06

పారిజాత సౌరభము – సమీక్ష

కోనసీమ కవికోకిల డాక్టర్‌ వక్కలంక లక్ష్మీపతి రావు గారి లేఖిని నుండి జాలువారిన అమృత గుళిక ఈ పారిజాత సౌరభము. ఈ చిన్ని కావ్యములో కధ పాతదైనను కల్పన కొత్తదై, పారిజాత ప్రసూనమై పరిమళించినది. నాయిక తిరుమల దేవి, నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు. తిరుమల దేవి పాత్రను కృష్ణరాయలు నంది తిమ్మన, అప్పాజీ, గజపతుల పాత్ర చిత్రణములు రమ్యముగా తీర్చిదిద్దబడినవి. తిరుమలది గంభీరమైన ప్రకృతి. రాయలు, తిరుమల నిండుకుండలు. రాచఠీవి కలిగిన వారిగా చిత్రింపబడినారు.

“ ఇది ఒక మధురమైన కృతి… శిశిరమైన కృతి… సురభిళమైన కృతి. కథను తీర్చునేర్పు ప్రకటించుట కవియందు ఉదాత్తమైన లక్షణము. అదికల కవియందు తక్కిన గుణములు చూపించనక్కరలేదు. యధార్ధమునకు కథా కథనమందు ఇంత నేర్పును కలిగి పద్యరచనయందును, చిన్ని చిన్ని వర్ణనల యందును పద్యరచనా శిల్పమునందును నేర్పులేని వాని కావ్యమును చదువలేము. ఈయనకా నేర్పును కలదు ” అని కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ కావ్యమును ప్రశంసించినారు.

ఇంత శిల్పసుందరమైన కావ్యమును సమీక్షించుట నాయదృష్టము.

శ్రీ కోనసీమ భానోజీరామర్సు కళాశాల సంస్థాపకులు శ్రీ జిల్లెళ్ల వెంకట భానోజీరామర్సు గారికి ఈ కావ్యము అంకిత మీయబడినది.

 

కొమరారున్‌ సమరాఢ్యుడై గజపతి క్షోణీతలేంద్రుండుడు

ర్దమ నాగేంద్ర చమూబలోజ్వలుడు నిర్వక్రప్రతాపస్ఫురత్‌

కమనీయామల కీర్తి వైభవ మహాకల్లోలినీ సంగతి

ప్రమదోద్రేకనట ద్దిశాంత గజరాష్ట్రఖ్యాత సంరంభుడై

 

ఈ కావ్యం ప్రతినాయకుడైన గజపతి వర్ణనతో ప్రారంభమైంది. గజ సైన్యం అధికం.  సార్ధకనామధేయుడు. మత్తేభవృత్తం గౌఢరీతిలో సాగిన సమాసం. సింహం మృగరాజైనప్పటికీ గజరాజు ఎదురుపడక వెనుక నుండి లంఘించి దానిని చంపుతుంది. కృష్ణరాయలు ముఖాముఖి ఎదిరించక యుక్తితో వశపరచుకోవడం సూచింపబడింది.

ద్వారపాలకుడని జనులు భ్రమించేలా శిల్పాభిమాని అయిన గజపతిరాజు శ్రీ కృష్ణదేవరాయల విగ్రహమును చేయించి ఉద్యానవనంలో పెట్టించాడు.

అవ్యక్త మధురములై వచ్చీరాని మాటలు వరహాల మూటలుగా చిన్నారిమోముపై చిందించు చిరునవ్వు వెన్నెలలు ఇంటికి వెలుగు కాగా పనీ లేక, తీరుబడీ లేక చేసే అల్లరి చేష్టలు ఉల్లము రంజిల్ల చేస్తూ పూర్వజన్మ సంస్కారం ఫలితం వలన కూనిరాగాలలో గాంధర్వగానం పలికిస్తూ ఇల్లు నిండిన బిడ్డయై ఎల్లవేళల తిమ్మన కవి చెంతనే చనువుగా తిరుగుతూ చీకూ చింతా లేని చిన్నతనమును గజపతి తనూజ స్వేచ్ఛగా గడుప సాగింది.

