మాట మహత్తరమైనది.. మనుషులను దగ్గర చేసినా, దూరం చేసినా దాని ప్రభావాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. ఇది సత్యం !
నా విషయానికి వస్తే ఆ ‘మాటే’ నా మనసును అనేకమంది మహనీయుల మనసులకు చేరువచేసి, అపారమైన వారి అభిమానాన్ని నాకు ప్రసాదించింది. నిజానికి వారితో ఏర్పడిన మైత్రీ బంధం విడదీయరానిది. ఆజన్మాంతం ఆ తీపి జ్ఞాపకాలు నిలిచేలా ఆ బంధం ఏర్పాటు చేసింది.
ఇటువంటి పరిచయాలద్వారా దేశ విదేశాలలో ఉన్న అనేకమంది నాకు అమూల్యమైన చెలిమి కలిమిని ప్రసాదించారు. వారిలో ఒకరు శ్రీలంక దేశం లోని కాండీ పట్టణానికి చెందిన శ్రీ మోహన్ కూమాసరు. ఆయన తో నా తొలి పరిచయం ఉత్తరాల ద్వారా 1967.. అంటే నేటికి షుమారు 54 సంవత్సరాల క్రితం ఏర్పడింది అన్నమాట ! అప్పట్లో ఫోన్లు, ఇతర ఎలెక్ట్రానిక్ మీడియానికి చెందిన పరికరాలు ఇంకా వాడుకలోనికి రాలేదు. అందుచేత ఎవరితోనైనా స్నేహం ఏర్పరచుకోవాలంటే ఉన్న ఒకే ఒక అవకాశం కేవలం ఉత్తరాల ద్వారానే. అవి భగవత్ప్రసాదాలయితే ఆ ప్రసాదాన్ని పంచిపెట్టే పూజారి పోస్టుమేన్. ఆ రకం గా మోహన్ కీ, నాకు స్నేహం వారధి గా నిలిచింది. అసలు దీనిని సేతుబంధనం అని చెప్పడం సబబు. ఏమంటే అది. శ్రీలంక లో ఒకరిని – భారతదేశం లో మరొకరిని కలుపుతూ స్నేహ వారధి గా నిలిచింది కదా !
నేను అప్పట్లో (1967) శ్రీశైలం ప్రాజెక్ట్, చీఫ్ ఇంజినీర్ ఆఫీస్ లో జూనియర్ ఇంజినీర్ గా పని చేసేవాడిని. అప్పటికింకా నాకు పెళ్లి కాలేదు. ఆఫీసు పని అవడం తో మధ్య మధ్యలో కాస్త విరామం దొరికేది. ఆ సమయం లో ఇంట్లో వంట, ఆఫీసు లో పనితో బాటు కాస్తంత వెసులుబాటు దొరికినప్పుడు స్నేహాలు, ఉత్తరాలు… ఇవీ కాలక్షేపానికి రస గుళికలు.
ఇక మోహన్ కాండీ లో తేయాకు తోటలకు సంబంధించి ప్లాంటర్ గా ఉండేవాడు. కష్టించి పనిచేయడం అతని నైజం అని గ్రహించడానికి నాకు అట్టే సమయం పట్టలేదు. నాకూ ఆఫీసులో పని కూడా తరచుగా తలములకలుగా ఉండేది.
మోహన్ కి ఒక వంక వృత్తిపరం గా ఉండే బాధ్యతలున్నా, తాను మరొకవంక కొంత మార్పు కోసం సినిమాలను, యాత్రలను, ఆటలను ఆశ్రయించడం జరిగింది. ఈ విషయాలనే తాను నాకు వ్రాసిన ఏరోగ్రామ్ లో పేర్కొన్నారు. వేసక్ పండుగ .. అంటే బుద్ధదేవుని పుట్టిన రోజు పండుగ అన్నమాట. కాండీ పట్టణం లో బుద్ధుడి దంతం ఉన్న దేవాలయం లో జరిగే ప్రత్యేక వేడుకలు చాలా ప్రసిద్ధి చెందినవి. ఆసక్తికరమైన వాటి ప్రస్తావన ఆయన ఉత్తరం లో ఉంది,
చాలా కాలం గా జరిగిన మా ఉత్తర ప్రత్యుత్తరాలు, మారుతున్న కాల ప్రభావం కారణంగా ఇప్పటికి దాదాపుగా కనుమరుగయ్యాయని బాధతో చెప్పక తప్పడం లేదు. … సిలోన్ ( అప్పటి పేరు ) ఏరోగ్రాం ఆనాటి ధర 30 పైసలు. ఇంగ్లీషు, తమిళం, సింహళ భాషలు ఆ ఏరోగ్రాం రూపకల్పనలో చోటు చేసుకుని సంతోషంగా సహజీవనాన్ని సాగించాయి ..
అయితే, నాకు అనూహ్యం గా ఆనందాన్ని కలిగించిన విషయమేమంటే, ఎండిపోయిందనుకున్న స్నేహలత తిరిగి ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు చిగురించి మోహన్ ను, నన్నూ మళ్ళీ కలిపి దగ్గర చేయడం. ఇటీవలే మోహన్ తో ఫోన్ చేసి మాట్లాడడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఫేస్ బుక్ లో నాకు పరిచయమయిన కొలొంబో నగరానికి చెందిన శ్రీ రేషన్ కూమాసరు, ఈ విషయం లో సూత్రధారి గా వ్యవహరించడం మరో ఆనందకరమైన విషయం. పాత మిత్రులను తిరిగి కలిపిన పుణ్యం నిస్సందేహంగా రేషన్ దే…. ఇందుకుగాను శ్రీ రేషన్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇదంతా దైవలీల కాక మరేమిటి ?! మీరే చెప్పండి ?!!
ధన్యవాదాలు….
నమస్కారములు.
~~~ <><><>!<><><> ~~~