10_005 ఆనందవిహారి

చెన్నై లో ‘ మనకు తెలియని మన మహాత్ముడు ‘

జాతిపిత మహాత్మా గాంధీ గురించి మనం తెలుసుకొని స్ఫూర్తి పొందాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని, వాటిలో మనకి తెలియనివి ఇంకా ఉన్నాయని డా. నాగసూరి వేణుగోపాల్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ఏటా  గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాన్ని ఈసారి యూట్యూబ్ ద్వారా ప్రసారం చేసింది. అక్టోబర్ 2వ తేదీ శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆకాశవాణిలో ఉన్నతోద్యోగి, పాత్రికేయులు, మీడియా విశ్లేషకులు, రచయిత అయిన నాగసూరి “మనకు తెలియని మన మహాత్ముడు” అంశంపై ప్రసంగించారు. 

 గాంధీజీ గురించి మనం చిన్నప్పటి నుంచే చదువుకుంటాం కాబట్టి ఆయన గురించి మనకంతా తెలుసని అనుకుంటామని, అయితే ఆ మహాత్ముడి జీవితంలో మనకి తెలియనివి ఎన్నో విశేషాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన 1925లో తన ఆత్మకథ రాశారని, అయినా ఇప్పటికీ, ముఖ్యంగా తమిళం, మలయాళ భాషల్లో ఆ పుస్తకం లక్ష కాపీలకు పైగా అమ్ముడుపోతోందని వెల్లడించారు. గాంధీజీ గురించిన వ్యాసాలు, పుస్తకాలు, డాక్యుమెంటరీలు లాంటివి మనదేశంలో కంటే ఇతర దేశాల్లో ఎక్కువ వచ్చాయని తెలిపారు. 

ఆయన గురించి తెలుసుకొంటున్న కొద్దీ ఆశ్చర్యం కలుగుతుందని అన్నారు. ఆయన రోజూ సుమారు ఇరవై కిలోమీటర్లు నడిచేవారని, అవసరమైనప్పుడు నలభై కిలోమీటర్లు నడిచిన సందర్భాలు, క్షతగాత్రులను మోస్తూ నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనకి మానసిక బలంతో పాటు దేహ దారుఢ్యం కూడా బాగా ఉండేదన్నారు. 

సత్యాగ్రహం అన్న మాటని సత్యం, ఆగ్రహం అని అర్థం చేసుకోకూడదని, సత్యాన్ని గ్రహించడమే సత్యాగ్రహం అని వివరించారు. ఆగ్రహానికి, గాంధీజీకి మధ్య చాలా దూరం ఉందన్నారు. 

సత్యాన్ని గ్రహించినవాళ్ళు సమాజం పట్ల ప్రేమతో, అహింసతో వ్యవహరిస్తారని ఆయన ప్రగాఢంగా నమ్మారని చెప్పారు. ఎదుటివాళ్ళకి కష్టాల నుంచి విముక్తి కలిగిస్తే అదే మన ముక్తికి మార్గం అవుతుందని విశ్వసించారని అన్నారు. ఇందుకు ఉదాహరణగా గాంధీజీ ఆఫ్రికాలో ఉండగా జరిగిన ఒక సంఘటనని వివరించారు.

అను బందోపాధ్యాయ “బహురూపీ గాంధీ” పేరిట గాందీజీ గురించి రాసిన పుస్తకంలో… గాందీజీ 27 రకాల పనులు పూర్తి నైపుణ్యంతో చేయగలిగేవారని రాశారని వెల్లడించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన జవహర్లలాల్ నెహ్రూ… ఏ పనైనా పైపైన కాకుండా కూలంకషంగా చేయడమే గాంధీజీ నైజమని కొనియాడారు. పిల్లలు దీన్నుంచి స్ఫూర్తి పొందగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా, మల్టీ టాస్కింగ్ అనేది గాంధీజీ రక్తంలోనే ఉందని అన్నారు.

పీసీ రే, జగదీష్ చంద్రబోస్ తమ తమ రంగాల్లో పరిశోధన చేసిన స్థాయిలో దేశవాళీ రంగాల్లో, నేత, రాట్నం, జౌళి గురించి పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేవారన్నారు. 1921లో రాట్నాన్ని మెరుగుపరచడంలో ప్రపంచ స్థాయి పోటీ ప్రారంభించారని, గెలిచిన వారికి అందజేసే మొత్తాన్ని ₹5 వేలతో మొదలుపెట్టి 1929 నాటికి దాన్ని ₹లక్ష చేశారని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఆయనకి ఆ పరిశోధన ఎంత ముఖ్యమని ఆయన భావించారో తెలుస్తుందన్నారు. 

గాంధీజీని మహాత్ముడనో దేవుడనో అనుకోకుండా మనకన్నా ఎన్నోరకాలుగా మెరుగైన వ్యక్తిగా భావిస్తే, ఆయన నుంచి స్ఫూర్తి పొంది మనల్ని మనం మెరుగుపరచుకోగలమని నాగసూరి సూచించారు. 

డా. కాళ్ళకూరి శైలజ వీక్షకులను కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఆమె వక్తను పరిచయం చేస్తూ.. 

ఏ విషయాన్నైనా కూలంకషంగా పరిశీలించి రాయడం, ఆకాశవాణి కోసం ఎన్నో ప్రయోగాత్మకమైన కార్యక్రమాలు రూపొందించడం నాగసూరి ప్రత్యేకత అని ప్రశంసించారు.

మహాత్ముడికి నివాళిగా యువ గాయనీమణి రిథి ‘వైష్ణవ జనతో… ‘, ఆమె తమ్ముడు మిహిర్ ‘రఘుపతి రాఘవ రాజారాం’ గీతాలను చక్కగా ఆలపించారు. 

*************************************

ఈ కార్యక్రమ వీడియో –