చేతికొచ్చిన పుస్తకం-46:
వైస్ ఛాన్సలర్ బాలమోహన దాస్ బయోగ్రఫీ
మృదువైన మాటతీరు, అందమైన విగ్రహం, అమోఘమైన ప్రతిభ, నలుగురిని కలుపుకుపోయే నేర్పరితనం డా విశ్వనాథుని బాలమోహన దాస్ గారి సొంతం! నిజానికి వారు నాకు ఇటీవల కాలంలోనే గాంధీజీ రచనల కారణంగా పరిచయం. 1947 ఆగస్టు 15న జన్మించిన వీరికి మహాత్మా గాంధీ స్ఫూర్తితో పేరు పెట్టారు. వీరి తండ్రి వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు కూడా. నేను విశాఖపట్నం బదిలి అయిన కొంతకాలానికి వారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా వెళ్ళిపోయారు.
2006 లో తెనాలిలో జరిగిన సభలో నా ‘నవతరానికి నార్ల’ పుస్తకాన్ని డా. బాలమోహన దాస్ ఆవిష్కరించారు. ఇపుడు విశాఖపట్నంలో స్థిరపడ్డారు.
ఇటీవల ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఫేస్బుక్ లో నచ్చిన పుస్తకం ఏదని మిత్రులను వాకబు చేసినప్పుడు దాస్ గారు ఈ పుస్తకం తనకు నచ్చిన పుస్తకం అని రాశారు, తర్వాత ఓ ప్రతిని పంపారు. గత ఆదివారం సాయంత్రం తిపేశ్వర్ అభయారణ్యానికి దగ్గర ఓ చెట్టు కింద కూచొని గంటన్నరలో ఈ 160 పుటల పుస్తకం చదివేశాను.
తన బాల్యం, చదువు, కుటుంబ సమస్యలు తర్వాత పై చదువులు, చిన్న వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం లో ఉద్యోగం, కులాంతర వివాహం చివరకు వైస్ ఛాన్సలర్ కావడం ఈ విషయాలను హాయిగా, అలవోకగా రచయిత్రి శ్రీమతి వసంత రాశారు. ఎన్నో ఫోటోలు అదనంగా జోడించారు. కథానాయకుడికి, రచయిత్రికి అభినందనలు. కొసమెరుపు ఏమిటంటే ఇది భార్య రాసిన భర్త జీవితచరిత్ర!
చేతికొచ్చిన పుస్తకం-47:
కుప్పిలి పద్మ కలానికి మతాబాలపూలు
ఆమె కానీ, ఆమె రచన గానీ తారసపడగానే ఉన్న పళంగా ఓ మాట గురుతొస్తొంది నాకు. చాలాసంవత్సరాలుగా–విమానం తొలిసారి ఆకాశంలోకి ఎగిరినపుడు కలిగే కుదుపును ప్రేమలో పడటంతో పోల్చడం అది! తెలుగు సాహిత్యంలో సోమవారపు పేజీల ఇంచార్జులకు ఇరువురు చాలా ఇష్టం అని నండూరి రామమోహనరావు పాతికేళ్ల క్రితం ముఖాముఖి నాతో అన్నారు. ఆ ఇద్దరు విషయం ఏమోగానీ కుప్పిలి పద్మ అంటే అందరికీ అభిమానమే! కుప్పిలి పద్మ కలానికి బాణాసంచా ఉండటమే దానికి కారణం.
కవిత, కథ, నవల, వ్యాసం ..ఇలా ఏదైనా సమ ప్రేమతో, ఈజ్ తో, గ్లామరస్ గా రాయడం ఆమెకే చెల్లు! ఆమె రచన కన్నా ఆమెకే ఎక్కువ మార్కులు వేస్తారు, ఎందుకంటే స్నేహశీలి కనుక!!
మార్చి 28న మెర్సీ మార్గరెట్ కవిత్వశాలకు వెళ్ళినప్పుడు రవీంద్ర భారతిలో కుప్పిలి పద్మ ఈ రెండు పుస్తకాలు – ఎల్లో రిబ్బన్ (మోహలేఖలు) & మోహనదీ తీరమ్మీద నీలిపడవ (కవిత్వం) అభిమానంగా నా చేతిలో పెట్టారు! రెండూ కాస్త చిన్న సైజులో వంద పేజీలుగా ఉన్నాయి. ఒకటి వచనం 2020, మరోటి కవిత్వం 2021. పద్మ లాగే ఆమె పుస్తకాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. (వంద, వందాయాభై రూపాయల విలువైన ఈ పుస్తకాలు ఏ పుస్తకాల షాపులో నైనా, ఆన్లైన్ లో నైనా లభిస్తాయి).
చేతికొచ్చిన పుస్తకం-48:
క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి ‘రోదసి‘
ఈ పుస్తకం గురించి ఎంతమంది కథా పరిశీలకులకు, విమర్శకులకు తెలుసో తెలియదు గానీ ఈ ప్రయత్నం విశేషమైనది! 2011-12 సమయంలో సాహిత్య అకాడమి కోసం ‘వైజ్ఞానిక కథలు’ (తెలుగు సైన్స్ ఫిక్షన్) ఎడిట్ చేసిన కాలంలో ఈ అనువాద కృషి గురించి తెలిసింది.
యార్లగడ్డ రాఘవేంద్రరావు చతుర, విపుల మాసపత్రికల కార్యనిర్వహక సంపాదకులుగా ఉన్న 2005-07 కాలంలో ముక్తవరం పార్థసారథితో ప్రతినెలా ఒక సుప్రసిద్ధ సైన్స్ ఫిక్షన్ కథను విపుల కోసం అనువదింపచేశారు. అలాంటి కృషి అంతకు ముందు గానీ, తర్వాత గానీ తెలుగులో జరుగలేదు.
