11_006 – మా ఈజిప్ట్ పర్యటన

               

                 వెనకటి తరం ప్రముఖ తెలుగు రచయిత్రి వాణీ మోహన్ కన్నుమూత

 

చెన్నై నగరానికి చెందిన ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్ (81) శుక్రవారం ( నవంబర్ 12వ తేదీ ) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల చలి జ్వరం బారిన పడిన ఆమె రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవడంతో స్వగృహంలోనే మృతి చెందినట్లు ఆమె కుటుంబ స్నేహితులు తెలియజేశారు.

 

భర్త వఠ్యం మోహన్ రైల్వే ఉన్నతాధికారిగా ఉత్తరాది రాష్ట్రాలలో, ఆఫ్రికాలో విధులు నిర్వహించేవారు. అందువల్ల తాము ఉండిన ప్రతి ప్రాంతంలో కూడా అక్కడి తెలుగువారిని కలుపుకొని అనేక తెలుగు కార్యక్రమాలను ముందుండి నిర్వహించేవారు వాణీ మోహన్. పిల్లలకి తెలుగు నేర్పి వారిచేత సాంస్కృతిక కార్యక్రమాలు చేయించేవారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, వింతలూ విశేషాలను భర్తతో కలిసి గ్రంథస్థం చేశారు.

 

చెన్నై వచ్చి స్థిరపడిన తరువాత మాలతీ చందూర్ స్ఫూర్తితో, ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో రచయితగా ఎదిగిన వాణీ మోహన్ రాసిన అనేక కథలు, కవితలు ప్రముఖ పత్రికలలో అచ్చయ్యాయి, ఆకాశవాణి చెన్నై కేంద్రంలో ప్రసారమయ్యాయి. కొన్ని కథల పోటీలలో పాల్గొని బహుమతులు కూడా అందుకున్నారు వాణీ మోహన్. అంతేకాకుండా, దేశంలోని, విదేశాల్లోని రచయిత్రులతో కలిసి కథల పుస్తకాలను, ఒక గొలుసు నవలను, సొంతంగా “చిగురులు” అనే నవలను వెలువరించారు.  ఆకాశవాణి చెన్నై కేంద్రంలో కొన్ని దశాబ్దాలపాటు అనేక అంశాలపై ప్రసంగించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనానికి సంబంధించిన సొసైటీ సభ్యురాలిగా… ఆ భవనాన్ని నిర్మింపజేసిన వై ఎస్ శాస్త్రి గారు ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాలలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు.

 

లయన్స్ క్లబ్ నిర్వహించే అనేక సేవా కార్యక్రమాలలో ఆమె చురుగ్గా పాల్గొనేవారు. రైల్వే ఉన్నతోద్యోగులకు చెందిన స్టెర్లింగ్ రోడ్డులోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్ కార్యక్రమాలలో కూడా మోహన్ దంపతులు ఉత్సాహంగా పాల్గొనేవారు. పదేళ్ళ కిందట మోహన్ అనారోగ్యంతో కన్నుమూయగా, వాణీ మోహన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు.

 

స్థానిక తెలుగు ప్రముఖులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, బంధుమిత్రులు వాణీ మోహన్ మృతదేహాన్ని ఆమె స్వగృహంలో సందర్శించి నివాళులు అర్పించారు. స్థానికంగా ఆటో నడిపే కొందరు చోదకులు ఆమెతో తమకుండిన పరిచయాన్ని పురస్కరించుకొని ఆమె భౌతికకాయానికి పూలమాలలు సమర్పించారు.

 

చివరిదాకా రాస్తూనే….

 

      చెన్నైలో చివరి రోజుల్లో కూడా తెలుగువారి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వాణీ మోహన్… దేశవిదేశాల్లో తను నిర్వహించిన కార్యక్రమాల జ్ఞాపకాలను శిరాకదంబంతో పంచుకోవాలని ఆశపడ్డారు, కొన్నింటిని  పంచుకున్నారు కూడా. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ పరంపర మరింత కాలం సాగాలని వయసును, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతో ఉత్సాహంగా వ్యాసాలు రాస్తూ వాటికి తగిన ఫోటోలను పంపుతూ వచ్చారు. ఈ వ్యాస పరంపర కొనసాగకుండా అడ్డుకున్న ఆమె హఠాన్మరణం పట్ల శిరాకదంబం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.

