11

అయిదు రోజుల పెళ్ళి

 

ఆరోజే కూతురు పెళ్ళి ఒక మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో చేసి అలిసి పోయి వేరే ఆలోచనలో ఉన్న రామనాధం కొడుకు పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడు. “ అబ్బ మన పెళ్ళిళ్ళు బాగా స్ట్రెయిన్ డాడీ! ” అంటూంటే “ ఒరేయ్ దీనికే ఇదవుతున్నావు. నా చిన్నప్పుడు మా పెదనాన్న కొడుకు నీకు వరుసకి పెదనాన్న పెళ్ళి ఐదురోజులు జరిగింది. అది ఆరోజుల్లో కన్నుల పండగ. ఇప్పుడైతే ఓపికలు లేక బిజీగజిబిజి జీవితాల్తో చెయ్యలేక చేసేమా లేదా అని చేస్తున్నాం రా! ” అనగానే “ వాడు ఐదురోజులే! అసలు అన్నిరోజులేం చేస్తారూ? ” అనగానే “ అది చాలా ఏళ్ళమాట ” అంటూ “ ఆ పెళ్ళి విషయాలు ఇప్పటికి నాకు జ్ఞాపకం ఉన్నాయి ” అని రామనాధం గతంలోకి వెళ్ళిపోయాడు…….

*********************

చైత్రమాసం వెళ్ళిపోయింది  కొత్తసంవత్సరపు వసంతం లో ఒక మాసం విశ్రాంతి తీసుకుంది. వైశాఖి విసనకర్ర, మామిడిపళ్ళు శివాలయం లో పంచిపెట్టి మా వాళ్ళు ఇంటికి వచ్చారు.

ఇక పెళ్ళిళ్ళ ముహూర్తాల జోరు మరింత పెరుగుతుందని మా వాళ్ళు అనుకోవడం “ మరింకే వంశీ పెళ్ళి కూడా ఈ ముహూర్తాల్లో చేసేస్తే బావుంటుంది ” అని బామ్మ అనుకోవడం చదువుకుంటున్న రాంబాబు చెవిలో పడింది. వాడికి భలే ఆనందమేసింది. ఆహా వంశీ గాడి పెళ్ళా అని సంతోషమేసింది.

మా వీథి అరుగులమీద అప్పడాలు ఒత్తుతున్న ఇంతులందరు పెళ్ళికబుర్లు, ఫలానా వారు ఎలా ఎలా పెళ్ళి చేసారో అని కథలు కధలు గా చెప్పుకుంటున్నారు.

“ అయినా ఈ మథ్య పెళ్ళిళ్ళు తూతూ మంత్రంగా లాగించేస్తున్నారు. మూడు రోజులకే ముగించేస్తున్నారు. ఆ మథ్య మా కోడలు తరఫు వాళ్ళ అమ్మాయి పెళ్ళి నాలుగోరోజున ఒక్కడంటే ఒఖ్ఖడు లేడు చోద్యం ” అని నోరునొక్కుకుంది రామాయమ్మగారు.

మిగిలినవాళ్ళుకూడా ఐదురోజుల పెళ్ళి చూసి ఎన్నిరోజులైందో అంటూ చాలా బాథపడిపోయారు.

అది విని మా బామ్మ “ ఆ ముచ్చట మా పెద్దమనవడు వంశీ గాడి పెళ్ళిలో చూడొచ్చు కొద్దిరోజులాగితే ” అనగానే అందరు పన్లన్ని ఆపేసి ఆవిడ కేసి తిరిగారు. చీరచెంగు లాక్కుని, “ అవునర్రా ! ఐదురోజుల పెళ్ళి ఈ కాలంలో జరిపిస్తామని ఆడపెళ్ళివారు మాటిచ్చారు. వాళ్ళలా వీళ్ళలా మూడు పూట్ల భోజనాలు కాదు. ఐదురోజులు పెళ్ళి పుల్లెల వారు. మహా మహా పండితుల కుటుంబం. ఊరు ఇందుపల్లి మరి!

