09

నేను సైతం – సలీం కవిత్వంలో శిల్పం

 

కవిత్వం రసాభివ్యక్తి. కవిత్వం ఒక పరసువేది. కవిత్వం ఒక ఆల్కెమీ అన్నాడు తిలక్. అందుకే నాకు అనిపిస్తుంది కవిత్వం ఒక గారడీ. ఇది వ్యతిరేక అర్ధం తోనో వెక్కిరింపుగానో అనడం లేదు. కవిత్వం ఒక గడసాని తాడు మీద నడిచే నడక వంటింది. చాలా నైపుణ్యం కావాలి. ఎంతో పెద్దదైన భావ సముద్రాన్ని ఒక్క చెంచాడు కవితలోకి పొదగాలి. పొంగి పొరలే ఉద్విగ్నతలన్నిటిని ఒడిసి పట్టి తీరుగా పేర్చి కూర్చి కవితామాతల్లి జడలో పూబంతిలా తురమాలి. చెప్పదల్చుకున్న విషయం పైన సంపూర్ణ అవగాహన ఉండాలి, ఎంతవరకు విప్పి చెప్పాలి, ఎంతవరకు కప్పి ఉంచాలి, పాఠకులకు ఎంత వరకు మర్యాదనివ్వాలి, అర్ధం చేసుకోమని వదిలి పెట్టాలి ఇవన్నీ కవికి గారడీ విద్యలే. సముద్రం గురించి సముద్రమంత చెప్పలేము కదా. అది ఒకోసారి ఒక్క అల గా ఒకోసారి పెను ఉప్పెనగా కూడా వస్తుంది. అది కవి మానసిక స్థితి ని బట్టీ, అతని భావ సాంద్రతను బట్టీ ఉంటుంది. అంతేకాదు ఆ కవిత ఇతివృత్తాన్ని బట్టీ ఉంటుంది. శిల్పం అంటే ఫార్మ్ అండ్ స్ట్రక్చర్ అని మనం తీసుకుంటే ఒక కవి కవిత్వం లో ఈ అంశాలను కవితా నిడివి, కవి ఉద్దేశ్యం, కవి చెప్పిన విధానం ఈ మూడు అంశాలను పరిశీలించాలి. కవిత్వం లో వస్తువును బట్టే ఇవి అన్నీ వుంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.

మనమైతే కవి, కథకుడు, నవలా కారుడు ఇలా అంటున్నాం కానీ ఆంగ్లం లో రచయితని పొయెట్ అనే అంటారు. పొయెట్ అంటే కేవలం కవిత్వమే రాస్తాడని అర్ధం కాదు. సలీం కవిత్వం మూడు సంపుటాలు అతని వివిధ జీవన దశలలో వెలువరించినవి. ‘నీలోకి చూసిన జ్ఞాపకం’(1999), ‘ఆకులు రాలే దృశ్యం’(2005), ‘విషాద వర్ణం’(2013). వివిధ మానసిక దశల్లో కవి మనసు లో కదిలే భావ తరంగాలను కవితలుగా

అభివ్యక్తీకరిస్తాడు. మొదటి కవితగా మనం సలీం కవిత్వాన్ని పట్టుకోవడానికి దొరికేది ‘స్వాగతం’ అనే కవిత. ఇది 1975 లో అంటే తన తొలి కథ ‘మనిషి’ కన్నా ఆరేళ్లు ముందుగా తన పదునాలుగవ ఏట రాసినది. ఇది ఒక ఉగాది కవిత. కృష్ణ శాస్త్రి బాగా అగుపిస్తాడిందులో. అప్పటికింకా ఈ చిన్నారి కవికి స్వంత స్వరం రాలేదు. అందుకే ‘నాకిక కుసుమ సౌరభాలు లేవు/సుధారస స్రవంతులు లేవు/మధుర దరహాసాలు లేవు/అధరామృతాలు లేవు/బాధ పెట్టకు ఉగాది/ రాధ లేని ఈ మది/విధి కట్టిన సమాధి/కదిలిపోకు ఉగాది/కనుల నీరు నింపి పోకు/ఆగమనలేను నేడు/నను దాటి సాగమనలేను/ నాకోసం కాకున్నా/నిల్చిపో ఉగాది/నిఖిలాంధ్ర హృదయం లో/గుడి కట్టుకుని నిల్చిపో”(12-4-1975).