 

                                                                                          – గుడిమెళ్ళ మాధురి

 

వాణీమోహన్ గారి చివరి రచన ఈ క్రింద……

                

                                      మా ఈజిప్ట్ పర్యటన

 

చెన్నై నుంచి శ్రీ రామన్ ఆధ్వర్యంలో మద్రాస్ లిటరరీ సొసైటి ( MLC ) సభ్యులు 2007 డిసెంబర్ లో పదిరోజులు ఈజిప్ట్ పర్యటన చేయాలనుకుని బయిలుదేరాము. మాలో ఒకరికి కాలు బెణికి కట్టు, మరొకరికి చెయ్యి భుజం నెప్పి. అందరూ 60 సంవత్సరాలు పైబడిన వారే మరి. ఏవో చిన్న చికాకులున్నా అధిగమించి స్నేహపూర్వకంగా బయిలుదేరి అనుకున్నవి చూసాము.

 

ఈజిప్ట్ దేశం ఒక మిలియన్ స్క్వేర్ మీటర్ల భూభాగంలో విస్తరించి ఉంది. ఆ రోజుల్లో జనాభా ఎనభై మిలియన్లు. ఇందులో ఇరవై మిలియన్లు ‘ కైరో ‘ లో నివసించేవారు. ఈదేశం టూరిజం ద్వారా వచ్చే ఆదాయంతో వర్తిల్లుతోంది. చాలామంది ఇస్లాం మతస్తులు.

 

ఈజిప్ట్ నైలు నది కిరువైపులా విస్తరించి ఉండి తమ నాగరికత విస్తరింప జేసుకుంది. నైలు నది డెల్టా గా వ్యవహరించేది ఈజిప్ట్ పై భాగం, క్రింద భాగంతో కలిపి మొదటి ‘ షారో ’ ల పాలనాకాలం 3100 BC.  నామర్ పేరు కలిగి ఉండి. అప్పటి నుంచి షారో ల పాలన, ఈజిప్ట్ చరిత్ర మొదలయి 3000 BC వరకు 30 వంశీయుల పాలన అలెగ్జాండర్ వచ్చేవరకు అంటే ( 322 – 300 ) సాగింది. చివరగా బ్రిటిష్ వారి పరిపాలన క్రిందకు వచ్చింది. ఇది చరిత్ర. ప్రస్తుత రిపబ్లికన్ గవర్నమెంట్ 1952 నుంచి పాలన సాగిస్తోంది.

 

మనకి గంగానది చుట్టూ అద్భుతమైన చరిత్ర ఉన్నట్లే వీరికి ‘ నైలు ‘ నది చుట్టూ నాగరికత పరుచుకుంది.

 

వీరు సాధించుకున్న ప్రగతి ఆ రోజులలోనే…..

    1. మొట్టమొదటి చేతి వ్రాత
    2. పాపరాన్ పార్చిమెంట్ ( పాపిరిస్ ) – మొక్కల ద్వారా తయారుచేసిన కాగితం. అప్పటి వ్రాత ప్రతులన్నీ భద్రపరచగలిగారు.
    3. మొట్టమొదటి స్మారక చిహ్నం ( Monument )
    4. అతి చౌకగా విద్యుత్తు తయారుచేయగలగడం – ఆశ్వాన్ డ్యామ్

మన దేశంలో డా. కె. ఎల్. రావు గారు సెంట్రల్ వాటర్, పవర్ కమిషన్ లో పనిచేసిన ఆరోజుల్లో ఆ డ్యామ్ చూడాలనేది ప్రతి ఇంజినీర్ కల. అందులో శ్రీ మోహన్ ఒకరు. చాలా సంప్రదింపులు, చర్చలు, ఇ మెయిల్స్ తర్వాత చెన్నై నుంచి బయిలుదేరి కువైట్ మీదుగా మొదట లక్సర్ చేరాము. అధికంగా సందర్శకులు వచ్చే పాత నగరం థేబ్స్. ఆనాడే ఇక్కడ వున్న ఓపెన్ ఎయిర్ మ్యూజియం, లక్సర్ మందిరం, కర్నాక్ మందిరం, ఇంకా ‘ వాలీ ఆఫ్ కింగ్స్ ” ముఖ్యమైనవి.

