13_009 తొలి అడుగు

అవునండి మన జీవితంలో చాలా సందర్భాలలో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. తలచేది జరుగదు… జరిగేది తెలియదు. అలా తలవకుండా జరిగిన ఓ యదార్థ ఘటన ఇది.

                    మధ్య తరగతి కుటుంబం లో పుట్టిన నాకు చిన్నప్పుడు అందరిలాగే అమెరికా గురించి చిత్ర విచిత్రంగా చెప్పుకోవడం, వినడమే కానీ అక్కడికి వెళ్లాలనే ఆలోచన ఏ మాత్రం  ఉండేది కాదు. చదువు ఉద్యోగం, పెళ్లి వరుస క్రమంగా జరిగిపోయాయి. నా భార్య శారద అభిరుచులు కూడా నా అభిరుచులతో కలిసి పోవవడం వల్ల సంసారం సజావుగా సాగిపోయింది… ధనార్జన మీద  పెద్ద ఆసక్తి ఉండేది కాదు. బంగాళాలు, కార్లు కొనాలన్న కోరిక లేదు. పుస్తక పఠనం మీద ఆసక్తి మెండు.

                      వృత్తి ప్రవృత్తి ఒకటి గా ఉండటం చాలా అరుదు గా జరుగుతుంది. అలాంటి అదృష్టం నాకు పట్టింది… టూరిజం డిపార్ట్‌మెంట్ లో జాబ్. అందువల్ల అనేక సందర్భాలలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పలుమార్లు వివిధ ప్రదేశాలు చూసి సంతృప్తి పడటం జరిగింది.

                     నాకు యిద్దరు అమ్మాయిలు మైత్రి, ప్రజ్ఞ ఒక అబ్బాయి ఆదిత్య ముగ్గురూ జీవితాల్లో స్థిరపడ్డారు.  

                      ఇప్పుడు నాకు ముగ్గురూ మనవళ్ళు, ముగ్గురూ మనవరాళ్లు మూడు వరహాలు, మూడు మాణిక్యాలు ఇదే నా సంపద. ఇంకేం కావాలి జీవితానికి. దేవుడి దయవల్ల ఆరోగ్యంగా  ఉన్నాము. సంతృప్తికరమైన జీవితం.   

                      బెంగళూర్ లో ఉండే చిన్నమ్మాయి ప్రజ్ఞ, అల్లుడు శరత్ వృత్తి రీత్యా అమెరికా  వెళ్ళడం జరిగింది. ఒక సంవత్సర కాలం అక్కడ స్థిరపడ్డ తరువాత మమ్మల్ని అమెరికా రమ్మని  ఆహ్వానించారు. దాన్ని మా మమనవరాలు కీర్తన, పెద్ద అల్లుడు ప్రహ్లాద్ గారి తో సహా కుటుంబ సభ్యులందరు బలపరచడమే కాక ప్రోత్సహించారు…. రిటైర్ అయి ఖాళీ గా కూర్చున్న నాకు మరో మాటకు ఆ అవకాశం లేకుండా ఓకే చెప్పించారు…..

ఇక అప్పటి నుండి యాత్రా ప్రహసనం మొదలైంది.

*   *   *

ఇక అప్పటి నుండి మొదలయ్యాయి మా పాట్లు. మా దగ్గర ఆల్ రెడీ పాస్ పోర్టులు ఉన్నాయి… కనుక మాకు కావలసింది వీసా స్టాంపింగ్ మాత్రమే…..

                       మా చిన్నమ్మాయి ఇన్విటేషన్ లెటర్ పంపింది…. షెడ్యూల్ ప్రకారం ఇంటర్వూ జనవరి 2025 లో ఉంది.… ఓ ఇంకా చాలా సమయం ఉంది కదా అని దాని గురించి పట్టించుకోలేదు.