ఉగాది కవిత అని తెలుస్తూనే ఉంది. అంత్య ప్రాసలు తో ఉండేదే కవిత్వమని భావించే రోజులవి. కవి ఇంకా పసి ప్రాసల గోడ దూకి ఫ్రీ వెర్స్ వచన కవిత్వం లోకి రాలేదు. ఈ కవితను గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనడానికి లేదు. కవిగా మొదలయిన సలీంలో ఈ విశ్వజనీనత అనే అంశం బీజ ప్రాయం లో ఉంది అనడానికి ఈ కవిత నిదర్శనం. వ్యక్తిగతం నుండి మొదలై నిఖిలాంధ్ర వరకు వచ్చిన వైనం అగుపిస్తుంది. This shows a poet to be promising in the future. నేను నుండి నిఖిలాంధ్ర వరకు వచ్చాడు అంటే కృష్ణ శాస్త్రిని గెడ కర్ర ఊతంగా తీసుకుని ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేస్తున్నాడు అని తెలుస్తోంది. సహజంగా తొలి నాళ్ళ కవిత్వం ఎవరిదైనా భావావేశం తో ఉంటుంది. శబ్ద లౌల్యం. పద లౌల్యం. తనకే అంతా తెలుసునని. తాను తెలుకున్నదంతా చెప్పేయ్యాలని అనిపిస్తుంది. ఇది ఒక మానసిక దశ. ఇలాంటి దశలోని కవితలు జీవితం పట్ల తన దృక్పధాన్ని, ఆశానిరాశల కలయికని ప్రతిబింపింప చేస్తాయి అలాంటి కవితలు కొన్ని 78. 79. 80 ల్లో రాసినవి ఉన్నాయి. 1981 లో ఇరవయ్యేళ్ల యువకుడు ‘మనిషి’ కథను రాశాడు అంటే అతని పరిశీలనా దృష్టి ఎంత సాంద్రమైనదో మనకి అర్ధం అవుతుంది.

ఒక కవిని కవిగా, కథకుడుగా విభజించలేము. అతని హృదయ ధర్మం బట్టి రాయాలనుకున్నది కవితగానో, కథగానో అభివ్యక్తి అయి ఉండవచ్చును. ‘నేను కవిగానే మొదలయ్యాను’ అని ఒకసారి నాతో చెప్పాడు. కానీ సలీంని కథకుడిగానే ఎక్కువ పరిగణిస్తుంది తెలుగు సాహిత్య లోకం. కొన్ని అమూర్త భావాలకి (abstract) కవిత్వమే సరి అయిన లెట్ ఔట్. భవిష్యత్తు జీవితం పట్ల భయాన్ని ఒక కవితలో అంటాడిలా “జీవితం ఎంత బరువు/పృధ్విని హృదిలో మోస్తున్నట్లు/నక్షత్ర శకలాలు/మెదడు మొదళ్లను కోస్తున్నట్లు/అంకుశం అంచున మొలకెత్తిన అంకురంలా/ప్రతి క్షణం బ్రతుకు భయం”(జీవితం, 1979). 18 యేళ్ళ కుర్రవాని మనో స్థితి ఇది. సమాజాన్ని అనునిత్యం పరిశీలిస్తూ ప్రతిస్పందిస్తున్న కవి 1998 లో ‘ కల్తీ క్రిమి సంహారక మందులు/భేషుగ్గానే పని చేశాయి/అరంగుళం పురుక్కి బదులు/ఆరడుగుల మనుషుల్నే మింగేసాయి/కత్తులూ, తూటాలే కాదు/తీర్చలేని అప్పు కూడా అణ్వాస్త్రమే/సామూహిక సంహారానికి/స్కోరు పెరిగే కొద్దీ/సంబర పడుతోందా  ప్రభుత్వం!/ఎన్నెన్ని సార్లు ఉరితీయాలో దీన్ని?” ఈ కవితలోని ఆవేశం ఆక్రోశంతో  ధర్మాగ్రహ ప్రకటన చేస్తున్నాడు కవి. సామాజిక అవగాహన కల్పిస్తూనే తన విప్లవాత్మక వైఖరిని కూడా వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ కవి ఒక న్యాయాధికారి, ఒక తీర్పు నిచ్చే, ఒక సామాజిక వైఖరిని నిర్మించే నిర్మాత. తన అభిశంసను సూటిగా చెప్పే ధైర్యం గల యువ కవి అప్పటి సలీం.

