ఆనందవిహారి 02

వీరపాండ్య కట్టబ్రహ్మన 258వ జయంతి,

వాగ్గేయకారులు త్యాగరాజస్వామి 250 జయంతి

 

దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనం కావాలని, కులమతాలకు, లింగ భేదాలకు, పట్టణం, గ్రామం అన్న భేదాలకు అతీతంగా ఎదిగితేనే దేశం ఉజ్వలంగా వెలుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

ఆలిండియా తెలుగు ఫౌండేషన్, అఖిల భారత తెలుగు సమాఖ్య, తమిళనాడులోని తెలుగు సంస్థలు సంయుక్తంగా వీరపాండ్య కట్టబ్రహ్మన 258వ జయంతిని, వాగ్గేయకారులు త్యాగరాజస్వామి 250 జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. మద్రాసు విశ్వవిద్యాలయం సెంటినరీ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ పాల్గొన్నారు.

ఇద్దరు పవిత్ర వ్యక్తులను స్మరించుకొనే ఈ సభ  అత్యంత పవిత్రమయినదని గాంధీజీ కన్నా ఎంతో ముందు బ్రిటిషువారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కట్టబ్రహ్మన అని కొనియాడారు.

కులాలకు, మతాలకు అతీతంగా అందరూ త్యాగరాజ కీర్తనలను పాడుతున్నారని, అందుకే ఆయన త్యాగబ్రాహ్మ అయ్యారని వ్యాఖ్యానించారు. సంగీతం, సాహిత్యం, భక్తి కలగలిపి అందించిన ఆయనవంటి వాగ్గేయకారుడు మరి రాలేరని వ్యాఖ్యానించారు.  మానవాళి ఉన్నంతవరకూ ఆయన కీర్తనలు నిలిచి ఉంటాయని అన్నారు. మన సంగీత సాహిత్యాలతో మనసుకు సాంత్వన కలుగుతుందని, వాటిని మరింతగా ఉపయోగించుకొని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని అన్నారు.

ప్రపంచమంతటా అనేక నాగరికతలు “వసుధైక కుటుంబం”, “సర్వేజనస్సుఖినోభవంతు” అన్న సంస్కారాన్ని  మనకు అందించిన మన సంస్కృతి వల్లే మన దేశంలో వేల సంవత్సరాలుగా సంస్కృతీ సాంప్రదాయాలు, నాగరికత నిలిచి ఉన్నాయని పేర్కొన్నారు.

వీరపాండ్య అల్లూరి సీతారామరాజు, సురేంద్ర సాయి వంటివారు జాతీయ నాయకులని, వారితోపాటు చిదంబరం పిళ్ళై, సుబ్రహ్మణ్య భారతి వంటి గొప్పవారి గురించి పాఠ్యాంశాలు ఉండాలని అన్నారు.

దేశాన్ని దోచుకోవడమే కాక కొందరి మనసులు కూడా దోచుకున్నారని, అదే ప్రస్తుతం సమస్యగా ఉందని అన్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు, మనం పనికిరాని వాళ్ళమన్న భావన ఉండడం నిరాశాజనకమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఇంట్లో మాతృభాషలోనే మాట్లాడాలని సూచించారు. అమ్మ అన్నమాట హృదయంలో నుంచి వస్తుందని, మమ్మీ అన్న మాట నోటి నుంచి వస్తుందని చమత్కరించి నవ్వులు పూయించారు. ఇంగ్లీషు చదువుకుంటేనే అభివృద్ధి ఉంటుందన్నది అపోహ అని, తాను కాన్వెంటుకు వెళ్ళకుండానే ఈ స్థాయికి ఎదిగానని చప్పట్ల మధ్య అన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా కాన్వెంటుకు వెళ్ళలేదని అన్నారు.

క్రమశిక్షణ, సామాజిక స్పృహ, వ్యక్తిత్వం, విలువలతో మాత్రమే పైకి రాగలమని వివరించారు.
దేశపటాన్ని ప్రేమించడం మాత్రమే కాదని, దేశమంతా ఒక్కటిగా ఉండడమే దేశభక్తి అని అన్నారు. “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్” అన్న గురజాడ మాటలను గుర్తు చేశారు.

మహిళలు అభివృద్ధిలో భాగమని అన్నారు. మాతృభూమి అనడమే స్త్రీకి గౌరవ సూచిక అని వ్యాఖ్యానించారు.

అడుగడుగునా ఛలోక్తులు విసిరి ప్రేక్షకులను  నవ్వించారు. తన వస్త్రధారణ గురించి అడిగినవారికి.. అడ్రెసు మాత్రమే మారిందని, డ్రెస్సు మారలేదని చెప్తూంటానని అన్నారు.

“మతము వ్యక్తిగతము”, “నువ్వు టోపీ పెట్టుకో ఇంకొకరికి మాత్రం టోపీ పెట్టొద్దు” చిట్టి నా బొజ్జకు శ్రీరామరక్ష” వంటి అనేక చమత్కార బాణాలను సంధించారు.