హెచ్ జి వెల్స్, ఆర్థర్ సి క్లార్క్, ఐజాక్ అసిమోవ్ ఇత్యాదులు రాసిన 23 కథలను అనువదించడమే కాక, ప్రతి కథకు ఆ కథకుడి గురించి సంక్షిప్త పరిచయం కూడ ఇవ్వడం విశేషం! విశాలాంధ్ర బుక్ హౌస్ 2014లో ప్రచురించిన ఈ 176 పేజీల పుస్తకం వెల 125 రూ. నా సైన్స్ మిత్రులు ముక్తవరం పార్థసారథి వారికి కంగ్రాట్స్!!
చేతికొచ్చిన పుస్తకం-49:
అలనాటి రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు
రచయితగా మనకు అట్లూరి పిచ్చేశ్వరరావు (1925-1966) తెలుసు, అయితే వారి గురించి మరో విషయం, విశేషం ఉంది. బ్రిటిష్ వారి అధీనంలో ఉన్న రాయల్ ఇండియన్ నేవీ లోని సుమారు 20 వేలమంది భారతీయ నావికాదళం సిబ్బంది 1946 ఫిబ్రవరిలో తిరుగుబాటు చేశారు. బాంబే హార్బర్ లో ఉన్న హెచ్ ఎమ్ ఎస్ తల్వార్ నౌకలో తిరుగుబాటు చేసిన వారిలో అట్లూరి పిచ్చేశ్వరరావు కూడా ఉన్నారు! నిజానికి ఈ తిరుగుబాటు గురించి పెద్దగా ప్రచారం లేదు. ఇటీవల ప్రమోద్ కపూర్ పుస్తకం ఒకటి వచ్చినట్టుంది.
రష్యన్, హింది భాషల నుంచి అనువాదాలు తోపాటు వెండితెరకు (నవలలు, కథలు, సంభాషణలు) కూడా కృషి చేసిన పిచ్చేశ్వర రావు ఇతర రచనలు కూడా ఉన్నాయి.
సుమారు నాలుగు నెలల క్రితం మిత్రులు కాటా చంద్రహాస్ చదవమని సి ఎల్ ఎస్ పబ్లిషర్స్ ఎల్ ఎల్ పి హైదరాబాద్ ప్రచురించిన అందమైన ఆకర్షణీయమైన పుస్తకం పంపారు. ఇటీవల కాలంలో అందుబాటులో లేని ఈ సంకలనాన్ని వారి కుమారుడు అట్లూరి అనిల్ శ్రమ తీసుకుని ప్రచురించడం ఆనందదాయకం.
అట్లూరి పిచ్చేశ్వరరావు రాసిన 26 కథల తోపాటు ఆరుద్ర, కొకు, ఓల్గా వంటి వారి ముందుమాటలు, పుస్తక సమీక్షలు, రచయిత గురించి స్మృతులు ఈ విలువైన సంకలనంలో ఉన్నాయి! 278 పేజీల ఈ పుస్తకం వెల రూ 250, కాపీలకు నవోదయ, కాచిగూడ లేదా www.TeluguBooks.in ను సంప్రదించవచ్చు.
చేతికొచ్చిన పుస్తకం-50 :
వేణుగాన విద్వాంసులు ఎన్నెస్ శ్రీనివాసన్
తెలుగు ఆకాశవాణికి తన గొంతుకతో వశీకరణ విద్య నేర్పించిన శారదా శ్రీనివాసన్ గారికి ఎంతో ఆనందం కల్గించిన ఈ పుస్తకాన్ని రచయిత్రి, సంగీత విద్వాంసులు పేరి పద్మావతి రచించారు! జియాలజి లో ఎమ్మెస్సీ చేసి, కర్ణాటక గాత్ర సంగీతంలో ‘రాణి’స్తున్న పద్మావతి ఇప్పుడు సంగీత విభాగంలో పి హెచ్ డి చేస్తున్నారు!
మహాలింగంతో పోల్చగల పిల్లంగోవి వాదనా పాండిత్యం గల శ్రీనివాసన్ చిరస్మరణీయమైన సిగ్నేచర్ ట్యూన్స్, ప్రోగ్రామ్స్ కూడా అందించారు తన సంగీతానికి అదనంగా! అలాంటి ఎన్నో విషయాలను ఈ సంకలనంలో భద్రపరిచి మనకందించిన పద్మావతి అభినందనీయులు.
ఊర్వశి, రాజేశ్వరి వంటి ఎన్నో పాత్రలకు తన గళం అందించి రేడియో మాధ్యమానికి అజరామరమైన కీర్తి కలిగేలా చేసిన శారద ఈ వేణు(శ్రీనివాసన్) గానాన్ని పెళ్ళి చేసుకుని శారదా శ్రీనివాసన్ అయ్యారు!
పాతికేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణి కోసం వేర్వేరు సందర్భాల్లో గురుశిష్యులు టి ఆర్ మహాలింగం, ఎన్నెస్ శ్రీనివాసన్ గార్లను ఇంటర్వ్యూ చేసిన నా అదృష్టం మధురమైన జ్ఞాపకంగా ఇప్పుడు మదిలో మెదులుతోంది!
పేరి పద్మావతి గారికి కంగ్రాట్స్!! మూడు వందల పుటల పుస్తకం వెల రెండు వందల రూపాయలు, ఆసక్తి ఉన్న వారు రచయిత్రిని సంప్రదించవచ్చు.
————— ( 0 ) —————
Please visit this page