10

అమెరికా ఇల్లాలి ముచ్చట్లు

హ్యాండ్ బ్యాగ్ – నేపద్యం

 

ఒక్కోసారి మనం ఎంతో ఎంజాయ్ చేసే వస్తువు మనకు తెలీకుండానే, క్రమేణా ఒక ముఖ్యమైన వస్తువయి పోతుంది. దాంతో అది మనకు ఒక బాద్యతతో కూడిన బరువైపోతుంది. హైదరాబాద్ లో కాలేజీలో చదువుకునే రోజుల్లో, సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ బస్సులో ప్రయాణం చేసే నేను భుజానికి ఓ చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్తుండేదాన్ని. అలా ఆ బ్యాగ్ భుజానికి తగిలించుకుని వెళ్లటం నాకు చాలా ఇష్టంగా ఉండేది. అమెరికా వచ్చాక నేను మొట్టమొదటగా ముచ్చటపడి కొనుక్కున్న వస్తువు హ్యాండ్ బ్యాగ్! ఇప్పుడు నాకు ఆసక్తి లేనిది, నేను పెద్దగా ఇష్టపడని వస్తువు ఏది అంటే హ్యాండ్ బ్యాగ్! నాలో వచ్చిన మార్పే నాచేత ఈ ముచ్చట రాయించింది.

ఈ “హ్యాండ్ బ్యాగ్” ఆర్టికల్ చదివి బావుందంటూ చాలా మంది ఆడవాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. నా ఫ్రెండ్ ఒకావిడ వాళ్ళ అమ్మగారు హటాత్తుగా పోతే ఇండియా వెళ్లారు. వెళ్ళగానే బంధువులు ముఖ్యమైన కాగితాలు…డబ్బు దస్కం అన్నీ తెచ్చి ఆవిడ హ్యాండ్ బ్యాగ్ లో కుక్కుతూ “బ్యాగ్ జాగ్రత్త” అని పదేపదే చెప్తుంటే అంత బాధలోనూ ఆవిడకు నా ఆర్టికల్ గుర్తొచ్చి నవ్వుకున్నానని నాకు తర్వాత చెప్పారు!

 

 హ్యాండ్ బ్యాగ్

ఏమిటీ…నా బర్త్ డే గిఫ్ట్ గా ఈ బ్యాగ్ కొన్నారా?

ఈ భోషాణమంత బ్యాగ్ ఇప్పుడు నేనేం చేసుకోవాలటా?

నాకు అన్నింటికీ వీలుగా ఉంటుందని కొన్నారా?  నేను మొయ్యలే గాని బ్యాగేం ఖర్మ బస్తాయే కొనిస్తారు!

మన పెళ్ళయిన కొత్తల్లో నా పుట్టినరోజుకు ఇలాగే మీరు నాకు హ్యాండ్ బ్యాగ్ కొనిచ్చారు. ఆరోజుల్లో మీరిచ్చిన ఆ బ్యాగును చూసుకుని మురిసిపోయాను! అందులో నా అలంకార వస్తువులు పెట్టుకోవాలని చెప్పారు. వెంటనే నా పౌడరు, తిలకం, కొత్త జేబురుమాలు అందులో పెట్టుకున్నాను. ఆరోజు సాయంత్రం నన్ను మీరు సినిమాకు కూడా తీసికెళ్ళారు. మీరు రిక్షా మాట్లాడుతుంటే, నేను నడిచి వెళ్దామన్నాను గుర్తుందా?

మెత్తగా అందంగా ఉన్న ఆ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మీద నడుస్తూ నా అందం రెట్టింపైదనుకున్నాను! ఈ బ్యాగ్ నా సొంతం అని, అందులో నా వస్తువులన్నీ దాచుకోవచ్చని ఆనందపడ్డాను. కానీ..అమెరికా వచ్చాక తెలిసింది హ్యాండ్ బ్యాగ్ ఆడవాళ్ళ అలంకారానికి గుర్తు కాదని, అది వాళ్ళ బాధ్యతలకు గుర్తూ అని.