ఎన్నో సంవత్సరాల తరువాత సంక్రాంతికి  కుటుంబంతో గడిపానని, అందుకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు. తమిళంలో ప్రసంగాన్ని ప్రారంభించారు. అందరికీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలను తెలిపారు.

సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ… ప్రజల మంచిచెడ్డలు తెలుసుకొనేందుకు వారితో మమేకమయ్యే నేతలు వెంకయ్య, భన్వరీలాల్ పురోహిత్ అని కొనియాడారు. రాష్ట్రంలో 40 శాతం భాషా మైనారిటీలు ఉన్నారని, వారి నుంచి భాషా హక్కును దూరం చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో జోక్యం చేసుకొని తెలుగువారి పిల్లలు తెలుగు అభ్యసించేలా చూడాలని అభ్యర్థించారు.అయినా తమిళం అంటే తెలుగువారికి గౌరవం ఉంది, ఆ భాష నేర్చుకోవడం కూడా సబబేనని అన్నారు. అయినా, ఆంధ్ర  చిత్తూరు జిల్లాలో 43 పాఠశాలలు తమిళాన్ని బోధిస్తున్నాయని, తమిళనాడులో కూడా మాతృభాషకు ఎవ్వరూ దూరం కాకూడదని వ్యాఖ్యానించారు. ఆ రకంగా  జీవో తీసుకురావాలని అభ్యర్థించారు.  త్యాగరాజస్వామి పేరిట తిరువయ్యారులో  విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని, చెన్నై నగరంలో కూడా కట్టబ్రహ్మన నెలకొల్పాలని గవర్నర్ ను కోరారు.

సభకు అధ్యక్షత వహించిన అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ డా. ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ.. కట్టబ్రహ్మన స్ఫూర్తి అందరికీ కలగాలని ఆకాంక్షించారు. సంగీతానికి భక్తి అద్ది ప్రచారం చేసిన వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి అని పేర్కొన్నారు. తమ స్వగ్రామం అత్తగిరిలోని తమ కులదైవమైన  రాముడి అనుగ్రహం తమ మీద ఉందని అన్నారు.

తమిళనాట ఉన్న 2 కోట్ల తెలుగువారి ప్రతినిధిగా తాను ఎన్నికలలో గెలిచి మంత్రినయ్యానని రాష్ట్ర స్పోర్ట్స్ అండ్ యూత్ శాఖ మంత్రి పి. బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన తెలుగులో ప్రసంగిస్తూ… కట్టబ్రహ్మన, త్యాగరాజస్వామి గొప్పదనాన్ని వివరించారు. మాతృభాషను మరిచిపోకూడదని, ఇంకొక రాష్ట్రంలో ఉన్నప్పుడు అక్కడి భాష కూడా నేర్చుకొని అక్కడివారితో పాలూ నీళ్ళలా కలిసిపోవాలని అన్నారు.

తమిళంలో సభకు అభివాదం చేసిన గవర్నర్.. తమిళంలో మాట్లాడడం వల్లే తమిళుల మనసు చూరగొనగలనని గ్రహించానని అన్నారు. ఎన్నో శతాబ్దాల తరువాత కూడా కట్టబ్రహ్మన, త్యాగరాజస్వామిలను గుర్తు చేసుకోవడం వారి గొప్పదనమని, మనది అంత ఘనమైన సంస్కృతి అని పేర్కొన్నారు. 40 సంవత్సరాలు నిండకముందే దేశం కోసం కట్టబ్రహ్మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారని గుర్తు చేశారు. త్యాగరాజస్వామి గురించి మాట్లాడుతూ..
“ఎందరో మహానుభావులు”, నగుమోము గనలేని”, “సామజ వరగమన” వంటి పేరొందిన కీర్తనలను, రెండు సంగీత రూపకాలను రూపొందించారని అన్నారు. విజయనగర రాజుల కాలం నుంచి తెలుగువారు ఇక్కడికి తరలివచ్చారని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యాపార, సినీ రంగాల ఎదుగుదలకు తెలుగువారు ఇతోధికంగా తోడ్పడ్డారని కొనియాడారు. తెలుగు, తమిళ ప్రజలు ఒకరి నుంచి ఒకరు ఎంతో నేర్చుకున్నారని, రాష్ట్రంలో ఉన్న ఈ వాతావరణం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ అని అన్నారు. ఇక్కడ ఉన్నందుకు తాను అదృష్టవంతుడినని పేర్కొన్నారు.

అనంతరం వివిధ మతాలు, రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించారు.
మదురైకి చెందిన నాయక రాజుల శ్రీనివాసన్, పాస్టర్ ఈశ్వరప్ప, కర్ణాటక సంగీత విద్వాంసులు తాడేపల్లి లోకనాథశర్మ, తిరుపూరు జిల్లాలో కట్టబ్రహ్మన విగ్రహం ఏర్పాటుకు కృషి చేసి, ఏటా ఆయన జయంతిని నిర్వహిస్తున్న పీ ఎస్ మణి, కట్టబ్రహ్మన వంశీకులు భీమరాజులను ఉప రాష్ట్రపతి, గవర్నర్ లు ఘనంగా సత్కరించారు.
గెందుస్వామి నాయుడు, మహమ్మద్ కరీముల్లాహ్ లు రాలేకపోయినందున వారి ఇంటికే వెళ్ళి సత్కరిస్తామని సమాఖ్య ప్రతినిధి తెలిపారు.