పువ్వు పుట్టగానే పరిమళించునట్లు తిమ్మన గురుత్వంలో చిరుతప్రాయంలోనే తిరుమలమ్మ లలిత కళల యందు అభిలాష కలిగినది అయింది. రాయల గురించి రహస్యంగా రూపయౌవన పరాక్రమములను వీనులవిందుగా తిమ్మన చెప్తుంటే మదిలో తీయని ఊహలతో సిగ్గుతో తలవంచేది తిరుమల.

ఏ కళాకారుడో ధన్యుడీ విధంగా భావనామాత్ర కల్పిత ప్రతిమకాక ఇంతటి మోహనాకారుడు భూమిపైన ఉంటే కనుక అతడు ధన్యుడు అన్నది తిరుమల. ఇంత అద్భుత కళాఖండమును నా చిత్రశాలలో కాక దొడ్డి గుమ్మంలో పెట్టడానికి హేతువేమో అనుకున్నది.

పరులెవ్వరైనా పచ్చగా ఉంటే హర్షింపలేని ఈర్ష్యాపరుడు క్షాత్రం పేరుతో యుద్ధరంగంలో పచ్చినెత్తురు త్రాగు పరమపాపి గజపతి సార్ధక నామధేయుడుగా శత్రువని భావించినచో కన్నకూతురినీ అల్లునీ లెక్క చేయని నిర్వక్రపరాక్రమునిగా, ఆవేశపరునిగా చిత్రింపబడినాడు.

“ సామ్రాజ్యకాంక్షతో శాంత్యహింసలను సాగనీయని దురాశా పిశాచి, రాజ్యాంగ నిర్వహణ తంత్రమనే తెరవెనుక పరుల కొంపలు కూల్చే వంచకుడు, నీచకులుడైనా నిక్కపురాచవని వేషముననున్నవట్టి డాంభికుడు వీడు ఇస్సిసీ. వీడికి ఈ కృష్ణరాయనికి ఇంతకన్నా ఉచిత స్థానము ఇంకెక్కడిది? ” అన్నాడు గజపతి. ‘ సిద్ధహస్తుడైన శిల్పి చేత బడి లేని ఠీవి కలిగింది వీడికి కులము తక్కువ, గుణహీనుడు పైకి వీడు మేడిపండు ’ అని ఈర్ష్యతో పలికాడు. తండ్రి మనసును గ్రహించి రాయల పరాక్రమమును చూసి ఒడలు పులకించింది కన్యకి. ఈ సందర్భము కవిత్వ కళలో సిద్ధహస్తులైన రావు గారి ప్రతిభకి కలికితురాయి.

తండ్రి చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కిట్టని వాళ్ళు ఎవరో లేనిపోని అపవాదులు అంటకట్టారేమో. రాయలు నాగాంబికా తనయుడని సుక్షత్త్రియ వంశసంభవుడని అంటారు. అంతవాడు దాసీ సుతుడెలా అవుతాడు? అని వితర్కించుకొని ముందే రాయల యశమును విన్న తిరుమల ఆ విగ్రహమును చూసిన మొదలు కాంచు… మఱి కాంచు… మఱి కాంచి… కాంచి నిజ మన: ఫలక మందు నిలుపుకొనగోరింది. క్రిందికి కొట్టే కొలదీ బంతి అంతకంతకు ఎగిరి మిన్నందునట్లు పగతుని తండ్రి కసితీరా తెగడు కొలది తిరుమలమ్మకు అనురాగభారం హెచ్చింది. తిరుమల స్వభావ చిత్రణ తండ్రిని కాదని రాయలను చేపట్టే భావి కథాసూచన చేశారు కవి.

తన రూపం ఆ రాజునకు అను రూపం అవునో కాదో అని శంకించి మనసిచ్చి తనను భార్యగా చేసుకొనునో లేదో అని కొందల మందింది.

కన్నుమూసినా తెరచినా తన ప్రియుని ఊహించుకుంటూ తన తండ్రికి శత్రువు కనుక అందని మ్రానిపండేమో, వీరాధి వీరుడు దాసీ కుమారుడెట్లు అవుతాడని మధన పడింది. ఏ కారణం లేకుండా లోకములో ఈ నింద వస్తుందా అని సంశయం, శూద్రపుత్రుడైతే నా మనసు వీని యందు ఎలా లగ్నమౌతుంది అని ఏది వాస్తవమో నిశ్చయింప లేక తండ్రి గీచిన గీతను దాటలేక తన మనోరధ మీడేరు దారి లేక అబల కృశింపసాగింది.

