తెలుగు సాహిత్యం అన్ని రంగాలకూ విస్తరించాలి

ఐఐటీ ప్రొఫెసర్ డా. శ్రీనివాస్ చక్రవర్తి

 

అనేక రంగాలకు సంబంధించిన అనేకానేక పుస్తకాల వెల్లువతో తెలుగు సాహిత్యం సుసంపన్నం కావాలని మద్రాసు ఐఐటీలో న్యూరోసైన్స్, బయోటెక్నాలజీ ప్రొఫెసర్ డా. వడ్డాది శ్రీనివాస్ చక్రవర్తి ఆకాంక్షించారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సంస్థ ప్రతి నెలా నిర్వహించే “నెల నెలా వెన్నెల” కార్యక్రమంలో భాగంగా ఆయన “తెలుగు సాహిత్యం – కొత్తపుంతలు” అంశంపై ప్రసంగిస్తూ పవర్ పాయింట్ ప్రెసెంటషన్ ఇచ్చారు. సైన్స్ మీదే కాక తెలుగు సాహిత్యం మీద ఆయనకున్న పరిజ్ఞానం వెల్లడయ్యేలా కొనసాగిన ప్రసంగంతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

తెలుగు పుస్తకాలనగానే ఇతిహాసాలు, కాల్పనిక సాహిత్యం, ధర్మ సూక్ష్మాలు, కవితలు, గేయాలు, నీతి సూక్తులు వంటి పుస్తకాలు మాత్రమే ఉంటున్నాయని శ్రీనివాస్ చక్రవర్తి అన్నారు. తనకు తెలుగంటే చాలా ఇష్టమని, అందుకే తెలుగు సాహిత్య విస్తృతి బాగా పెరిగి కొత్తపుంతలు తొక్కాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు.

పుస్తకాల వ్యాపారమనగానే వ్యాపారులు భయపడేలాగా మార్కెట్ తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.

యూరప్ లో పారిశ్రామిక విప్లవానికి ముందే సాంస్కృతిక, వైజ్ఞానిక పునరుజ్జీవనం (విప్లవం) వచ్చిందని సోదాహరణంగా వివరించారు.
తను ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు… దైవం గురించి రకరకాల దృక్పథాలు, భాష, చరిత్రకారులు, చిత్రకళ, చిత్రకారులు, ఛాయాగ్రహణం  యాత్రలు, వంటలు వంటివాటిని అమితంగా ప్రేమిస్తారని తెలుసుకున్నానని వివరించారు. వాటికి సంబంధించిన మిలియన్ల కొద్దీ పుస్తకాలు అక్కడ లభ్యమవుతున్నాయని ప్రశంసించారు. ఒక ఛాయాగ్రహకుడు హెలికాఫ్టర్ లో తిరిగి అక్కడి అందాలను చిత్రాలలో బంధించి పుస్తకం విడుదల చేశారన్నారు. వీటిలో విదేశీ సాహిత్యం ఒకమూల కొద్దిగా ఉంటుందని పేర్కొన్నారు. బ్రిటన్ లో అచ్చయిన ప్రతి పుస్తకం తమ వద్ద ఉంటుందని బ్రిటీష్ లైబ్రరీ గర్వంగా చెప్పుకుంటుందని, ఆ పరిస్థితి మన దేశంలో ఉన్న లైబ్రరీకైనా  ఉందా అని ప్రశ్నించారు.

ఇక విదేశీ బాల సాహిత్యం ఒక సముద్రంలా రెండు కళ్ళూ చాలవన్నట్టు ముచ్చటగోలుపుతాయని అన్నారు. పిట్టకథలు, సైన్స్ ఫిక్షన్, పిల్లలలో భయాన్ని దూరం చేసే బాలల భయానక సాహిత్యం, క్రీడలు తదితర విభాగాలలో పలురకాలను వివరించారు. అంతర్కటికా వెళ్ళిన బాలల కథల ఆంగ్ల పుస్తకం 60 కోట్లు అమ్ముడైందని,  “సాహస గాథలు”  పేరుతో వాటిని అనువదించానని వెల్లడించారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు తెలుగులో బాల సాహిత్యం బాగానే ఉండేదని, ప్రస్తుతం జాలిగొలిపే స్థితిలో ఉందని అన్నారు.

మనం సినిమాలను ఎంతగా ఇష్టపడినా..నటనలో రకాలు, శాస్త్రీయ దృక్పథంతో కూడిన పుస్తకాలు ఎందుకు రావో అర్థం కాదన్నారు. సైన్స్ లో జరగనున్న అభివృద్ధి, గర్భిణులు తొమ్మిది నెలలూ తీసుకోవలసిన జాగ్రత్తలను విపులంగా వివరించేవి, సినిమా నిర్మాణం పట్ల అవగాహన కలిగించేవి, ఇంకా అనేక రంగాలకు సంబంధించిన పుస్తకాల అవసరాన్ని వివరించారు.

“మాయాబజార్” చిత్రంలో రకరకాల వంటల వర్ణనలో శాకంభారీ వర ప్రసాదం గోంగూర అని చెప్పినట్టు తెలుగు సాహిత్యానికి “నాన్ ఫిక్షన్” అటువంటిదని అన్నారు. పాశ్చాత్య దేశాలలో బడ్జెట్ కి అనుగుణంగా ఇల్లు కట్టుకోవడం ఎలా అన్న అంశంపై కూడా పుస్తకాలుంటాయని, అక్కడివాళ్ళు వాటిని చదివి ఇల్లు కూడా కట్టుకుంటారని వివరించారు. అటువంటి ఉపయోగపడే పుస్తకాలు భారతీయ భాషలలో కూడా రావాలనే అభిలాషను వ్యక్తం చేశారు.

