10_009 పాలంగి కథలు – ధనుర్మాసం … తిరువళ్లిక్కేణి

             అవి నేను 6,7 క్లాసులు చదివే రోజులు మద్రాసు (చెన్నై) తిరువళ్లిక్కేణి, పార్థసారథి స్వామి సన్నిధి వీధిలో ఉండే మాకు ధనుర్మాసం వచ్చిందంటే బోల్డు హడావిడి. ఆ నెలరోజులూ తెల్లవారుఝామున లేవడానికి ముందునుండీ మానసికంగా సిద్ధమయేవారం. ఎందుకంటే దేవాలయం నాలుగు మాడవీధుల్లోనూ తిరుగుతూ జరిగే నగర సంకీర్తనలో పాల్గొని, రోజుకొక్కళ్లం నామావళి పాడాలి కనక. ఆ రోజుల్లో పార్థసారథి స్వామి సన్నిధి వీధి పిల్లలకి అది ఒక గౌరవం. ఇహ మరో విషయం, అతి ముఖ్యమైనది ఈ సంకీర్తన తర్వాత గుళ్లో పూజ, తిరుప్పావై పూర్తికాగానే ఇచ్చే వేడి వేడి చక్రపొంగలి, వెళ్‌పొగళ్లుల ముఖ్య ఆకర్షణ. ఈ రెండు ఆకర్షణలూ మా పిల్లల్ని బాగా తెల్లవారుఝామునే లేచేలా చేసేవి. పైగా లేచి, ఏదో ముఖం కడుక్కుని వెళ్లిపోవడం కాదు. స్నానం చేసి మరీ వెళ్లాలి. అప్పటికే పెరట్లో పొయ్యి వెలిగించి, కాగులో నీళ్లు తోడి పోసి కాచేది ఒదిన. శీతాకాలం… చలి. నీళ్లు తొందరగా వేడెక్కవ్‌. ఎలాగో, గోరు వెచ్చనైనా చాలని, గబగబా స్నానం చేసి తయారైనా జడ నేను వేసుకోలేను కదా! ఒదిన వెనకే రిబ్బన్లూ, దువ్వెన్నా పట్టుకుని తిరగటం! ఓ పక్క కుంపటి అంటించటమో, లేకుంటే వీధి గుమ్మం కడిగి ముగ్గు వెయ్యడమో చేస్తుంటుంది ఆ సమయానికి. కాకపోతే చంటాడు లేచి ఏడుపు మొదలెడతాడు! అలా ఆవిడ కూడా తిరుగుతుంటే మొత్తానికి రెండు జడలు వెయ్యడం పూర్తవుతుంది. అమ్మో…వేద పండితుల గొంతులు వినబడుతున్నై! వారి వెనక తీర్థకావిడి!! ఆపై భజన బృందం దగ్గరకొచ్చేసినట్లుంది. పరిగెత్తి వీధి చివరకెళ్లేసరికి అప్పటికే అక్కడికి చేరుకున్న పార్థూ, చిన్నా, వేదవల్లి, అంబుజ, తంగచ్చి, విజయ, పద్మనాభన్ వాళ్లతో కలిసి భజనబృందంలో కలిసేదాన్ని! నవ్వుతూ కళ్లతోనే పలకరించేవారు అయ్యంగార్‌ మామ. మెడలో హార్మనీ తగిలించుకుని వాళ్లబ్బాయి వాయిస్తూ పాడుతున్నాడు. ఈ రోజు పద్దూ (పద్మనాభన్‌) పాడాలి నామావళి. అందుకే మెల్లిగా సందు చేసుకుని వాయిద్యాల మధ్యకి చేరుకున్నాడు. మేమంతా కూడా చుట్టూ చేరాం. అప్పటివరకూ పాడిన పిల్లలు మెల్లిగా పక్కకి తప్పుకున్నారు.