బయటికెళ్ళినా అందరి అవసరాలు తీరుస్తూ ఉండాలి కాబట్టి ఆడవాళ్ళకు హ్యాండ్ బ్యాగ్ చాలా అవసరమని అనుభవం మీద తెలుసుకున్నాను. వచ్చిన కొత్తల్లో పౌడర్, లిప్స్టిక్, పర్ ఫ్యుమ్ పెట్టుకునేదాన్ని. ఒళ్ళో నా బ్యాగ్ ఖాళీగా ఉందని తెలుసుకున్న మీరు నెమ్మదిగా టోల్ టిక్కట్లు, టోల్ బూత్ దగ్గర పే చెయ్యడానికి తెచ్చిన చిల్లరడబ్బులు, టోకెన్లు, మీ మ్యాపుల కట్ట ఇచ్చి బ్యాగ్ లో పెట్టుకోమనేవారు. అప్పుడప్పుడు మీ సిగరెట్లు కూడా నా బ్యాగ్ లో పెట్టేవారు.

తర్వాత పిల్లలొచ్చారు. వాళ్ళు పసివాళ్ళుగా ఉన్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ తో పాటు డైపర్ బ్యాగ్ సరేసరి! తర్వాత పిల్లలు చిన్నవయసులో ఉన్నప్పుడు కారెక్కిన క్షణం నుంచి “ఆర్ వుయి దేర్ ఎట్ “ అంటూ అడిగే వాళ్ళను శాంతపరచటానికి బ్యాగ్ లొ కుక్కీలు, క్యాండీలు,చాక్లెట్లు, చూయింగమ్ములు పెట్టుకునేదాన్ని. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యాక వాళ్ళను మనతో పార్టీలకు తీసికెళ్ళటానికి గగనమయ్యేది. “డు వుయి హావ్ టు కమ్?” అంటూ నన్ను ఉద్ధరిస్తున్నట్టు బయలుదేరేవారు. ఎక్కడికెళ్ళాలన్నా ముందుగా వాళ్ళ బుక్స్, టేపులు, బాల్స్, పజిల్స్ నా బ్యాగ్ లొ కుక్కి మరీ ఎక్కేవారు. ఏవన్నా అంటే, “వుయి నీడ్ దెమ్” అనేవారు. వాళ్ళ వస్తువులతో నా బ్యాగ్ ఎప్పుడూ మా ఊళ్ళో నాదస్వరం ఊదే మస్తాను మొహంలా ఉండేది! నా బ్యాగ్ అని పేరుకే గాని దాన్నిండా పిల్లల వస్తువులే ఉండేవి. తెగిపోయిన టేపులు, మెల్ట్ అయిన చాక్లెట్లు, ఎండిపోయిన చూయింగమ్ములు, ముక్కులు విరిగిన పెన్సిళ్ళు, రాయని పెన్నులు….

ఇంట్లో ఎవరికి ఏ వస్తువు కనిపించకపోయినా వెంటనే “చెక్ మామ్స్ బ్యాగ్” అంటూ దాడి చేస్తారు. ఆ బ్యాగ్ మీ సొంతమే అన్నట్లు సోదా చెయ్యడమే కాకుండా అవసరమైతే కిందా మీదా బోర్లించి కావాల్సింది కనబడితే తీసేసుకుని, కనిపించకపోతే నన్ను బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు. పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత “హమ్మయ్య” అనుకుని నా హ్యాండ్ బ్యాగ్ నా సొంతం అవుతుందని భ్రమ పడ్డాను.

కానీ మీరు నాకు ఇంకో పిల్లవాడై కూర్చున్నారు!

గడప దాటితే చాలు “ఇదిగో అంటూ వాలెట్..కళ్ళజోడు.. పెన్ను..ఆఫీసు తాళాలు అంటూ చదివింపులు మొదలు పెడ్తారు. అసలు మీ వస్తువులు నేనెందుకు మొయ్యాలిటా?…నాకు తెలీక అడుగుతా!