పెర్సీ జాక్సన్ వంటి వారు పౌరాణిక సాహిత్యం ఆధారంగా ఆసక్తి రేపే సినిమాలను తీశారని అన్నారు. మనకూ అటువంటివి ఉంటే బాగుంటుందన్నారు.

ఉపనిషత్తులు, ప్రాచీన శాస్త్రాల గురించి కూడా ప్రస్తావిస్తూ… చంద్రయాన్ మిషన్ సందర్భంగా ఒక రచయిత వ్యాసం రాశారని గుర్తు చేశారు. అందులో ఆయన చంద్రుడికి సంబంధించిన జ్ఞానం దేశంలో ఎప్పటినుంచో ఉందని పేర్కొన్నారని,
ప్రతి విషయం మనకు ముందే తెలుసని అనుకున్నప్పుడు అభివృద్ధి అనేది ఉండదని వ్యాఖ్యానించారు. నిజంగా ఉన్నట్టయితే అది నేటి జీవనానికి ఉపయోగపడేలా మలచవలసి ఉంటుందని, అదే శాస్త్రీయ దృక్పథమని అన్నారు.
జీవితం అభూత కల్పన అన్న జ్ఞానం గొప్పదే అయినా, ఆ జ్ఞానం అనుభవంలోకి వచ్చేవరకు భౌతిక ప్రపంచంలో ఉండవలసినదేనని వ్యాఖ్యానించారు. మనసు, మమత అనేటువంటి భావనలకి ఆధారం భౌతిక ప్రపంచమే కదా అని ప్రశ్నించారు. ప్రతి రంగానికి సంబంధించిన పుస్తకాలు రావాలని, ఆర్థర్ హెయిలీ రాసిన “ఎయిర్పోర్ట్” సృజనకు శిఖరం వంటిదని ఉదహరించారు. యండమూరి వంటివారు సైన్స్ విషయంలో కొంత ప్రయోగం చేసినా, వాస్తవానికి దగ్గరగా ఉండే రచనలు ఎన్నో రావలసిన అవసరం ఉందన్నారు. చెన్నై విషయమే తీసుకుంటే.. వచ్చే ఏడాది భారీ వర్షం కురిస్తే ఎదుర్కొనడానికి కావలసిన చర్యలను వివరించే పుస్తకం కూడా ఈ కోవకు చెందినదేనన్నారు.

తెలుగులో నన్నయ సాహిత్యం, అన్నమాచార్య సాహిత్యం తదితర రూపాలలో  అద్భుతమైన పదకోశం ఉన్నా దాన్ని సమర్థవంతంగా ఉపయోగించే రౌతుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఆంగ్లంలో పదాల వ్యుత్పత్తి, చరిత్రలు తెలిపే కథల పుస్తకాలతో పాఠకులు ప్రేమలో పడతారని, అటువంటి సరదాగొలిపే పుస్తకాలు మనకూ ఉండాలన్నారు.
చక్కని పదకోశం ఆన్లైన్ లో ఉండవలసిన అవసరం ఉందని, “ఈనాడు” సంస్థ  ఆ ప్రయత్నం చేస్తోందని విన్నానని అన్నారు.

దేశంలో ఆంగ్లం మీద పట్టున్నవారు పది శాతమే ఉన్నారని అంటూ.. మనకు ఆత్మగౌరవం పెరిగి భారతీయ భాషా విప్లవం రావాలని పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ తో సహా యూరప్ అంతా కూడా కళాత్మక విప్లవం జరిగిందని పేర్కొన్నారు. మన దేశంలో అనేక మార్పులు మొదలయ్యాయని ఇటీవల మేధావులు అనడం ఆశాజనకంగా ఉందని, అవి అత్యంత త్వరగా నిర్మాణాత్మకంగా మారగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

సంస్థ అధ్యక్షులు “అజంత” శంకరరావు వక్తను సత్కరించి స్వాగతోపన్యాసం చేశారు. కార్యదర్శి వై. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కల్పన గుప్తా స్వాగతోపన్యాసం చేశారు.