“ ఏ మాటకామాట చెప్పద్దు, పెళ్ళికూతురు తండ్రికి చాలా సరదాలు సుమీ. పెళ్ళి చూపులకెళితే ఎంత హడావుడి, ఎంత మర్యాదా! ఎంతసంప్రదాయం కారు దిగి దిగ్గానే గంగాబొండం.నీళ్ళు పెద్ద పెద్ద  గ్లాసుల్లోఎండన పడొచ్చారంటు తాగించారు. మరిన్ని నిమిషాలు అయ్యాయో లేదో వేడి వేడి ఫిల్టరు కాఫీ పెద్ద పెద్ద ఇత్తడి గళాసుల్లో ఇచ్చి, నాలుగైదు టిఫిన్లతో అదరగొట్టేసారు. పిల్లని చూపించారు, కుందనపు బొమ్మ. సంగీతం వచ్చు, దేవతా స్తోత్రాలు, సౌందర్య లహరులు కంఠతా వచ్చుట. డిగ్రీ పాసయ్యింది, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. బంగారు ఛాయ తో లక్ష్మీదేవిలా ఉంది. పేరు కృష్ణ ట. అసలు పేరు కృష్ణకుమారిట. మా వంశీగాడు అదృష్టవంతుడు. ఇద్దరి పేర్లు కలిపితే “వంశీకృష్ణ”. దగ్గరగా నిలబెడితే ఈడుజోడు చూడముచ్చటగా ఉంది. చూపులయ్యాకా పెళ్ళికూతురు నాన్న మనసులో మాట బయటపెట్టాడు. తనకి ఐదురోజుల పెళ్ళి చేసి రోజూ పల్లకి ఊరేగింపు జరపాలని ఉందని చెప్పాడు. మేం కూడా ఆనంద పడ్డాం. వచ్చేస్తుంటే కార్లో కొత్తపల్లి కొబ్బరి మామిడి ఒక నాలుగు “పరకలు “, ఘుమఘుమ లాడే పనసపళ్ళు నాలుగు కార్లో పెట్టించాడు. ” అని చెప్తోంటే ఆవిడ కళ్ళల్లో జరగబోయే ఐదురోజుల పెళ్ళి కనబడుతోంది.

*********************

కొబ్బరాకుల మథ్యలోంచి వైశాఖ చంద్రుని మోము మల్లెల తెల్లదనమనే పౌడరు వ్రాసుకొని అందంగా తయారైన పెళ్ళికొడుకులా ఉన్నాడు.

తెల్లవారుఝాము నాలుగు గంటలైంది.

బస్ ని ఆనుకొని రాంబాబు పెద్ద ఫోజుకొడుతూ ఫొటో తీయుంచుకుంటున్నాడు. వాడే తోడి పెళ్ళికొడుకు మరి. కొత్తబట్టలు వాడికి నాలుగు జతలు కుట్టించాడు వాళ్ళ పెదనాన్న. దాంతో వాడు తెగ ఫోజులు. హడావుడిగా అందరు బ్యాగులు తీసుకొని రెండు బస్సుల పెళ్ళివారు బయలు దేరారు.

బస్ కి కూడా అరటి మొదళ్ళు కట్టించాడు ఇరుపక్కల వంశీ నాన్న జనార్ధన్. రావలసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా అని కింద మీద పడుతూ మా అక్క ఏది, మా తమ్ముడెక్కాడా, చిన్నాన్న ఏడి? ఇలా గందరగోళం పడుతూ రెండు బస్సుల జనం తో ఛలోక్తులు, పలకరింపులతో కదిలాయి పెళ్ళివారిల్లు ఇందుపల్లికి కి ఏలూరు నుంచి. మథ్యలో రావులపాలెంలో టిఫిన్లకి ఆపించాడు జనార్థనం!

