రుచి, శుచి, ఆరోగ్యాల సమ్మేళనం తెలుగువారి భోజనం
అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. మనం తినే అన్నమే బ్రహ్మ స్వరూపం, దాని ద్వారానే మనకు ప్రాణం ఉంటుంది.
అందుకే మన తెలుగు ఇళ్ళలో వంట చేస్తున్నప్పుడు ఆ అన్నపూర్ణ దేవిని స్మరిస్తూ, వారికి వచ్చిన భాగవత, రామాయణం లాంటి పురాణ పద్యాలు చదువుతూనో, లలిత సహస్రనామాలు చదువుతూనో వంట చేసేవారు. అలా చేస్తే ఆ వంట రుచిగా పవిత్రంగా తయారవుతుంది. అది భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తినడం వల్ల మనకు బలం చేకూరి ఆరోగ్యంగా ఉంటాము. అందుకే పంచకోశాలలో అన్నమయ కోశం ముందుగా చెప్పబడింది. చక్కటి భోజనం ఆహారంగా తీసుకుంటే ఓజస్సు కలుగుతుంది.
మనం తినడం కోసం పుట్టకపోయినా పుట్టినందుకు తినాలి. ఆ తినే ఆహారపదార్థాలు శుచిగా, రుచిగా, ఆరోగ్యవంతమైనవిగా ఉండాలి. మన పూర్వీకులు ఆరోగ్యంగా ఉండటానికి వారి ఆహారపు అలవాట్లు కారణం అని తప్పక చెప్పాలి.
ఒక అన్నమయ్య కీర్తనలో, స్వామికి భక్తితో పెట్టె నైవేద్యాల గురించి ఉంటుంది.
.
ఇందిర వడ్డించగ నింపుగను
చిందక ఇట్లే భుజించవో స్వామి
.
అక్కాళపాశాలు అప్పాలు వడలు
పెక్కయిన సయిదంపు పేణులును
సక్కెర రాసులు సద్యో ఘృతములు
కిక్కిరియగా నారగించవో స్వామి
.
దాలింపు గూరలు కమ్మని కూరలును
సారంపు బచ్చళ్ళు చవులుగా నిట్టే
కూరిమితో జేకొనవో స్వామి
.
పిండివంటలును పెరుగులు
మెండైన పాశాలు మెచ్చి మెచ్చి
కొండల పొడవు కోరి దివ్యాన్నాలు
వెండియు మెచ్చవే వెంకట స్వామి
.
.
అంటూ అన్నమయ్య ఆ శ్రీనివాసునికి పద్మావతీ అమ్మవారు ప్రేమగా తినిపించే ఆహార పదార్థాల పట్టిక తెలిపి ఆ శ్రీనివాసున్ని ఒక్కటి కూడా వదలకుండా తినాలి అని కోరుతున్నాడు ఈ పాటలో.
మరి ఇందులో శ్రీనివాసుడికి పెట్టిన ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
.
నేతి పాయసం, గారెలు, బూరెలు, గోధుమ సేమ్యా పదార్థాలు, చక్కెర తో తాజాగా చేసిన నేతి వంటలు, చక్కటి కూరలు, రుచి రుచిగా పచ్చళ్ళు, పెరుగుతో చేసిన రకరకాల వంటలు, అనేక పిండివంటలు, రకరకాల పులిహోరలు ఇలాంటి అద్భుతమైన ఆరోగ్యమైన రుచికరమైన వంటలు శ్రీనివాసునికి ఆ అమ్మవారు కొసరి కొసరి వడ్డించిన దృశ్యాన్ని ఆ అన్నమయ్య చూస్తూ, స్వామీ నోరూరే ఈ రుచికరమైన వంటలను అనుభవిస్తూ తినవయ్య అని చక్కటి పాట రాసారు.
ఇప్పుడు చెప్పిన పదార్థాలతో ఒకటి కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలు, మసాలాలు, కారేట్టు నూనెతో పదార్థాలు ఒక్కటి కూడా లేవు మనం గమనించవచ్చు.
ఈ సంప్రదాయ వంటలన్నింటిలోను ప్రతి మనిషి ఆరోగ్యానికి కావాల్సిన ప్రోటీన్లు, ఐరన్, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు మొదలైన పోషకాలు లభించేవి అన్నీ ఉంటాయి.
మన పూర్వం పెద్దవారు ఎవరింటికైనా భోజనానికి వెళ్ళి వచ్చాక వారు పంచభక్ష్యపరమాన్నాలు పెట్టారు కడుపు నిండిపోయింది అనేవారు కదా.