****************************

బాలసుబ్రహ్మణ్యం అభిమానిని

ఎల్. వైద్యనాథన్ జీవిత సాఫల్య పురస్కార సభలో ఎంపీ ఇల గణేశన్

తను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానిని అని, పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన గొప్ప కళాకారులయ్యారని బీజేపీ ఎంపీ ఇల గణేశన్ పేర్కొన్నారు.
ఎల్. వైద్యనాథన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని  ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. శుక్రవారం భారతీయ విద్యాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇల గణేశన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్యనాథన్ మేనకోడళ్ళు, శిష్యురాళ్ళు, ప్రముఖ వయోలిన్ కళాకార ద్వయం ఎం. లలిత, ఎం. నందినిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇల గణేశన్  మాట్లాడుతూ..
సంగీతానికి శిఖరరాల వంటి కళాకారుల మధ్య కూర్చోవడం ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు.
తనకు సంగీతం తెలియదని, రసికుడిని మాత్రమేనని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం పాటలకు తను అభిమానినని వెల్లడించారు. తెలుగులో “తేట” అన్నమాట ఉపయోగిస్తారని, “సుందర తెలుంగు” అని భారతీయార్ ఎందుకన్నారో హైదరాబాద్ లో కొందరు అమ్మాయిలు మాట్లాడిన తెలుగు విన్నాక అర్థమయిందని అన్నారు.
“శంకరాభరణం” చిత్రంలో ఎస్పీబీ ఆలపించి అజరామరం చేసిన “ఓంకారనాదాను” పాటలోని  …అద్వైత సిద్ధికి అమరత్వ లబ్దికి గానమే సోపానము సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము…ను గుర్తు చేసి అర్థం వివరించారు.
ప్రహ్లాదుడికి భక్తి తల్లి గర్భంలో ఉండగా భక్తి కలిగినట్టు ఎస్పీబీకి సంగీతం పూర్వజన్మ సుకృతంగా అబ్బిందని ప్రశంసించారు.

భారతదేశం గొప్పదనం సింహాసనంలో (అధికారం) లేదని,   సంస్కృతిలో ఉందని పేర్కొన్నారు.
ప్రపంచమంతటా సంగీత నృత్యాలున్నా మనదేశంలోని సంగీతం దైవికమైనదని వ్యాఖ్యానించారు.
త్యాగరాజస్వామి, సూరదాసు తదితర వాగ్గేయకారులు సంగీతంతోనే ముక్తి పొందారని గుర్తు చేశారు. వైద్యనాథన్ గురించి మాట్లాడుతూ….తమిళనాడు గ్రామీణ సంగీతంతో సహా పలురకాల సంగీతాన్ని ఔపోసన పట్టిన కళాకారులు వైద్యనాథన్ అని ప్రశంసించారు. వాణీ జయరాం గురించి మాట్లాడుతూ.. గత జన్మలో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసిన కారణంగా ఆమె ఈ జన్మలో  “కలైవాణి” అయ్యారని ఆమె తండ్రకి ఒకరు జోశ్యం చెప్పిన విషయాన్ని సభకు వివరించారు.

పురస్కారాన్ని అందుకున్న అనంతరం బాలసుబ్రహ్మణ్యం స్పందిస్తూ…
ఈ సభలో కూర్చోడానికి కష్టంగా ఉందని ఇల గణేశన్ అన్నారని, అనేక రంగాలలో నిష్ణాతులైనవాళ్ళ మధ్య కూర్చోవడం తనకు అంతకు పదింతలు కష్టంగా ఉందని పేర్కొన్నారు.

50 ఏళ్ళు పాడగలగడం ఒక యోగమని, ఇది తన  పూర్వజన్మ పుణ్యం అయ్యుంటుందని అన్నారు. తనకు అన్నయ్య, ఆత్మబంధువు అయిన ఎల్. వైద్యనాథన్ పురస్కారాన్ని అందుకోవడం అదృష్టమని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

గొప్ప కళాకారులతో కలిసి చేసిన ప్రయాణం వల్ల తను సంగీతం నేర్చుకున్నానని అన్నారు. అనేకమంది గురువులు, ఆ గురువుల ఆశీర్వాదం దక్కిందని పేర్కొంటూ….తనకు ఏం తెలియదో తనకు తెలుసని అన్నారు.

“శ్రీ శ్రీ శ్రీ మర్యాదరామన్న” చిత్రంలో మొదటి పాట పాడినప్పుడు వీ ఎస్ నరసింహన్, ఎల్. వైద్యనాథన్  వయోలిన్ కళాకారులని, ఆ ఇద్దరూ సోదరుల్లా అన్యోన్యంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. వైద్యనాథన్ 24, తను 20 వయసులో ఉన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం ఏర్పడిందని వెల్లడించారు. అద్భుతమైన కళాకారులు ఆయన బృందంలో ఉండేవారని, వైద్యనాథన్ సంగీతం అందించిన 90 చిత్రాలకు పని చేయడం తన అదృష్టమని బాలసుబ్రహ్మణ్యం అన్నారు.  ఆణిముత్యాల వంటి ఆ పాటలను ఇప్పటికీ తను వేదికల మీద పాడుతూనే ఉన్నానని పేర్కొన్నారు.  నిరాడంబరులు, వినయశీలి అని,
ఇళయరాజా అనే సంగీతకారులు మేధావి అవ్వడానికి కారణం వైద్యనాథనే అని వ్యాఖ్యానించారు. తనకు అవకాశాలు ఇచ్చినవారిలో ఒకరైన వైద్యనాథన్ కు కృతజ్ఞతాపూర్వకంగా ఈ పురస్కారాన్ని అందుకున్నానని వెల్లడించారు. శంకరాభరణం చిత్రంలోని “ఓంకార నాదానుసంధానమౌ గానమే” పాటలో ఇల గణేశన్ పేర్కొన్న భాగాన్ని పాడి ప్రేక్షకుల కరతాళధ్వనులను అందుకున్నారు. తను పాడలేనని చెప్పినా పట్టుపట్టి పాడించిన పుగళింది, కే వీ మహదేవన్ లను గుర్తు చేసుకున్నారు. రాజ్ కుమార్ భారతి, వాణీ జయరాంల ప్రతిభను ప్రశంసించారు. తను ఎంతో మందికి రుణపడి ఉన్నానని, అందరి రుణం తీర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాలని ఆకాంక్షించారు. ఇప్పటి ప్రేక్షకులు అప్పుడు కూడా ప్రేక్షకులుగానే ఉండాలని చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. తను వైద్యనాథన్ కుటుంబ సభ్యుడినని పేర్కొన్నారు. మిగతా కళాకారుల కన్నా తన మీద ఎక్కువ ప్రేమ ఉండడం వల్ల   పేరిట ఏర్పరచిన పురస్కారాన్ని మొదట తనకు ఇచ్చారని ఆత్మీయంగా అన్నారు.