                       ఒక నెల కాగానే హఠాత్తుగా ఓ అర్ధరాత్రి ఫోన్ చేసి ఏప్రిల్ 8 న వెరిఫికేషన్… 16 న ఇంటర్వూ అని చెప్పింది… అది విన్న వెంటనే మాకు గుండె దడ మొదలైంది… పెద్ద  అమ్మాయి మైత్రి, అబ్బాయి ఆదిత్యలు ఇద్దరు కలసి మాకు కావల్సిన డాక్యుమెంట్ల కలెక్షన్ చేసారు…

                       వాటిని జాగ్రత్తగా ఫైలింగ్ చెయ్యడం జరిగింది. వెరిఫికేషన్ రోజు మేం పెద్దవాళ్ళం కంగారుపడకుండా మాతో బాటు మైత్రి, ఆదిత్య వీసా ఆఫీసుకి రావడానికి సిద్ధమయ్యారు. వెరిఫికేషన్ రోజు ఉదయమే నలుగురం మెట్రో లో హైటెక్ సిటీకి చేరుకున్నాం.… స్టేషన్ లోనే వెరిఫికేషన్ సెంటర్ ఉంది. మా స్లాట్ టైమ్ ప్రకారం మమ్మల్ని పిలిచారు. పెద్ద క్యూ.…

   మా వంతు రాగానే… లోపలికి వెళ్ళాము….మా కౌంటర్ దగ్గరే మా ఫోటోలు….ఫింగర్ ప్రింట్ లు తీసుకొన్నారు….పేర్లు మాత్రమే అడిగారు… ఓకే .. యు కెన్ గో నౌ అన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాము…

                       ఆ రోజు సంతోషంగా యింటి మొఖం పట్టాము అది అయిన సరిగ్గా వారం రోజులకు ఇంటర్వ్యూ తెలిసిన వాళ్ళందరి దగ్గరి నుండి రకరకాల సూచనలు, సలహాలు.…

                       ఇదేదో ఐఏఎస్, ఐపీఎస్… ఇంటర్వూ అన్న బిల్డప్ ఇచ్చారు.… నాకు గతంలో ఒకసారి రిజక్ట్ అయినందు వల్ల ఈసారి ఏమవుతుందో అన్న భయం మాత్రం లోపల ఉంది.

                       నిజంగా రిజెక్ట్ అవుతే పిల్లలు ఏమంటారో… వాళ్ళ ముందు చులకనపుతామేమో అన్న ఆందోళన… వెరసి ఓ రకమైన ప్యానిక్…

                       ఉద్యోగరీత్యా ఎలాంటి భయం లేకుండా అసెంబ్లీ, పార్లమెంటుల్లో అడుగు పెట్టిన వాణ్ణి…. రచయిత గా ఎన్నో సందర్భాలను ఎన్నో సన్నివేశాలను సృష్టించిన వాణ్ణి…. కానీ ప్రత్యక్షంగా ఇలాంటి అనుభవం కొత్తగా ఉంది… మా పిల్లలు అమెరికాలో మేం వెళ్లాల్సిన శాన్‌ఫ్రాన్సిస్కో… క్యాలిఫోర్నియా. వీళ్ళు ఉన్న టౌన్ శాంతాక్లారా. మా అల్లుడు పనిచేసే కంపెనీ  పేరు బట్టీ పట్టించారు.

                       ఇంటర్యూ డేట్ రానే వచ్చింది. ఉదయం తొమ్మిది గంటలకే. అందుకే ఉదయం ఆరు గంటలకే మెట్రో లో బయలుదేరాము. దారి పొడుగునా మా ప్రయాణం తెలిసిన బంధువులు, స్నేహితులు ఫోన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పసాగారు.