ఇక తర్వాతి కవితా సంపుటం “ఆకులు రాలే దృశ్యం”(2005) లోకి వచ్చేటప్పటికి కవి ప్రపంచీకరణ భూతం ఆవహించిన దేశాన్ని చూస్తున్నాడు. 2004 , 2005 లో రాయబడిన కవితల్లో డాలర్ల కామెర్ల రోగం అంటుకున్న కొడుకుల గురించి రాస్తాడు. ‘ఏ పుట్టినరోజైనా/పొరపాటున/’అమ్మ బావున్నావా’ అంటూ/ధ్వని తరంగాల్తోఅల్లుకుంటే చాలు/నాగబంధం లా మారి /బాధించిన పేగు బంధం లో / ఆ రోజంతా పులకింతలు/ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన కళ్ళు/కాంతి పుష్పాలౌతాయి/ఆమె శరీరం నిలువెల్లా/నవ్వుల వనం/ఇక్కడి అమ్మానాన్నలు /శిలువల్ని గుండెల్లో/ మౌనంగా మోస్తున్న/ ఏసుక్రీస్తులు”(కొడుకు.కామ్)

నాగలిని మోస్తున్న రైతు తన శిలువను తానే మోస్తున్న ఏసు క్రీస్తులా ఉన్నాడు అంటాడొక కవితలో గుంటూరు శేషేంద్ర శర్మ. ఈ కవితలో ఒక వేదనాత్మకత, అటువంటి కొడుకులకు ఒక ఎరుక కలిగించడం తప్ప కవి ధోరణి లో didactic అంటే ప్రవచన ధోరణి లేదు. ఈ సంపుటిలోని కవితలన్నిటిలోనూ కవి నలిగిపోయిన ఆత్మ వేదన అగుపిస్తుంది. ఎక్కువ కవితల్లో భావుకత, నిస్సహాయత కనిపిస్తుంది. ‘మనిషికీ మనిషికీ మధ్య కాక/మనసులోని మాలిన్యంతో/మనిషిలోని కాఠిన్యంతో అయిన రోజు/నేను యుద్ధాన్ని ప్రేమిస్తాను”(నేను యుద్ధాన్ని ప్రేమిస్తాను కవిత). ‘మనుషులు స్వజాతి ధృవాలు కదా/ వికర్షించుకుంటూనే ఉంటారు” (నాటకం కవిత నుండి). (ఈ కవిత ప్రపంచీకరణ ప్రతిధ్వని కవితలు, పాటల సంకలనం 2004 నుండి).

‘ఆకులు రాలే దృశ్యం/ మనోహరంగా లేదు/ సృష్టి మర్మాన్ని దాచుకున్న/మరణ దృశ్యం లా/భీతావహం/ఒక్కో ఆకు రాలినపుడల్లా /చెట్టు గుండె రక్తసిక్తం/విరాగిలా మారి/ఒంటికాలి మీద/మౌన ముద్రలో చెట్టు.” (ఆకులు రాలే దృశ్యం కవిత, ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక జూలై 2004). ‘చెట్లు కూలే దృశ్యాన్ని కళ్ళకు కడతాడు అజంతా. అలాంటి ఆవేదనాత్మకమైన టోన్ ఈ కవితలోనూ ఉంది.

