14_001 తో. లే. పి. – స్వర్ణమాలి గుణవర్ధనే

స్వర్ణమాలి గుణవర్ధనే, కొలంబొ, శ్రీలంక.

పట్టా చేతపుచ్చుకుని, 1963 వ సంవత్సరంలో జూనియర్ ఇంజినీర్ గా శ్రీశైలం ప్రాజెక్టు లో పాదం మోపడం నా ఉద్యోగ పర్వంలో తొలి సోపానం పైన. ఒకదశలో, నేను చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో పనిచేయడం జరిగింది. దీనితో అంతకు ముందు ఉన్న పని భారం నుండి కాసింత వెసులుబాటు లభించిందనే చెప్పవచ్చు.

ఎలాగంటే ఉన్నది ఇంకా బ్రహ్మచారి హోదాలోనే  కాబట్టి, మరింత స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునే సదుపాయం కూడా ఉండేది. దానితో కాస్త సంగీతము, సాహిత్యము, కళలు… వీటిపై ఉన్న మక్కువ ఎక్కువై, ఈ దిశలో బహువిన్యాసాలు చేసేవాడిని. అంతర్జాతీయ స్ధాయిలో, కలం స్నేహాలు వీటిలో అధికభాగం. ప్రత్యేకించి మనకు పొరుగు దేశాలయిన నేపాల్, శ్రీలంక( సిలోన్), భూటాన్ అంటే  నాకు వల్లమాలిన అభిమానం.

ఈ రకంగా, నాకు పరిచయమయిన వారు కొలంబో, శ్రీలంక కు చెందిన స్వర్ణమాలి గుణవర్ధనే. ఈ స్నేహానికి ఓంకారం పలికినది 1965 వ సంవత్సరంలో అన్నమాట!

డిసెంబరు 20,1965వ సంవత్సరంలో వారు నాకు వ్రాసిన ఉత్తరమే ఈనాటి తోక లేని పిట్ట. వచ్చే సంవత్సరంలో ఆ పిట్ట షష్టి పూర్తి  వేడుక జరుపుకోబోతోందంటే  నిజానికి అది నమ్మశక్యం కాని నిజం !

ఈ ఉత్తరంలో స్వర్ణమాలి అంతరంగకధనం అత్యంత ఆసక్తిదాయకం….దయచేసి మీరూ  గమనించండి.

ఇండియా లోని వ్యక్తులతో తాను కలం స్నేహాన్ని వాంఛించింది. ఈ దేశం పట్ల ఆమెకున్న అభిమానం దీనికి నేపధ్యం.

శ్రీలంక లోని విశాఖ విద్యాలయానికి ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన తమిళనాడు కు చెందిన శ్రీమతి పుల్లిమూద్ గురించిన ప్రస్తావన ఈ లేఖ లో చోటుచేసుకోవడం విశేషం!

తాను అప్పట్లో  కాలేజి చదువులో ప్రాధమిక దశను దాటి, 1968 లో వైద్య కళాశాల లో చదివే ప్రయత్నం చేస్తోంది.

గతంలో తాను చదువుతూన్న స్కూలును నాటి మన దేశ ప్రధాని శ్రీ నెహ్రూ, తన కుమార్తె ఇందిరాగాంధీతో కలిసి సందర్శించిన ఆనాటి మధురస్మృతిని సంతోషంగా స్మరించుకుంది.

భారతీయ సినిమాలప్రస్తావన ఆ లేఖలోని మరొక ఆసక్తికరమైన అంశము..  ఇందులో భాగంగా, ప్రముఖ  సినిమా దర్శకుడు శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారు కూడా ఆమె జ్ఞాపకాలదొంతరలలో ఉండడం ఎంతో ముదావహం ! సుబ్బారావు గారి గురించి ప్రముఖ సినీ పత్రిక ఫిల్మ్ ఫేర్ లో ప్రచురితమైన ఒక వ్యాసం దీనికి మూలంట !

అలాగే హిందీ సినిమా నటీనటులు దేవానంద్, నూతన్, రాజేంద్ర కుమార్ ప్రభృతులు కూడా ఆమెకు  అభిమాన తారలు. మరొక విషయమేమంటే,హిందీ సినీమా ‘బందినీ’ ఆమె అభిమానచిత్రం‌!

ఇక ఇతర సంగతులు విషయానికొస్తే, విదేశీ పర్యటనల పట్ల స్వర్ణమాలి కి ఎంతో  అభిరుచి. ఇదే విషయంలో, నాకు ఉన్న ఆసక్తిని గమనించింది కాబోలు…

నన్ను వీలు చూసుకుని కొలంబోకు రావాల్సిందిగా  మంచి మనసుతో మనసారా ఆహ్వానించింది. నాకూ ఎప్పటినుండో శ్రీలంకను దర్శించాలని మహా కోరిక ! కాగా మరి, తలపెట్టిన నా యాత్రకు ముహూర్తం ఇంకా వచ్చినట్లులేదు! ఆ కోరిక సిద్ధించే సుముహూర్తానికై ఎదురు చూస్తున్నాను.

అయితే 2015 లో నేపాల్ వెళ్ళి ఖాట్మండు లో నా మిత్రుడు, సోదరతుల్యుడు శ్రీ హేమ్ బహదూర్ లామా ని, కుటుంబాన్ని కలిసి వారింట అతిథి గా కొన్నిరోజులు ఆనందంగా గడిపే అదృష్టం నాకు భగవంతుని దయవలన లభించింది.

మంచి మిత్రురాలు స్వర్ణమాలి తో ఈ మధ్యకాలం లో ఉత్తరం ప్రత్యుత్తరాలు లేవు. అయినా ఆ స్నేహపునరుద్ధరణ కోసం, అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ అవకాశాన్ని ఆ పరమాత్మ తప్పక  త్వరలో ప్రసాదిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం!

****ధన్యవాదాలు -నమస్కారములు***

*************************************

*************************************

 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

Please visit this page