ఈదరపల్లి వంతెన మీంచి ఇందుపల్లి ఊళ్ళోకి బస్ లు రావడం తరవాయి నేదునూరు బాండ్, అప్పనపల్లి సన్నాయి మేళం తో అపురూప స్వాగతం. ఆడపెళ్ళివారందరు వచ్చి ఒక్కొక్కళ్ళని ప్రయాణం ఎలా జరిగిందని పలకరిస్తూ చల్లని మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని విడిది తోడ్కొని వెళ్లారు. విడిది ఐదు మండువా లోగిలి ఇళ్ళల్లో చక్కని సదుపాయాలతో ఏర్పాటు చేసారు. ప్రతి విడిది ఇంటికి మనుషుల్ని పెట్టి ఎవ్వరికి ఏం కావలసి వస్తే అది ఇచ్చేలా ఏర్పాట్లు చేసారు. అందరు సర్దుకున్న వెంటనే కాఫీలు టిఫిన్లు చేతికిచ్చారు. పెళ్ళికొడుకు కి ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టారు అన్ని చూసుకొనేలా!

ఊరంతా తాటాకు పందిళ్ళు వేసి పందిరి గుంజలకి పచ్చి కొబ్బరాకులు చుట్టారు. అన్ని విడిది అరుగులమీద చాపలు జంబుకానాలు వేసారు. చిన్న పిల్లలు అందరు పందిరి గుంజల మధ్య నాలుగు స్ధంబాలాట ఆడుకొంటున్నారు. ఆ రోజు అందరు అలసి పోవడం వల్ల విశ్రాంతి తీసుకొన్నారు. పెళ్ళివారిలో అటుపక్క ఇటుపక్క కొందరు అరుగుల మీద కూర్చొని ఎన్నోవిషయాల మీద సంభాషించుకుంటున్నారు.

రాంబాబు కి తన ఈడు కుర్రాళ్ళతో పరిచయం బాగానే అయ్యింది. ఆ రోజుకి విడిది విశ్రాంతి అయ్యింది మగపెళ్ళివారికి.

తర్వాత రోజు స్నాతకం. మగపెళ్ళివారు విడిదిలో చేసుకోడానికి ఏర్పాట్లు జరిగాయి. ఆడపెళ్ళివారిని ఆ వేడుక కి పిలవడానికి రాంబాబు అమ్మ, వంశీ వాళ్ళ అమ్మ మిగిలిన వాళ్ళు మగవారందరి తో సన్నాయి తో వెళ్ళి పిలిచారు.

స్నాతకం మొదలైంది. వంశీ కాశీ యాత్ర కి పావుకోళ్ళు, గొడుగు ధరించి వెడుతూంటే కాబోయే బావమరిది విస్సు వచ్చి వంశీ గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి బావగారూ ! మా అక్కని పెళ్ళి చేసికోండని బతిమాలే ఘట్టం అందరి నవ్వుల మధ్య భలే ఆనందం వేసింది అందరికి. వంశీ బాబు మా అమ్మాయిని చూసావు కదా!  ఇంక ఎక్కడికి వెళ్ళవు అని ఛలోక్తులతో ఇందుపల్లి వీథంతా మారుమోగిపోయింది.

వంశీ కాబోయే బావమర్దికి బట్టలు పెట్టి ఆ తంతు ముగించారు. ఆ అపూరూప ఘట్టాలన్నిటిని అమలాపురం నుంచి బలరాం స్టూడియో వాళ్ళొచ్చి క్లిక్ మనిపించారు. అలసిపోయిన వంశీకి గబగబ కుర్చీ వేసి ఫ్యాను వేసి కూల్ డ్రింక్ తెప్పించి తాగించారు.

తర్వాత అంకురార్పణ ఘట్టం, వినాయకపూజ అయ్యేకా పెళ్లి తంతు మొదలు పెట్టారు. నవధాన్యాలని పాళికల లో మట్టి పోసి నీళ్ళు జల్లారు.

ఎదురు సన్నాహం లో ఒకరి శుభలేఖ మరొకరు చదవడం, గంథం పూసి ఒకరికొకరు పానకం ఇచ్చి పుచ్చుకోవడం జరిగింది. పిల్లల్లో రాంబాబు కూడా బాగా ఎంజాయ్ చేసాడు.

భోజనాలకి విడిదికి వెళ్ళి పిలిచారు ఆడపెళ్ళివారు.