 

చాలామంది ఫారో రాజులు, రాజ వంశాల ఖననం 18వ, 20వ శతాబ్దాలలో ఇక్కడే జరిగింది. 18 సంవత్సరాల వయసు కలిగిన టూటంక మున్ ( 1336 – 37 BC) మమ్మీ ఈ మధ్యనే కనుగొన్నారు. ప్రదర్శనలో పెట్టారు. ఇక్కడ 62 గోరీలు ఉన్నాయి. 1922 లో కనుగొన్న ఈ ‘ సమాధుల సమాహారం ’…. అవును… ఈ పేరు నేనే పెట్టాను.

 

ఈ విశాల మైదానంలో క్రింద భూగర్భంలోకి కూడా గదులున్నాయి. వీరు మరణం తర్వాత జీవితం ఉందని నమ్మేవారు. అందువలన చనిపోయిన తరువాత ఆ శరీరాన్ని అనేకరకమైన ద్రవ్యాలతో కడిగి, కట్టి భద్రపరచేవారు. దీని ‘ మమ్మీ పైయింగ్  ’ అంటారు. ఇక్కడ పనిచేసినవారి కళ్ళకు గంతలు కట్టేవారట. చనిపోయిన వ్యక్తి తాలూకు ధనం, బంగారం కూడా పాతిపెట్టేవారు. ఈ ధనం కోసం ఎన్నో దొంగతనాలు జరిగేవి అని చరిత్ర చెబుతోంది. ఇక్కడ అద్భుతమైన దృశ్య శ్రవణ ( Light and sound ) ప్రదర్శన చూసాము. నైలు లోయలో కనిపించే పక్షులు కూడా ఒక వింతే !

 

ఆశ్వాన్ :

దక్షిణాన ఉన్న పట్టణం. ఇది కొత్త నగరం. మేము రోడ్ ప్రయాణం చేసి ( లక్సర్ నుంచి ) 200 కిలోమీటర్లు ప్రయాణించి ఆశ్వాన్ చేరాము. నైలునది ప్రవాహం మొదలయి మెడిటీరేనియన్ సముద్రం వరకు సాగుతుంది.

 

‘ ఆశ్వాన్ హై డ్యామ్ ’ ఒక ఆధునిక అద్భుతం. ఈ డ్యామ్ వరదల నివారణ, చావకగా విద్యుత్తు ( ఈజిప్ట్ ) కి ప్రక్కనే ఉంది. ఈ హైడ్యామ్ అప్పటి వారి అధ్యక్షుడు నాజర్ 1971 లో సోవియెట్ సహాయంతో కట్టి ప్రసిద్ధి గాంచారు.

 

ఆ తరువాత మేము ISIS మందిరం కి చేరాము. ఇక్కడ వారి దేవత గురించి ‘ మ్యాజిక్, లైట్ అండ్ సౌండ్ షో ’ చూసాము. ఆ తరువాత ఎడ్ఫు ఆలయం, కొమోంబో ఆలయం ఇంకా ప్రఖ్యాత ఫలీ ఆలయం చూసాము.

ఎడ్ఫు మందిరంలో హోరుస్ – ఫాల్కన్ దేముదిని చూసాము. సూర్యచంద్రులు కన్నులుగా గల దేముడు. సూర్యచంద్రులు కన్నులుగా గల ఈ మందిరం 237 – 200 BC ల మధ్య నిర్మించబడింది. ఈ కట్టడం గ్రీకో, రోమన్ లకి పేరు తెచ్చిన స్మారకమందిరం.

