10_015 స్వేచ్ఛ

.

కొమ్మమీంచి …

ఒక్కసారిగా రెక్కలు చప్పుడు చేస్తూ

గాల్లోకి లేచిన విహంగాన్నిచూసినా…

.

పూవు చుట్టూ…

ఝంకార శబ్దంతో

వృత్తాల్లో విన్యాసాలు చేస్తున్న

తుమ్మెదను చూసినా…

.

గిరి అంచులమీంచి…

అఖండ ధారగా..

బండరాళ్ళ మీదుగా…

పరవళ్ళు తొక్కుతూ…

మెలికెలు తిరుగుతున్న

సుందరవాహిని

చెంత నిలిచినా..

.

సాగరతలంమీంచి….

తీరం దాటుకొంటూ

మైదానాలమీదుగా

పచ్చటి పైర్లమీదుగా

ఊళ్ళోకి ప్రవేశించిన

మలయ వీచికను

దేహంతో స్పృశించినా…

.

అది స్వేచ్ఛ అని…

అతనికి తెలియదు.

అతను…..

మనిషి!

.

***************************