కొత్తావకాయ, ప్రశస్తమైన గోంగూర పచ్చడి, అంబాజీపేట నుండి తెప్పించిన పనసకాయ పొట్టు ఆవతో కలిపినది, దేశవాళి రాణీలాంటి కారంపెట్టిన వంకాయకూర వండించారు. బెండమూర్లంక నుంచి తెప్పించిన దోసకాయలతో చిన్నావకాయ, సూడిద గుమ్మడి, దేశివాళీ ఆనపకాయ, కొత్తిమీర వంకాయ, చిరు దోసకాయ కలిపిన పులుసు, బూరెలు, ఆత్రేయపురం పూతరేకులు, జున్ను, ఘుమఘుమ లాడే పులిహోర, మామిడికాయ పప్పు , ఆవునెయ్యి, గుమ్మడి వడియాలు, ఆ మథ్యే ఒత్తి ఎండబెట్టిన అప్పడాలు, గెడ్డ పెరుగు, తాంబూలం తో తన పాకశాస్త్రాన్ని దిగ్దశలా వ్యాపించేలా వండి వడ్డించాడు అమలాపురం శర్మ! ఆడపెళ్ళివారు ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి అన్ని అందేయా అన్నయ్యగారు, మామయ్యగారు అంటూ ఏ లోటు రాకుండా చూసుకున్నారు.

యజ్ఙోపవీత థారణ తో వంశీ కి పెళ్ళికొడుకు కళ మరింత ఇనుమడించింది. మధుపర్కాలు ధరించి శివపార్వతుల్లా  కన్నుల పంట గా ఇద్దరు మెరిసిపోతున్నారు. కృష్ణకుమారి చేతులకి ఇంట్లో పెరిగిన గోరింటాకు రుబ్బి చక్కగా చేతులకి, మథ్యలో “వి” అనే ఆంగ్ల అక్షరం వచ్చేలా పెట్టారు. ఎర్రగా పండిన ఆమె లేలేత  చేతులకి ఆ రంగు అరచేతిలో కెంపులు పోసినట్టుంది.

పెళ్ళికూతురి గౌరి పూజ మొదలైంది. గౌరి పూజానంతరం దీపాల వెలుగులో పెళ్ళికూతురు కృష్ణ ని మేనమామలు అందంగా అలంకరించిన బుట్టలో పచ్చిపూలు మరువం కలిపిన దండలతో కట్టిన పెళ్ళివేదిక పైకి తీసుకొచ్చారు. అందమైన తెల్లని తెరచాటున ఉన్న ఇద్దరు ఎప్పుడెప్పుడు ఒకరి కళ్ళలోకి చూసుకోవడమా అని ఆతృతపడుతున్నారు. పెళ్ళి చూపులతర్వాత మళ్ళీ చూడలేదుగా మరి.

కాళ్ళు కడగడం, జీలకఱ్ఱ బెల్లం, కన్యాదానం, కాలు తొక్కించడం, స్వర్ణజలాభి మాత్రణం, యోక్తృ బంధనం తో కృష్ణ సిగ్గుల మొగ్గైంది. మంగళసూత్ర ధారణ ముందు పురోహితుని చేతుల మీదుగా అందరి ముత్తైదువుల సూత్రాలు తాకించి తెచ్చి, అష్టదిక్పాలకుల సాక్షిగా, అంగరంగ వైభవంగా మనస్సుల ముడివేసుకున్న క్షణంలో.. తలమీద మాడుపైన అద్దిన జీలకఱ్ఱ బెల్లపు మిళిత రసం వారిద్దరి నాడుల్లోకి ప్రవేశించి ప్రేమ అంకురించే క్షణం, హైందవసాంప్రదాయానికి అగ్రతాంబూలం ఇచ్చే మన సంస్కృతి చిరస్థాయిగా నిలవాలని ఇరువైపుల పెద్దలు నడుం కట్టిన ఆ వేడుకలో భాగంగా రంగులీనే కృష్ణ మెడలో వంశీ బంగారు తాళిని మూడుముళ్ళుగా వేసాడు. అలనాడు సీతమ్మవారికి వేసినంత పూల జడ ని ఆడవాళ్ళు పైకెత్తి పట్టకోగా ముళ్ళు వేస్తున్నప్పుడు, వేళ్ళుతాకిన మెడభాగంలో చక్కిలి గింతల వల్ల వచ్చిన నవ్వుల ముత్యాలని దొరలనీయక మునిపంట నొక్కి ఉంచి ఊపిరి బిగబెట్టింది. అందరు పెద్దలు వరుసలో వధూవరులని ఆశీర్వదించారు.