 

కొమోంబో మందిరం ఎన్నో సంవత్సరాలు ఇసుకతో కప్పబడి ఉంది. ఈ ఆలయాలలో మొసలి ఆకారంతో వారి దేవతలు చెక్కబడి ఉన్నాయి. ఇవి హరోసిస్, సోబెక్ మొదలైన హౌరస్ లవే. ఆశ్వాన్ లో రెండు గ్రానైట్ క్వారీలున్నాయి. ఈ కట్టడాలని ఆ ఎడారి ప్రాంతంలో లభించిన గ్రానైట్ తో కట్టారు. ఏ రకమైన పనిముట్లు వాడకుండా చేతులతో చెక్కరు. అవి ఇసుకలోనే గొయ్యి తవ్వి చెక్కి, తాళ్ళతో పైకి లేపి నిలబెట్టరని తెలుసుకున్నాము.

 

నైలునది పొడవునా వ్యాపారం జోరుగా సాగేది. ప్రస్తుతం ఈ ప్రదేశాలన్నీ విహారయాత్రికుల కోసమే. నైలునదిలో ఫెలుక్కా అనే చిన్న పడవలో విహారం ఎంతో ఆహ్లాదకరమైన అనుభవం.

 

అబు సింబెల్ :

ఆశ్వాన్ నుంచి 40 కిలోమీటర్ల దూరం. ఇక్కడికి మేము విమానంలో చేరాము. ఇక్కడ 1274 బి‌..సి. లో ఫారో రామ్సేస్ 2 నిర్మిండిన స్మారక మందిరం ఉంది. రామ్సేస్ 3 కాలంలో తిరిగి నిర్మించారట. ఇది సూర్యభగవానునికి అంకితం అయింది.

 

రెండవ మందిరం ‘ గాడెస్ ఆఫ్ లవ్ ’. అతని భార్య నేఫర్ టీటీ కి అంకితం చేయబడింది. ఈ ఆలయాలు ఆశ్వాన్ హై డ్యామ్ కట్టడం వలన మునిగిపోవచ్చని ఈజిప్ట్ ప్రభుత్వం యునెస్కో సహాయం తీసుకుని కాపాడుకోగలిగింది. జాతి చరిత్ర, సంస్కృతి ఆవిధంగా కాపాడుకున్నారు. ఆ రాత్రి ఆశ్వాన్ నుంచి కైరో కి అబెల్ ఎక్స్‌ప్రెస్ లో వెల్లము. పూర్తి ఎయిర్ కండిషన్దు కోచ్ లుండి డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ రైలు లోనే ఇచ్చే ఏర్పాటు ఆ రోజుల్లోనే ఉంది.

 

కైరో :

మరుసటి రోజు ఉదయం కైరో చేరాము. కస్ర్ ఎల్ నీల్ బ్రిడ్జ్, పెద్ద ఎత్తైన సింహాలు గలది మనని జెండాలతో ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆధునికంగా కొద్ది భవనాలు ఉన్నా పాత నగరం పార్కులతో నిండి ఉంది.

 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏడు అద్భుతాలలో ఒకటైన అధ్బుత పిరమిడ్ గిజా చేరాము. పొడవుగా మరో రెండు చిన్న పిరమిడ్లు, సింహిక ( Sphinx ) ఉన్నవి. ఇవి నిజంగా ఎలా కట్టారా అన్న విభ్రమ కలుగుతుంది. నేడు వాడుకలో గల యంత్రాలు అవీ లేని రోజుల్లో 156 మీటర్ల ఎత్తు, 2.10 మిలియన్ల రాళ్ళతో నిర్మించబడింది. కనుకనే ప్రపంచంలోని వింతలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది.

 

మరునాడు కైరో మ్యూజియం. 1,25,000 భాగాలు గల చరిత్ర ప్రదర్శనాశాల 1901 లో నిర్మించారు. 5000 బంగారు నగలు ఫారోస్ వి ప్రదర్శనకు పెట్టారు. ఇంకా సమాధుల అడుగున చాలా నగలు భద్రపరచబడి ఉన్నవి అన్నారు.

