14_001 మందాకిని – వృత్తి ఉద్యోగాలు – మహిళ

నేడు సమాజంలో మహిళయొక్క పాత్ర వేగంగా మారుతొంది అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మూడు నాలుగు దశాబ్దాలుగా ఈ మార్పు బాగా కనపడుతోంది. చదువుకొన్న ఆడపిల్లల శాతం రోజురోజుకి పెరుగుతోంది. మామూలుగా పట్టా తీసుకోవడమే కాకుండా డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా అన్ని రంగాలలో తమ అభిరుచిని తెలుపుతున్నారు.

ఈనాటి మహిళ కూతురుగా, అక్కచెల్లిగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, అత్తగారిగా, ఉద్యోగస్థురాలిగా, వ్యాపార వేత్తగా, కళాకారిణిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్నది. తన వ్యక్తిత్వం నిలుపుకోవడానికి గానీ, తన కాళ్ళమీద తను నిలబడటానికి గాని, తన కుటుంబాన్ని పోషించడానికి గాని, తన భర్తకి ఆర్థికంగా సహాయపడటానికి గాని మహిళ ఈనాడు బయటకి వెళ్ళి ఉద్యోగం చేస్తోంది.

కాని మిగతా అందరు మహిళల లాగానే, ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఎన్నోసమస్యలను, సవాళ్ళను ఎదుర్కొంటున్నది.  కొన్ని ఇక్కడ ప్రస్తావించుకొందాం.

  1. ఈనాడు మహిళకు ఎన్నో బాధ్యతలు, బరువులు ఎక్కువ అయా యి. శక్తికి మించిన పనులలో సతమతమయిపోతోంది. వంటిల్లు, ఆఫీసు, ఇంటిపని, మొగుడు, పిల్లల పనులు, అత్తమామలు ఉంటే వారి బాధ్యతలు, తన ఆరోగ్యం, ఇష్టాయిష్టాలు సంబాళించుకొంటూ పరుగులు పెట్టవలసి వస్తోంది.
  2. ముఖ్యమయిన అడ్డగోడ పురుషాధిక్వత, పురుష భేషజం, ఇది ఇంట్లో అవవచ్చు, ఆఫీసులో అవవచ్చు, ఇంకెక్కడైనా అవవచ్చు. ఎల్లవేళల, అన్ని చోట్ల మగవారి సహాయం, సహకారం, భర్తదైనా సరే లభించదు. ఎక్కడో అక్కడ పురుష సహజమైన భేషజం. అహంకారం, ఆధిక్యత ఆమెను కించపరుస్తూనే వుంటాయి
  3. ఉద్యోగం విషయంలో అన్ని చోట్ల మిగతావారితో సమానంగా అవకాశాలు, బాధ్యతలు తమ సామర్థ్యమునకు తగ్గని దొరకవు. వారి శక్తి నిరూపించే అవకాశాలు రావు. ఒకవేళ వచ్చినా ఆ అవకాశాలు, బాధ్యతలు నిర్వహించేటటువంటి వెసులుబాటు ఇంటాబయట కూడా మహిళకి దక్కదు. ఉదాహరణకి ఉన్న ఊరునించి పదోన్నతికై వేరే వూరు వెళ్ళాలన్నా, లేక ఉద్యోగరీత్యా వేరే వూరు వెళ్ళి రావాలన్నా కుటుంబ బాధ్యతల వల్ల, ఇంకా వేరే కారణాల వల్ల ఆ అవకాశం వదులుకోవలసి వుంటుంది. ప్రతిసారి మహిళా తన ఉద్యోగాన్ని త్యాగం చెయ్యవలసివస్తుంది.
  4. మరొక ఇబ్బంది. ఉద్యోగస్థులైన మహిళలందరికి తమ ఆదాయంలో పూర్తి హక్కు వుండదు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో మహిళ ఆదాయం భర్త చేతికి గాని, తండ్రికిగాని, ఇంకొక పురుషుడు – అన్న, మామ మొదలగువారి చేతికి వెడుతూ వుంటుంది.
  5. ఇంకో ముఖ్యమైన ఇబ్బంది – ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పు డు బస్సులు మొదలగు వాటిలో, ఉద్యోగం చేసే చోట, కాంటీన్, మీటింగ్స్ లో ప్రత్యక్షంగానో, పరోక్షం గానో ఏదో విధమయిన లైంగిక వేధింపులకి గురి అవుతూ వుంటారు మహిళలు. అవి చూపులు కావచ్చు, మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు. ఇటువంటివి మహిళలు వారి వారి పరిస్థితులను బట్టి ఎదుర్కొంటూ, తమని తాము రక్షించుకుంటూ, తప్పించుకునే దారులు వెదుక్కంటూ గడుపుకోవడమో లేక ఎదురు తిరగడమో, లేక ఫిర్యాదులు చెయ్యడమో చేస్తారు. వాటి మంచి చెడులు ఎదుర్కొవాల్సి వస్తుంది. దీనివల్ల ఎంతగానో మానసికమైన ఒత్తిడి, ఆందోళనఅనుభవిస్తూ వుంటారు. ఇది వాళ్ళ ఉద్యోగంలో పనిమీద ప్రభావం చూపుతుంది. ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
  6. మరొక విషయం — వేతనాలలో అసమానత. మహిళలు నర్సులుగా, టీచర్లుగా, డాక్టర్లుగా ఉద్యోగాలు సంపాదించినా ఇతర వర్గాలలో ఇంజనీర్లుగా, మేనేజర్లుగా వేరే మగ ఆధిక్యత ఉన్న రంగాలలో చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా మగవారికే ఎక్కువ ప్రాధావ్యత వుంటుంది. ప్రమోషన్ల విషయంలో కూడా అసమానత కనపడుతుంది. అన్నిరంగాలలోను స్త్రీ, పురుషులకి ఒకే పనికి ఒకే జీతం లభించదు. ఉదాహరణకి రోజుకూలీ వేతనాలకి చిన్నపరిశ్రమలలో మగవారికి ఇస్తున్న వేతనం కన్నా చాలా తక్కువ స్త్రీలకి లభిస్తుంది.