సత్పురుషులకు సందేహం వచ్చినపుడు వారి అంత:కరణ ప్రవృత్తులే వారికి ప్రమాణము అనుకొన్నది తిరుమల.

 

ద్వితీయోల్లాసము

రాజవీధులలో రత్నాల రాశులను పోసి విక్రయించుటచే విజయనగరం  శ్రీలకిల్లైంది.

శ్రీలకిల్లై మూడు పూలారుకాయలై ఆంధ్రవైభవము మిన్నంటుతావు కృష్ణరాయేంద్రుని కేల్వట్టి శారద చిరునవ్వు వెన్నెలలు చిమ్ముచోటు చైతోత్సవములందు నేత్ర పర్వమ్ముగా కళలు గుబాళించు తెలుగు తోట అతిలోక నిష్ఠ విద్యారణ్యుడవనిలో ప్రభవింపజేసిన స్వర్గసీమ రివులవేడి నెత్తుట జేవురించి తుంగభద్ర  త్రుళ్ళింతలిడి తన్ను పలుకరింప కృష్ణరాయల చల్లని యేలుబడిని విజయభేరులు మ్రోయించు విజయనగరి.

సందేహం లేకుండా శత్రువులను సాధించు పంతంతో కుందేలు పులిపిల్లలా చెలగు తెలుగుగడ్డ ఖడ్గదేవతకు తుష్టి కలిగేలా శత్రువులను వందలూ వేలూ బలిపెట్టే ఆంధ్రచరిత్ర వాసికెక్కినదిక్కడే.

తిమ్మరుసు మంత్రి రాజ్యాంగ ధిషణతో విపుల బాహుపటిమతో యశము మిన్నందుకొనేలా రాజ్యమేలే శ్రీకృష్ణరాయప్రభువీతడే. రాయలకు గల సాహితీ ప్రియత్వమే రాబోవు కథలో వారి కాపురాన్ని నిలబెట్టడానికి కారణమైంది.

అష్టదిగ్గజములను తన ఆస్థానమున నిలిపినాడు. ప్రతిభా సమున్మేష భావనా పటిమతో కవులలో గణనకెక్కాడు. రామరాజ్యమును తోసిరాజనేలా రాణౌశిళి సంతతారాధ్యుడైనాడు. విష్ణు కధాగాన వివశుడై ‘ఆముక్త మాల్యద’ను హరికొసంగినాడు. తన సమస్తము కళలకు ధారవోసి సాహితీ సమరాంగణ సార్వభౌముడైనాడు. అనంత విఖ్యాతినందిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణరాయడు ఈతడే.

పక్షపాతమేకాని పరువైన నిష్కళంకత్వ మబ్బని సుధాకరునికన్నా పక్షంలో పాతం నెలలో ఒకపక్షమే ఉండేవాడు కళంకం కలిగిన వాడైన చంద్రునికన్నా రాయలు కళంకంలేని గొప్పవాడు. ఆర్బాటమేకాని అడుగు ముందుకు వేయని మహాజలధి నాయకుని కన్న భటుల గర్జనలే కాని సార్వకాలికమైన త్యాగమబ్బని అంబుదరుని (మేఘం) కన్నా కఠినత్వమే కాని కలలో కూడా మార్దవం తెలీని పర్వతేశ్వరునికన్నా.

శైత్సగాంభీర్య వితరణ ఔన్నత్యములలో (క్రమాలంకారం) ఘనుడితడని విశ్వవిఖ్యాతి నంది యావత్ప్ర జా హృదయాంతరముల సతతము విహరించు నీ మహాచక్రవర్తి ఈ అపరభోజుని వదనాన్ని వీక్షించినంతనే జడునికి కూడా వాణి సాక్షాత్కరిస్తుంది. ఈ రసజ్ఞునీ డెందము నిట్టెదోచు ఆంధ్రకవులకు లక్ష్మీకటాక్షం అరుదా? బిరుదు మగడు, సిసలైన రాచవాడు, గజపతి నీచకులుడు, నిక్కపు రాచవాని వేషములో ఉన్న దాంభికుడు అన్న అభిప్రాయాన్ని ఖండించడానికి ప్రతాపం కలిగిన రాయలు సిసలైన రాచవాడు అన్నారు కవి.