సుబ్రమణ్య భారతి మనుమడు వి. రాజ్ కుమార్ భారతి, వాణీ జయరాం, గాయని సునంద, డా. చంద్రశేఖర శాండిల్య   లను వైద్యనాథన్ కుటుంబ సభ్యులు సత్కరించారు. భారతీయ విద్యాభవన్ చైర్మన్ సభారత్నం, నల్లి ఫైన్ ఆర్ట్స్ వ్యవస్థాపక కార్యదర్శి ముత్తుస్వామి, తదితరులు పాల్గొన్నారు.

వైద్యనాథన్ అత్యంత మృదువుగా మాట్లాడేవారని, తను జీకే వెంకటేష్ వద్ద కన్నడంలో పాడిన అన్ని పాటలకూ ఆయనే అద్భుతంగా ఆర్కెస్ట్రయిజేషన్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఏది చెప్పినా వెంటనే నేర్చుకొని పాడే గాయకుడు బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. “శంకరాభరణం” రికార్డింగ్ అప్పుడు తను ఆయనను “శంకరశాస్త్రి” అనేదాన్నని అంటూ అప్పటి విశేషాలను ఆసక్తి కలిగేలా వివరించారు. సభలో నవ్వులు పూయించారు.

కర్ణపేయంగా సంగీత కార్యక్రమాలు

సభా కార్యక్రమానికి ముందు వైద్యనాథన్ మేనకోడళ్ళు, శిష్యురాళ్ళు, ప్రముఖ వయోలిన్ కళాకార ద్వయం ఎం. లలిత, ఎం. నందినిలు చక్కని కచేరి చేశారు. వైద్యనాథన్ రూపొందించిన వాసంతి రాగంలోని రచనను కర్ణపేయంగా వినిపించారు. శ్రీధరన్ మృదంగ సహకారం రాణించింది. వైద్యనాథన్ పై డాక్యుమెంటరీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆర్కే నారాయణన్ రచనల ఆధారంగా రూపొందించిన టీవీ కార్యక్రమం మాల్గుడి డేస్ కు వైద్యనాథన్ అందించిన సంగీతం ఆధారంగా సాగిన డాక్యుమెంటరీ ఆసక్తికరంగా సాగింది. సభ అనంతరం చెన్నై చిల్డ్రన్స్ కొయిర్, చెన్నై మ్యూజిక్ లవర్స్ సంగమం వినిపించిన సంగీతం సభను మెప్పించింది.

ఎల్. వైద్యనాథన్ గురించి…

ఎనిమిదేళ్ళ లేత వయసులో అరంగేట్రం చేసిన వైద్యనాథన్ కర్ణాటక, హిందుస్తానీ, పాశ్చాత్య సంగీతాలలో నిష్ణాతులయ్యారు ఆకాశవాణి  నేరుగా ఏ గ్రేడ్ గుర్తింపును ఇచ్చిన ఏకైక కళాకారులు.
170 తమిళ, తెలుగు, కన్నడ తదితర చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఒక కన్నడ చిత్రంలోని “శివ శివ” అన్నది అత్యంత కష్టమైన పాట అని ఎస్. జానకి తరచూ అంటూంటారు. అది వైద్యనాథన్ సంగీతం అందించిన గీతమే.

****************************

 

“నవగ్రహాంజలి” సీడీ ఆవిష్కరణ

 

గ్రహాల ప్రభావం, సంగీత ప్రభావం శాస్త్రీయమైనవని, సాహిత్య, సంగీత రచనతో జోశ్యుల ఉమ, శైలేష్ లు నవగ్రహాల గొప్పదనాన్ని తెలియజెప్పారని ప్రముఖ తమిళ రచయిత పట్టుకొట్టై ప్రభాకర్, ప్రముఖ తెలుగు కవి, రచయిత ఆచార్య కాసల నాగభూషణం పేర్కొన్నారు.

ఫిబ్రవరి 10వ తేదీన నగరానికి చెందిన ప్రముఖ రచయిత్రి, సంగీత గురువు జోశ్యుల ఉమ రచించి, ఆమె కుమారుడు శైలేష్ స్వరపరచిన “నవగ్రహాంజలి” నవగ్రహాల కీర్తనల సీడీ విడుదల సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని సీడీను విడుదల చేశారు.
శనివారం సాయంత్రం ఎం ఆర్ సీ నగర్ రాణి మెయ్యమ్మై టవర్స్ లోని క్లబ్ హౌస్ లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఉమ, శైలేష్, నీరజ వసంత్, ఎస్పీ వసంతలక్ష్మి, పత్రి అనురాధ ఆలపించిన పాటలకు రామకృష్ణన్ తబలపై సహకరించగా శైలేష్ కీబోర్డు కూడా వాయించారు.