                       హైటెక్ సిటీలో దిగి క్యాబ్ లో నానక్‌రామ్ గూడా లో ఉన్న అమెరికన్ కాన్స్లేట్  కు బయలుదేరాం. దారి పొడుగునా అంబారాన్ని తాకుతున్న బిల్డింగ్ లను చూస్తూ ఇది నేను  పుటిన హైద్రాబాదేనా అని ఆశ్చర్యపోయాను. కొంత దూరం చేరగానే దారికి అడ్డంగా జనాలు  గుంపులు గుంపులు గా జనం కనిపించారు…  

                       “ ఇక్కడే సార్ మీరు దిగాల్సింది… ” డ్రైవర్ అనడంతో నలుగురం దిగి చుట్టూ  చూసాం. తిరణాలలో లా అక్కడ జనం ఉన్నారు.

సెక్యూరిటీ విజిల్ వేస్తూ లైన్ లైన్… అంటూ అరిచాడు..…

పక్కకు తిరిగి చూశాను. తిరుపతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కనిపించింది.

గుండెలు బేజారయ్యాయి..… అమెరికా అంటే ఇంత క్రేజా అనిపించింది. అలా గుంపులు గుంపులుగా అంత జనం ఉంటుందని ఊహించలేదు… నేను నా అవస్థ చూసి మా అబ్బాయి ఫ్లాస్క్ లో కాఫీ  కప్పు లో పోసి ఇచ్చాడు.…

“ నాన్నా ! మనం ఎంతో అదృష్టవంతులం. మనం ఉన్న ఊళ్లోనే ఉండి కడుపులో చల్ల కదలకుండా వచ్చాము. ఈ చుట్టూ ఉన్న జనాలు చూడు. ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు…. టైమ్‌స్లాట్ ప్రకారం పిలుస్తారు… కంగారు పడొద్దు ” అని   చెప్పాడు. బి పి టాబ్లెట్ వేసుకొని, మాకు కేటాయించిన లైన్లో నిల్చున్నాము.…

                       అంచెలంచెలు వివిధ ప్లాట్ ఫారాలు దాటి మెయిన్ కాంప్లెక్స్ కు చేరుకొన్నాం. రెండు గంటలు పట్టింది. నిల్చుని నిల్చుని కాళ్ళు పట్టేసాయి. తనూ షుగర్ పేషంట్. అయినా వోపిగ్గా నిల్చున్నాము…  

                       సుమారు పదిహేను వేలు వీసా ఫీజు వసూలు చేశారు. సౌకర్యంగా కూచోవడానికి లేదు, తాగడానికి గుక్కెడు నీళ్ళు కూడా లేవు..…

                       మా వంతు వచ్చింది లైన్లో ఉన్నంతసేపు మా ఆవిడ మేము వెళ్లాల్సిన ఊళ్ళ పేర్లు అవీ బట్టీయం వేస్తూనే ఉంది. కౌంటర్ ముందు నిల్చున్నాము.  

                       మా అదృష్టానికి ఇంటర్యూ  చేసే అమ్మాయి ఇండియన్. నవ్వుతూ విష్ చేసి  మా పాస్‌పోర్ట్ లు తీసుకొంది…

” అమెరికా కు ఎందుకు వెళుతున్నారు.. ” ఇంగ్లీష్ లో అడిగింది…  

 “ ఈ వయసులో ఎందుకెళతామమ్మా ! మా మనవళ్ళని చూడడానికి.. ” సమాధానం చెప్పాను. ఎందుకో గొంతు గద్గదమయింది….

“ ఒకే.. ” అంటూ మా ఆవిడ వైపు తేరి పారా చూసింది. నెరిసిన జుట్టు, కళ్ళజోడు తో ఉన్న ఆమెను చూసి బహుశా ఆ అమ్మాయి కి వాళ్ళ బామ్మ గుర్తొచ్చి ఉంటుంది.

ఫోటోలు, వేలిముద్రలు సిస్టమ్ లో వెరిఫై చేసింది…  

రెండు నిమిషాలు… టెన్షన్… టెన్షన్. మా ఆవిడ సహస్ర నామాలు నెమరేసుకొంటోంది.