 

ముఖద్వారం మీద “ గడిచిన 100 సంవత్సరాల ఈజిప్ట్ ” అని చెక్కబడి ఉంది. ఈ ప్రదర్శనలో వారి ప్రతిభా, విజ్ఞానం చూస్తూ వీటి మధ్య నడవగలగడం ఆశ్చర్యం, అధ్బుతం అనిపిస్తుంది.

 

ఆ తరువాత వీరి పాత రాజధాని మెంఫిస్ మరియు సక్కర లోని స్మారకమందిరాలు చూసాము.

 

 

కొప్టిక్  చర్చ్, హంగింగ్ చర్చ్ చూసాము. ఖల్లేలి బజారుతో షాపింగ్, పర్ఫ్యూమ్ బజారు తిరిగాము. రాత్రి 3 గంటలకు క్రూయిస్ నైలు నదిలో Scarable అనే లగ్జరీ బోటులో ‘ పాట, ఆట ‘, దాన్ని ఫ్లోర్ షో అన్నారు. చూసాము. అక్కడే బెల్లీ డాన్స్ చూసాము. డ్రింక్స్, డిన్నర్ సరేసరి !!

 

అలెక్సాండ్రియా :

మరునాడు ఉదయం 225 కిలోమీటర్ల డ్రైవ్. అలెక్స్ ఒక పోర్ట్. అలెగ్జాండ్రియా 331 లో నిర్మించిన విశాల నగరం. తదుపరి గ్రేకో రోమన్ ఈజిప్ట్ కి ముఖ్యపట్టణం.

 

‘ లైబ్రరి ఆఫ్ అలెక్సాండ్రియా ’ ప్రతీ ఈజిప్ట్ వాసి. ఇది విజ్ఞాన భండాగారంగా విలసిల్లేది. ప్రపంచ ప్రఖ్యాతి గన్న లైబ్రరి ఈజిప్ట్ ప్రభుతావమ్ ఆధునికంగా 2002 లో ఆరు సంవత్సరాల శ్రమ తదనంతరం పూర్తి చేయగలిగారు. యూ‌ఎన్, యూ‌ఎస్‌ఏ ల సహాయంతో 11 అంతస్తులు, 555000 పుస్తకాలు, వాటిని ప్రింట్ చేసుకునే వీలు, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పరిచారు. అయిదు వేల పుస్తకాలతో ఏడు పరిశోధనాలయాలు ఉన్నాయి. ఇక్కడ భవనం పైభాగం నుంచి వెలుతురు ప్రసరిస్తుంది. పగటిపూట ఏ విధమైన లైట్లు అవసరం లేదు. అక్కడ కూర్చుని చదువుకునే వారిని చూసి ఆనందం కలిగింది. అధునాతనమైన పుస్తక భండాగారం మనిషి సృష్టించిన ఒక అద్భుతం. ఆ విజ్ఞానం, సమర్థత కొనియాడతగినది.

 

ఆఖరుగా అందరం సిటాడేల్ ఆఫ్ కైరో అనే పెద్ద కోట, సమాధి 1173-83 ల మధ్య నిర్మించినది చూసాము. ఆ మసీదు లోపలంతట పలకల గాజుతో చెక్కబడి ఉన్నది. ఆ రోజుల్లోని కట్టడమే మరి.

 

రెండు సంవత్సరాలుగా అన్ని రకాల ప్రయాణాలు ఆగిపోయాయి. ప్రపంచం అంతా నుకొని ఉపద్రవల పాలబడి జబ్బులతో అతలాకుతలం అయింది. కానీ ప్రస్తుతం అన్ని దారులు తెరుచుకుని అవాంతరాలని అధిగమించుతున్నారు. తిరిగి విదేశీ ప్రయాణాలు, దేశీ ప్రయాణాలు మొదలయిన శుభ సమయం వచ్చింది. ఈజిప్ట్ లాంటి చారిత్రిక స్థలాలు చూసే వీలు కలుగుతుందని రాబోయే తరాలు ఆనందించగలవని ఆశపడుతున్నాను.