10_011 కథావీధి – రావిశాస్త్రి రచనలు 7

.

విమల అభిమానం పొందడం కోసం సీత్రాం కవున్సిలర్ తో కలసి బంగారయ్య సినిమా ఫక్కీలో తన మనుషుల చేత ఆమె పైన దాడి చేయించి తాను ఆమెని రక్షించి తద్వారా ఆమె అభిమానాన్ని సంపాదించాలని పధకం వెయ్యగా, ఆ మనుషులలో ఒకతను విమల చేత తాళి కట్టించుకున్న ఆడంగి పెళ్ళికొడుకు తమ్ముడవడం చేత వాడు విమల పై నిజంగా దాడి చెయ్యబోగా, వాడినుంచి విమలను రక్షించి తీసుకుని వెడుతున్న సంధర్భం లో వాడు అసలు విషయం బయటపెడతాడు. ఆ సమయంలో వాడు తీసిన దొంగ దెబ్బ కి బంగారయ్య ఆస్పత్రి పాలవుతాడు. ముందుకే బంగారయ్య అక్రమ సంపాదన పై అసహనం గా ఉన్న విమల బంగారయ్య ప్రదర్శించిన ఈ కపటాన్ని సహించలేకపోతుంది. ఆ విధంగా బంగారయ్య పధకం బెడిసి కొడుతుంది.

బంగారయ్య ఆసుపత్రి లో ఉన్న కాలం లో విమలకు అతని గురించి కొంత మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. బంగారయ్య మేనమామ, సీత్రాం కవున్సిలరూ, కనకరాజు పోస్ట్‌మానూ, వైటార్సు డాక్టరూ, ఆసుపత్రి ప్యూనూ ల ద్వారా తెలిసిన విషయాలతో, ఆమె బంగారయ్య పై తనకున్న అభిప్రాయాన్ని మార్చుకుంటుంది. ఇకపై అక్రమాలకీ, అన్యాయాలకీ స్వస్తి చెప్పి, ఇంతవరకూ తద్వారా సంపాదించిన మొత్తాన్ని వదిలేసుకుంటానని, మాట తీసుకుని ఆమె బంగారయ్య తో వివాహానికి అంగీకరిస్తుంది. 

బంగారయ్య తాను విమలకి ఇచ్చిన మాటను అక్షరాలా అమలు చేయగా మిగిలిన అతని సంపద తో వారి జీవితం సుఖంగా వెడుతూ ఉంటుంది. విమల గర్భవతి అవుతుంది. బంగారయ్య దగ్గర మిగిలిన సొమ్ము, మొత్తంగా చూసుకుంటే, తిరుపతి యాత్ర లో అతను కాజేసిన సున్నుండల సజ్జ లోని బంగారం అనీ, పెళ్ళోరి బంగారం విషయాన్ని బంగారయ్యకి ఉప్పందించిన దూదిపులి కి కూడా ఇందులో హక్కు ఉంది అన్న విషయాన్నీ, బంగారయ్య దాచి పెట్టడం తో అది ఎవరికీ తెలియదు. దూది పులి చనిపోతాడు.

ఒకరాత్రి అందరూ గాఢ నిద్ర లో వున్న సమయం లో సన్నటి శబ్దానికి మేలుకున్న బంగారయ్య నిశ్శబ్దం గా నడుచుకుంటూ వెళ్ళి నేల మాళిగలో వున్న తన బంగారాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్న దొంగని పట్టుకుని, గాయపరచి వశం చేసుకుంటాడు. వాడు దూదిపులి కొడుకు అనీ, చనిపోతూ దూది పులి బంగారం విషయం వాడికి చెప్పాడనీ, వాడు తన వాటా తాను తీసుకునేందుకు వచ్చాడనీ తెలుసుకుంటాడు, ఇదంతా విమలమ్మ వింటుంది. ఆ సమయం లో జరిగిన ఘర్షణ లో బంగారయ్య ని రక్షించే ప్రయత్నంలో ఉన్న విమలమ్మ కడుపులో దూది పులి కొడుకు చేతి లోని గునపం గుచ్చుకోగా ఆమె గాయపడుతుంది. వాడిని హతం చేసి, విమలమ్మని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళబోతున్న బంగారయ్యని విమలమ్మ వారించి అతని మిగిలిన పాపాలని కడుక్కుని స్వచ్చమైన బంగారం లా పై లోకానికి రమ్మనీ, తాను అక్కడ కదుపులోని బిడ్డతో అతని కోసం వేచి వుంటాననీ చెప్పి అలా చేస్తానని అతని దగ్గర మాట తీసుకుని మరణిస్తుంది. 