“ శ్రీనివాసా గోవిందా! శ్రీ వెంకటేశా గోవిందా! భక్తవత్సలగోవిందా! భాగవతప్రియా గోవిందా! ” అంటూ ఆ రోజు పాడవలసిన రాగంలో అందుకున్నాడు పద్దూ. మేమంతా వంత కలిపాం. ప్రతిరోజూ నగర సంకీర్తన పూర్తయాక గోదాదేవి పూజ, తిరుప్పావై, హారతి నైవేద్యం అయ్యాక ఇచ్చిన ప్రసాదాలు…అవే పొంగళ్లు తెచ్చుకుని కుముదవల్లి వాళ్ల అరుగు మీద కూర్చుని తింటుంటే మా బాచ్‌ వాళ్లకి మర్నాడు పాడబోయే నామావళి ఏ రాగంలో పాడాలో చెప్పేవారు అయ్యంగార్‌ మామ. మామా వాళ్ల కొడుకులు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నార్ట. అందరూ ఈ నెలరోజులూ శలవుపెట్టి మరీ వచ్చి ఉంటారు ఈ ధనుర్మాసం కోసం! కుముదవల్లితో సహా అందరూ బాగా పాడతారు వాళ్లింట్లో. భజనలో కూడా వాళ్ల పిల్లలు తలో వాయిద్యం వాయిస్తూ నగర సంకీర్తనకి వస్తారు.

ఇంతకీ కృష్ణ అయ్యంగార్‌మామ పాడి వినిపిస్తుంటే అలా వారిని ఫాలో (అనుకరించి) అయిపోవడమే!! ఆ పాడే రాగం సింహేంద్రమధ్యమమా, కల్యాణా, హిందోళమా… ఏమో! ఆ రాగం ఫలానా అని తెలిసేది కాదు. కాని వారు పాడుతుంటే అలా కొనసాగించేసేవాళ్లం. మాలో రోజుకొకళ్లం చొప్పున నామావళి పాడాలి. తక్కినవాళ్లు దాన్ని అందుకోవాలన్నమాట! ఇంతకీ మేమంతా కూడా కుముదా వాళ్ల వీధిలో ఉన్న తిరువళ్లిక్కేణి లలితా మ్యూజిక్‌ స్కూల్‌ విద్యార్థులం అన్నమాట! ఇంకొంచెం పెద్దయాక తెలిసింది రాగాల గురించి. అప్పటికైనా బృందావన సారంగ, దేవతి, చారుకేశి లాంటివి గుర్తించలేకపోయేవాళ్లం! కానీ వాళ్లు మొదలుపెట్టి అందిస్తే చాలు అలాగే కొనసాగించేసేవాళ్లం అదే రాగంలో!!

మరికాస్త పెద్దయాక తిరుప్పావై నేర్పిస్తాను రమ్మనేవారు అయ్యంగార్‌ మామ. వారు చెబుతూంటే అలా వల్లె వేసేయడమే!! అర్థం చేప్పేవారు కాని మాకేం పెద్దగా అవగాహన అయేది కాదు. కానీ, చిలకపలుకుల్లా చెప్పిందల్లా చేప్పేసేవారం.

మార్గళిత్తంగళ్‌ మది నిౖరైంద నన్నాళాల్‌ నీరాడప్పోదువీర్‌ వైయ్యత్తువీర్‌గాళ్, నాముమ్‌ నమ్చా వైక్కుచ్చెయ్యుం గిరిశైగళ్‌కేళిరో… బెంగి ఓంగిలగళంద ఉత్తమన్‌పేర్పాడి…ఇలా సాగే ఆ పాశురాల అర్థాలు…నిజం చెప్పొద్దూ, అరవవాళ్లకే ఆ తమిళం (గ్రాంథికం) అర్థమయ్యేది కాదు. ఇహ మాకెక్కడ అర్థమవుతుంది?? అర్థంకాలేదని మానివేసే ప్రసక్తి లేదు లెండి! మరి ప్రసాదం భక్తులం కదా! అలాగని ప్రసాదం మాకొక్కళ్లకే పెట్టరు. కానీ అలా పాడి ప్రసాదం తీసుకోవటంలో వచ్చే గౌరవం వేరు. మేం ఇద్దరం తెలుగమ్మాయిలం ఉండేవాళ్లం. తక్కినవాళ్లంతా అయ్యంగార్ల పిల్లలే! మొత్తానికి మామ వాళ్లతో కలిసి తిరుప్పావై వల్లించి, పాడటం వచ్చింది. ఆ సంవత్సరం దైవ సన్నిధిలో పాడేందుకు సిద్ధమయాం అన్నమాట. తెల్లవారగట్ల మాతోపాటు మా అన్నయ్య (అన్నయ్య ఫ్రెండు అయ్యంగార్‌ మామా వాళ్ల 5వ అబ్బాయి), తంగచ్చివాళ్లప్పాట్టీ (అమ్మమ్మ), విజయవాళ్ల నాన్నగారు వచ్చేవారు. ఎంతైనా మరీ చిన్న పిల్లలం కాదు కదా!– అందుకని అన్నమాట.