అరుంధతీయులకు ప్రస్తుతం ఇస్తున్న 3 శాతం రిజర్వేషన్ ను 6 శాతానికి పెంచాలని సంస్థ కార్యదర్శి నందగోపాల్ గవర్నర్ ను కోరారు.

ఉపాధ్యక్ష్యులు ఇజ్రాయేల్ వందన సమర్పణ చేశారు.

ఆస్కా సభ్యులు, వ్యాపారవేత్త ఆదిశేషయ్య, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు వేణుగోపాలరెడ్డి, అఖిల భారత అట్టపెట్టెల సమాఖ్య అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి తదితర నగరంలోని తెలుగు ప్రముఖులు, వెంకయ్య నాయుడు కుమార్తె పాల్గొన్నారు.

సభ మధ్యలో..  జనబాహుళ్యంలో పేరొందిన “కృషి ఉంటే మనుషులు రుషులౌతారు” పాట సాహిత్యాన్ని మార్చి ప్రముఖ సినీ గీత రచయిత భువనచంద్ర రాసిన కట్టబ్రహ్మన, త్యాగరాజస్వాని గొప్పదనాన్ని తెలిపే గీతాన్ని ప్రముఖ గాయకులు రాము ఆలపించారు. ఇందులో వెంకయ్యను కూడా కీర్తించారు. రామును వెంకయ్య నాయుడు సత్కరించారు.

వెంకయ్య రావడం ఆలస్యం కావడం వల్ల 4కి మొదలవ్వాల్సిన సభ ఆరు గంటలు అవుతూండగా ప్రారంభమైంది.
కార్యక్రమానికి ముందు ఎస్పీ శైలజ, రాము జనాదరణ పొందిన సినీ గీతాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. మెడ్రాస్ క్రిస్టియన్ కళాశాల విద్యార్థి సురేష్ మిమిక్రీ ఆకట్టుకుంది.
సమాఖ్య తరఫున సీఎంకే రెడ్డి పై ఒక ప్రైవేట్ తపాలా బిళ్ళను విడుదల చేశారు.
జాతీయ గీతాన్ని, తమిళ తాయి గీతాన్ని ఆలపించిన చిన్నారులను వెంకయ్య దగ్గరకు పిలిచి అభినందించారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఉపన్యాసం వీడియో లు ఇక్కడ ……

 

ప్రసార మాధ్యమాలతో భాష ముందుకే వెళ్తోంది.

ప్రసార మాధ్యమాలు – తెలుగు భాషా సాహిత్యాలు” అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో వక్తలు

ప్రసార మాధ్యమాలతో తెలుగు భాష ముందుకే వెళ్తోందని, ఈ ధోరణిని అర్థం చేసుకొని యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని గొల్లపూడి మారుతీ రావు, పెన్సిల్వేనియ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య అఫ్సర్ పేర్కొన్నారు.
డీ ఆర్ బీ సీ సీ హిందూ కళాశాల “ప్రసార మాధ్యమాలు – తెలుగు భాషా సాహిత్యాలు” అంశంపై తలపెట్టిన రెండు రోజుల ( ఫిబ్రవరి 1, 2 తేదీలు ) అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. నగర శివారులోని పట్టాభిరాంలోని కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగిన ప్రారంభోత్సవంలో ప్రముఖ నటులు, రచయిత, కాలమిస్టు గొల్లపూడి మారుతీ రావు ముఖ్య అతిథిగా, పెన్సిల్వేనియ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య అఫ్సర్ కీలక ఉపన్యాసకులుగా పాల్గొన్నారు.

ముందుగా కళాశాల ప్రధానోపాధ్యాయురాలు డా. లక్ష్మి స్వాగతోపన్యాసం చేస్తూ…అత్యంత ప్రాచీన ద్రావిడ భాష తెలుగు అని, భాషా ప్రేమికుడయిన శ్రీకృష్ణదేవరాయలు కూడా “ఆముక్తమాల్యద” ను రచించి భాషా సేవ చేశాడని గుర్తు చేశారు. ప్రసార మాధ్యమాల ద్వారా తెలుగు సాహిత్యం మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు.

కళాశాల కార్యదర్శి వెంకటేష్ పెరుమాళ్ సదస్సు సంచికను విడుదల చేసి మొదటి ప్రతిని గొల్లపూడికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1969  నుంచి తమ కళాశాలలో తెలుగు బోధిస్తున్నారని, 1979నుంచి తెలుగు సాహిత్యంలో బి. ఏ నిర్వహిస్తున్నామని   పేర్కొన్నారు.

అంతర్జాతీయ సదస్సు ద్వారా విద్యార్థులు లబ్ధి పొందగలరని సంచాలకులు రాజేంద్ర నాయుడు ఆకాంక్షించారు.