ఇచ్చిన మాట ప్రకారం బంగారయ్య తన వద్ద మిగిలిన సంపదనంతా ప్రభుత్వం వారి పరం చేసి తాను చేసిన నేరాలను స్వయంగా అంగీకరించి స్వచ్చందంగా ప్రభుత్వం వారికి లొంగిపోయి జైలు శిక్షని అనుభవిస్తాడు. జైల్లో అతని సహవాసి బైరాగినాయుడు.

ఇదీ మూడుకథల బంగారం కథ. 

అసంఖ్యాకం గా వున్న రావిశాస్త్రి గారి సాహిత్యం నుంచి రత్తాలూ-రాంబాబూ, మూడు కథల బంగారం రచనలని పరిచయానికి ఎంచుకోవడానికి కొన్ని కారణాలు వున్నాయి. సంక్షిప్తం గా చెప్పాలంటే, వారి సుప్రసిద్ద రచనలైన ఋక్కు లు, గోవులొస్తున్నాయి జాగ్రత్త  ,సొమ్మలు పోనాయండి, రాజు – మహిషి, ఆరు సారా కథలు మొదలైన సాహిత్యం అంతటిలోనూ వారు ప్రదర్శించిన సాహితీ శిల్పం, శైలీ మొదలైన విన్యాసాలు అసమాన్యం. ఐతే వాటిలో అంతర్లీనం గా ఎర్ర భావజాల సమర్ధన వుంది. సంజకెంజాయి రంగుల మాయాజాలం లో నుంచి బయట పడిన రావిశాస్త్రి గారు బహిరంగం గానే ఆ విషయాన్ని అంగీకరించారు. ( సంజ కెంజాయిల సృష్టికర్త లు కూడా తాము జీవించి వుండగానే ప్రకృతి సహజ సిద్ద నియమాలకు తమ సిద్దాంతం వ్యతిరేకమని గ్రహించి ఆ విషయాన్ని బహిరంగం గానే అంగీకరించారు )

భ్రమల నుంచి బయటపడిన తరువాత వారు సృష్టించిన సాహిత్యం అప్పటికే ప్రతిపాదించబడిన కొన్ని విలువలని సమర్ధించింది. వాటిలో ఒకటైన కర్మ సిద్ధాంతం ఈ రెండు కథలలోనూ స్పష్టం గా ప్రస్థావించబడింది. 

మొత్తంగా వీరి రచనా వ్యాసంగాన్ని పరిశీలిస్తే తొలినాళ్ళలో పంజరం లో చిలక, రైలు ప్రయాణం, పోరుపడలేక లాంటి సీదా సాదా కథలు రాసి మంచికథలు రాయలేనేమోనన్న సంశయం తో రచనా వ్యాసంగానికి తాత్కాలికం గా స్వస్తి చెప్పి, సతీమణి ప్రోత్సాహం తో మళ్ళీ రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టిన వీరు కొన్ని మారు పేర్ల తో కథలు రాసారు. సుప్రసిద్ధ రచన అల్పజీవిని అయ్యరే బాబారే పేరు తో రాయగా భారతి లో ప్రచురించబడి విశేషం గా ఆదరణ పొందింది. ఇలా చాలా కలం పేర్లతో రచనలు చేసారు.

సొంత పేరు తో దెయ్యాలకు ద్వేషాలు లేవు అనే కథ తో మొదలైన వీరి రచనా వ్యాసంగం చివరి కథ ఇల్లు వరకూ అప్రతిహతం గా సాగింది. వీరి ఆఖరి రచన ఏడో చంద్రుడు రెండు మూడు భాగాలు ఆంధ్రజ్యోతి లో ప్రచురించబడింది, ఆ సమయం లో వీరు తీవ్ర అనారోగ్యం తో అస్తమించారు.

1960 లో మధ్యపానం పైన నిషేధం ఎత్తి వేసిన సమయం లోనే వీరు న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. చట్టం లో లొసుగులూ, వాటిని ఉపయోగించుకునే సామర్ధ్యం ఉన్న న్యాయవాదులూ, ధన ప్రభావానికీ, రాజకీయ బలానికీ తలవంచే పోలీసు వ్యవస్థ, పన్నాగాలకీ అన్యాయాలకీ బలైనా కూడా నోరు మెదపలేని అమాయక సామాన్యులూ, వీరందరినీ, వీటన్నిటినీ దగ్గరగా చూసి గ్రహించుకున్న వీరు తన అనుభవాలనీ, అభిప్రాయలనీ తన రచనలలో వ్యక్తీకరించారు. 

అదే విధంగా 1970 లలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం ఉధృతం గా సాగుతున్న సంధర్భం లో రచయితలని ప్రశ్నిస్తూ విద్యార్ధి లోకం విడుదల చేసిన రచయితలారా మీరెటు వైపు ? అనే కరపత్రం వీరిపై, తద్వారా వీరి రచనలపై ప్రభావాన్ని చూపింది. 