సీడీ విడుదల అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ…
సంగీతం రాకపోయినా సంగీత రసికుడిగా, “స్వరార్ణవ” శ్రేయోభిలాషిగా ఈ సీడీ విడుదల కార్యక్రమానికి వచ్చానని ప్రభాకర్ వెల్లడించారు. జోశ్యుల  కుటుంబమంతా కళాకారులేనని, గర్వమే దరిజేరని వారి వ్యక్తిత్వం తనను ఆకట్టుకుందని అయన ప్రశంసించారు. తన శ్రీమతిలోని కళాతృష్ణను ఉమ నెలకొల్పిన శిక్షణా సంస్థ తీరుస్తోందని, ఇంకొకరికి నేర్పే అభిరుచితో ఎందరి కళాతృష్ణనో తల్లీ తనయులు తీరుస్తున్నారని అన్నారు.
నవగ్రహాలపై ఉమ చేసిన రచనలన్నీ పూర్తి జ్ఞానంతో కూడుకున్నవని కొనియాడారు. మనపై నవగ్రహాల ప్రభావం శాస్త్రీయంగా నిరూపింపబడిందని అన్నారు. సంగీతం కూడా ప్రభావవంతమైనదని, అందులోనూ మంచి శాస్త్రీయ సంగీతం వింటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.

విద్యని క్షణక్షణం, ధనాన్ని కణకణం ఆర్జించాలని శాస్త్రం చెప్తోందని ఆచార్య కాసల వెల్లడించారు. సాంస్కృతిక వారసత్వమున్న కళాకారులు జోశ్యుల కుటుంబ సభ్యులని ప్రశంసించారు. ఈ నవగ్రహ కీర్తనల సంకలనం నవగ్రహ వైభవమని వ్యాఖ్యానిస్తూ…  సాధారణంగా గ్రహాలనగానే సామాన్యులు భయపడతారని, తేట తెలుగులో ఉమ రాసిన పాటలు  అందరి భయాన్ని పోగొడతాయని వివరించారు. సంస్కృతంలో ఉన్న జ్ఞానం సామాన్యులని చేరుకోవడానికి ఇటువంటి రచనలు తోడ్పడతాయని వ్యాఖ్యానించారు. పేరడీ పాటలకు పెట్టింది పేరైన ఉమ కుటుంబంతో తన అనుబంధాన్ని వివరించారు.

అంతకుముందు ఉమ మాట్లాడుతూ… తన విద్యార్థులు తన పాటల సీడీని విడుదల చేయడం గురువుగా  తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. తమ గళాలను అందించిన నీరజ, అనూరాధ, వసంతల పాటతోపాటు మాట కూడా మధురమని, అంతటి మంచి మనసున్నవాళ్ళని ఆశీర్వాద పూర్వకంగా ప్రశంసించారు.
ఆద్యంతం కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించిన శైలేష్ స్వాగతోపన్యాసం చేస్తూ నవగ్రహాల అనుగ్రహాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. సీడీలోని కొంత భాగాన్ని సభకు వినిపించారు.

ఉమ, శైలేష్, పట్టుకొట్టై ప్రభాకర్, ఆచార్య కాసల, నీరజ వసంత్ ల పరిచయాలను ఊటుకూరు శారద, వి. నీరజ వసంత్, మల్లిక ప్రకాష్, ఉమ, జ్యోత్స్నలు సభకు చదివి వినిపించారు.
“స్వరార్ణవ” విద్యార్థినులు తమ గురువు ఉమను ఘనంగా సత్కరించారు.

పట్టుకొట్టై ప్రభాకర్, ఆయన శ్రీమతి శాంతి, ఆచార్య కాసల, తనను అడుగడుగునా ప్రోత్సహించే భర్త శ్యామసుందర్ లను ఉమ సత్కరించారు. చివరిగా నవగ్రహాల మీద అసక్తికరమయిన ఒక ఆటను నిర్వహించారు. ప్రభ వందన సమర్పణ చేశారు. సంస్థ విద్యార్థినులు, వారి కుటుంబసభ్యులు, సంగీతప్రియులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

****************************

 

వైవిధ్యం శర్వాణి సభ సంగీత కార్యక్రమం

భక్తి అనగానే తెలుగువారి ధ్యాస కీర్తనల మీదికే పోతుంది. అందులోనూ అన్నమాచార్య, భక్త  రామదాసు, త్యాగరాజస్వామి కీర్తనలు భక్తికి పెట్టింది పేరు. ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచినవి కూడా. ఎంత విన్నా తనివితీరని ఆ కీర్తనల కార్యక్రమాన్ని శర్వాణి సంగీత సభా ట్రస్ట్ సరికొత్తగా “ఆర్ట్… ఏ జర్నీ టు ద సోల్ అఫ్ మ్యూజిక్” పేరిట ఏర్పాటు చేసింది. టీనగర్ లోని పీ ఆర్ సీ సెంటినరీ హాలు (పప్పి చెట్టి రాఘవయ్య చెట్టి హాలు)లో  ఫిబ్రవరి 10వ తేదీ శనివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ గాయకులు, స్వరకర్త నీహాల్ రూపొందించగా… ఆయన సారథ్యంలో పేరొందిన గాయనీమణులు నిత్యసంతోషిణి, గోపిక పూర్ణిమ, వర్ధమాన  గాయకుడు శరత్ సంతోష్ అద్భుతంగా కీర్తనలను ఆలపించి అలరించారు. ఇందులో జనబాహుళ్యంలో ప్రజాదరణ పొందినవాటితో పాటు  కొన్ని అరుదైన అన్నమాచార్య సంకీర్తనలను, ప్రసిద్ధి గాంచిన రామదాస, త్యాగరాజ కీర్తనలను వినిపించారు.