ప్రతి భాషకూ గ్రాంథిక, వ్యావహారిక, గ్రామ్య అన్న మూడు రకాలు ఉంటాయని, ఒకప్పటి గ్రామ్య భాష నేటి వ్యావహారికంగా మారిందని విశిష్ట అతిథి ఆచార్య ఎల్బీ శంకరరావు వివరించారు. భాషపై సినిమాల ప్రభావం చాలా ఉందని అన్నారు. డిగ్రీలో మాత్రమే తెలుగు ఉన్న కళాశాల అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం తన 60 ఏళ్ళ వృత్తి జీవితంలో మొదటిసారి చూస్తున్నానని ఆయన ప్రశంసించారు.

సమాచార విప్లవానికి నూతన సాంకేతిక యుగం తోడ్పడిందని సీతమ్మ పేర్కొన్నారు.
భావ, జాతీయ, అంతర్జాతీయ సమైక్యతకు తోడ్పడే భాషా సాహిత్యాల విలువలని విద్యార్థులకి పంచే ఉద్దేశంతో అంతర్జాతీయ సదస్సును తలపెట్టామని సదస్సు ఉద్దేశాన్ని వివరించారు.

ఆకట్టుకున్న గొల్లపూడి

గొల్లపూడి ప్రసంగిస్తూ…
1965లో మొదటిసారిగా “ఆత్మ గౌరవం” చిత్రానికి రచయితగా పని చేశానని, ఆ చిత్రానికి గాను కలవల కన్నయ్య చెట్టి సారథ్యంలోని
“మద్రాసు ఫిలిం ఫ్యాన్స్” పురస్కారాన్ని అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అందుకున్నానని గుర్తు చేసుకున్నారు. పత్రికలతో మొదలుపెట్టి అన్నిరకాల కమ్యూనికేషన్ మాధ్యమాలలో పని చేసే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు.

సమాచార వ్యవస్థ గురించి “ఫ్యూచర్ షాక్” రచయిత ఆల్విన్ టాఫ్లర్ చెప్పిన విషయాలను పలుసార్లు ఉటంకించారు.

ప్రస్తుతం సమాచార వ్యవస్థ వెర్రితలలు వేస్తోందని,  ప్రసార మాధ్యమాలు ప్రజలకు “రీచ్” అవ్వాలన్న తాపత్రయాన్ని వదిలి  “ప్రీచ్” చెయ్యాలని హితవు పలికారు.

భూమ్మీద మానవ మనుగడ సాగిన 50వేల సంవత్సరాలలో గత రెండు తరాలలోనే సమాచార విప్లవం జరిగిందని పేర్కొన్నారు.
బొమ్మ, మాట, అక్షరం, దృశ్యం అన్న క్రమంలో అభివృద్ధి చెందిన కమ్యూనికేషన్ నేడు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు.

ఒకే సినిమాను చూసి ఒక వ్యక్తి హంతకుడు కాగా మరొక వ్యక్తి యోగి అయిన సందర్భాన్ని ఉదహరిస్తూ… మీడియా మహిమ అనంతం అని వ్యాఖ్యానించారు.

ఆధునిక సమాచార వ్యవస్థ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా అని, యువతరం వివేకంతో మంచివైపే నడవాలని ఆకాంక్షించారు.

అఫ్సర్ కీలకోపన్యాసం చేస్తూ…
తెలుగు భాష విషయంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల గురించి అనేక ఆసక్తికర విషయాలను తెలిపారు.
భాషను బోధించడం, భాషను అనేక విధాలుగా విద్యార్థులకు అందించడమనే ప్రక్రియ కష్టతరమైనదని, హిందూ కళాశాల అందులో ముందుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.  అమెరికాలో ఉన్న ఒకే ఒక తెలుగు శాఖ నిర్వహకుడిగా తన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ప్రింట్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వచ్చిన మార్పు జీవితాలను శాసిస్తోందని

ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో తెలుగు మరింతగా వృద్ధి చెందుతోందని అంటూ..
2010లో టెక్సాస్ లో మొదటిసారి తెలుగు విభాగాన్ని ప్రారంభించినప్పుడు పది మంది విద్యార్థులు ఉండేవారని, అతి త్వరలో ఆ సంఖ్య ఐదు వందలకు పెరిగిందని వెల్లడించారు. తెలుగు  సాహిత్యం మీద ప్రజలలో పెరిగిన ఆసక్తికి అది తార్కాణమని అన్నారు.

ఒకే సంస్కృతి, ఒకే రంగు అన్న భావన బలపడుతోందని, అందుకే స్థానిక తెలుగువారు ఎంతో జాగరూకతతో వ్యవహరిస్తున్నారన్నారు. మీడియాను ఉపయోగించుకొని పిల్లలకు భాష, సంస్కృతిలను చేరవేస్తున్నారని తెలిపారు.

అక్కడి పిల్లలు అద్భుతమైన సాహిత్యం చదువుతారని, బజారులో కూరగాయలతో పాటు పుస్తకాలు కూడా కొని మరీ చదువుతారని వివరించారు. సాంకేతిక విప్లవానికి అక్కడ పెద్ద పీటే వేసినా…అక్కడ బడుల్లో చదవడం, రాయడం తప్పనిసరి చేయడం వల్ల ఏడాదిలొనే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని అన్నారు.