అంతా అయాక పార్థసారథి స్వామి, ఆండాళ్‌ తల్లీ ధరించిన పూలు, పెద్ద మాలలు మాకు స్పెషల్‌గా ఇచ్చేవారు అర్చకమామ. ఆ మాలలు ఇంటికి తెస్తే అమ్మ పూల జడ కుట్టేది! స్కూల్‌కి పూల జడతోనే వెళ్లేవాళ్లం! అలా దైవం ధరించి ఇచ్చిన పూలతో పూల జడ కుట్టించుకోవడం అందరిలో మాకు మాత్రమే బహుమతిగా దక్కిన గౌరవంగా భావించేవాళ్లం! అంతెందుకూ…స్కూల్లో ప్రతీ గురువారం చివరి రెండు పీరియడ్లూ తోట పని క్లాసుండేది. ఒక్కొక్క స్క్వాడ్‌కి ఒక్కో మడి కేటాయించేవారు టీచర్ల పర్యవేక్షణలో. అందులో దవనం, మరువం పెంచేవారం. ఎదిగాక కోసి, కట్టలు కట్టి మాలో మేమే కొనుక్కునేవాళ్లం. ఎంతో తెలుసా? అర్థణా! కట్ట!! అలా వచ్చిన డబ్బును క్లాసు లీడర్‌ పోగుచేసి టీచర్‌కిస్తే, రెండు నెలలకొకసారి వచ్చే ‘‘డెఫ్‌ అండ్‌ డెమ్‌’’ స్కూల్‌ వాళ్లకిచ్చేవారు స్కూల్‌ తరఫున. శుక్రవారం పొద్దునే అమ్మ తొమ్మిది పాయల జడ అల్లేది ఆ దవనం, మరువం పెట్టి! మేమెక్కడ ఉంటే అక్కడే సువాసనల ఘుమఘుమలు!! ఇంతకీ ఆండాళ్‌ తల్లి ఉనికే పూలలోనూ, పాశురాలలోనూ!

ఆండాళ్‌ తిరువడిగళే శరణం!! ఈ మాట మాత్రం చాలా తొందరగా వచ్చేసింది!!

ఆమె రకరకాల పూలతో అందమైన మాలలల్లి, ముందు తాను ధరించి, అందంగా ఉన్నాయనిపించాకే తీసి బుట్టలో సర్ది తండ్రికిచ్చేదట! వటపత్రశాయికి (శ్రీకృష్ణునికి) అలంకరించడానికి! గోదాదేవిని సాక్షాత్తూ రంగనాథుడే ఏనుగుపై ఊరేగి వచ్చి, గోదా వాళ్ల నాన్న కాళ్లు కడిగి కన్యాదానం చేస్తే పెళ్లి చేసుకున్నాడట! అయ్యంగార్‌ మామ చేత ఎన్నిసార్లు చెప్పించుకున్నామో ఈ కథ! కళ్లు పెద్దవి చేసుకుని వినేవాళ్లం!! భలే ఉండేది!

ఆ తల్లి చూడి కొడుత్త నాచ్చియార్‌! ఆముక్త మాల్యద!!

మరి మేమో?!

ఆ తల్లి స్వామికి సమర్పించిన పూల నిర్మాల్యాన్ని అలంకరించుకున్న కన్యలం అన్నమాట!!!

****************************