ఇక తలంబ్రాల ఘట్టం చాలా సరదాగా గడిచింది. వంశీ అన్నయ్య ఏ మాత్రం తగ్గకు అంటు ఉత్తేజపరుస్తుంటే పురోహితుడు “ నాయనా ఇద్దరు నా మంత్రాలు వింటూ చెప్పి మూడుసార్లు పోసుకున్నాకా మిగిలినది మీ ఇష్టం ” అని నిక్కచ్చిగా చెప్పాడు. కృష్ణ తండ్రి వాటిల్లోకి మంచి ముత్యాలు కలిపించాడు. పిల్లల కేరింతలు, వంశీ కృష్ణ ఫ్రెండ్స్ అల్లర్లతో సందడిగా తలంబ్రాల వేడుక జరిగింది. బలరాం స్టూడియో వాళ్ళు తలంబ్రాలు జలజల రాలే ఘట్టాన్ని ఫొటోలో బంధించారు.

తర్వాత బిందెల్లో ఉంగరాలు తీసే ఆనందకర వేడుక మొదలైంది. వంశీని అన్నయ్య నువ్వే గెలవాలి అంటూ రాంబాబు మిగిలిన కుర్రాళ్ళు, మేనత్తలు ఉత్సాహపరచగా, కృష్ణని ఆమె తరఫువాళ్ళు మనమే నెగ్గాలి అక్కా! అంటూ అల్లరి చేయగా తనకి దొరకిన ఉంగరాన్ని కృష్ణ చేతికే ఇచ్చి ఆమె మనసుని గెలుచుకున్నాడు.

ఇద్దరికి బ్రహ్మముడి వేసి సప్తపదులు నడిపించి మనసా వాచా కర్మణా కష్టాల్లో సుఖాల్లో ఒకరికి ఒకరు ఆలంబనగా ఉండాలని, పాణిగ్రహణంతో చిటికెన వేళ్ళు పట్టించి ఏ క్షణమైన ఒకరినొదలి ఒకరు ఉండకూడదని ” ధర్మేచ, అర్ధేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి ! ” అని అర్థవంతంగా వివరించి మంత్రాలు వల్లించి చెప్పారు పురోహితులు. మామూలుగా అంత వివరణ ఇవ్వరు ఎవ్వరు! కానీ పెళ్ళికూతురు తండ్రి శివరామ శర్మగారు సూచన ఇవ్వబట్టి అది సూనృతమైంది.

చదివింపుల ఘట్టంలో అందరు తమ స్థోమతకు తగ్గట్టుగా చదివించారు. ఒక మేనమామ వరస ఆయన పెద్ద పేపరు పేకట్టు విప్పమంటే పురోహితుల వారు విప్పలేక అసిస్టెంట్లకి అప్పచెప్పితే అందరు ఆతృతగా ఏముందా ? అని ఆరాట పడగా పడగా చివరికి దాంట్లోంచి ఒక పాల పీక బయటపడింది. అందరు ఘొల్లుమని నవ్వగా పెళ్ళికూతురు మోము సిగ్గు తో ఎర్రబడింది. వంశీ చిన్నగా నవ్వుకున్నాడు.

ప్రధానహోమం, సన్నికల్లు తొక్కడం, స్థాళీపాకం, నాగవళిఅయిన తర్వాత సదస్యంలో కోనసీమలో ఉన్న ఘనాపాటీలతో వేదోక్తంగా ఆశీర్వచనం చేయించారు. సప్త ఋషులు భువికి దిగి వచ్చి ఆశీర్వదించారా అనేట్లుగా ఉంది ఆ సమయం. వారందర్ని అన్నివిధాలా తృప్తిగా సన్మానం చేసారు ఇద్దరు వియ్యంకులు.