‘జీవన వేదాన్ని/మౌనంగా బోధిస్తున్న/మహాయోగి/మా పెరట్లోని వేపచెట్టు’ (ఆకులు రాలే దృశ్యం) అనడం లో జీవన తాత్విక ధోరణి కనిపిస్తుంది. Personification (రూపు కట్టించడం) ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్. మనిషితనాన్ని గుణాన్ని మనిషి కాని దానికి అన్వయించడాన్ని అంటారు. అలాంటిదే ఈ ‘మహాయోగి’ ప్రయోగం.

ప్రేమ, విషాదం, మౌనం, సముద్రం గురించిన ఎక్కువ ప్రతీకలు కనిపిస్తాయి సలీం కవిత్వం లో. 2013 లో వెలువరించిన ‘విషాద వర్ణం’ లో ఒక సామాజిక మేధావి అగుపిస్తాడు. ఒక కవి కవిత్వాన్ని విశ్లేషించినపుడు అతని వస్తువును, శిల్పాన్ని విడదీసి చెప్పడం అసాధ్యం. ఎందుకంటే వస్తువు బట్టే రూపం, అభివ్యక్తి, ధోరణి ఉంటాయన్నది స్పష్టం. వస్తు విశ్లేషణ మాటాడటంలో రూపాన్ని, ధోరణిని పరిగణించక పోయినా కొద్దిగా చెప్పినా చాలు. కానీ శిల్పం గురించి చెప్పేటప్పుడు రెంటినీ కలిపిగానీ చెప్పలేము.

సలీం లో సముద్రం ఉంది. అతనే ఒక అక్షర సముద్రం. సముద్రాన్ని ప్రేమించని వారు ఎవ్వరూ ఉండరేమో. ప్రతి మనిషీ ఒక కడలి లాంటి వాడే. అందుకే ప్రతి భావానికి అనునిత్యం కదిలిపోతూనే ఉంటాడు.

‘ఉవ్వెత్తున ఎగసి/గొప్ప శబ్దం చేస్తూ విరిగి/పడి- ప్రవహించి- అలసి/నా పాదాలదాకా ప్రాకి…./వుహు…నేనే నీకు తల వొంచుతాను/నాకు నేర్పవూ…./ఆ ఓర్పునీ-పట్టుదలనీ /ఉత్సాహాన్నీ-ఔన్నత్యాన్ని(సముద్రం, 12/4/87) అంటూ వినమ్రంగా సముద్రమెదుట సలీం, విషాద వర్ణం లో సముద్రాన్ని ఎంత తాత్వికంగా వర్ణిస్తాడో చూద్దాం. తానూ సముద్రం ఒకటేనన్న ఎరుక గలిగిన కవి తానా అక్షరాల అలలలో ఎలా ఒలికిపోతాడో చూద్దాం. ఒక నిశ్చిత దృక్పధం కలిగిన వైనం మనకు అగుపిస్తుంది.

 