“తలచి చూడ పరతత్వంబితడు” అన్న కీర్తనలో అన్నమాచార్య శ్రీహరిని ఎవ్వరూ చూడని ఒక కొత్త కోణంలో చూపించారని నీహాల్ వివరించి ఆలపించారు. ఈ సంకీర్తనకు తనే సంగీతాన్ని సమకూర్చానని వెల్లడించారు. అనంతరం అందరికీ తెలిసిన కొన్ని సంకీర్తనల పల్లవుల మాలికను ఆలపించి సభను ఆకట్టుకున్నారు.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ, నేదునూరి కృష్ణమూర్తిలు స్వరపరిచి అజరామరం చేసిన కీర్తనలకు నీహాల్ కొత్త హంగులను జత చేర్చి తన బృందంతో సమర్పించారు. “అదిగో భద్రాద్రి”, “తారక మంత్రము కోరిన దొరికెను” వంటి కీర్తనలను కళాకారులు ఆలపించారు.

“ఇనకుల తిలక” అన్న కీర్తనను గోపికపూర్ణిమ  ఆర్తిగా ఆలపించారు. “ఎన్నగాను రామ భజన” అన్న కీర్తన సహకార వాయిద్యాలు లేకుండానే  నిత్యసంతోషిణి భావయుక్తంగా వినిపించి సభను మెప్పించారు. మల్లాది సూరిబాబు స్వరాలను సమకూర్చిన “శరణాగత”, బాలమురళి స్వరపరిచిన “ఏ తీరుగ నను దయ చూచెదవో” కీర్తనలను నీహాల్ ఆలపించి మెప్పించారు.

అనంతరం “మేలుకోవయ్య”తో మొదలుపెట్టి “రారా మా ఇంటిదాకా”, “వందనము రఘునందన” వంటి కొన్ని త్యాగరాజ కృతులు, కీర్తనలను సాంప్రదాయబద్ధంగా ఆలపించారు. పంచరత్న కీర్తనల పల్లవులను, చివరిగా ఒక్కొక్క వాగ్గేయకారుడి ఒక్కొక్క కీర్తనను వినిపించి కార్యక్రమాన్ని ముగించారు. శ్యామలి వెంకట్ (వేణువు), డి. రవిశంకర్ (కీబోర్డు), ఎస్. విజేంద్రన్ (మృదంగం), టీ. శరవణన్ (ప్యాడ్), బి. సుబ్బారావు (ఘటం), వై.సత్యనారాయణన్ (తబల, పఖవాజ్) లు అందించిన సహకారం కార్యక్రమ శోభను మరింతగా పెంచింది.

హాలును ఏర్పాటు చేసి, ప్రసాద వితరణకు కూడా తోడ్పడిన పీఆర్సీ ఛారిటీస్ ట్రస్టీలు ఉమ్మడి సుధాకర్, వై వీ హరికృష్ణ, బుర్రా రఘురామయ్య తదితరులు,  ముఖ్య అతిథి, చీఫ్ ఇన్కం టాక్స్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ ను శర్వాణి సభ నిర్వహకురాలు వసంత సత్కరించారు.

ఏప్రిల్ 26న సామవేదం షణ్ముఖశర్మచే “శివపదం”, అనంతరం 27, 28, 29 తేదీల్లో “పరమేశ్వరీ వైభవం” అంశంపై  రాజా అన్నామలై మన్రం లో ఆయన ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

****************************

 

నవీన స్వయంవరం

 

చెన్నైలోని తెలుగు బ్రాహ్మణ మహాసభ ఆధ్వర్యంలో “నవీన స్వయంవరం” పేరిట 33వ వధూవరుల పరిచయ వేదిక ఆదివారం నగరంలో జరిగింది. టీనగర్ రామకృష్ణ మిషన్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలోని ఇన్ఫోసిస్ హాలు వేదిక. సంస్థ ఉపాధ్యక్షులు రఘు కుమార్, కోశాధికారి జయరామన్ ల ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జరిగిన కార్యక్రమం వినాయక పూజ, స్వయంవర పార్వతీ పూజతో ప్రారంభమైంది. 200 మంది వధూవరులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జ్యోతిష పండితులు సత్యనారాయణ, మహదేవన్ లు పాల్గొన్నారు. దాదాపు 500 మంది పాల్గొన్నారు. తమిళనాడు తెలుగు బ్రాహ్మణ మహాసభను బాలకృష్ణన్ స్థాపించి ఇరవయ్యేళ్లకు పైగా కార్యదర్శిగా సేవాలందించారని, ఆయనే  మొట్టమొదటి వధూవరుల పరిచయ వేదికను తిరువయ్యారులో నిర్వహించారని నిర్వాహకులు వివరించారు. తమ సంస్థ విద్యాదానం,వసతి, ఉద్యోగం, వివాహం, సాంస్కృతిక సేవలతో ముందుకు వెళ్తోందని, విద్యాదానంలో భాగంగా 20 శాతం మంది ఇతర సామాజిక వర్గాల బాలబాలికలకు కూడా ఉపకారవేతనాలను అందజేస్తున్నామని వెల్లడించారు.

