11_008 – అంతర్వాహిని

 

జీవితం అనే యుద్ధం లో గెలవటం అంటే మనల్ని మనం గెలుచుకోవటమే అనుకుంటాను. మనసుకి, మెదడుకి తేడా తెలిసాక నిరంతరం మనసుకి మెదడుకి జరిగే పోరాటంలో ఆలోచన గెలవకపోతే మనం ఒడిపోతాం అన్నది నా సిద్ధాంతం. మనసు మాట వినకపోవటం అంటే ప్రలోభాలకి లొంగకపోవటం అని గర్వపడుతూ వుంటాను. 70 ఏళ్ల వయసులో వీలయినపుడల్లా వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను నేను అబినందించుకున్న క్షణాలే ఎక్కువ. కానీ ఎపుడైనా అద్దంలో నాకళ్ళలోకి నేను చూసుకుంటే మాత్రం ఎందుకో తలదించుకుంటాను. నేను కాక ఎవరో కనిపించినట్లు వుంటుంది. కొంచెం భయం వేస్తుంది.  వెంటనే ప్రక్కకి వచ్చేస్తాను. మళ్ళీ నా ఆఫీస్ చైర్ లో కూర్చోగానే బలమైన వెంకట్ గా మారిపోతాను. ఈరోజు ఇలా సంఘం లో వున్నత స్తితి లో వున్నాను అంటే నా వెనుక వున్నది నేను, నా ఆలోచన మాత్రమే. అందుకే అందరికన్నా ఎక్కువగా నన్నునేను ప్రేమించుకుంటాను. కానీ ఇన్నాళ్ళూ నన్ను గెలిపించిన నా ఆలోచనలు బలహీనమయ్యాయనిపిస్తోంది. మనసు, మెదడు రెండు ఒకటై పోయి నన్ను ఓడించాలనే కుట్ర చేస్తున్నట్లుగా వుంది. లేకపోతే ఎందుకు ఈ మధ్యన ఎక్కువగా “ తను  గుర్తు వస్తోంది. తాళాలు అవసరం లేని గదిలాగా ఎందుకు గతం తానంతట అదే తెరుచుకుపోతోంది.

 

 

తనంతట తానుగా వచ్చే తన జ్ఞాపకం తనలానే నా హృదయపు లోతుల్లో జారిపోవటం నాకు అనుభవమే అంతకుమించి నా ఆలోచన పరిధిలోకి తనని నేను ఎప్పుడు రానివ్వలేదు కానీ ఇన్ని సంవత్సరాల తరువాత  ఇప్పుడు రాలేని తన జ్ఞాపకాన్ని నేను వెలికి తీస్తున్నాను.. ఓడిపోవడానికి సిద్ధం అయ్యానా ?

 

 

ఇంటర్ లో చేరిన రోజుల్లో ఉన్నది పల్లెటూరు కావడంతో సిటీలో జాయిన్ అయ్యాను. చదువుకన్న ఎక్కువగా ప్రపంచాన్ని చదివే రోజులు. నన్ను ప్రభావితం చేస్తున్న గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, ఏదో చేయమని అడిగే ఆలోచనలు, చేయాలనే ఆవేశం. ఇంక డిగ్రీ లో జాయిన్ అయ్యాక చదువు పూర్తిగా వెనక్కి వెళ్ళింది. ఉద్యమాలు, విప్లవాలు, పోరాటాలు, ఊరేగింపులు… నేనొక పెద్ధ హీరో అయిపోయాను. అమ్మ ఎంత బ్రతిమిలాడినా నాకు నచ్చిన ఆలోచనే నేను ఆచరించాను. డిగ్రీలో యువజన నాయకుడిని అయ్యా. అంతే చదువు ఆగిపోయింది. పూర్తి చేయాలని కూడా అనిపించలేదు. కాలేజీ నుంచి బయటికి వచ్చిన నా ఫాలోయింగ్ తగ్గలేదు అలానే కాలేజీ గొడవలలో నా పాత్ర కూడా ఉంటూనే వచ్చింది. జూనియర్స్ అందరూ సలహాలు కోసం వస్తూనే ఉండేవారు. నాన్నకి తెలీకుండా అమ్మ డబ్బు పంపించేది. అలా ఇంకో రెండు ఏళ్లు గడిచాయి.

 

కొద్దిగా జీవితంలో హడావిడి తగ్గింది. ఖాళీ పెరిగింది. కర్తవ్యం ఎదురుగా కనిపిస్తున్నా కళ్ళు మూసుకుని కాదంటున్నాను. సంఘసేవకి ఆవేశం ఆఖర్లేదు, ఆలోచన చాలు. న్యాయం, ధర్మం అంటూ అరిచి, వుద్యమాలు, వూరేగింపులతో సమాజ సంస్కరణ చేయలేమని, అసలైన మార్పు మననించే మొదలవ్వాలని ఇలా ఏదో నాలో ఒక సంఘర్షణ….. నాతో నాకే తర్కం….. ఈ మార్గం లో వుండలేక, బైటికి రాలేక కొట్టుకుకుంటున్న రోజుల్లో… కాలేజీ ఎలక్షన్స్ వచ్చాయి… జూనియర్స్ వస్తామన్నారు కొన్ని సలహాల కోసం… భాస్కర్ ఇంటికి రమ్మన్నాను… భాస్కర్ నాకు ఫ్రెండ్ అంటే సరిపోదు. మా స్నేహం లో హద్దులు లేవు అర్ధంచేసుకోవడమే తప్ప. వాడు డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ వుద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆరోజు సాయంత్రం భాస్కర్ వాళ్ళ ఇంటి మేడ మీద కాలేజీ ఎలెక్షన్స్ చర్చలు జరిగాయి, కరపత్రం తయారు చేసే భాద్యత నేనే తీసుకుని వాళ్ళకి అవసరమైన సూచనలు ఇచ్చి పంపించేశాను. భాస్కర్ నేను మంచి కోటేషన్స్ తో కరపత్రం చేయాలని కసరత్తు చేస్తున్నామ. సడన్ గా భాస్కర్ వాడి చెల్లిని పిలిచి “ ఒకసారి విష్ణుప్రియని రమ్మనవే “ అన్నాడు. ప్రశ్నార్ధకంగా చూస్తున్న నాకు “ చెల్లి ఫ్రెండ్ రా .. వ్యాసాలు బాగా రాస్తుంది. సాయం తీసుకుందాం ” అన్నాడు… మాటల్లోనే వచ్చింది విష్ణుప్రియ… పారిజాత పరిమళంలా, వోణీ వేసిన సన్నజాజి లా, ప్రోగుపడిన ముగ్ధత లా వస్తూనే తన ఆకర్షణ లోకి నన్ను లాక్కుని నన్ను అసహాయుడిని, అచేతనుడిని చేసేసింది. భాస్కర్ ఏదో వివరిస్తున్నాడు తనకి. మద్యలో నన్ను అంతే కద అని ఆడుగుతున్నాడు. కానీ నాకు ఏమి తెలియటంలేదు. మెదడు, మనసు ఏది పనిచేయటం లేదు. “ సర్లే భాస్కర్ పని వుంది. మళ్ళీ వస్తాను ” అని రూమ్ కి వచ్చేశాను. నన్ను నేను కూడదీసుకోవడానికి ఒక రోజు పట్టింది. ఇక అక్కణ్ణించి ఎపుడూ లేంది నాకు భాస్కర్ తో పనులు ఎక్కువ అయ్యాయి. తనతో మాటలు కూడ. మనిషి ఎంతో సున్నితం కానీ మాటలు చాలా పదును గా రాసేది. ఏదయినా ఎక్కువ మాట్లాడదు. చిన్నగా నవ్వటం తప్ప… ఆ నవ్వే నా మనసు వినే మోహనరాగం… తరచుగా ఏదో ఒక కారణం తో తనని కూడ చర్చలకు పిలిచే వాళ్ళం. ఎంతో చక్కగా తన అభిప్రాయాలని వ్యక్తీకరించేది. చాలా తొందరగా తన విషయం లో ఒక అభిప్రాయానికి వచ్చాను. మేము ఇద్దరమే వున్నపుడు తన చేతిని నా చేతిలోకి తీసుకుని “ జీవితాంతం తోడుగా వుంటావా ” అని అడిగాను. కళ్ళలో సిగ్గు దాచి కనురెప్ప వేస్తే, కనురెప్ప మూస్తే, చెక్కిట జారిన సిగ్గు పెదవుల చేరి ఎర్రబడి చక్కగా నవ్వింది అందంగా, అందం లాగా।

 

జీవితానికి గమ్యం తెలిసినట్లు అనిపించింది. ముందు డిగ్రీ పూర్తి చేసి వుద్యోగం సంపాదించాలి. అప్పటికి తను కూడ డిగ్రీ చివరి సంవత్సరం లోనే వుంది. అవసరమయిన పుస్తకాలు తానే తెచ్చేది. ఫీజు తానే కట్టింది. చదువుతున్నాను కానీ పూర్తి గా కాదు… అలవాటు అయిన దారి అంతా తొందరగా వదలలేము. ఎవరో ఒకరు వచ్చి ఏదయినా వుధ్యమం అంటే మళ్ళీ గాడి తప్పడం… మొత్తానికి పరీక్షలు రాశాను… ఇక వుద్యోగం వెతుక్కోమని తనే టికెట్ కొనిచ్చి హైదరాబాద్ పంపింది. డిగ్రీ పాస్ అయ్యాను. ఏదో ఒక వుద్యోగం చేయాలి. ఏది   నచ్చట్లేదు… కొన్నాళ్ళు చేయడం, మానెయ్యటం. మళ్ళీ కొత్త ప్రయత్నం. ఉత్తరాలతో ఒకరికి ఒకరం ఎన్నో చెప్పుకుంటున్నాము. తనకి చాలా ఆశలు పెడుతున్నాను. సడన్ గా ఒకరోజు భాస్కర్ వచ్చాడు విష్ణు ని తీసుకుని. తనకి వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో సంబంధం కుదురుస్తున్నారని, ఏం చేయాలో తెలియక ఇలా విష్ణుని తీసుకు వచ్చానని అన్నాడు. మనసుకి మెదడుకి యుద్ధం. చాలిచాలని వుద్యోగంతో ఇప్పటికిప్పుడు పెళ్ళంటే నా వల్ల కాదన్నాను. నాకు టైమ్ కావాలి అంటూ తప్పించుకున్నాను. విష్ణు… ఒకసారి కళ్ళు ఎత్తి చూసింది అలానే అందంగా. తనకి పెళ్లి అయి తాను నా గతం అయింది. నా తప్పు ఏమి లేదని తనని తీసుకు వచ్చి బాధ పెట్టడం కన్నా ఇద్దరం విడిపోవడమే వాస్తవం అని నన్ను నేను నమ్మించుకున్నాను. కష్టపడ్డాను. జీవితం అన్నీ ఇచ్చింది. మంచి వుద్యోగం, అనుకూలవతి అయిన భార్య, సంఘం లో ఒక స్టేటస్ అన్నీ దొరికాయి… ఈ గెలుపు అంతా నావల్లే అనే గర్వం కూడ వుంది. మధ్యలో మనసు అపుడపుడు అడిగినట్లు అనిపిస్తుంది ఏది గెలుపు అని. నోరుముయ్ అంటాను అలవాటుగా. అయినా తన వెంటాడే నవ్వు నా గెలుపు శిఖరం నించి పాతాళం లోకి తోసేస్తూ వుంటుంది. ఈ మధ్య మరీ ఎక్కువగా జీవితపు చివరిదశలో… ఒకసారి తనని చూడగలిగితే, మళ్ళీ నవ్వుతుందేమో నన్ను క్షమించిన దేవతలా… నా అహంకారం తట్టుకోగలదా. కాదు ఈసారి మనసుని గెలిపించాలి, నేను ఓడిపోవాలి. వోడి గెలవాలి. భాస్కర్ కి ఫోన్ చేశాను. ఆ సంఘటన మాలో ఈ మార్పు తేలేదు. అర్థమే చేసుకున్నాడో, నాకు అర్హతే లేదనుకున్నాడో ఇక ఆ విషయం మా ఇద్దరి మద్య ఎపుడూ రాలేదు. ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ నా అంతట నేనుగా అడిగాను విష్ణు అడ్రసు. భాస్కర్ ఫోన్ పెట్టేశాడు. ప్రియ నా జీవితంలోనే కాదు అసలు ఈ ప్రపంచం లోనే లేదు నను చూసి ఈసారి నవ్వడానికి. గుండెకి ఏదో అవుతోంది. అంతా నేనే అనుకున్న నేను లేకుండా ఐపోతున్న… ఓటమి ని గెలుపుగా విర్రవీగిన నా అహంకారం ఈసారి నన్ను చూసి నవ్వింది. ప్రియా ! నీ పరిచయమొక తెలిమంచు వాన, నీ స్నేహమొక మందార మాల, నీ నవ్వు నను తాకు తొలి సూర్య కిరణం, నీ జ్ఞాపకం ఒక గులాబీ పరిమళం, నిను వదిలినదీ లేదు, నిను మరచిందీ లేదు, నువ్వు ఓడిందీ లేదు, నేను గెలిచిందీ లేదు, నీవు ఎక్కడని వెతికితే నిరంతరం నాలో కదిలే నా అంతర్వాహిని నీవే… మళ్ళీ జన్మంటూ వుంటే ప్రియతమా, నీ పాద రేణువునయి నీ ప్రేమకై అర్ధిస్తా… ఈ జన్మకు క్షమించు ఈ మూర్ఖుడిని…                       

👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