ప్రతాపం రాచలక్షణం వీరుడైన రాయలు దాసీ పుత్రుడు కాదని చెప్పడానికి బిరుదు మగడు, సిసలైన రాచవాడు అనే పదాలను ప్రయోగించారు కవి గారు. కత్తినీ కలాన్ని పట్టి ఇటు సామ్రాజ్యాన్ని, అటు రసలోక సామ్రాజ్యాన్ని ఏలిన భాగ్యశాలి అంటూ కృష్ణదేవరాయల పాత్ర సమగ్ర దర్శనాన్ని వస్తుధ్వనితో మేళవించి పాఠకుల ఎదుట సాక్షాత్కరింప చేశారు కవి. విష్ణు కధాగాన వివశుడై ఆముక్తమాల్యదను విష్ణుమూర్తికి అంకిత మిచ్చి తన సమస్తమూ కళలకు ధారపోసి సాహితీ సమరాంగణ సార్వభౌముడై అనంత ఖ్యాతిని పొందిన ఆంధ్రభోజుడు రాయలు.

దక్షిణాపధనరనాధదంతియూధ మడలగర్జించు రాజసింహుడు. ఈ రాజసింహం గర్జిస్తే  దంతియూధం భయపడుతుంది. ఇంక గజపతిని గురించి చెప్పక్కరలేదని భావం. ఈ రాజభానుడు చండతేజంతో దిశలంతా నిండి వెలుగుతుంటే శత్రురాజుల గుండెలో చీకట్లు అలముకొంటాయి. ఇటువంటి రాయలకు ధీయుక్తిలో బృహస్పతిని మించెడి తిమ్మరుసు యంత్రాంగ శక్తి తోడై ఆంధ్రజాతిని  నిత్యకల్యాణపధంలో నడిపింది.

భార్యాభర్తలను చేరువ చెయ్యడానికి ఆడుదానికి లోకువై తన్నులందిన రసికాగ్రణ్యుల రచ్చకీడ్చి  వాస్తవికత ముచ్చటలనీన తిమ్మన పారిజాతాపహరణ కావ్యాన్ని రచించి రసికాగ్రగణ్యుడైన రాయలకు అంకితమిచ్చాడు. కృతి సమర్పణ వేళ కృష్ణరాయలను ప్రశంసిస్తూ నందితిమ్మన చదివిన పద్యాన్ని కావ్యనాయకుడైన రాయల వర్ణనకు సమయోచితంగా ఉపయోగించారు కవి.

యాదవత్వమున సింహాసనస్థుడు కామి

సింహాసనస్థుడై చెన్ను మెఱయ

నవతరించిన కృష్ణుడౌననగమించె

నరసవిభుకృష్ణరాయభూనాయకుండు

రాబోయే కథకు బీజం ఈ పద్యంలో సూచించారు కవి గారు. కృష్ణునికి, రాయలకూ అభేదాన్ని కల్పించి భార్యాభర్తల పొరపొచ్చాలను తీర్చాలనే కవి ప్రయత్నం కనబడుతుంది.

తల్లితండ్రి, గురువు దైవమై, అమాత్యుడై ఇంతవానిని అంతవానిగా అప్పాజీ మంత్రి చేసినాడు. ఇంత నిస్వార్ధచరితుడింకొకడు ఎవరు?

రాయలవారు అప్పా అని బిడ్డవలె పిలిస్తే కొండంత పొంగి తిమ్మరుసు వాత్సల్యం. తనువులు వేరయినా మనస్సులొక్కటే రాజమంత్రీదులు తనయుడు జనకుడు. వారి ఆప్తత్వమేనాటిదో. గజపతిరాజు పేరు వింటే కస్సుమనే రాయలు గజపతి రాజపుత్రిని హృదయాధి దేవతగా భావించాడు. హరిహరాదులను లెక్కించని వీరుడు పూవిలుకానికి చిక్కాడు. రాయలపైన ఈగ వాలకుండా వేయికన్నులతో కని పెట్టుకొని చూసే తిమ్మరుసు మంత్రి కళ్ళలో దుమ్ముకొట్టిన అతనుడెంత గుండెలు తీసిన బంటో అంటారు కవి.