సాంకేతిక విప్లవం భాషా పోషణ, సాహిత్యాభివృద్ధికి తోడ్పడుతున్నాయని అంటూ…
బీబీసీ లాంటి పెద్ద సంస్థ తెలుగు కార్యక్రమాలను ప్రారంభించడం తెలుగు భాష సాధించిన విజయమని పేర్కొన్నారు. యురోపియన్ భాషలతో సమానంగా తెలుగు నిలబడిందని సంతృప్తిని వ్యక్తం చేశారు.

తెలుగు అంతరించిపోతుందన్న భయం తనకు లేదని, వేల సంవత్సరాల ఘన చరిత్ర మన భాషదని ధీమా వ్యక్తం చేశారు.

తను ప్రస్తుతం పని చేస్తున్న పెన్సిల్వేనియ విశ్వవిద్యాలయంలో విదేశీయ విద్యార్థులు  తెలుగు సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అమ్మమ్మలతో అనుబంధం ఏర్పరచుకోవాలన్న ఆకాంక్షతో అమ్మానాన్న వద్దంటున్నా తెలుగు నేర్చుకొంటున్న  తెలుగు యువత గురించి వెల్లడించారు.

గొల్లపూడి అనేక సంవత్సరాలు నిర్వహించిన ప్రసిద్ధ “జీవనకాలం” పాఠకుడినని వెల్లడించారు.

కల్పన గుప్తా అతిథులని పరిచయం చేసి  కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య ప్రత్తి సీతమ్మ అతిథులందరినీ సత్కరించారు. డా. చామర్తి మాధవి వందన సమర్పణ చేశారు.

 

మొదటి సదస్సు

మొదటి సదస్సుకి ఆచార్య ఎల్బీ శంకరరావు అధ్యక్షత వహించారు. ఆద్యంతం భాషకు సంబంధించిన అనేక విషయాలను విద్యార్థులకు ఆసక్తి కలిగేలా వివరించారు. డా. మాధవి వందన సమర్పణ చేశారు.

ఒకప్పుడు 372 వార పత్రికలు ఉండేవని, నేడు ప్రముఖంగా మూడే కనిపిస్తున్నాయని “వార పత్రికలు – తీరుతెన్నులు” అంశంపై పత్ర సమర్పణ చేసిన ఆచార్య జేవీ సత్యవాణి (ప్రొఫెసర్, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం) ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల భాషను రాసే విషయంలో ఎంత శ్రద్ధ పెడుతున్నామో, అంతే శ్రద్ధ మన భాషకు సంబంధించిన విశిష్టమైన అక్షరాల మీద కూడా పెట్టాలని ఆమె అన్నారు. ఆధునికంగా అభివృద్ధి చేయబడిన ఖతులను నేర్చుకుంటేనే ఏ రంగంలోనైనా భవిష్యత్తు అంటుందన్నారు. శాస్త్రీయమైన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూనే విద్యార్థులు మన భాషను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలని సూచించారు.

“ఆకాశవాణిలో సాహితీ కార్యక్రమాలు – పరిశీలన” అంశంపై ఆకాశవాణి మద్రాసు కేంద్ర సహాయ సంచాలకులు గోడా లలిత పత్ర సమర్పణ చేశారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో అద్భుతమైన తెలుగు భాషలో అనేక కార్యక్రమాలు ప్రసారమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా మొదటి కేంద్రమైన మద్రాసులో మహామహులు వేటూరి ప్రభాకరశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కోరాడ రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఆది నుంచి 80ల వరకు ఆకాశవాణి వెలువరించిన “వాణి” పత్రికలో వెలువడిన వ్యాసాలను కొన్నింటిని వివరించారు.
దామెర్ల అంకభూపాలుడు తను రచించిన “ఉషా పరిణయం” పీఠికలో చెన్నపట్టణం ఏ విధంగా ఏర్పడిందీ వివరించాడని వేటూరి తన వ్యాసంలో పేర్కొన్నారని ఆమె వెల్లడించారు.

“పత్రికల్లో పుస్తక సమీక్షలు” అంశంపై పత్రాన్ని సమర్పించిన మన్నవ గంగాధర ప్రసాద్ మాట్లాడుతూ.. తమ పుస్తకాలను పరిచయం చేసే ఉద్దేశంతో రచయితలు సమీక్షలను ప్రారంభించారని ఆయన అన్నారు. ఒక వర్గం పాఠకులని ఆకట్టుకునేందుకు పత్రికలు వీటిని ప్రవేశపెట్టాయని పేర్కొన్నారు. మొదటినుంచీ కూడా నిష్పాక్షికంగా సమీక్షలు జరగడంలేదని, 80లలో మొదలైన ప్రపంచీకరణ వల్ల సమీక్షలలో నాణ్యత మరింత తగ్గిందని ఆయన నిర్మొహమాటంగా వెల్లడించారు. ఒక పుస్తకం గురించి శ్రీశ్రీ రాసిన సమీక్ష, ఇటీవల ప్రచురింపబడిన ఒక సమీక్షను చదివి వినిపించారు.