నేనూ-సముద్రం

నింగి కెగబాకినా/చివరికి నేలకు తల వొంచాల్సిందేనని/నిరంతరం గుర్తు చేస్తూ/నిలువెత్తు నినాదం లా/నా ఎదురుగా సముద్రం/మట్టితల్లి గుండెలమీద/గువ్వలా కూచుని/ఎన్ని కువకువలో/పరవళ్ళు తొక్కినా/కెరటాలు కేరింతలైనా/పెను తుఫానుల /ప్రళయ భీకర గర్జనలైనా /పడిపోనని…అందుకే/దానికంత నిర్భయత్వం/అలల లేత పెదాల మీద/నురగల చిర్నవ్వుతో/నా ముందు వయ్యారపు/నడుం వంపుల్తో /నడయాడే సముద్రం/కవ్వించే నీతి సుందరి/బిందువుల నిండా /ఉప్పటి జ్ఞాపకాల్ని/మోసుకొస్తున్న సముద్రం/పరుచుకున్న అద్దం లా/మార్మిక గతాల్లోకి తెర్చుకుంటూ/ నా రక్తంలోకి ప్రవహించి/పోటెత్తే వందల సముద్రాలుగా విడిపోయి/ఒక్కో కన్నీటి బిందువులో/మూట గట్టుకున్న ఎన్ని సింధువులో/నా శ్రామిక శరీరం మీద /కిరణాల విత్తనాలు నాటే ఎండకి/మొలకెత్తిన సముద్రాలెన్నో/నేను సముద్రాన్ని భుజాలకెత్తుకుని/భూమధ్య రేఖ అంచులదాకా/నడిచాక/నాలోకి చూసుకుంటే/నాలోనే సముద్రం/ప్రశాంతంగా, కల్లోలంగా/కర్కశంగా, కవ్వింతగా/అలల తాకిడికి/తరిగి విరిగి/నా తనువు లుప్తమైపోయి/ప్రస్తుతం నేనే సముద్రం/సముద్రమే నేను (విషాద వర్ణం నుండి)

అలనాడు తన ఔన్నత్యాన్ని తనకు నేర్పమని వినమ్రిల్లిన కవి నేడు సముద్రాన్ని తానే అయి ఔపోసన పట్టిన అగస్త్యుడుగా మారాడు. ఇది కవితలోనూ, జీవితంలోనూ, అభివ్యక్తిలోనూ వచ్చిన వైవిధ్యం, కవిత్వ శిల్ప సాంద్రత, నైపుణ్యం. కప్పి చెప్పేది కవిత్వం అంటారు. కవితలోని ఆ మార్మికత, సూచ్య ప్రాయంగా చెప్పే ఆ సింబాలిజం లేకుంటే అది కవిత్వం అనిపించుకోదు. అలాంటి మార్మికతను, శిల్ప వైవిధ్యాన్ని సరైన నైపుణ్యం తో పోషించిన వాడే మంచి కవి.

మరణం గురించి రాయని కవి ఉండడేమో. ఈ ప్రకృతి సత్యం. ఆ సత్యాన్ని తమ తమ ధోరణులలో నుడివే వారే కవులు. ‘ఏకం సత్ విప్రా (కవీనామ్) బహుదా వదంతి’. ఒకోసారి ప్రకృతికి తనలోని భావాలను అనుసంధానించి రాస్తాడు కవి. ఒకోసారి ప్రకృతిలోని భీబత్సాన్ని, అందాన్ని, విషాదాన్ని తనకు అన్వయించుకుంటాడు ఇది చెయ్యి తిరిగిన శిల్ప కారుడు శిల్పం చెక్కినట్టు కలం ఉలితో కాగితం పై బహు నేర్పుగా చెక్కగలిగే వాడు మంచి కవి.

ప్రజల నాల్కలందు మిగిలిపోయిన అద్భుత జీవన తాత్విక కవి వేమన ప్రాంగణంలోనే ఉన్నాం మనం. అలనాడే ఛాందసాలను పారద్రోలిన, ప్రశ్నించిన కవి వేమన. అలాంటి విప్లవ ధోరణి మనకి సలీం లో మాయమైపోతున్న అడవులను గురించి, మనుషులలోని మానవత్వం గురించి ప్రశ్నించినప్పుడు అగుపిస్తుంది. The poet is the conscious conscience keeper of the society అనడం లో అతిశయోక్తి లేదు.

