మా ‘హుళక్కి’ అంబాజీపేట వంటావదం వీధిలో ఎప్పుడుపుట్టాడో నాకైతే తెలీదు..అక్కడ అమ్మే లంకపనసపండు సాక్షిగా!
ఐతే…ఎఫ్బీ లో మాత్రం పుట్టి ఓ సహం పుష్కరం దాటింది! బండారులంక
గణపతి పోట్టింకలవాడు వడ్డించే దబ్బకాయ చెట్నీ సాక్షిగా!
అప్పుడెప్పుడో గుడిమెళ్ళవారి అరుగుమీద సాయిబు టైలర్ కుట్టిన ఊడూడిపోయే నిక్కర్ని, సుబ్బాలమ్మ కుంకాలకొట్టులో కొన్న ముతక మొలతాడుదాపులో దూర్చి మేనేజ్ చేయడం దగ్గరనుంచి వాడు ముదురు టెంకి!
చిన్నప్పుడు క్షీరాబ్ది ద్వాదశి ఉసిరిమొక్క పూజ అయ్యాక..మాచిరాజు రంగమ్మగారో…దొరువింటి కూచి భద్రంగారి వర్ధనమ్మగారో ప్రసాదoతోపాటు ఇచ్చే చిల్లరపైసలు నొల్లుకోడానికో దిడీల్న కనబడి మాయవయ్యేవాడు వీడు..!
అంతేగాని సదరు శాల్తీతో మాకేం లావాదేవీలు లేవు….!
ఇది దాటి రొండు పుష్కరాలకు ఇదిగో వీడి ఐపూ..ఆచూకీ…ఆనవాలూ ఎఫ్బీలో నా కంటికి అడ్డం పడింది..!!
నారాయణ…నారాయణా!!
అలాంటి నల్లపూస. హుళక్కిగాడు ఓరోజున డింగుమని కాకిపొడిచిన తాటిపండులా ఊడిపడ్డాడు ఎఫ్బీలో!
అప్పట్లో కొంకాపల్లి వీధుల్లో..పొట్టిసైకిల్ వేసుకుని…జీడికడ్డీలు నమిలి తిరిగే ఈ దివాభీతి….ఇప్పుడు ఎఫ్బీలో ఓ సన్నకారు రచనా సెలెబ్రిటీ!
లైకులకేకులు పోగేసుకుని నములుతూ…కామెంట్స్ బాక్స్ లోకి దూకి అక్షరలక్షలమధ్య ఈదుకునే ఉక్కిరి..బిత్తిరిగాడు!
సదరు ఎఫ్బీ పేజీనుంచి…అలా అమాంతం ఓ మలుపు తీసుకుని..కూతవేటు దూరంలో ఎదురైన “నీగొట్టం” ఛానెల్లో యమబిజీగాడు!
వక్కలంక తోటలో పక్వo పట్టని కందదుంప లాంటి ఈ కుంక…అడ్డేడ్డే….ఇక్కడి భాషాపటిమ సరిపోక..బోర్డర్ అవతలవైపుకు అసుంటా వెళ్లి..వచ్చీరాని తమిళ్లో అఘోరించినట్టు.సకలకళావల్లవన్!
అరవైనాలుగు కళలను ఔపొసన పట్టాలని ఆమహాసముద్రంలోకి ధిడీల్ న దూకి, ఆ మహాసాగరాన్ని కలచి కలచి అల్లకల్లోలం చేసి..ఊరంత తెచ్చుకొందామని రెచ్చిపోయి…
ఉద్ధరిణడు తెచ్చుకున్న కళ్ళునెత్తిగాడు ఈ హుళక్కిగాడు!
ఇలా ఎందుకు చెప్తున్నానంటే…
కళలమ్మ పాదాలపై పడి జన్మలు వేడుకున్నా దొరకని వరం కళాప్రవేశం!
రేణువంత దొరికినా అది ఆ చల్లనితల్లి కృప!
ఏదో జన్మవాసనలు మనసునిపట్టి ఏదైనా ఒక్క లలితకళలో ఆవగింజంత అభినివేశం దొరికినా జన్మధన్యమే!
దానిని పరిపూర్ణాంగా కాకపోయినా..కొనఊపిరి ఉన్నంతవరకూ నిలబెట్టుకోవడం అసిధారావ్రతం!
ఈ తపస్సులోనే మహామహులు తరించిన జీవగర్ర ఈ భూమి!
కళాసాధన ఓ జన్మాoతర సుకృతం ముమ్మాటికీ!
ఇందులో మళ్లీ అచ్చమైన గురుకటాక్షం వెన్నుదన్ను కావాలి!
అయినా ఆ కళాస్పర్శ అబ్భుతుందో లేదో అనేది …అదో చిదంబరరహస్యం!
సరే…
ఇలాంటి రహస్యం తుమ్మిపువ్వంత ఈశ్వర కటాక్షంగా దొరికి..
లలితకళారాధనలో పొంగిపోయే లక్ష్యం ఉండాలిగానీ..
దొరికినవీ…దొరకనివీ అనే తారతమ్యం చిటికెడుఅయినా లేకుండా…భరించే ప్రేక్షకాళి ఉందనిన్నీ..భుజకీర్తులూ…వడియాలగుడ్డలు కప్పేవాళ్ళూ…వెన్నెముక ఛిద్రం అయ్యేలా వెనుక తట్టేవాళ్ళూ,రికార్డులు ఇచ్చేవాళ్ళూ…వీళ్ళూ…
ఉన్నారనేసేసీ…
ప్రతికళా,ప్రక్రియా నేనే కనుక్కున్నాననీ…అవన్నీ…
నావెనుక హాచ్ భైరవుడే..అనే పొగరు కిలుo లా మనసుకి…బుద్ధికీ పట్టించుకుంటే… కనపడే సదరు శాల్తీ…
మా హుళ్లక్కే!