పుస్తకాలు, పత్రికలు, సమీక్షలు అన్నీ ఇంగ్లీష్ ప్రభావం కారణంగా వచ్చినవేనని తెలిపారు.

తెలుగువారికి తమిళ నేలతో ఉన్న బంధం అత్యంత గొప్పదని, తెలుగు పత్రికలు కూడా ఈ నేలపైనే పురుడు పోసుకున్నాయని
“తమిళనాడులో తెలుగు పత్రికలు” అంశంపై పత్రాన్ని సమర్పించిన విస్తాలి శంకరరావు (మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు) అన్నారు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రముఖాంధ్ర, చందమామ, బుజ్జాయి… నేటి శ్రీవాసవీ మిత్ర వరకు అనేక పత్రికలకు మద్రాసు పుట్టిల్లు అయిందని, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్వాహకులు పత్రికలను కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

 

తెలుగొస్తే చాలు.. కొలువులే…

అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పకులు

సామాజిక మాధ్యమాల ఆధారంగా ఏర్పడుతున్న కొలువులపై పవర్ పాయింట్ ప్రెసెంటషన్ ద్వారా అవగాహన కల్పించి బీబీసీ తెలుగు విభాగానికి చెందిన బి. వేణుగోపాల్   విద్యార్థులను ఆకట్టుకున్నారు. తెలుగులో ఉన్నన్ని వెబ్సైట్లు, మీడియా, ఉద్యోగాలు ఇంకే భాషలోనూ లేవని, ఆకర్షణీయంగా రాయగేవారు ఇట్టే ఉద్యోగ అవకాశాలను పొందచ్చని ఆయన అన్నారు. తెలుగు భాష ఆధారంగా సామాజిక మాధ్యమాలలో ఏ దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఆయన తెలిపారు. 12 సంవత్సరాల పైబడిన వారిలో తెలుగు చదువుతున్న వారి సంఖ్య ఏటా పది శాతం పెరుగుతోందని విద్యార్థుల కరతాళధ్వనుల మధ్య వెల్లడించారు.

పత్రికలు, ప్రసార మాధ్యమాలలో సినిమా సమీక్షలకు సంబంధించిన భాష సినిమాల నుంచి, మన దైనందిన జీవితం నుంచి వచ్చినదేనని సీనియర్ పాత్రికేయులు రెంటాల జయదేవ వివరించారు. చక్కని భాషను సొంతం చేసుకుంటే అనేక కొలువులు ఆహ్వానం పలుకుతాయని ఆయన వివరించారు.

యూట్యూబ్ లో వస్తున్న లఘు చిత్రాల వెల్లువతో ఎందరో ప్రతిభ గల రచయితలు, దర్శకులు, నటులు, గాయకులు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు గుర్తింపు పొందుతున్నారని పుష్పాలత భాస్కర్ తన పత్రంలో పేర్కొన్నారు.

ఆంగ్ల భాషను రాసే విషయంలో ఎంత శ్రద్ధ పెడుతున్నామో, అంతే శ్రద్ధ మన భాషకు సంబంధించిన విశిష్టమైన అక్షరాల మీద కూడా పెట్టాలని ఆచార్య జేవీ సత్యవాణి (ప్రొఫెసర్, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం) అన్నారు. ఆధునికంగా అభివృద్ధి చేయబడిన ఖతులను (కీబోర్డు) నేర్చుకుంటేనే ఏ రంగంలోనైనా భవిష్యత్తు అంటుందన్నారు.

ఇంకా ఆకాశవాణి మద్రాసు కేంద్ర సహాయ సంచాలకులు గోడా లలిత, పాత్రికేయులు మన్నవ గంగాధర ప్రసాద్, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ సహాయ ఆచార్యులు విస్తాలి శంకరరావు, శ్రీకన్యకాపరమేశ్వరి మహిళా కళాశాల తెలుగు శాఖాధిపతి డా. మోహనశ్రీ, ప్రెసిడెన్సీ కళాశాల అధ్యపకురాలు డా. ఎలిజబెత్ జయకుమారి, శిష్ట్లా రామచంద్రరావులు వివిధ ఆసక్తికర అంశాలపై పత్రాలను సమర్పించారు.

ఆచార్య ఎల్బీ శంకరరావు, విస్తాలి శంకరరావు, ఆచార్య యోగ ప్రభావతీ దేవి సదస్సులకు అధ్యక్షత వహించారు. డా. మాధవి వందన సమర్పణ చేశారు.

 

ఆకట్టుకున్న పాత్రికేయుల సదస్సు

“ప్రసార మాధ్యమాలు – భాషా సాహిత్యాలు” అంతర్జాతీయ సదస్సులో శుక్రవారం ఉదయం జరిగిన పాత్రికేయుల పత్ర సమర్పణ సదస్సు ఆసక్తికరంగా సాగింది.

“దినపత్రికలలో భాషా పరిణామం” అంశంపై చెన్నైకి చెందిన సీనియర్ పాత్రికేయులు డా. ఎస్ కే ఎం డి గౌస్ బాషా సమర్పించిన పత్రాన్ని కళాశాల అధ్యపకురాలు చామర్తి మాధవి చదివి వినిపించారు.  తెలుగు పత్రికలలో ఆంగ్ల పదాల వాడకం ఎక్కువగా ఉన్న పరిస్థితికి తెలుగు ప్రభుత్వాలు చొరవ చూపకపోవడమే కారణమని బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విశాతంలో తమిళనాడు, పశ్చిమ బంగ్లా ముందున్నాయని పేర్కొన్నారు.  “రాజకీయ వార్తలు – భాష” అంశంపై టి. ప్రభాకర్ పత్రాన్ని సమర్పించారు. ఇందులో.. నానాటికీ దిగజారుతున్న రాజకీయ నాయకుల మాటలు దినపత్రికల్లో యథాతథంగా రావడం శోచనీయమని అన్నారు.

“తెలుగు సినిమా మాటల్లో భాషా సాహిత్యాలు” అంశంపై తెలుగు సినీ రచయితల సంఘానికి ఉపధ్యక్షురాలిగా ఉన్న ఉమర్జీ అనూరాధ పత్రాన్ని పంపించారు. ఆమె భర్త, మరొక ప్రసిద్ధ సినీ మాటల రచయిత గౌతమ్ కాశ్యప్ చదివి తన అభిప్రాయాలను కూడా వెల్లడించి విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం “సినిమా పాటలు అంశంపై హైదరాబాద్ నుంచి వచ్చిన సీనియర్ పాత్రికేయులు గుళ్ళపూడి శ్రీనివాస కుమార్ ప్రసంగ వ్యాసాన్ని సమర్పించారు. వెనకటి తరం పాటలలోని భాషా మాధుర్యాన్ని, ఆ మాటలలోని పరమార్థాన్ని విడమరిచారు. ఇళ్ళలో పెద్దలు చెప్పే మంచి విషయాలను అందంగా ప్రస్తావించిన “దేవుడనేవాడున్నాడా”, “మత్తు వదలరా” పాటలను కర్ణపేయంగా పాడుతూ విద్యార్థుల మనసు దోచుకున్నారు.

సదస్సుకి అధ్యక్షత వహించిన సీనియర్ పాత్రికేయులు రెంటాల జయదేవ పలు ఆసక్తికర విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. స్థానికంగా ఉన్న పాత్రికేయులు కళాశాలల విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేయగలరని పేర్కొన్నారు. ఒక అంశంపై పత్రాన్ని సమర్పించేటప్పుడు లోతుగా పరిశీలించి వ్యాసం రాయాలని, వీలున్నంత సమగ్రంగా సమర్పించాలని వివరించారు. ఆచార్య ఎల్బీ శంకరరావు పత్ర సమర్పకులకు అభినందనలు తెలిపారు.

 

తెలుగు వెలుగుకి మాధ్యమాలను ఉపయోగించుకోవాలి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్

ఘనంగా అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవం

తెలుగు ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా ఎదగడానికి అంతర్జాలం, పత్రికలు, మాధ్యమాలు వేదిక కావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. ధర్మమూర్తి రావు బహద్దూర్ కలవల కణ్ణన్ హిందూ కళాశాల తెలుగు శాఖ నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం సాయంత్రం పట్టాభిరాంలోని కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ…

కలవల కణ్ణన్ శ్రేష్ఠి చేతికి వెన్నెముక లేదని, అందుకే ఒక మహోన్నత ఆశయంతో ఆయన కళాశాలను నెలకొల్పారని ప్రశంసించారు. ఆ ధర్మమూర్తి ఆశయాన్ని కొనసాగిస్తున్న కార్యదర్శి  వేంకటేశ పెరుమాళ్ ను అభినందించారు.
తన తండ్రి, మండలి వేంకట కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖమంత్రిగా ఉండగా  చేతుల మీదుగా ఇక్కడ ఒక భవనం ప్రారంభోత్సవం జరిగిందని ఇక్కడికి వచ్చిన తరువాతే తనకి తెలిసిందని భావోద్వేగానికి గురయ్యారు.  అటువంటి కళాశాల కార్యక్రమానికి తను ముఖ్య అతిథిగా రావడం తన అదృష్టమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విదేశాలలో ఉన్న అఫ్సర్ వంటి ఆచార్యుడిని ఆహ్వానించడంలొనే సదస్సు ఉన్నత ఉద్దేశం వెల్లడవుతోందని ప్రశంసించారు. ఆధునిక యుగంలో మాధ్యమాల సేవ అనితరసాధ్యమని అంటూ.. వివిధ రకాల మాధ్యమాల ప్రాధాన్యతను విశదీకరించారు  పత్రికల భాషా సేవను వివరిస్తూ…”భారతి” పత్రిక ద్వారా ఆంధ్ర సాహిత్యానికి విశేష సేవ చేసిన “దేశభక్త” కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రాతః స్మరణీయులని కొనియాడారు. కిన్నెర, ఆంధ్ర పత్రిక తదితర అనేక పత్రికలకు పుట్టిల్లు మద్రాసేనని పేర్కొన్నారు. నవలల నాటకీకరణ, నాటకాలు, ఉపన్యాసాలు, బాల సాహిత్యంలో ఆకాశవాణి విశేష సేవ చేసిందని, సాహిత్యం పెద్ద ఎత్తున ఆకాశవాణి వల్లే వచ్చిందని గుర్తు చేశారు. వేషభాషాల్లో తెలుగు ప్రసార మాధ్యమాలు తనను నిరుత్సాహానికి గురి చేశాయని, ఒక రకమైన సంకర భాషకు అవే నాంది పలికాయని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యాతలకు తెలుగు బాగానే వచ్చని, వాళ్ళ చేత మంచి భాష మాట్లాడించని యాజమాన్యాలకు శిక్షణ అవసరంగా ఉందని ఛలోక్తి విసిరారు. దినపత్రికలలో “ఈనాడు” మంచి భాషకు మారుపేరుగా ఉందని ప్రశంసించారు. సామాజిక మాధ్యమాలు మంచి, చెడు రెండూ చేయగలవన్నారు. తెలుగు ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా ఎదగడానికి అంతర్జాలం వేదిక కావాలని, ఈ విషయంలో తమిళులని ఆదర్శంగా తీసికొని మన రచయితల రచనలను అందుబాటులోకి తీసికొని రావాలని సూచించారు. సాహితీమూర్తులని గౌరవించుకోవడంలో కన్నడవారు ముందున్నారని అన్నారు.