కవి అంతర్ముఖుడైనప్పుడు అతనిలోని ఆత్మ పరిశీలనా దృష్టి కలిగినప్పుడు ‘మరణ శయ్య మీద పడుకుని/మరోసారి జీవితాన్ని దర్శించుకున్నప్పుడు/చేసిన ఒక మంచి పనైనా/గుర్తుకు రాకపోతే /నువ్వెప్పుడో మరణించినట్లు…(మరణమంటే… కవిత ). ఆత్మ విమర్శ, సంఘ విమర్శ ఈ రెండూ కవికి అత్యవసర అంశాలు. ‘ ఏ శిల్పం? ఏ గాంధర్వం ? ఏ వెలుగులకీ ప్రస్థానం? ‘ అంటాడు శ్రీశ్రీ. ఒక ప్రశ్న, ఒక జవాబు, ఒక అభిశంసన, ఒక ఆకాంక్ష, ఒక మందలింపు, ఒక భావుకత్వ విన్యాసం ఇది కవి శిల్ప సామగ్రి. బియ్యం గింజలో సముద్రాన్ని చెక్కి చూపించగలడు శిల్పి, అలాగే గుప్పెడు అక్షరాల్లో జగతిని సర్వస్వం చూపగలడు కవి. సలీం లో ఈ శిల్ప రహస్యాలు ఉన్నాయి. ఏది ఎంతవరకు ఎలా చెప్పాలో ఎరిగిన కవి సలీం. తన ఒంటరి అన్వేషణను సముద్రం ఆటుపోటులతో చీకట్లో దర్శించ గలిగిన కవి ఇలా అంటాడు ‘కళ్ళు చించుకుని/దిగాంతాల్లోకి చూస్తూ/సముద్రాన్ని ఔపోసన పట్టే/ధ్యాన ముద్రలో నేను/ఇద్దరి ఆరాటం/అందని ప్రశాంతత కోసమే’ (చీకట్లో సముద్రం, విషాద వర్ణం నుండి). సముద్రం లో తనని, తనలోని సముద్రాన్ని అభివ్యక్తీకరించిన కవిని ఆహా నీ శిల్పమనర్ఘం అనవచ్చును కదా. ఒకే వస్తువును తీసుకున్నా వివిధ దశల్లో విశిష్టంగా వర్ణించడం లోనే ఈ కవి నిష్ణాతత ఉంది.

కవిత్వం లో కొన్ని వర్ణనా విశేషాలని, కొన్ని భావావేశాన్ని, కొన్ని సందేశాన్ని, మరి కొన్ని మందలింపులని, మరి కొన్ని విషాద స్మృతులని, మరి కొన్ని మధుర స్మృతులనే వివిధ వర్ణాల బహు రూపాల శిల్పాలుగా రూపు దిద్దుకుంటాయి సలీం కవిత్వం లో. వస్తువు బట్టి రూపం అభివ్యక్తి కవిత నిడివి ఇవన్నీ స్పష్టమౌతాయి కవికి. ఒకే వస్తువు విపరీతమైన సాంద్రత కలిగినది అయినప్పుడు అది దీర్ఘ కవితగా రూపు దిద్దుకుంటుంది. అలాంటి దీర్ఘ కవితలు సలీం కలం నుండి ఇంకా జాలువారినట్టు లేదు.

‘శరీరం ఒక నగరం ‘ అంటాడు డాక్టర్ కె సచ్చితానందన్ అలా ‘శరీరం ఓ యుద్ధ భూమి’ అంటాడు సలీం. వస్తువు శరీరమే కానీ అభివ్యక్తి లో తేడా చూడాలి. రాజకీయ అరాచకాలను ప్రశ్నిస్తూ కలం ఝుళిపిస్తాడు, జాతీయ క్రీడను అవమానిస్తూ క్రికెట్ భూతాన్ని మోస్తున్న వారిని నిరసిస్తాడు. సలీం భావ సాంద్రతను అభివ్యక్తి శిల్పాన్ని చెప్పే కొన్ని ఉదాహరణలు:

‘ఆకలేస్తోందంటే/ఎడారిలో పెట్రోల్ బావుల్లోకి/అమాంతం విసిరేశారు అమ్మానాన్నా'(బంధిఖాన కవిత నుండి), అరబ్ శేకులకిచ్చి పెళ్లి చేసి చిన్నారులను దయాహీనంగా పంపేశారనే వెడల్పాటి దృశ్యం ఒక చిన్న వాక్యంలో ఇమిడ్చి చెప్పగలిగాడు.

‘ముఖ సముద్రంలా నేను/ఎన్ని నేనులు నాలో కలిస్తే/నేనైనానో…'(ఎన్ని ముఖాలో… నుండి)

‘జర్మనీ గుండెల్ని రెండుగా చీల్చి/సుప్త భుజంగంలా విశ్రమించిన గోడ/రెక్కలు విడిల్చిన ఇటుక గువ్వల సమూహమైంది/యాంత్రికంగా శ్రమించే కొడవళ్ళకు/ఆలోచించే మెదళ్లు మొలుచుకొచ్చాయి’ (స్వేచ్చ… కవిత నుండి) అంతర్జాతీయ అవగాహనను తెలియ జేస్తుంది ఈ కవిత. అలాగే కాశ్మీరు గురించి కూడా ఒక కవిత ఉంది సలీం కవిత్వం లో. ఏయే వేళల పూసే పూవుల ఆయా వేళల పూజించి అని గురజాడ వారు పూర్ణమ్మను గురించి రాసినట్టు ఏయే సందర్భాలను బట్టి ఆయా ప్రతిస్పందనలను తన కవిత్వం లో అందిస్తాడు సలీం.

‘ఒక విషాదం లోంచి మరో విషాదం లోకి ప్రయాణమేగా జీవితం’ (పద్మవ్యూహం… కవిత నుండి)

‘ముక్కలుగా తెగి పడుతున్న కాలం/ మనసుని జ్ఞాపకాల ఉలితో చెక్కుకుంటూ నేను’ (కాలం… కవిత నుండి)

అడవంటే ఒకప్పుడు/వేల చెట్లుగా మారిన అన్నం ముద్ద /ఇప్పుడదే ఎగసిపడ్తున్న/నీలం రంగు కడుపు కోత/ఆమె గుండెల్లో/ఎర్రగా  మొలకెత్తి దగ్ధమై పోతున్న/ఖాండవ వనాలు/నిద్రలో కొడుకుని కలగని/ఉలిక్కిపడి లేచి/చిరిగిన కప్పులోనుంచి కారే/నల్లటి ఆకాశాన్ని తాగేసి/ఎగిసిపడే కన్నీటి జలపాతమై/ఎన్నటికీ తీరని శోకమై/శ్వాసిస్తున్న శవమై…అనేక రంగుల్లో చిత్రించిన/ధు:ఖ చిత్ర పటంలా ఆమె (విషాద వర్ణం…. కవిత నుండి, ఒక చెంచు తల్లి ఆవేదన చూశాక రాసినది).

‘వస్తువులన్ని స్థానభ్రంశమై/అబ్స్త్రాక్ట్ చిత్రం లా అలరిస్తూ ఉంటాయి/ (మనవడి కోసం)

‘మళ్ళీ వాడు వచ్చే రోజు కోసం పువ్వులా వికసించడానికి/నేను శిలాజపు మొగ్గ లా ముడుచుకుపోతాను’ (మనవడి కోసం) ఇలా కొన్ని పద ప్రయోగ విన్యాసాలు, మంచి ప్రతీకలు సలీం కవిత్వ శిల్పానికి అలంకారాలయ్యాయి. సలీం మంచి కవి, కవిత్వ ప్రతిభ ఉన్న కవి. సలీం కలం నుండి ఇంకా మరిన్ని కవితాజలపాతాలు ప్రవహించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. సలీం దీర్ఘ కవిత కోసం నిరీక్షిస్తున్నాను.

************************************************************

8. ద్విభాషితాలు…                                                                                                 10. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు…