంబేలెత్తి పోతున్నారు. అందుకోసం ఇక్కడి నుంచి పారిపోదాం అంటున్నారు. అప్పుడు అక్కడి కష్టాల్ని తప్పించుకోడానికి అమెరికా అన్నారు, ఇప్పుడు, ఇక్కడి ఇబ్బందుల్ని తప్పించుకోడానికి ఇండియా అంటున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు….సుమతీ అని.

నేను ఎక్కడికీ రాను. మీ కల్లబొల్లి కబుర్లు నమ్మి కరిగిపోవడానికి, నేను వెనకటి కమలను కాను!       

**************************************************

తప్పించుకు తిరుగువాడు –నేపథ్యం

మా గెట్ టు గేదర్స్ లో కాలం గడుస్తున్న కొద్దీ మాట్లాడుకునే విషయాల్లో నెమ్మదిగా మార్పు రావడం గమనిస్తూ వచ్చాను. మొదట్లో ఇళ్ళు కొనుక్కోవడాలు, ఉద్యోగాల గురించి, ఆ తర్వాత  పిల్లల పెంపకం వాళ్ళ కాలీజీల గురించి, ఆపైన పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి అని ఓ పక్క మాట్లాడుకుంటుంటే మరో పక్క రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ ప్లాన్ల గురించి మాట్లాడుతూ ఉండేవారు. మా ఫ్రెండ్ ఒకాయన, కలుసుకున్న ప్రతిసారీ “నేను ఎర్లీ రిటైర్మెంట్ పుచ్చేసుకుని హాయిగా ఇండియా చేక్కేస్తా!” అని అనౌన్స్ చేస్తుండేవారు. “ఇండియాలో ఎక్కడ చూసినా దరిద్రం, అక్కడ మనం ఉండలేమండీ” అంటూ మాట్లాడిన మరో పెద్దమనిషి ఉన్నట్టుండి, “ఇక్కడేముందండీ? అదే మన దేశంలో అయితే “ఆ” అంటే మనుషులు “ఊ” అంటే మనుషులు. డబ్బు పారేస్తే చాలు దర్జాగా ఉండచ్చు” అంటూ కళ్ళు ఎగరేస్తూ ఉపన్యాసం ఇచ్చేవారు!

ఇలాంటి సంభాషణలు జరుగుతున్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ అన్నారు “అప్పుడు అమ్మా,నాన్నని, తోడపుట్టిన వారిని అందర్నీ వదిలేసి దూరంగా ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడున్న మన పిల్లల్ని, ఆత్మీయుల్ని వదిలేసి మళ్ళీ వెనక్కు వెళ్ళిపోదాం అనుకోడంలో అర్ధం లేదు” అని. మనకు సౌకర్యంగా ఉండని చోటునుంచి  వెళ్ళిపోవటమే సమస్యకు పరిష్కారం అని, ఎక్కడ మనకు సుఖంగా ఉంటుందో అక్కడికి వెళ్ళి  తమ హోదాను,దర్జాను ప్రదర్శించుకోవచ్చనుకునే మగవారిని చూసిన తర్వాత ఈ ముచ్చట తప్పకుండా రాయాలనిపించింది!!

**************************************************