12_006 ఆనందవిహారి

 

విశ్వ వేదిక మీద తెలుగు సాహిత్యం

చికాగో సప్నా – భారతీ  తీర్థ – సంయుక్త  తెలుగు సాహిత్య  సభ

 

ఉత్తర అమెరికాలో ఉన్నత స్థాయికి అతి వేగంగా దూసుకుపోతున్న ప్రపంచ భాషల్లో 

తెలుగు రెండో స్థానం లో ఉంది. భారత దేశపు సాహిత్య సాంస్కృతిక కళా రంగాలు ప్రజలకి

అనేక విధాలుగా స్ఫూర్తినిస్తున్నాయి. ఈ ఎదుగుదలకి ముఖ్యకారణం, ఆధారం అమెరికాలో ఉన్న 

తెలుగు సంస్థలు అని నిస్సందేహం గా చెప్పవచ్చు, సంస్థల వ్యవస్థాపకులని వారి కృషిని,

శ్రమని, త్యాగాన్నీ తలచుకోవాలి, సన్మానించుకోవాలి. సమైక్యత, సమత ప్రస్తుత కాలానికి అత్యవసరం ‘ 

అని విద్యావేత్త, సాహితీవేత్త డా. శొంఠి శారదాపూర్ణ , నవంబరు 12న చికాగోలో  ‘ సప్నా- భారతీ తీర్థ’ సంయుక్తం గా నిర్వహించిన సభ నిర్వహిస్తూ తెలిపారు. ప్రార్ధన తో ఆరంభమైన సభా కార్యక్రమంలో అట్లాంటా వాస్తవ్యురాలు, ప్రఖ్యాత వైద్యురాలు, రచయిత్రి, డా . పూడిపెద్ది శేషు శర్మ వ్రాసిన ” విజయ గీత ” భగవద్గీత తెలుగు అనువాద పద్య గ్రంథం, న్యూయార్క్ వాస్తవ్యులు డా. కలశపూడి శ్రీనివాస రావు అనువదించిన పద్మశ్రీ KK మహమ్మద్ ఆత్మకథ ” నేను భారతీయుణ్ణి ” ఆవిష్కరణ పొందాయి. ఈ సభకి ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, సహస్రావధాని, TTD అన్నమాచార్య ప్రాజెక్ట్ అధినేత డా. మేడసాని మోహన్ తన అధ్యక్షోపన్యాసం లో తెలుగు సాహిత్యానికి దేశ చరిత్ర ఎంత ఆవశ్యకమో అద్భుతంగా తెలిపారు. ఆత్మీయ అతిథి ప్రముఖ చిత్రకారుడు, రచయిత, పద్మశ్రీ యస్వీ రామారావు KK మహమ్మద్ ఆత్మకథ లో ముఖ్యమైన అంశాలని తెలిపారు. 

శ్రీ నూకల ప్రసాద్ తెలుగు భాషకి ఛందస్సు వ్యాకరణం ఎంత అవసరమో కవి సమ్రాట్ విశ్వనాథ ని గుర్తుచేస్తూ తెలిపారు. డా. దామరాజు లక్ష్మి, శ్రీ అప్పలనేని పద్మారావు, డా. బాబురావు, శ్రీ యడవిల్లి రమణ మూర్తి, శ్రీ జయదేవ్ రెడ్డి ఆవిష్కరణ పొందిన రెండు పుస్తకాల గురించి మాట్లాడారు. చికాగో భారతీ తీర్థ వ్యవస్థాపకులు డా. తాతా ప్రకాశం వివరాలు తెలిపారు. సప్నా – శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు అఫ్ నార్త్ అమెరికా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శొంఠి శ్రీరామ్ నాలుగు దశాబ్దాలుగా సప్నా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల

గురించి చెప్పారు. రచయిత్రి డా. పూడిపెద్ది శేషుని భారతి తీర్థ ‘ సమాజ – సాహిత్య భారతి’  అన్న బిరుదుతో గౌరవించింది. డా. శేషు శర్మ విజయ గీత అనువాద పద్య కావ్యం గురించి వివరిస్తూ తన ఆనందాన్ని ప్రకటించారు. డా. కలశపూడి శ్రీనివాస రావు అంతర్జాలం లో ప్రశంసలు అందించారు. గరిమెళ్ళ గోపాలకృష్ణ మూర్తి గానం చేసారు. చికాగో లో ఉన్న అనేక సంఘాల అధినేతలు, ప్రముఖులు -సయ్యద్ హాక్, ఖాజా మొయిఉద్దీన్, ఇంతియాజ్ ఉద్దీన్, డా. ఉమాపతిరెడ్డి, శ్రీ భీమారెడ్డి, శ్రీ ఆజాద్ సుంకవల్లి, శ్రీ అష్వక్ సయీద్, డా. చిట్టూరి రత్నం, శ్రీమతి ఉమ కటికి, డా. సంయుక్త రెడ్డి ప్రభృతులు సభకి హాజరయ్యారు. తెలుగు సభ వినూత్నం గా నడిచింది. 

 

ఈ కార్యక్రమ పూర్తి వీడియో ఈ క్రింది లింక్ లో…..

 

 

********************************************************************************

 

తెలుగునాట ఎలక్ట్రానిక్ మీడియాలో తొట్టతొలి మహిళా జర్నలిస్ట్

– అరుణా రవికుమార్

సమాజంలో మార్పుకి దోహదపడాలన్న అశయమే తనను పాత్రికేయ రంగం వైపు అడుగులు వేయించిందని ఎలెక్ట్రానిక్ మీడియా తొట్టతొలి మహిళా జర్నలిస్ట్ అరుణా రవికుమార్ వెల్లడించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి “నెల నెలా వెన్నెల” పేరిట ప్రతి నెలా నిర్వహిస్తున్న “నెట్టింట్లో సమావేశం” నవంబర్ 12వ తేదీ శనివారం సాయంత్రం అంతర్జాలం ద్వారా ప్రసారమైంది. ఇందులో ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, డాక్యుమెంటరీ రూపకర్త, వ్యాఖ్యాత్రి అయిన అరుణతో రేడియో జాకీగా, పలు కార్యక్రమాల నిర్దేశకుడిగా పేరు తెచ్చుకున్న ఎం. ఆరిఫ్ ముఖాముఖి నిర్వహించారు.

 

వెనకటి తరం ప్రముఖ రచయిత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నత పదవులు నిర్వహించిన శారదా అశోకవర్ధన్, తొమ్మిది భాషలలో ప్రావీణ్యం ఉన్న అశోకవర్ధన్ ల కుమార్తెనని వక్త తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. స్వాతంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్న తన తాతగారైన గాడేపల్లి జగన్నాథం అనేక ఆదర్శాలను కలిగి ఉండేవారని, ఆరోజుల్లోనే వితంతువును వివాహమాడారని వెల్లడించారు. ఆయనతో సాంగత్యంవల్ల తనకు అనేక రంగాలకు చెందిన నిపుణుల మాటలు వినే అవకాశం బాల్యంలోనే కలిగిందని, కరెంట్ అఫైర్స్ పట్ల మక్కువ కలిగించిందని చెప్పారు. దానికి తోడు, మార్పుకు దోహదం చెయ్యాలన్న తలంపుతో జర్నలిజంలో అడుగుపెట్టానని, నిజానికి తనది సైన్స్ నేపథ్యమని చెప్పారు. మొదిసారి రాసిన సివిల్ సర్వసెస్ ప్రిలిమ్స్ లో పాసైనా కూడా మెయిన్స్ లో ఎంపిక కాకపోవడంతో… అందుకోసం మరింత సమయాన్ని  వెచ్చించకుండా పాత్రికేయ వృత్తిలోకి రావడం వల్ల తనకు జీవితంలో మంచి ఎదుగుదల కలిగిందని అన్నారు. 

