13_009

 

ప్రస్తావన

ప్రపంచం ముందుకు వెడుతోందా ? వెనక్కి వెడుతోందా ? అని ఆలోచిస్తే సమాధానం కొంచెం కష్టమే ! సాంకేతికంగా ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది. అందులో ఏమీ అనుమానం లేదు. అయితే మనిషి మస్తిష్కం మాత్రం వెనక్కి తీసుకెడుతోంది అనిపిస్తోంది. ఒక ప్రక్క చంద్రుడిని, సూర్యుడిని కూడా చేరుకుని అక్కడ ఆవాసాలు ప్రారంభించేటంత వరకు మానవ మేధస్సు వృద్ధి చెందితే… మరో ప్రక్క స్వార్థం, అసూయ, అసహనం లాంటివి కూడా మనిషిలో అంతకంటే వేగంగా పెరుగుతున్నాయి. సాంకేతికత పరంగా ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయిందనుకుంటే… మనుష్యుల మధ్య, ప్రాంతాల మధ్య, దేశాల మధ్య…. చివరికి వ్యక్తిగతమైన కులం, మతం, జాతి లాంటి వాటి మధ్య కూడా విబేధాలు,ద్వేషాలు పెరిగిపోతున్నాయి.

ప్రతి ఆవిష్కరణ లోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. కత్తో, తుపాకీ నో తయారు చేసినపుడు అవి ఆత్మరక్షణ కోసమనే తయారు చేసి ఉంటారు. అందుకే ఉపయోగిస్తే అది మంచిదే ! కానీ ఇతరులను బెదిరించి వాళ్ళ దగ్గరున్నది దోచుకోవడానికో, మనకి నచ్చని వాళ్ళని అడ్డు తొలగించుకోవడానికో ఉపయోగించడమే ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో దొంగలు, హంతకులు ఇలాంటి మారణాయుధాల మీదనే ఎక్కువగా ఆధారపడేవారు. కత్తి పట్టుకుని తిరిగేవాడిని మనం గుర్తించి జాగ్రత్త పడే అవకాశం ఉంది. అలాగే అతడు నేరం చేశాక వాటి ఆధారంగా పట్టుకోగలిగే అవకాశం ఉండేది. అదొక సాక్ష్యంగా కూడా ఉపయోగపడేది. ఇప్పటి దొంగలకు ఇవన్నీ అవసరం లేదు. అంత సులువుగా పట్టుబడే అవకాశం కూడా ఇప్పటివరకైతే లేదు. ఈ దొంగల ఆయుధం కనిపించేది కాదు. అదే సాంకేతికత. అంతర్జాలం మానవ వికాసానికి ఎంతగా ఉపయోగపడుతోందో…. అంతగా తప్పుడు పనుల కోసం కూడా ఉపయోగపడుతోంది. అంతర్జాలం వలన సమాచార మార్పిడి చాలా సులభమయింది. విజ్ఞానపరంగా చాలా ఉపయుక్తంగా ఉంది. గతంలో క్లిష్టమనిపించిన ఎన్నో సేవలు అంతర్జాలం ఆధారంగా చాలా సులువుగా అయిపోతున్నాయి. ఉదాహరణకి మనం బ్యాంక్ లో దాచుకున్న డబ్బుని తీసుకోవాలంటే సుదీర్థమైన ప్రక్రియ ఉండేది. బ్యాంక్ సమయాలను, నియమాలను, పద్ధతులను పాటించి ఎక్కువ సమయం వెచ్చించవలసి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఏ‌టి‌ఎం ల నుంచి ఏ సమయంలో కావాలన్నా మన డబ్బు తీసుకోవచ్చు. నెట్ / మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికైనా, ఎప్పుడైనా పంపవచ్చు. బ్యాంక్ కి వెళ్లవలసిన అవసరం లేదు. ఇది మనిషికి కలిగిన ప్రయోజనమైతే అదే అంతర్జాలాన్ని ఉపయోగించి మన డబ్బుని అంతర్జాలం ఉపయోగించి తస్కరించే దొంగలు కూడా పెరిగారు. వీటి నుంచి రక్షించే మార్గాలు ఎంతగా అప్డేట్ చేస్తున్నా, ఈ దొంగలు కూడా అంతకంటే ఎక్కువే అప్డేట్ అవుతున్నారు. ఒక మార్గం మూసివేస్తే మరో మార్గం కనుక్కుంటున్నారు. కొంతకాలం క్రితం వైరస్ భయం అంతర్జాలాన్ని, కంప్యూటర్లని వెంటాడేది. మాల్వేర్ లను పంపించి మన సమాచారాన్ని తెలుసుకుని మన బ్యాంక్ ఖాతాలనుంచి డబ్బు కొల్లగొట్టడం వంటివి జరిగేవి… ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే వీటికి విరుగుడును ఆపరేటింగ్ సిస్టమ్ లు ఎప్పటికప్పుడు మనకి అందజేయడం వలన అది అంత సులభంగా లేదు. అందుకే సైబర్ మోసాలకు తెరదీశారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు, అధిక లాభాల పేరుతో ఆశాపరులకు వల వెయ్యడం ప్రారంభించారు. మనిషి బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు ఉపయోగించే పద్ధతులను ఈ దొంగలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇటీవల బాగా పెరిగిన కొరియర్ మోసాలు, గ్రహ దోషాలు వగైరా. మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చిందని…. అది అనుమానాస్పదంగా ఉండడం వలన కస్టమ్స్ వారు స్వాధీనం చేసుకున్నారని… అందులో నిషిద్ధ వస్తువులున్నట్లు తేలిందని…. కాబట్టి మీరు వ్యక్తిగతంగా రాకపోతే మీ మీద నిషిద్ధ వస్తువుల రవాణా కేసు నమోదు చేసి అరెస్టు చేయవలసి ఉంటుందని…. పోలీసు అధికారి వేషంలో వీడియో కాల్ లో మాట్లాడి బెదిరించడం జరుగుతోంది. సహజంగానే ఉండే భయం వలన ఆ కేసు నుంచి తప్పించడానికి వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బుని పంపి మోసపోవడం జరుగుతోంది. ఇలా ఏమాత్రం సంబంధం లేని విషయంలో డబ్బులు పొగొట్టుకుంటున్నారు చాలామంది. చదువు సంధ్య, ప్రపంచ జ్ఞానం ఏమీ లేని వాళ్లెవరైనా ఇలా మోసపోతున్నారా అంటే అత్యంత మేధావులుగా చెప్పుకోబడే ఐ‌ఏ‌ఎస్, ఇలాంటి నేరాలెన్నిటినో నిత్యం చూస్తున్న పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇలాంటి మోసాలకు వేదికగా చెప్పుకునే బ్యాంక్ సిబ్బంది కూడా ఇలా మోసపోయిన వాళ్ళలో ఉంటున్నారు.