ఏమన్నా అంటే పిల్లల కంటే ఎక్కువగా మీ పన్లను సమర్ధించుకుంటారు. పర్సు బ్యాక్ పొకెట్ లొ పెట్టుకుంటే నడ్డి నెప్పి..తాళాలు జేబులో ఉంటే గుచ్చుకుంటాయి…కళ్ళజోడు షర్ట్ జేబులో పెట్టుకుంటే వంగినప్పుడల్లా టప్పుమని కిందపడుతుంది వగైరా…వగైరా. అందుకని నా హ్యాండ్ బ్యాగ్ లో పెడితే ఏ గొడవా ఉండదు మామూలే! పోనీ అంతటితో అగారా అంటే లేదే..

లేటు వయసులో ఘాటు ప్రేమ అని ఇంత వయసొచ్చి మళ్ళీ తల్లినయినట్టుంది నా పని! పిల్లలు పసివాళ్ళుగా ఉన్నప్పుడు కూడా నాకు ఇంత పని ఉండేది కాదు. మరి ఇప్పుడు ఇల్లు కదలాలంటే ఎంత తతంగం! “తింటే ఆయాసం, తినకపోతే నీరసం” అని మీకు ఎప్పుడు ఆకలేస్తుందో, ఎక్కడ నీరసం వచ్చి మీ షుగర్ లెవెల్ పడిపోతుందో అని భయం. దీనికి తోడు సీజను మారితే చాలు నేనున్నానంటూ తయారయ్యే ఆస్తమా ఒకటి. కీళ్ళ బాధ ఉండనే ఉంది. అందుకోసం జ్యూస్ బాటిల్స్..నీళ్ళ సీసాలు, ఎమర్జెన్సీ ఫుడ్డు, గ్లూకోజ్ మానిటరు, ఇన్ హేలరు, కీళ్ళనొప్పి క్రీము, మీ మూతి ముక్కు తుడుచుకోవటానికి టవలు, టిష్యులు, మీ సెల్ ఫోను, నా నెత్తికాయ…

పెళ్ళి….పిల్లలు….సంసారం…..బాధ్యతలు పెరిగినట్లే నా బ్యాగ్ బరువు కూడా పెరుగుతూ వచ్చింది. కాలంతో పాటు మనమూ మారుతున్నట్లు నా హ్యాండ్ బ్యాగ్ కూడా అవసరానికి అనుగుణంగా సైజు, క్వాలిటీ, ఎఫిషియన్సీ మారుతూ ఉంటుంది. ఏ వెకేషనుకు వెళ్ళినా మీరు కేర్ ఫ్రీగా తిరిగేస్తూ, నేను ఎక్కడ రిలాక్స్ అవుతానో అని “నీ హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్త!” అంటూ రిమైండ్ చేస్తూ ఉంటారు.

ఇండియా వెళ్ళినప్పుడల్లా రైలు ప్రయాణాల్లో మీరు..పిల్లలు సుబ్బరంగా భోజనాలు కానిచ్చి బర్తులు పరుచుకుని గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటారు. నేను నా బ్యాగ్ లో ఉన్న డబ్బుకట్టలు, టిక్కెట్లు, పాస్ పోర్టులు ఎవడూ ఎత్తుకుపోకుండా కాపలా కాస్తూ ఉంటాను. బాధ్యత అనే పదవి మొగాళ్ళ సొత్తే అయినా దాన్ని కాపలా కాసి కాపాడేది ఆడదే కదా?!

మీ అవసరాలకు అంతరాయం కలగకుండా ఉండటానికే మీ మగవాళ్ళు “లేడీస్ హ్యాండ్ బ్యాగ్” ని కనిపెట్టారు. అందుకే ఎన్నో అందాల్ని విరజిమ్మేటట్లు తయారు చేసారు!

పైకి ఎంతో మెత్తగా, సుకుమారంగా కనపడే ఈ హ్యాండ్ బ్యాగ్ లు లోపల ఎంతో బరువును మోస్తూవుంటాయి…. ఆడదాని లాగే !

******************************************************

 

9. నేను సైతం…                                                                                                 11. అయిదు రోజుల పెళ్ళి…