13_009 తో. లే. పి. – అంబికా సింగ్

1963 లో కాకినాడ లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో, చదువు పూర్తిచేసి పట్టా చేతబట్టుకుని, శ్రీశైలం ప్రాజక్టు లో జూనియర్ ఇంజనీరు గా నేను ఉద్యోగంలో చేరడం జరిగింది. దాదాపు ఒక ఏడాదిపాటు ప్రాజక్టు నిర్మాణ స్ధలిలో విసుగు-విరామం లేని రీతిలో కార్యనిర్వహణను విజయవంతంగా పూర్తి చేసి, దానికి సముచితమైన గుర్తింపును పొంది, ఆ పిమ్మట ఛీఫ్ ఇంజనీరు వారి కార్యాలయానికి బదిలీ కావడం జరిగింది. ఆఫీసు పని అవడంతో కాస్తంత విరామం దొరికేది. దానిని సద్వినియోగం చేసుకునే దిశలో నా అభిరుచి కి అనుగుణం గా దేశ‌విదేశీయులతో కలం స్నేహాన్ని ఎన్నుకొని వారితో తరచుగా ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపేవాడిని.

ఇదిగో ఆ రకంగా చెలిమిని ఏర్పరచుకున్న వారిలో ఒకరు ఆస్ట్రేలియా కు సమీపాన ఫిజి ఐలెండ్స్ లో లబాసా నగరానికి చెందిన శ్రీ అంబికా పి. సింగ్.

1960 దశకంలో ఆయనతో ఏర్పడిన స్నేహం 1990 ప్రాంతంలో ఆయన చనిపోయే వరకు కూడా కొనసాగింది. అంతే కాదు ! ఆ తరువాత వారి శ్రీమతి భాన్మతీ సింగ్ గారి తోను వారి పిల్లలు శ్రీ ధరమ్ జీత్ సింగ్ (కెనడా), శ్రీ రంజీత్ సింగ్( న్యూజిలాంఢ్), కుసుమ్ లతా సింగ్ ( లబాసా ) తోనూ కొనసాగుతూనే ఉన్నాయి.

అంబికాసింగ్ పూర్వీకులు పంజాబ్ సంతతి కి చెందినవారు, ఆ రోజులలో కుటుంబ పోషణార్ధమై పంజాబును వదలి ఫిజి దీవులకు వలస వెళ్ళి‌ అక్కడ చెరకు పొలాలలో కష్టించి పనిచేసి కుటుంబ అవసరాలను తీర్చుకునేవారు.

అ కోవలో తన కుటుంబ సమేతంగా అంబికా సింగ్ ఫిజికి వెళ్ళి‌ లబాసాలో స్ధిరపడ్డా‌రు. కాలగమనంలో అక్కడ మౌనిదేవో ఇండియన్ స్కూలు అన్న పేరుతో ఒక విద్యాసంస్ధను  స్ధాపించి నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా‌, International Scouts and Guides అన్న అంతర్జాతీయ సంస్ధలో సభ్యునిగా చేరి అదనపు బాధ్యతను నిర్వహించారు.

అంబికా సింగ్ సదా తాను ఉత్తరాలకు ప్రాముఖ్యతను ఇస్తూ అమూల్యయిన స్నేహానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తూండేవాడు. 1968 అక్టోబరు లో జరిగిన నా వివాహానికి ఆహ్వానిస్తూ శుభలేఖను పంపగా‌, తక్షణమే స్పందిస్తూ, మాకు పెళ్ళికానుకగా art-work తో నిండిన ఒక పెద్ద సిల్క్ కర్ఛీఫును పంపించాడు. 

వారి అమ్మాయి చిరంజీవి కుసుమలత వివాహానికి మమ్మల్ని సకుటుంబంగా ఆహ్వానిస్తూ ఎంతో పెద్దమనసుతో లేఖ, శుభలేఖలను పంపాడు. మా స్నేహం అలా క్రమేపీ విస్తరిస్తూ వచ్చింది.

ఇలా ఉండగా, ఒకసారి దురదృష్టవశాత్తూ అంబికా సింగ్ హృద్రోగానికి గురై, వైద్యచికిత్సను పొందుతూ హఠాన్మరణం చెందాడు. అలాగే మరికొన్నేళ్ళకి సోదరి భాన్మతి కూడా కాలం చేసింది. నిజానికి,

ఇవి ఈనాటికీ నేను జీర్ణించుకోలేని వాస్తవాలు.

కాగా వారి పిల్లలు ఫేస్ బుక్ ద్వారా ఈనాటికీ నాతో contactలో ఉంటూ ఉండడం వారి సౌజన్యానికి సంకేతం అని ఘంటాపధంగా చెప్పగలను.

ఈనాడు నేను మీతో పంచుకుంటూన్న ఈ తోక లేని పిట్ట అంబికా సింగ్ నాకు పంపిన అమూల్యకానుకలలో ఒకటి…

మీ ముందు..మీ కోసం !

*** ధన్యవాదాలు-నమస్కారములు ***

­ ***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page