అది గడిచాకా ముత్తైదువులు పార్వతీదేవిని థ్యానిస్తూ నెమ్మదిగా గుచ్చి ఇచ్చిన నల్లపూసలు పెళ్ళికూతురికి వేసాడు వంశీ! ఇద్దరికీ అరుంధతి నక్షత్ర దర్శనం చేయించారు.

అప్పగింతల్లో కృష్ణ అమ్మ నాన్నని కౌగిలించుకొని ఏడిస్తే అల్లుడికి గద్గదమైన కంఠంతో ‘ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో నాయనా! ’ అనీను, తన తరఫున కూతుర్ని “ నువ్వు ఇహ వాళ్ళమ్మాయివి. మామగారు, అత్తగారే నీకు తండ్రి తల్లి ! తమలపాకు ఈనె గుచ్చుకొంటే ఓర్చుకోలేవేమో అనేంత గారంగా పెంచిన మేము, అక్కడ నువ్వు స్ధైర్యంగా ఉంటావని, మీ ఇంటికి గౌరవం తెస్తావని ఆశిస్తున్నానమ్మ! ఏం జరిగినా ధైర్యంగా నిలబడాలి, పుట్టింటికి అత్తవారి అభివృధ్ధినే చెప్పు, ఆనందాన్ని వినిపించు, నీ పుట్టింటి గొప్పలు అక్కడెవరికి వివరించకు. ఆకాశం అంత హృదయం, భూదేవంత సహనం పెంపొందించుకో! ” అని పిల్లని “ మీ చేతుల్లో పెడుతున్నాం! ఇక కృష్ణ మీ అమ్మాయి ! ” అని శివరామశర్మగారు వినయంగా అప్పగింతల కార్యక్రమం జరిపించారు. అందరూ భారమైన గుండెలతో ఉండగా అందరికీ టీ కాఫీలు వచ్చాయి.

ఈ ఐదురోజులు పల్లకీ, ఊరేగింపు, బాజాభజంత్రీలు అధ్భుతంగా కుదిరాయి.

పెళ్ళి అయిపోయి బస్ ఎక్కుతూఉంటే ఊరంతా చిన్నబోయింది.

కృష్ణ, వంశీలిద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని ఆటపట్టిస్తున్నా ఆడపడచు వరస వాళ్ళకి హారతి పళ్ళెంలో బోల్డంత డబ్బు వేసాడు వంశీ!

పారాణీ జిలుగులతో వెండి పట్టీలు ధరించి నడుముకు కట్టిన వడిబియ్యంతో ఆ నట్టింట అడుగు పెట్టి గృహప్రవేశం చేసారిద్దరు!

ఇదిరా ఇలా చెయ్యాలి ఐదురోజుల పెళ్ళంటే! ” అంటే “ బాబోయ్ ! మీ ఓపికలకి జోహార్లు నాన్నోయ్ ” అన్నాడు.

“ అవునురా మరి ఆ రోజుల్లో పెళ్ళంటే ఒక పండగ, వేడుక, ఆనందం. ఈ రోజుల్లో ఒక డ్యూటి, ఎప్పుడు తెముల్చుకుందామా, దించుకుందామా అని అనుకొనే బరువు కదా మరి! ” అని పడక్కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళగానే ఫోన్ వచ్చింది వంశీ నుంచి రేపు ఏభయవ పెళ్ళి రోజు. తన పెళ్ళి జరిగిన ఊళ్ళో శివాభిషేకాలు, దేవుని కళ్యాణం,  పెద్ద ప్రవక్త చేత పార్వతీ కళ్యాణం ఉపన్యాసం, అందరికి భోజనాలు వగైరా వగైరా అని తప్పక రావాలని చెప్పాడు.

“ నాన్న! నేను కూడా వస్తా! ” అనగానే

“ ఒరే వంశీ ! నీకు వెయ్యేళ్ళు! నీ పెళ్ళి కథాకళి ఇప్పుడే అయ్యింది! తప్పక వస్తాం ! ” అని ఫోన్ పెట్టి ఊరుని తలుచుకుంటూ టీవీ పెట్డగానే చాగంటి కోటేశ్వరరావుగారి ” పార్వతీ కళ్యాణం” ప్రవచనం వస్తోంది.

***************************************************************

 

10. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు…                                                                                           12. మందాకిని…