గజపతిరాజు శూరుడని క్షత్రియలోకం వేనోళ్ళతో వాని విజయ పరంపరలు పొగుడుతుంటే వియ్యానికి కయ్యానికీ సాటిరాజు ఇతనొక్కడే మనకి యుద్ధంలో వానిని జయించాలని నిజమైన రాచవాడు ఒరులనిస్తులతేజమును సాగనిచ్చునా? అని తన క్షత్రియోచితమైన లక్షణాలను ప్రదర్శించాడు.

తురకల పొత్తుతో హైందవ సంస్కృతిని ఉద్ధరింపవలసిన సమయం వచ్చింది. అల్పుడని ఇప్పుడిక ఉపిక్ష చేస్తే భారత రాజ్యరమావధూటి తురకల పాలవుతుంది అనీ, ఓడిపోయినవాడు కానుకగా శత్రువుకి కన్యనిచ్చి సంధి చేసికొనే సంప్రదాయం దేశంలో ఉంది. రాయల భావాన్ని గ్రహించి శత్రు తనూజాత యందు రాయల మనసు లగ్నమైందని తెలిసికొన్న మంత్రి ఆలోచనాపరుడైనాడు.

ఫణోజ్వల మణిని చేపట్టు పేరాసతో కాలసర్పంతో చెరలాడవచ్చా ! శీల వివేక సద్గుణ విశిష్ట చరిత్రగ పేరున్న శత్రుసుత కదా. సమ్రాట్టయ్యును కాంతాకనక ప్రలోభవశ్యులు కాని వారుంటారా ? అయినా ఇదీ ఒకందుకు మంచిదే. ఆవధూటి అపరభారతి యందురు. ఈ రోజు ఆమె కరము పట్టిన బంగారానికి పరిమళం అబ్బినట్లు వీరి దాంపత్యం అలరారుతుంది అనుకున్నాడు తిమ్మరుసు.

అయినా రాయలను పరీక్షించాడు. సామాన్యుడనుకోకు గజపతిని. యుద్ధరంగంలో నీకు సామాన్యంగా లొంగడు. గెలిచావా సరే కీర్తీ కాంతా ! ఓడితే అంతా గోవిందా ! సార్వభౌమత్వం పోతుంది అన్నాడు. నేలని పోయేదాన్ని చేతికి రాసుకోవద్దన్నాడు.

బలవద్దక్షిణ భారతావని రిపులనుభంజించిన సర్వాంధ్ర రాజ్యాంగ నియోగమందు అపరచాణక్యుడవు, యుద్ధరంగంలో నృపాలభీకరుడవు… కలలో కూడా లేని సంశయం నీ కెందుకొచ్చింది అన్నాడు రాయలు. ధీశాలివైన నీవుండగా ఈ కృపాణం వేలమంది క్షత్రియ వీరులను చీల్చి చెండాడు కత్తి నా చేతిలో ఉండగా ఫాలాక్షుడేతెంచినా పరాజయం కలుగుతుందా? బుద్ధిగా కానుకలిచ్చాడా సరే నా భుజబలంతో గజపతిని బంధిస్తాను. నా విజృంభణకు విశ్వం కంపిస్తుంది. శ్రీరంగేశుని కృపాకటాక్షంతో విజయాన్ని సాధిస్తాను లేదా వీరస్వర్గమలంకరిస్తాను అంటున్న రాయల ధృఢనిశ్చయాన్ని తెలిసికొని పెంచిన ప్రేమతో దరహానవదనంతో శత్రు విజయానికి ఇంతగా ఆరాటమెందుకు? నా ప్రాణాలొడ్డి అయినా నీ అభిమతాన్ని నిలుపుతాను. ఒక్క గజపతిని ఏమిటి? యుక్తి మెరయ చతుస్సముద్ర వేఖలా వలయిత భూమినాధులను పట్టి నీ మోల పెట్టి నీ మనోరధం నెరవేరుస్తాను. అయినా రక్తపాతం ఎందుకు? గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? ప్రజానష్టం అనవసరం అన్నాడు అప్పాజీ. మొగమింతయ్యెన్ మహీజానికి ఆ తను మధ్యనెప్పుడు చూడాలి? దినములు దీర్ఘాలై కనబడినాయి. మొగమింత అవ్వడం చక్కని తెలుగు పలుకుబడి.

********************************************************************

5. మేఘదూతం…                                                                                                                 7. తో. లే. పి. …