బయటకి వెళ్ళి పనిచేసే మహిళ నలుగురితొ తిరిగి మాట్లాడి, ఉద్యోగానికి తగ్గ వస్త్రధారణ చేసుకొని, స్కూటర్లు, కార్లు నడుపుతూ, ఆధునికంగా, స్వతంత్రంగా వుంటే ఇప్పటికీ సమాజం లో కొన్నిచోట్ల అటువంటి వారిని ఏదో బరితెగించినట్లు, నేరం చేసినట్లు చూడటం జరుగుతోంది.

బయటకి వెళ్ళి ఉద్యోగాలు చేసే స్త్రీల సమస్యలపైన ప్రభుత్వపరంగాను, ప్రైవేటు వ్యవస్థాపకుల పరంగాను చాలా అధ్యయనాలు జరిగాయి. ఎన్నో సలహాలు, మార్పులు చెప్పడం అయింది. మచ్చుకి కొన్ని….

మహిళ మగవారితో సమానంగా విధులు నిర్వర్తించాలంటే సంఘంలో, కుటుంబ వ్యక్తులలో మార్పులు రావాలి. మగవారు మహిళకి చేదోడు వాదోడుగా, అన్ని పనులలో సహకారం అందించాలి. పనిచేసే చోట్ల భద్రత పటిష్ఠంగా వుండాలి. CCTVలు, GPS ఉండాలి. తమను తాము రక్షించుకోగలిగిన స్థితికి కావలసిన శిక్షణ కావాలి. పనిచేసే వీలు సవరించి ఇంటి నుంచి పనిచేసే సౌకర్యం వుండాలి. ప్రసవసమయంలో నూ, అనారోగ్య పరిస్థితిలో శెలవులు ఉదారంగా ఇవ్వాలి. ఎక్కడినుంచైనా సరే ఇన్ని గంటలు పనిచేస్తే ఇంత జీతం వుండాలి.

*************************************

*************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page