13_006

ప్రస్తావన

అప్పుడప్పుడు కొంతమంది కారణజన్ములు పుడుతుంటారు. వారి పుట్టుకకు కారణమైన పనులు నిశ్శబ్దంగా చేసి అంతే నిశ్శబ్దంగా నిష్క్రమిస్తూ ఉంటారు. 2024వ సంవత్సరం ప్రవేశిస్తూనే ఇద్దరు మిత్రులను వరుసగా తీసుకొని వెళ్లిపోయింది. ఇద్దరికీ ‘ శిరాకదంబం ’ తో ఎంతో అనుబంధం ఉండడం కాకతాళీయం కావచ్చు. కానీ వారు లేని లోటు తీర్చలేనిది.

 

మొదటగా మహాకవి దాశరథి గారి మేనకోడలు, రచయిత్రి, పాత్రికేయురాలు, ‘శిరాకదంబం’ ఆవిర్భావంలో ప్రముఖ పాత్ర వహించిన దుర్గ డింగరి భర్త శ్రీనివాస్ అకాల మరణం. ఎంతో కాలంగా అనారోగ్యంతో ఉన్న దుర్గ ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, గాజు బొమ్మలా చూసుకుంటూ వచ్చిన శ్రీనివాస్ అదే మహమ్మారి కాన్సర్ బారిన పడి, చికిత్స గురించి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా జనవరి 8వ తేదీన వెళ్లిపోవడం అత్యంత విషాదకరం. ఆయనకు శిరాకదంబం నివాళులు ఆర్పిస్తూ… దుర్గ కు, పిల్లలకి మనోధైర్యాన్ని అందించవలసినదిగా ప్రార్థిస్తూ….

 

తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి, ప్రాణత్యాగం చేసి సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ‘ అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ’ కి కార్యదర్శి గా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చిన శ్రీ యర్రమిల్లి రామకృష్ణ గారు ఫిబ్రవరి 1వ తేదీన స్వర్గస్తులయ్యారు. కళలను, సాహిత్యాన్ని పోషిస్తూ ఎన్నో సంవత్సరాలుగా ప్రతి నెలా ‘ నెల నెలా వెన్నెల ’ అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. 2020 లో కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యక్ష సభా కార్యక్రమాలు నిలిచిపోయినా, అంతర్జాలంలో క్రమం తప్పకుండా నిర్వహించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. ఆ కార్యక్రమాలకు సాంకేతికంగా సహకరించే అవకాశం ఇవ్వడంతో ‘ శిరాకదంబం ’ తో వారి అనుబంధం బలపడింది. ఇప్పటికి 44 నెలలుగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా, విజయవంతంగా నడుస్తోంది. ఎంతోమంది సాహిత్యకారులు, కళాకారులు పాల్గొంటున్న ఆ కార్యక్రమం వైవిధ్యభరితంగా ఉండి దేశ విదేశాలలోని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయికి సమితి కార్యక్రమాల్ని తీసుకెళ్లారు రామకృష్ణ గారు. దేశ, విదేశాలనుండి అనేక ప్రశంసలు అందుకొన్నారు. అమరజీవి స్మారక సమితి తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు రామకృష్ణ గారు.

శ్రీ యర్రమిల్లి రామకృష్ణ గారు 2001 సం.లో దక్షిణ ఆఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చి, 2004లో వారి తండ్రి గారు శ్రీ వై.యస్.శాస్త్రిగారి మరణానంతరం ఆయన చివరి కోరికమేరకు “పొట్టి శ్రీరాములు మెమోరియల్ సొసైటీ” మరియు స్మారక భవనం బాధ్యతలు తీసుకున్నారు. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి తన చివరి ఊపిరి వరకూ సేవలందించిన ధర్మనిరతుడు మన ఈ కలియుగ రాముడు. మధ్యలో కొన్ని కారణాల వల్ల 2017లో స్మారక భవనం బాధ్యతల నుండి వైదొలగారు. తెలుగు భాష, సంస్కృతిల పరిరక్షణకు, అమరజీవి పొట్టి శ్రీరాములు సేవ కోసం, తండ్రిని మించిన సేవలు చేసారనడంలో అతిశయోక్తి లేదు.

ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా భారత దేశం విదేశీ కబంధ హస్తాల నుంచి బయిటపడి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అలాగే స్వంత రాష్ట్రంలో పరాయి వాళ్లలా బతకవలసి వచ్చిన పరిస్థితిని మార్చడానికి, తెలుగు జాతి ఆత్మగౌరవంతో తలెత్తుకుని బ్రతకగలిగేలా చేసిన వారెందరో ! వారి నిరంతర పోరాట ఫలితంగా మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ప్రజల కోసం, జాతి కోసం నిస్వార్థంగా పొరాడి సాధించి పెట్టిన మహనీయులను క్రమంగా జాతి మరిచిపోతోంది. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం చరిత్రను వక్రీకరించి ఆ మహనీయుల త్యాగాలను ఉద్దేశ్యపూర్వకంగా ప్రజలకు దూరం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు.

ఈ తరుణంలో తమ తండ్రి గారి వారసత్వంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి బాధ్యతలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తూ తెలుగు వారికి శ్రీరాములు గారి ఆశయాలను గుర్తు చేస్తూ వచ్చారు రామకృష్ణ గారు.

ఇలా రామకృష్ణ గారి సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని వందల మందికి ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకూ విద్య నందించిన జ్ఞానప్రదాత. అనేక మందికి ఆర్థికంగా చేయూత నందించి వారి కష్టాలను తుడిచిన అపర కుబేరుడు. ఏం జరిగినా వారు మనకి అండగా ఉన్నారనే భరోసాతో బ్రతికే బ్రతుకు జీవులెందరో! ఫిబ్రవరి నెల మొదటిరోజునే వారికి “వెన్నెల” ముసురేసింది.

ఎంతో సౌమ్యంగా, ప్రేమతో చిరునవ్వుతో పలకరించే ఆ ముఖారవిందం ముడుచుకున్న వేళ ఆయనకు నివాళి అర్పించకుంటోంది “శిరాకదంబం”

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితికి ఎనలేని సేవలు చేసిన రామకృష్ణ గారి మృతి అమరజీవి స్మారక సమితికి, చెన్నై తెలుగు ప్రజలకు తీరని లోటు. …. తెలుగు జాతికి అంతటికీ తీరని లోటు.

శ్రీ శ్రీనివాస్ గారికి, శ్రీ యర్రమిల్లి రామకృష్ణ గారికి ‘ శిరాకదంబం ‘

🙏 నివాళి🙏

 

మాలతీచందూర్ నవలపై పరిశోధనాత్మక వ్యాసం పోటీ… 2024 

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page