- గారెలు, బూరెలు, అప్పాల లాంటి కొరికి తినే పదార్థాలు
- పులిహోరలు, దద్ద్యోజనం లాంటి అన్నంతో చేసే పదార్థాలు. ఇవి నమిలి తినేవి.
- పాయసం, దప్పలం, చారు లాంటి ద్రవ పదార్థాలు. ఇవి జుర్రుకుంటూ తినాల్సినవి.
- తేనె, బెల్లం, పాకం, లేహ్యం లాంటి నాకుతూ తినే పదార్థాలు.
- నీళ్ళు, పాలు, పళ్ళ రసం, కాషాయం లాంటి తాగే పదార్థాలు.
.
ఇలా తెలుగింటి సాంప్రదాయ వంటలు సంపూర్ణమైన వంటలు అని చెప్పవచ్చు. తెలుగు వారి భోజనంలో పప్పు, కూర, రోటిపచ్చళ్ళు, ఊరగాయలు, పొడులు,చారు, ముక్కలపులుసు, పులిహోరలు, ఊరమిరపకాయలు, గుమ్మడి వడియాలు, మినప వడియాలు రకరకాల అప్పడాలు, పాయసం, భక్ష్యాలు (బొబ్బట్లు), పూర్ణాలు మొదలైనవి కమ్మటి కాచిన నెయ్యితోనో, ఇంగువపోపు నూనెతోనో తినడం ఆంధ్రుల రుచికరమైన, ఆరోగ్యకరమైన అలవాట్లు.
.
శ్రీకృష్ణదేవరాయలు వారి ఆముక్తమాల్యద లో ఆ కాలంలోని భోజనపదార్థాల గురించి, అతిథులను ఆహ్వానించి ఎలా భోజనం పెడతారో అనే విషయాల గురించి ఎంతో విపులంగా రాసారు.
పోతన, తెనాలి రామకృష్ణ లాంటి వారు కూడా ఆంధ్రుల వంటల గురించి రాసారు.
భోజనం అతిథులకు వడ్డించడం కూడా ఒక గొప్ప కళ. గృహస్తు అతిథులు భోజనం చేసాకే చేయడం కూడా తెలుగు వారి సాంప్రదాయం లో భాగమే.
మొదట ఏది వడ్డించాలి, చివర ఏది వడ్డించాలి అనేది కూడా ముఖ్యం. అలాగే తినే వారు కూడా మొదట ఏది కలుపుకోవాలో అనేది కూడా అంతే ముఖ్యం.
రకరకాల పదార్థాలు రుచి రుచిగా చేస్తే హడావిడిగా తినకూడదు. తినే ప్రతి పదార్ధాన్ని నమిలి చక్కగా అనుభవిస్తూ తినాలి. అప్పుడే అది జీర్ణం అయి మనకు బలాన్ని ఇస్తుంది. తినే పదార్ధాలే ఆరోగ్యాన్ని అతిగా తింటే ఆ పదార్థాలే అనారోగ్యాన్ని ఇస్తాయి. చక్కటి షడ్రశోపేతమైన భోజనం ఓజస్సు ని ఇచ్చి పరిపూర్ణ ఆరోగ్యం కలిగిస్తుంది.
వండడం ఒక గొప్ప కళ, అయితే వడ్డించడం, తినడం కూడా మహత్కళ అనిపిస్తుంది నాకు.
ప్రస్తుత కాలంలో ఈ ఆహార అలవాట్ల మార్పుల వల్లనే అనేక జబ్బులు వస్తున్నాయి.
వేళ కానీ వేళ రుచి శుచి లేని పదార్థాలు, విదేశీ వంటలు వ్యామోహంగా తినడం అనారోగ్యానికి చేటు కలిగిస్తుంది.
చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు కదా.
అందుకే ఇకనైనా కవులు రాసినట్టు మన పెద్దలు పాటించి చేసిన రుచి, శుచి తో చేసిన ఆరోగ్యకరమైన తెలుగింటి సాంప్రదాయ వంటలు చేసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకొని ఓజస్సు పొంది తేజస్సుతో ఆరోగ్యంగా వుందాము.
.
.
****************************************
.
— Lellapalli SrideviRamesh
Chennai
Mobile : 9445360139, Email : faces108@gmail.com, Website : http://www.faces108.com
.
___________________________________________________
ఈ రచన పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న comment box లో వ్రాయండి.
___________________________________________________
శ్రీదేవి గారు , మీరు వ్రాసిన “తెలుగు భోజనం” చదువుతుంటే కడుపు నిండిపోయింది! చాలా బావుంది !
ధన్యవాదాలు శ్యామల గారు మీ సుస్పందనకు
Very good account of Telugu food. Nice work.