ఇటీవల వార్తల్లో వచ్చిన ఒక సంఘటనలో కుమారుడు ఏదో పని మీద బయిట ఊరికి వెడితే అతని తల్లిదండ్రులకు సైబర్ మోసగాళ్ళు ఫోన్ చేసి మీ కొడుకుని స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశామని బెదిరించి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. ఆ సమయంలో అతని మొబైల్ కూడా అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు నిజమేనని నమ్మి అడిగినంత సమర్పించుకున్నారు. తర్వాత అతని మొబైల్ అందుబాటులోకి వచ్చాక తెలిసిన విషయమేమిటంటే ఆ దొంగలు చెప్పినట్లు ఏమీ జరగలేదని, సురక్షితంగానే ఉన్నాడని, మొబైల్ సిగ్నల్ సమస్య వలన అందుబాటులోకి రాలేదని తెలిసింది.

అయితే ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ మోసాల నుంచి తప్పించుకునే అవకాశం పెరుగుతుంది. ముందుగా మనకి తెలియని నెంబర్ల నుండి కాల్స్ వచ్చినప్పుడు వీలైనంతవరకు వాటిని తీయకుండా ఉండడం మంచిది. ఒకవేళ పొరబాటున తీసినా… మనకి సంబంధించిన విషయం కాదని తెలియగానే కాల్ కట్ చెయ్యడం, ఆ నెంబర్ ని బ్లాక్ చెయ్యడం తప్పనిసరి. మన ఫోన్ లో కాలర్ ఐడి ఉండేలా చూసుకుంటే చేసిన వారి పేరు ఆధారంగా ఆ కాల్ తీసుకోవాలో, లేదో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలాంటి మోసాల బారిన పడే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఎంత జాగ్రత్త తీసున్నా ఏదో ఒక కారణం చేత ఈ మోసం బారిన పడితే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ విభాగం 1930 నెంబర్ కి డయల్ చేసి ఫిర్యాదు చెయ్యడం తప్పనిసరి.

మనకి రకరకాలుగా మెయిల్ ద్వారా గానీ, వాట్సప్ వంటి ఆప్ ల నుంచి గానీ ఏవైనా తెలియని లింక్ లు వస్తే వాటి జోలికి పోకుండా ఉండడమే మేలు. పొరబాటున అలాంటి లింక్ మీద క్లిక్ చేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే. మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇలాంటివి జరిగినపుడు మొదటగా బ్యాంక్ ను సంప్రదించి ఆ దొంగలు ట్రాన్సఫర్ చేసుకున్న మొత్తాన్ని ఫ్రీజ్ చేయించుకోవాలి. అలాగే మీ నెట్ బ్యాంకింగ్, ఏ‌టి‌ఎం కార్డ్ వంటి వాటిని కూడా బ్యాంక్ నిలిపివేస్తుంది. ఇలా వెంటనే చేస్తే ఆ డబ్బు దొంగలకి చేరకుండా మధ్యలోనే ఆపి, నిర్ధారించుకున్నాక మీ ఖాతాకి జమ చేసే అవకాశం బ్యాంక్ కి ఉంటుంది.

ఇలాంటి సైబర్ నేరాలు అరికట్టడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నా…. మోసగాళ్ళు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ పత్రికలలోనూ, వార్తా చానెళ్ల లోనూ సైబర్ మోసాల గురించి కథనాలు వస్తూనే ఉన్నా, మనందరం వింటూనే ఉన్నా కొంతమంది మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటున్నారు. మన అప్రమత్తతే మనల్ని కాపాడుతుంది. మొబైల్ అనవసర వినియోగం, కనిపించిన ప్రతి ప్రకటనకు ఆకర్షితులై లింకులు తెరవడం వంటివి మానాలి.

గతంలో మెయిల్ ఐడి, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల లోని ఖాతాలను హాక్ చేసి మన సమాచారాన్ని దొంగిలించేవారు. ఇప్పుడు మన ఖాతా లాంటిదే నకిలీ ఖాతా సృష్టించి… మన పేరు మీద మన మిత్రులనుంచే డబ్బు దొంగిలిస్తున్నారు. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు కాదేదీ సైబర్ నేరానికి మార్గం. అందుకే ముందుగా మన అప్రమత్తతే చాలా అవసరం.

************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page