మా పిల్లల పాట్లు, ఆశలు వమ్ము కాకూడదు భగవాన్ ! మనసులో ప్రణమిల్లాను.

                       ఆ అమ్మాయి మా ఇద్దరి పాస్‌పోర్ట్ లు తీసుకొని చెక్ చేసి బొటన వేలు ఎత్తి థమ్సప్ సింబల్ చూపించి….  

“ కంగ్రాట్యులేషన్స్.. యూ గాట్ వీసా.. ” అంది.  

హమ్మయ్య ! ఇద్దరం గట్టిగా ఊపిరి పీల్చుకొన్నాము… నాకైతే ” గా..టి..ట్ ..” అని బిగ్గరగా అరవాలనిపించింది…..

                        హాలు దాటి బయటకు రాగానే మంచి నీళ్ళ పంపు కనిపించింది. ఇద్దరం

చిన్న పిల్లల్లా కడుపు నిండా నీళ్ళు తాగాము… గాజు గోడలకు అవతల దూరంగా మా పిల్లలు  కనిపించారు. వారికి చేతులు ఊపుతుంటే సెక్యూరిటీ అతను ” మీరు వాళ్ళకు కనిపించరండి ..” అన్నాడు.

                       గబగబా ఇద్దరం స్పీడు గా నడుచుకుంటూ కాంపౌండ్ వాల్ దాటి బయటకు  వచ్చాం. మా మొహాల్లో ఆనందం గుర్తించిన పిల్లలు ఇద్దరు సంతోషంగా మా ఇద్దరినీ వాటేసుకొన్నారు.

కొన్ని సంతోషాలను వర్ణించలేము. మెట్రో లో ఇంటికి తిరిగి వచ్చాము.

*   *   *

                       వారం రోజుల్లో వీసా చేతికి రావడం… మరో నెల రోజులకు చిన్నమ్మాయి  ప్రజ్ఞ శాన్ఫ్రాన్సిస్కో టికెట్లు పంపడం జరిగింది.

                       ఈ నెల రోజుల్లో మాకు కావలసిన షాపింగ్ సరంజామా అంతా మా మనవరాలు కీర్తన, మైత్రీ లే చూసుకున్నారు. వెరసి రెండు పెద్ద, రెండు చిన్న సూట్‌కేసులు మా యిద్దరికి రెండు బ్యాక్‌పాక్ లు సిద్దం అయ్యాయి.

                        మా రూట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్… హైదరాబాద్ నుండి… ముంబాయి…  ముంబాయి నుండి… శాన్‌ప్రాన్సిస్కో…..

                        మే 21 తెల్లవారు జామున నాలుగు గంటలకే కాబ్ లో శంషాబాద్ చేరుకొన్నాం. లగేజ్ దించుకొని ఇంటర్‌నేషనల్ టెర్మినల్లో వెళుతుంటే అప్రయత్నంగానే ఇద్దరికీ ఏదో చెప్పలేని భావోద్వేగం తో పిల్లలందరని హత్తుకున్నాము.  

మా పెద్దమ్మాయే సర్ది చెప్పింది ” సంతోషంగా వెళ్ళిరండని “

                        బ్యాగ్ ల సెక్యూరిటీ చెక్ చేసిన తరువాత బోర్డింగ్ పాసులు ఇచ్చారు.

బోర్డింగ్ పాసులు రాగానే పిల్లలు ఇంటికి తిరుగు ముఖం పట్టారు.                

                       బోర్డింగ్ పాసులు రాగానే మరో అరగంటకు ముంబాయి ఫ్లైట్ లో  అడుగుపెట్టాము. ఎయిర్‌హోస్టెస్ నమస్తే అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఇద్దరం సీట్లల్లో సెటిల్ అయ్యాము. సీట్ బెల్ట్ పెట్టుకున్నాము. విమానం టేక్‌ఆఫ్ అయింది. ఎయిర్‌హోస్టెస్ బ్రేక్‌ఫాస్ట్ అందించింది. అది తిని కాఫీ తాగి స్తిమితంగా కూర్చుందాము అనుకునే లోగా ‘ వెల్కం టూ ముంబాయ్ ’ వినిపించింది…  బ్యాగులు తీసుకొని ఫ్లైట్ దిగాము…

                       ఛత్రపతి శివాజీ మహారాజ టెర్మినల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్…. విశాలంగా ముక్కున వేలేసుకొనేంత ఆశ్చర్యజనితంగా మయనిర్మితమైన మయసభ లా ఉంది.. ఇక్కడి నుండి రోజూ 980 విమానాలు ఎగురుతాయంట. మాకు రెండు గంటలు వెసులబాటు ఉండటం వల్ల తీరిగ్గా చిత్ర విచిత్రం గా ఉన్న షాపుల సముదాయాన్ని చూస్తూ మేము వెళ్లాల్సిన 66 శాన్‌‌ప్రాన్సిస్కో టెర్మినల్ కు చేరుకొన్నాం. మా పెద్దమ్మాయి ఇచ్చిన పులిహోర లంచ్ గా పూర్తి చేశాం.

                        మళ్ళీ ఇక్కడ వీసా వెరిఫికేషన్, ఫోటోలు, వేలిముద్రలు. ఈసారి బూట్లు కూడా విప్పించి నఖ శిఖ పర్యంతం చెక్ చేసి ఫ్లైట్ లోకి ఎక్కించారు.. హమ్మయ్య అనుకొని

సీట్లలో కూర్చున్నాము…. ఏకబిగిన 12000 కిలోమీటర్ల దూరం 16 గంటల ప్రయాణం… మా చుట్టూ  ఉన్న ఇతర ప్రయాణికులని చూసాం. విమానం లో మూడొంతులమంది వృద్ధులే ఉన్నారు. కొన్ని పంజాబీ కుటుంబాలు మూడు తరాల వాళ్ళు కనిపించారు. వాళ్ళ చేతుల్లో నెలల పసి కూనలు. ‘ కూటి కోసం.. కూలి కోసం.. ‘ శ్రీ శ్రీ  కవిత గుర్తుకొచ్చింది. అప్పుడు పట్టణం… ఇప్పుడు దేశాలు… అంతే తేడా…..

                        చూస్తుండగానే  కొంతమందిని వీల్‌చెయిర్ లో ఫ్లైట్ లోపలికి చేరుస్తున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది… వాళ్ల కన్నా మనమే ఎంతో ఆరోగ్యంగా యంగ్‌గా ఉన్నాం కదా అని మా ఆవిడ అంది.

                       అది విన్నాక అంతవరకు మాలో ఉన్న భయాలన్నీ పటాపంచలయ్యాయి.

                        చాలామంది మమ్మల్ని భయపెట్టారు. విమానం టేకాఫ్ అపుడు కళ్లు  తిరుగుతాయని, కడుపులో తిప్పుతుందని ముందు జాగ్రత్తగా రాబి ప్రోజాల్ వేసుకొన్నాం…   

                       మా ముందర ఉన్న టీవి స్క్రీన్ ఆన్ చేసి మాల్గుడి డేస్, ఆర్ద్రమైన ఆ కథ చూస్తుంటే టేకాఫ్ ఇబ్బందులు ఏవి మాకు తారసిల్ల లేదు.… టీవి స్క్రీన్ మీద మేము ప్రయాణిస్తున్న దిశ చూపిస్తోంది.  

                       మా ఫ్లైట్ గల్ఫ్, యూరప్ దేశాల మీదుగా కాకుండా సూర్యుడి కి అభిముఖంగా వ్యతిరేక దిశ లో బంగ్లాదేశ్, చైనా, జపాన్ ల మీదుగా సాగుతోంది…. గతం లో, డొమెస్టిక్ ఫ్లైట్లలో గంట, రెండు గంటల ప్రయాణమే కానీ ఇంత సుధీర్ఘమైన ప్రయాణం చేయడం ఇదే తొలిసారి.

                       ఎవరి టీవీలో వారు మునిగిపోయి ఉన్నారు. ఎయిర్‌హోస్టెస్ సమయానుకూలంగా కాఫీ, టీలు, కూల్‌డ్రింక్స్ సర్వు చేస్తోంది… మాకు టైమ్ తెలవట్లేదు..

                        ఆకాశం లో శూన్యం కనిపిస్తోంది… ఈ పైనే స్వర్గం నరకం ఉంటాయేమో ! అదే విషయం చెప్తే శారద నవ్వి ” స్వర్గానికి బెత్తెడు దూరం లో ఉన్నామన్నమాట “

ఇదే స్వర్గమనుకో..… అవును దేవదాసు చెప్పాడుగా మునకే సుఖమనుకోమని.  

                       చిన్నగా కునుకు పట్టింది.. ఇద్దరం కునికి పాట్లల్లో ఉండగా ఎయిర్‌హోస్టెస్ తట్టి లేపి ఏవో స్నాక్స్ ఇచ్చింది… అయిష్టంగానే సగం తిని వదిలేసాము. అప్పుడు గమనించా ! కొందరు పెద్దవాళ్ళు  ఫ్లైట్ లో తెగ తిరిగేస్తున్నారు. కాళ్ళు పట్టేస్తాయని వాకింగ్ చేస్తున్నారన్నమాట, మేము కూడా వాళ్ళను ఫాలో అయ్యాం.

                       సుధీర్ఘ నిరీక్షణానంతరం మా గమ్యం చేరువైవుతున్నట్టు అనౌన్స్‌మెంట్ వినిపించింది. అన్ని సర్దుకుని కూర్చున్నాం.

                       సమయం రాత్రి ఎనిమిది గంటలు అయింది… లాండ్ అవగానే శాన్‌ప్రాన్సిస్కో… ఎయిర్‌పోర్ట్ లోకి చేరుకొన్నాం. ఆకాశం లో ఎండ పెటిల్లున కాస్తోంది. ఓ ఆరగంటలో మా బ్యాగేజ్ తీసుకొని ట్రాలీ తో ఆరైవైల్ లాంజ్ చేరుకొన్నాం.

                       దూరం నుండే ” నాన్నా.. తాతయ్యా.. ‘ అన్న పిలుపులు వినిపించాయి. పక్కకు తిరిగి చూసాము. ప్రజ్ఞ, శరత్, పిల్లలు యవన్, శౌరి లు ఒక్క ఉదుటన వచ్చి హత్తుకున్నారు….

                       ప్రజ్ఞ వాళ్ళ అమ్మ వడిలో చేరింది.… మనవళ్లిద్దరూ నా మెడను గట్టిగా వాటేసుకొన్నారు. ఇదే రక్తసంబంధం… ఆలౌకికానందం… కళ్ళు చెమ్మగిల్లాయి. అంతవరకు పడిన కష్టం, బాధ అంతా ఇట్టే మటుమాయమై పోయాయి. కొత్త శక్తి ఏదో ఆవహించింది. ఇద్దరినీ ముద్దు పెట్టుకున్నాను.

” వెల్కం.. తాతయ్యా…. ” అంటూ శౌరి నా చేతులు పట్టుకొని

” ఐ విల్ షో యు అమెరికా… ” సంతోషంగా ఆహ్వానించాడు.    

” ఓకే మై సన్ …” అంటూ వాడి చేయి పట్టుకొని ఇద్దరం ఏడు సముద్రాల అవతల ఉన్న అమెరికాలో తొలి అడుగులు వేసాము…

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page