****************************

 

సొగసరి సీసపద్యాలు పుస్తకావిష్కరణ

భావం, శైలి, వ్యక్తి శీలం, ధర్మం వంటి అంశాలను గురించిన ఉత్తమ పద్యాలు తెలుగు వాఙ్మయంలో ఎన్నో ఉన్నాయని ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య లింగమనేని బసవ శంకరరావు పేర్కొన్నారు.

జనవరి 28వ తేదీన వేద విజ్ఞాన వేదిక, ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన “తరతరాల తెలుగు కవిత” 95వ అంకంలో ఆయన సంపాదకత్వం వహించిన, ప్రెసిడెన్సీ కళాశాల  తెలుగు శాఖ ప్రస్తుత అధ్యక్షురాలు ఆమ్బ్రూణీ ఏర్చి కూర్చిన “సొగసరి సీసపద్యాలు” సంకలనం ఆవిష్కరణ సభ జరిగింది. డా. విజయకుమార్ ఆవిష్కరించి మొదటి ప్రతిని ఆకాశవాణి చెన్నై కేంద్రం పూర్వ సంచాలకులు వేణుగోపాలరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన శంకరరావు… ఎంపిక చేసిన కొన్ని పద్యాలను వివరించారు.

నది ఒడ్డుకి చెరొకవైపు అగస్త్య, వసిష్ఠ మహర్షులుండేవారని, అప్పుడు జరిగిన సంఘటనలను చమత్కారంగా వివరించిన పద్యాలను వివరించారు. మహాభారత యుద్ధ సమయంలోని పద్యం, దుర్వాస మహర్షి జీవితంలోనిది, లక్ష్మి, పార్వతిలు ఒకరినొకరు హాస్యమాడుకున్న పద్యాలను వివరించారు. గోనయామాత్యుడు అనే కవి “సస్యానందం” గ్రంథంలోని ఒక పద్యాన్ని వివరించి… అందులో వర్షం ఏ విధంగా కురుస్తుందో తెలియజెప్పే ప్రయోగాన్ని వివరించారని, ఎంతో పరిశీలించి  ఇటువంటి అమూల్యమైన పద్యాలను ఎంపిక చేశామని వెల్లడించారు.

పద్యాల ఎంపిక గురించి ఆమ్బ్రూణీ మాట్లాడుతూ… ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక రచయితలు రాసిన కొన్ని వేల పద్యాలను పరిశీలించి వాటిలో అణిముత్యాల వంటి 500 పద్యాలను ఎంపిక చేశామని వివరించారు.
సీస పద్యాల గురించిన గ్రంథాన్ని వెలువరించేందుకు తనను ఎంపిక చేసిన శంకరరావు శిష్య వాత్సల్యం గొప్పదని వివరించారు. గురుపత్ని సుజాత పంచిన ప్రేమ  తల్లిని తలపిస్తుందని అన్నారు. సంకలనంలోని పద్యాలను గురించి చెప్తూ… తల్లిని ఒక కవి వర్ణించిన, గురువు గురించి నన్నె చోడుడు చెప్పిన పద్యాలను చదివారు.

జేకే రెడ్డి మాట్లాడుతూ… తన కోరికపై ఎంతో శ్రమకోర్చి సీసపద్యాలను ఎంపిక చేసిన శంకరరావు, ఆమ్బ్రూణీలకు, అడిగిన వెంటనే  ప్రచురణకు అంగీకరించిన మధులకు ధాన్యవాదాలు తెలిపారు. కుటుంబంలోని ఆత్మీయతను, కవుల రసికతను, రసానుభూతిని, నెల్లూరి సీమ గొప్పదనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్నీ వెల్లడించే  కొన్ని పద్యాలను తన సహజశైలిలో రాగయుక్తంగా వినిపించారు. శంకరరావు శ్రీమతి సుజాత సంస్థ సాహిత్య కృషిని మెచ్చుకుంటూ రాసిన స్వీయపద్యాన్ని చదివారు. డా. విజయకుమార్, వేణుగోపాలరెడ్డిలు సంస్థను, పద్యాలను సేకరించిన ఆచార్యులను అభినందించారు.

కార్యక్రమం ప్రారంభంలో మధు స్వాగతోపన్యాసం చేస్తూ..ఈ గ్రంథంతోనే వేద విజ్ఞాన వేదిక పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. ఎల్బీ శంకరరావు, ఆమ్బ్రూణీ, డా. విజయకుమార్, వేణుగోపాలరెడ్డిల పరిచయాలను చదివి వినిపించారు.

కిడాంబి లక్ష్మీకాంత్ తన తండ్రి వీరరాఘవచార్యులు రచించిన ప్రార్థనాగీతాన్ని అలపించగా కార్యక్రమం ప్రారంభమైంది.

తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం ధ్యక్షులు తమ్మినేని బాబు, కార్యదర్శి పీ ఆర్ కేశవులు, ప్రముఖ రచయిత ప్రణవి, ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు శాఖ పూర్వాధ్యక్షురాలు డా. అనిందిత దంపతులు వక్తలను, ముఖ్య అతిథులను సత్కరించారు. తన తల్లి లూర్దమ్మ, గురువు శంకరరావు దంపతులు, మధు, జేకే రెడ్డిలను ఆమ్బ్రూణీ సత్కరించారు.