సరే…సాటి ఎఫ్బీయుడిగా అమాంతం నన్ను గుర్తించి…తొండలా నాలుక చాచి నన్ను లుంగచుట్టుకుని తన అకౌంట్లోకి ఎక్కించేసుకుని బ్రేవ్ మన్నాడు!
సరే!వీడివల్ల నా కళకీ కూచింత మైలేజీ…కూచింత లైకుల
హానీకేకులూ…కామెంట్ల శాండల్సెంట్లూ వస్తాయని.ఘాటుగా తలచి… గీసేసిన మీసాలు మళ్లీ ఏపుగా పెంచి మెలేశా…!!
ఎందుకో…మా హుళక్కి గాడి పోస్టింగుల… వావిలేని వరస నా మీసరాజాలకి..ఊహూ..
సుతరామూ రుచ్చించలే!
ఎంతపైపైకి దువ్వి… అప్పుతెచ్చుకున్న జెల్ పెట్టినా…ధ్వజస్థంభంలా నుంచోక నా మీసo…పెళ్లి అయ్యాక…పదార్రోజుల పండగ దాటాక…పెళ్ళిబుట్టలో.. సామానులమధ్యదొరికిన మాగి,వయసైపోయిన అరటిపండులా అమాంతం వాలి చస్తోంది!
విధి వింతనాటకం హుళక్కి ఎఫ్బీ పేజ్ రూపంలో..ప్రతిగంటకీ నాకో మరణ శాసనం రాస్తోంది!
పులి గుహలోకి వెళ్తే..పులి చెప్పినట్టు ఉండాలనే నా ఊహని మొహమాట పెట్టేస్తూ…!
నా ఎఫ్బీహుళక్కిని అనుక్షణం వేపమాత్రలా…కూచింత పందార అనుపానం లేకుండా మింగుతున్నా…!భరిస్తున్నా!!
ఇప్పుడిలా ఎఫ్బీనడిరోడ్డుకి ఎక్కి,నిస్సిగ్గుగా బోరుమంటున్నా!
“ఎఫ్బీయులందు మహామంచి ఎఫ్బీయులు వేరయా…అని
మాగహట్టిగా అనేస్కుంటూ..
వారికి అభినందనలు చెప్పేస్తూ..!”
ఇహ మా ఎఫ్బీ శుంఠడి,
మాహుళక్కి గాడి ఎఫ్బీ వడ్డనని మీకు రోన్త రుచిచూపిస్తున్నా..కాచుకు..మీ ఇష్టదైవాన్ని తలచుకోండి…
వాడి దుష్ఠుపోస్టుల్లో మీక్కొంత రుచికి….ఇవి…
అనుభవించండి..!!
హుళక్కిఎఫ్బీరాతల వాతలు:
*************************
“నువ్ మేఘం మీన తడిబట్ట!
మావీధి చివర ఒంటరి..ఓ పేడతట్ట!
తుమ్మడొంకల కోకిల కూత…
పలకమీద పగిలిన చగొడి.. నారాత…”
************
“జ్ఞాన మస్తిష్కం లోంచి తనకుతానే పెల్లుబికి కారిపోతున్న ఆధ్యాత్మ ధార…ఓ రసప్లవం…ఓమనిషి మనో రoధ్రమా…ధైర్యాన్ని సిమెంట్ల నింపుకో…ఎలుగెత్తి కంటనాలం ఘోషని గుడి మెట్లమీద చిత్రించు….”
**************
“వాగ్గేయకారత్వం నాలో 64 కళలనీ ప్రసవిస్తోంది…నే అమాంతం రైలు చక్రాన్ని అయ్యి…పూ తీగెమీద పరిగెడుతున్నా!
ఇంద్రధనస్సుతో పళ్ళుతోముకోవడం మరచిన ఆరాత్రి..కడుపులో ఒకటే పిల్లులు ఏడుపు…..”
******************
“నా హృదయ గజల్ ఇది
పానపాత్ర నా హృదయ కుంపటిమీద
సాకీ పెదవుల తీపిలో నా హృదయబన్ను..
నా మోచేతిమీద చిలుకకోక
ఓ హుళక్కీ…ఇదిగో ఇక్కడ ఈరాత్రి
నీ ఎదకవాటం తెరిచి ఉంచు”
*********************
“ఆధునిక కళాజీవిలో తడి లేదు!అదో ఎండిన నుయ్యి…గతతార్కిక మానసిక వాదంలోంచి డార్విన్ తొంగిచూస్తున్న అధివాస్తవిక జడచేతనలోని భిన్నధ్రువ కాంతిపుంజం ఈ రచనలో నాకు దృగ్గోచరచరాచర రసవంతం…రచయితకు నా అభినందన అరటిపూ ప్రదానం”
************************
అయ్యా!
ఇదీ వరస!ఇదీ మా మహా క్రియేటివ్హుళక్కి వీర విజృంభణ సాహిత్య కార్ఖానా!
చదివిన దాన్ని, నే పడుతున్న భూలోక నరక బాధనీ..తట్టుకోలేక..తలని ఫ్రీజ్లో దాచేసుకునేలా ఉన్న మీకు పారాహుషారని …ఇందుమూలంగా చాటేస్తూ..
ఇప్పటికిలా ఇంత చేటభారతాన్ని మీమీదకు వదిలాననేసేసి కూచింత నా ముఖాన్ని చాటేసేస్తూ….
“అపరాధ సహస్రాణి….!!!”
****************************************
గమనిక : ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.
పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023
****************************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి