02

మాధవా !

1.  శరణు శరణము శరణు శరణము, శరణు శరణము శరణమణినీ

చరణముల పడిశరణమన్నను, కరుణకలుగద మాధవా !

2.  పట్టితిని నీ పదాబ్జంబుల, పట్టు విడువక భక్తిమీరగ

బెట్టు చేయక గట్టు చేర్పర, ఇట్టెక్షణమున, మాధవా !

3.  పేదయేనని పెదవి విరిచి నిరాదరింపక, అలుసు చేయక

సాదరంబున నన్ను నేలవె, మోదమొసగియు మాధవా !

4.   వట్టి చేతుల పుట్టుమనుజుడు వట్టి చేతుల మట్టికలియును

పట్టి గైకొను పాపపుణ్యాల్ కట్టె తోడను మాధవా !

5.   వట్టి చేతుల వచ్చినానని, నెట్టివేయక, నెపములెన్నక

దట్టమగు సద్భక్తి చూడర, తట్టి నా హృది మాధవా !

6.    నిన్ను కొని నీ ప్రేమగెల్వగ, ఎన్నజగముల నెవరితరమగు ?

మున్ను నీ సతిమున్గదే అవమాన భారమున మాధవా !

7.     పట్టినానా ? కట్టినానా ? తిట్టినానా ? తిమ్మినానా ?

ఎట్టులోర్తును ఇట్టినిర్దయ, పట్టిసారక మాధవా !

8.     భామ పూతన ప్రాణమూడ్చగ, పాము పడగల పదము చిందిడ,

మామ కంసుని మట్టు బెట్టగ భూమి మురిసెను మాధవా !

9.      ఫలితమునకై పరితపించక, పట్టిదీక్షగ పనిని సేయగ,

పలువరమ్ములు ప్రసాదింతువు పరమపావన ! మాధవా !

10.     వీడి నామము, వేడిలోభుల, కూడికుజనుల, ఆడికల్లలు

ఓడితిని భువి పోరిబ్రతుకున, నీడనిడరా, మాధవా !

11.     వీడి నామము, వీడిస్మరణము, వీడి శ్రవణము, వీడి చరణము,

వీడి పూజలు, వీడి భజనలు, ఏడ సుఖమిక ? మాధవా !

12.     సంధి కూర్పగ సమర్ధుండవు, సంధికూర్పగ చతుర బుద్ధివి,

విందుకద, రణదుందుభుల్ విన, సంధి చేతువె ? మాధవా !

13.     ఎవరి వేడితి ? ఎవరిపాడితి ? ఎవరికూడితి ? ఎవరికొలిచితి ?

ఎవరి నా హృదినవధరించితి ? నిజము చెప్పుము మాధవా !

14.     కర్మతతులకు కర్తనీవే, కర్మఫలముల భోక్తనీవే,

కర్మఫలములు అంటునే ? నీకర్పితంబిడ మాధవా !

15.      పరుషమగు నాపలుకులన్నియు, సరకు చేయక కరుణ మీరగ,

తరలిరారా తరుణమిదియే, సరసహృదయా, మాధవా !

16.      తోడువై, నా నీడవై నావాడవై కాపాడు దొరవని

పాడి నిరతము పరవశించెడివాడ నిజమిది మాధవా !

17.       వీడి విశ్వాసంబు నమ్మిక వీడిభక్తియు ప్రేమనీపై

పాడి సుఖమా ? ఆడిసుఖమా ? వేడి సుఖమా ? మాధవా !

18.       చలము చేసిన నిలువ లేనని తెలిసి యున్నను పలుకరావిటు

అలుకలేలర ? ఆశ్రితావన అల్పుడనురా ! మాధవా !

19.       అణచివేయ నధర్మతిమిరము, అవధరింపగ ధర్మజ్యోతుల

అవతరింపవె ? అవని పరిపరి, అమృతమూర్తీ ! మాధవా !

20.      వీడచున్నది జపము జీవము, వాడుచున్నది బ్రతుకు సుమలత,

తోడువై నానీడవైకాపాడరావయ, మాధవా !

21.      తలుచువారికి తలను నాల్కవు, కొలుచు వారికి కొంగుబంగరు,

వలుచు వారికి కల్పలతికవు, తెలియ నిజమిదె, మాధవా !

22.       అరుదొంగల బారిపడి ఏదారి కానక తల్లడిలునను,

వీర ! శూర ! సుధీర ! కావర, మారజనకా ! మాధవా !

23.       దిక్కునీవని, దేవుడీవని, మక్కువగ నీమరుగు జొచ్ఛితి,

చక్కనయ్యా ! చనువుచూపర, బక్క భక్తుడ మాధవా !

 

1. ధ్యానశ్లోకములు….                                                                                                        3. మందాక్రాంతా….