 

“ఈనాడు”లో కొన్ని సంత్సరాలపాటు పనిచేసిన తరువాత 1995లో “ఈటీవీ 2” ప్రారంభమయ్యాక తనను అందులో విలేఖరిగా తీసుకున్నారని అరుణ చెప్పారు. తను చేసిన ముఖ్యమైన ఇంటర్వూలను గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అధికార మార్పు జరుగుతుండగా సంచలనం రేపిన లక్ష్మీ పార్వతితో ఇంటర్వ్యూ, ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూ, అద్వానీ భారత ఉప ప్రధాని, గృహమంత్రిగా ఉండగా ఇచ్చిన ఇంటర్వ్యూలు, పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా చేసిన ఇంటర్వూల విశేషాలను వివరించారు. ఎన్టీఆర్ తనకు ఇచ్చిన ఇంటర్వ్యూనే ఆయన చివరిది అవుతుందని ఊహించలేదని అంటూ అరుణ ఉద్వేగానికి లోనయ్యారు. సాహితీమూర్తి అయిన పీవీని శారదా అశోకవర్ధన్ కుమార్తెగా పరిచయం చేసుకోవడం, ఆయన తన పేరు అడిగిన వెంటనే, ఆయన రచించిన “ఇన్సైడర్”లోని కథానాయిక పేరేనని సమయస్ఫూర్తితో చెప్పడంతో ముగ్ధుడైన ఆయన… షెడ్యూలులో లేనప్పటికీ తన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

 

మీడియాలో ఉండడం వల్ల అన్ని రంగాలతో పరిచయం కలిగిందని వక్త వివరించారు. కొత్తలో ఒక మహిళ రాజకీయ వార్తల సేకరణలో ప్రముఖంగా పాల్గొనడం కొందరికి రుచించక తనను సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం చేశారని, కొంత కాలం తరువాత మనసు మార్చుకొని మళ్ళీ పొలిటికల్ జర్నలిజంలో అవకాశం ఇచ్చారని వెల్లడించారు. అప్పటినండీ ఇక తనకు తిరుగు లేకపోయిందని సంతోషంగా తెలిపారు. రాజకీయ జర్నలిజంతో పాటుగా అనేక సాంస్కృతిక, సామాజిక కార్య్రమాలలో పాల్గొనడం తన అదృష్టమని  పేర్కొన్నారు. “సోపానాలు” కార్యక్రమం ద్వారా మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కాళోజీ, వెంపటి చినసత్యం, వావిలాల గోపాలకృష్ణయ్య, ఆరుద్ర, ఎస్. జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితర మహామహులను కలుసుకున్నానని అన్నారు. సరదాగా, స్ఫూర్తిమంతంగా సాగిన ఆ కార్యక్రమాల విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఎన్ టీవీ, లోకల్ టీవీ, వనిత, జెమిని టీవీలలో నిర్వహించిన “తులసి” (ఆథ్యాత్మికం), “అద్దం”, “ఒక చిన్న మార్పు”, “యదార్థం” (సామాజికం), “చట్ట సభల్లో వనిత” (రాజకీయం) తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయని చెప్పారు. “ఒక చిన్న మార్పు” ఈనాటి స్వచ్ఛ భారత్ వంటిదని పేర్కొంటూ… ఆ కార్యక్రమం ద్వారా సమాజంలో జరిగిన కొన్ని మంచి మార్పులను ఉటంకించారు. ఇక “యదార్థం” కార్యక్రమం మొదలైన నెలకే యూనిసెఫ్ నుంచి ఉత్తమ చర్చా కార్యక్రమంగా బహుమతి అందుకుందని వెల్లడించారు. 

 

సామాజిక, ఆథ్యాత్మిక విషయాలు నేర్చుకోవాలనే తపన తనలో ఉండడం వల్లే ఇలా అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించే అవకాశం వచ్చిందని అరుణ అన్నారు. వృత్తిపరంగా తను కలిసిన గొప్పవారి నుంచి ఎలా జీవించాలో నేర్చుకున్నానని, కరుడు గట్టిన నేరస్థుల నుంచి ఎలా జీవించకూడదో నేర్చుకున్నానని అంటూ… మీడియాలో పనిచేయడం వల్లే తన జీవితం ముందుకి ప్రవహించిందని వ్యాఖ్యానించారు.

 

 రవికుమార్ తో వివాహం తరువాత విజయవాడలో కొంతకాలం ఉన్నానని, వెళ్ళిన కొత్తలోనే జరిగిన వంగవీటి రంగా హత్యోదంతాన్ని (1989), అప్పట్లో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో తనకు “ఈనాడు” గట్టి భద్రత కల్పించిందని చెప్పారు. 

 

పిల్లల ఆలనా పాలన దృష్ట్యా ఉద్యోగ జీవితంలో మధ్యమధ్య విరామాలు తీసుకున్నానని, అందువల్లే పలు సంస్థలలో పనిచేయడం జరిగిందని అరుణ తెలిపారు. మీడియా అనుభవంతో రచయిత్రిగా కూడా మారానని వక్త తెలిపారు. ఇదివరకు ఆంగ్లంలో రచించిన పుస్తకాన్ని ప్రస్తుతం తెలుగులోకి అనువదిస్తున్నానని, మరొక పుస్తకం తెలుగులోనే రాస్తున్నానని వెల్లడించారు. ఆరిఫ్ చక్కని అంశాలను లేవనెత్తి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగేలా నిర్వహించారు. 

 

ఈ కార్యక్రమ పూర్తి వీడియో ఈ క్రింది లింక్ లో…..

 

********************************************************************************

 

ముగ్గురు తేజోమూర్తులు

– డా. కాసల

 

 

అమరజీవి పొట్టి శ్రీరాములు, అంతేవాసిగా ఆయనను ఆరాధించి తరించిన వై. ఎస్ శాస్త్రి, ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపులు మద్రాసు నగరంలో వెలుగొందుతున్న తెలుగు సాంస్కృతిక వైభవానికి పట్టుగొమ్మలని డా. కాసల నాగభూషణం కొనియాడారు. ఈ నెల 15 అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కాగా, బాపు జయంతి కూడా. ఇదే నెల 11 వై. ఎస్. శాస్త్రి జయంతి. ఈ సందర్భాలను పురస్కరించుకొని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఏర్పాటు చేసిన ప్రత్యేక “నెల నెలా వెన్నెల” కార్యక్రమం “ముగ్గురు తేజోమూర్తులు”లో డా. కాసల ప్రసంగించారు. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం అంతర్జాలంలో ప్రసారమైంది. స్థానిక డిజి వైష్ణవ కళాశాల తెలుగు శాఖాధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన డా. కాసల మాట్లాడుతూ… ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆయన అంతేవాసి వై. ఎస్ శాస్త్రి ఆంధ్రజాతి అస్థిత్వానికి ఒక గుర్తింపు, గౌరవం సాధించిన కార్యశూరులు అని పేర్కన్నారు. వారిద్దరూ సమరజీవులని ప్రశంసించారు. 

   పొట్టి శ్రీరాములు అనగానే ఆమరణ నిరాహారదీక్ష, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అని మాత్రమే కొత్త తరాలకి తెలుసునని అంటూ …. అప్పటి విశేషాలను వివరించారు. వ్యక్తిగత జీవితం, ఆయన మీద గాంధీ గారి ప్రభావం, ఆయన చేపట్టిన సంఘ సేవా కార్యక్రమాలు, ఆత్మ బలిదానం అనే నాలుగూ శ్రీరాములు జీవితంలోని నాలుగు పార్స్వాలని పేర్కొని వాటిని వివరించారు. గాంధీజీ 1945 మే 29న మహాబలేశ్వర్ నుంచి రాసిన లేఖలో, “నాకు శ్రీరాములు వంటి పదకొండు మంది అనుచరులు ఉంటే చాలు, ఏడాదిలోనే స్వాతంత్య్రం సాధించగలను.” అని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ మాట శ్రీరాములు మనసులో బలంగా నాటుకుందని చెప్పారు. 

 

   స్వాతంత్ర్యానంతరం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి పట్ల వివక్ష ఎదురైందని, దాంతో 1903-4 లోనే అంకురించిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఊపందుకుందని అన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటే ధ్యేయంగా 1952 అక్టోబర్ 19న ఉదయం పది గంటలకి ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన శ్రీరాములు ధృఢ సంకల్పంతో 58 రోజులు కొనసాగించి డిసెంబర్ 15న రాత్రి 11:23కి స్వర్గస్తులయ్యారని వివరించారు. గాంధీజీ శిష్యుడు శ్రీరాములు అయితే, ఆయన శిష్యుడు వై. ఎస్ శాస్త్రి అని పేర్కొన్నారు. ఆ సమరజీవి త్యాగాన్ని అనుక్షణం గుర్తుచేసే స్మారక భవనాన్ని నిర్మింపజేసిన మరొక సమరజీవి శాస్త్రి అని వ్యాఖ్యానించారు. శ్రీరాములు దీక్ష చేసిన ఇంటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసి ఆయన స్మారకంగా మార్పు చేసేందుకు శాస్త్రి 14 ఏళ్ళ పాటు నిర్విరామంగా కృషి చేసి విజయం సాధించారని గుర్తు చేశారు. శాస్త్రి వయసును జయించినవారని అంటూ… 75వ ఏట కంప్యూటర్ కోర్సు చేసి డిటిపి, లేజర్ టైప్ సెట్టింగ్ చేసేవారని చెప్పారు. ఆయన వెలువరించిన పుస్తకాల వివరాలు తెలిపారు. 

 

ఇక బాపు అంటే జగమెరిగిన చిత్రకారుడు, చలన చిత్రకారుడు అని వక్త అన్నారు. బ్రహ్మాండాన్ని అంతటినీ తనలో ఇముడ్చుకున్న అణువులాగా బాపు అనేక కళలను వెలయించారని వక్త వ్యాఖ్యానించారు. ఆయన చిత్రకారుడు, వ్యంగ్య చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్, పెయింటర్, డిజైనర్, సంగీత కళాకారుడు, రచయిత, దర్శకుడు అని బాపు బహుముఖాలను పరిచయం చేశారు. బాపుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ… మహాకవి తిక్కన రాసిన “నిర్వచనోత్తర రామాయణా”నికి “తిక్కన సీత” పేరుతో తను ఒక వ్యాసం రాశానని చెప్పారు. అందుకు ముఖ చిత్రం వేయమని అడిగితే, తను ఇచ్చిన వివరాలకు మించి అద్భుతంగా బొమ్మ వేసి పంపారని డా. కాసల గుర్తు చేసుకున్నారు. 

 

    అనేక సంవత్సరాలుగా మద్రాసు నగరంలో ఉంటూ ఆచార్యుడిగా, సాహితీవేత్తగా ఎదిగిన డా. కాసల నాగభూషణం తన ప్రత్యక్ష అనుభవాల సారాన్ని ప్రేక్షకులకు పంచుతూ “ముగ్గురు తేజోమూర్తులు” కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కార్యక్రమానికి ముందు నిడమర్తి వసుంధర వక్తను పరిచయం చేసి, చివరిలో వందన సమర్పణ చేశారు.

 

ఈ కార్యక్రమ పూర్తి వీడియో ఈ క్రింది లింక్ లో…..

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ———

Please visit this page