కార్యక్రమంలో “ఆమెన్ మినిస్ట్రీ రెవరెండ్ పాల్ యురేష్ కుమార్, “ఎమ్మాన్యుయెల్ ప్రేయర్ హౌస్” సిస్టర్ అచ్చు కుట్టి, ఇతర విశ్వాసకులు, ఆమ్బ్రుణి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

****************************

 

వైశ్యులది ధర్మబద్ధమైన వ్యాపారం

సినీ గీత రచయిత భువనచంద్ర

ఘనంగా ఎస్ కే పీ డీ వసతి గృహం శత వార్షికోత్సవ వేడుకలు

ప్రపంచంలో ఎన్ని ధర్మాలు నశించినా వైశ్య ధర్మం మాత్రం ఆచంద్రతరార్కం నిలిచిపోతుందని ప్రముఖ సినీ గీత రచయిత భువనచంద్ర ప్రశంసించారు. ఎస్ కే పీ డీ హాస్టల్ శత వార్షికోత్సవ వేడుకలు జనవరి 28వ తేదీ ఆదివారం ఉదయం జార్జ్ టౌన్ లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాలలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భువనచంద్ర వ్యాపారం, బ్యాంకింగ్, పబ్లికేషన్ల రంగాలలో వైశ్యుల కృషి గొప్పదని, ప్రతి ఆర్యవైశ్యుడూ చేసేది ధర్మబద్ధమైన వ్యాపారం… అంటే…సేవేనని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో దేవాలయ నిర్మాణం, నిత్యాన్నదానం, సత్రాల నిర్మాణం, నిర్వహణ, విద్యా దానాలలో వారు ఎప్పుడూ ముందే ఉంటారని, వారంటే తనకు అత్యంత గౌరవమని వెల్లడించారు. అందరి శ్రేయస్సు కోరుకొనేవారే శ్రేష్ఠులని పిలువబడ్డారని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అమ్మవారి జన్మస్థలమయిన పెనుగొండను దర్శించి ఆమె ఆశీర్వాదం పొందాలని సూచించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న అఖిల భారత శ్రీ వాసవీ ట్రస్ట్, పెనుగొండ అధ్యక్షులు డా. పీ ఎన్ గోవిందరాజులు మాట్లాడుతూ.. ఎన్నో కష్టనష్టాలకోర్చి వంద సంవత్సరాలుగా ఒక హాస్టల్ ను నిర్వహించడం మాటలు కాదని, తాను కూడా ఒక హాస్టల్ నిర్వహకుడినే కాబట్టి అందుకెంత శ్రమించాలో తనకు తెలుసునని పేర్కొన్నారు. పెనుగొండలో అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎస్ కే పీ డీ ఛారిటీస్ ఇప్పటికే, ఐదు లక్షల రూపాయలను అందజేసిందని, ఎప్పటికీ నిలిచిపోయే ఈ కార్యక్రమానికి మరింతగా సహకరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. పూర్వ దాతల సహకారం వల్లే సంస్థ ఆధ్వర్యంలో ధర్మకార్యాలు కొనసాగుతున్నాయని డా. జి. విజయకుమార్ అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. ఎం కే రవీంద్రన్ స్వాగతోపన్యాసం చేశారు.

హాస్టల్ పూర్వ విద్యార్థుల వితరణ

ఎం కే రవీంద్రన్ హాస్టల్ కు ఒక కంప్యూటర్ ను బహూకరించారు.  చదువులో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఏ రామచంద్రన్ ఉపకారవేతనాలను అందజేశారు. నలుగురు ప్రతిభ గల విద్యార్థులకు జి. బాలాజీ బంగారు పతకాలను బహూకరించారు.

ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు

వేడుకలలో భాగంగా ఉదయం అమ్మవారికి అభిషేకం, అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఊరేగింపును నిర్వహించారు. “వాసవీ చరిత్ర” హరికథను ప్రఖ్యాత హరికథా కళాకారిణి పురాణం విజయలక్ష్మి ఆకట్టుకొనేలా వివరించారు. టీ. పవిత్ర భరతనాట్యం ప్రేక్షకుల మన్ననలందుకొంది. అనంతరం హాస్టల్ విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎస్ కే పీ డీ అండ్ ఛారిటీస్ ధర్మకర్త పల్లా వేంకట చంద్రశేఖర్, కార్యదర్శి కే. రవీంద్రనాథ్, ట్రస్టీలు వూరా ఆంజనేయులు, నాలం శ్రీకాంత్, ఊటుకూరు శరత్ కుమార్, దేశు లక్ష్మీనారాయణ, గుగ్గిలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హాస్టల్ పూర్వ విద్యార్థుల “వైశ్య బాలభక్త సంఘం” ఆధ్వర్యంలో, ఎం ఏ నరసింహన్, ఎం కే రవీంద్రన్, టీ. జగదీశ్ బాబు, జి. బాలాజీ, కే. గోపాలశెట్టి, ఏ. రామచంద్రన్ ల నిర్వహణలో కార్యక్రమం జరిగింది. బండారు చంద్రయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

****************************

 

……. 10. మందాకిని                                                                                      తరువాయి ‘ ఆనందవిహారి – 02 ‘ లో…….