ఇలా చూస్తే వీరి రచనా వ్యాసంగం పై ప్రధానంగా ప్రగాడ ప్రభావాన్ని చూపినది సమకాలీన సమాజం మాత్రమే. ఒక స్వచ్చమైన, నిజాయితీ గల రచయితగా వ్యక్తిగా వీరు సమాజం లో ఒక భాగమై, సమాజం లో జరుగుతున్న మార్పులను తన రచనలలో ఆవిష్కరించారు. వీరి శైలి అసమాన్యం.

అయితే ఈ నిజాలని ఉపేక్షించిన కొందరు విమర్శకులు వీరి పైన గురజాడ, రెండు శ్రీ కవుల ప్రభావం వుంది, వీరు వారి మార్గం లోనే ప్రయాణించారు అని నొక్కి వక్కాణించి, వీరి గొప్పదనానికి వారే కారకులు అని తీర్మానించారు.

విషయం లో నిజాయితీ లేనప్పుడు రచనలో రచయిత వుద్దేశించిన పరిష్కారాన్ని ప్రతిపాదించలేడన్న విషయం కన్యాశుల్కం తేటతెల్లం చేసింది, మొత్తం గా అర్ధ మయ్యే విషయం ఏమిటంటే కరటక శాస్త్రి, గిరీశం లతో పాటు సౌజన్యారావు పంతులు కూడా కుహనా సంఘ సంస్కర్తే అని మధుర వాణి సమర్ధవంతం గా నిరూపిస్తుంది. ఇదేదో నా స్వంత అభిప్రాయం కాదు సాక్షాత్తూ రావి శాస్త్రి గారే బాకీ కధలలో ఈ విషయం చెపుతారు. ఆ కాలం లో వ్యవహారిక భాష గా వ్యవహరించి కవిగారు వాడిన భాషా, చాకలీ మంగలీ బారికా, విధవ ముండా లాంటి పద ప్రయోగాలూ ఇప్పుడు వాడితే అట్రాసిటీ కేసు పెడతారు. 

రావిశాస్త్రి గారు వ్యక్తిగా నిష్కల్మషుడు రచయిత గా నిజాయితీ పరుడు, తాను నమ్మిన సిద్దాంతాలని తన రచనలలో ప్రతిపాదించారు. తాను ప్రస్తావించిన సమస్యలకు, నాటక ఫక్కీలో, ఆదర్శాల ఫక్కీలో పరిష్కారాలు ప్రతిపాదించ లేదు అందువలననే వీరి రచనలు కొన్ని అసంపూర్ణం గా అపేసారు. 

సమాజాన్ని ఈ రోజున పరిశీలించినా మనకి మందుల భీముళ్ళూ, సార్వభౌమారావులూ, శేషగిరిలూ, రాజయోగి పెదనాన్న గార్లూ, సీత్రాం కవున్సిలర్లూ, సివం సెలాలూ తాడి చెట్లల్లా పెరిగి మర్రి చెట్లల్లా ఊడలు దింపుకుని విస్తరించడం, కమ్మలింటి రాజులూ, రాంబాబులూ, అలుపెరుగని పోరాటాలు చేస్తూ వుండడం, రత్తాల్లూ, ముత్యాల్లూ, సముద్రాల్లూ, సుబ్బారాయుళ్ళూ, రొట్లప్పారావులూ, అడారాదినారాయణలూ ఇంకా మంచిరోజుల కోసం నిట్టూరుస్తూ ఎదురు చూడడాలూ మనకి కనిపిస్తూనే వున్నాయి. ఇంక దండధారులైన దొరల, గంటకి వేల రూపాయలు ఫీజు పుచ్చుకుని తిమ్మిని బమ్మి చేసే లాయర్లూ, డిపాట్మెంట్లలో వేతనశర్మలూ, గంగరాజెడ్డ్లూ, సూర్రావెడ్ల సంగతి ప్రత్యేకం గా చెప్పనక్కరలేదు. 

సమాజం పట్ల నిబద్ధత వుండి, సమాజం లో తాను చూసినదీ, తన అనుభవం లోకి వచ్చిన విషయాలనూ మాత్రమే రాసి, సమకాలీన సమాజాన్నితన రచనలలో ప్రతిబింబించి తన రచనలతో “చెడుకి వుపకారం, మంచికి అపకారం ” (ఇవి వారి మాటలే) చెయ్యని రావిశాస్త్రి గారికీ రచయితలు గా సమాజం పట్ల తమ భాధ్యతలు నిర్వర్తించక పేరుకోసమో, మరొకవాటికోసమో రచనావ్యాసంగాన్ని వాడుకున్న వారికీ పోలిక తేవడం సరి కాదు.

( రావిశాస్త్రి గారి పరిచయం సంపూర్ణం )