08

ద్విభాషితాలు – బాబయ్యగారి అరుగు

 

 

సన్నని వీధిలో….

పైకి పొడుచుకొచ్చిన….

నున్నటి ఎర్రకంకర రాళ్ళ రోడ్డుని ఆనుకొని…

నల్లరంగు గచ్చుతో …నిగనిగ లాడుతూ…

బాబయ్య గారి అరుగు!

 

పగటి అలసటను తరిమి…

విశ్రాంతిని మోసుకొని…

ఊరి వీధుల్లోకి ….

చీకటి ప్రవేశించే వేళ…

మనుషులు కలవడానికి…

మనసులు తెరవడానికి…

మసక వెన్నెల్లోమెరిసే …..

మాటల వేదిక…

బాబయ్యగారి అరుగు!

 

రాత్రి పూట….

ఓ క్షణం దొరికే కబుర్ల విశ్రాంతికి….

 

కరెంటుపోయి …

ఇంట్లో కిరసనాయిలు దీపాలు…

మసిబారినప్పుడు…

మనసులో వెలుగు నింపడానికి…,

 

అప్పుడే అందిన వార్తని ….

గుండెల్లో దాచుకోలేక…

ఊరి చెవులకు చాటింపు వేయడానికి…,

 

భిన్న భావావేశాల ప్రకటనకి…

 

బహిరంగ సభగా…..

బాబయ్యగారి అరుగు!

 

భోజనం ముగించి…

మేడలోంచి బయటకొచ్చి…

అరుగు చేరిన…..

లావు బాబయ్య …

మావయ్య  పేల్చిన జోకుకి…..

ఎగిరి ..విరగబడి నవ్వితే…

అరుగు పగిలేది!

 

పట్నంలో..విడుదలయిన..

పెద్దనటుల సినిమాలకు…

అరుగే …రెండో తెర అయ్యేది.

 

రాజకీయ పార్టీల …

అభిమానుల మధ్య…వాగ్యుద్థానికి…

అరుగే …రచ్చబండ అయ్యేది.

 

మాటల ప్రవాహం….

అరుగుమీంచి ….

వీధిలోకి ప్రవహించి…

వరదయ్యేది.

 

రాత్రి చిక్కబడుతుంటే….

అరుగు పలచబడేది.

 

స్వేచ్ఛను….                                                                         

సంతోషాన్నీ….

జ్ఞానాన్నీ….                                                                                                 

హాస్యాన్నీ…

పంచిన…

బాబయ్యగారి అరుగు….

నెమ్మదిగా…

నిశ్శబ్దంలోకి …ఒరిగిపోయేది!

 

వికసించిన స్నేహపరిమళంతో….

వీధంతా గుబాళించి…

నిద్రలోకి జారిపోయేది!

 

****************************************************

 

7. తో. లే. పి. ….                                                                                                   9. నేను సైతం….