వేల పుస్తకాలు, పత్రికలను డిజిటలైజ్ చేసిన మనసు ఫౌండేషన్ సేవలను కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక శాఖ “తెలుగు విజయం” పేరిట ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించారు.
అంతకుముందు ఆచార్య సి. మృణాళిని సమాపనోత్సవ సందేశాన్నిచ్చారు. అన్ని మాధ్యమాలలో పని చేసిన అనుభవాన్ని రంగరించి చక్కని ప్రసంగం చేసి విద్యార్థులను ఆకట్టుకున్నారు.
దినపత్రికలే భాషను ముందుకు తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
ప్రామాణికమైన తెలుగు భాషను ఉపయోగించడంలో, ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్థకాలను తీసుకురావడంలో ఈనాడు దినపత్రిక అన్నిటికన్నా ముందుందని అభినందించారు. చీర్ లీడర్స్ ను “ఉల్లాసినులు” అని ఆ పత్రిక పేర్కొనడం తన మనసుకు ఉల్లాసాన్ని కలిగించిందని అన్నారు. రేడియో చదువురాని వారికి కూడా అమూల్యమైన సేవలందిస్తూ వచ్చిందని అన్నారు. అయినా, రేడియో, దినపత్రికలకన్నా టీవీ, సినిమాల ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంది కాబట్టి… ఆ మాధ్యమాలకి ఒక సామాజిక బాధ్యత ఉండాలని ఆశిస్తామని వ్యాఖ్యానించారు. సంస్కారయుతమయిన భాష అవసరాన్ని మాధ్యమాలు గుర్తించాలని కోరుతూ… కొన్ని సందర్భాలలో రాజకీయ నేతలు మాట్లాడే తప్పుడు మాటలను ప్రజలు నిజజీవితంలో మాట్లాడడం సమంజసమేనని అనుకోవడం శోచనీయమని అన్నారు. అనువాద రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, టీవీ రంగంలో అనువాదకుల వ్యవస్థ పటిష్ఠంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పోటీ పరీక్షలలో తెలుగు స్థానాన్ని గురించి చెప్తూ.. సివిల్ సర్వీసెస్ లో తెలుగు సబ్జెక్ట్ కి మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల తన విద్యార్థులు 8 మంది ఐఏఎస్ కు ఎంపికయ్యారని చెప్పారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న చీఫ్ ఇన్కం టాక్స్ కమిషనర్ మేడిశెట్టి తిరుమల కుమార్ మాట్లాడుతూ.. జర్మనీ, జపాన్, చైనా, రష్యా దేశాలలో ఇంగ్లీషు ఉనికిలో లేదని, వాళ్ళ భాషాలలోనే వాళ్ళు రాణిస్తున్నారని పేర్కొన్నారు.
ఆంగ్లం వస్తేనే ఉద్యోగలొస్తాయన్నది అపోహేనని అంటూ.. తల్లి పాలు తాగి పెరిగిన పిల్లలకి, పోత పాలు తాగి పెరిగిన పిల్లలకి ఉన్న తేడా తెలుగు, ఇంగ్లీష్ భాషల పిల్లలలో కూడా కనిపిస్తుందని విద్యావేత్త కొమర్రాజు వేంకట లక్ష్మణరావు అన్న మాటను ఉటంకించారు. తాను కూడా ప్రాథమిక, ఉన్నత విద్యను, ఒక్క పీజీ తప్ప, తెలుగులోనే చదువుకున్నానని తెలిపారు. 1984లో సివిల్స్ కూడా తను తెలుగులోనే రాసి ఐఆర్ఎస్ కు ఎంపికయ్యానని వెల్లడించారు.

సదస్సును నిర్వహించడం వల్ల మరిన్ని కార్యక్రమాల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత కనబడుతోందని సదస్సు సారథి సీతమ్మ వ్యాఖ్యానించారు.  మీడియా అనే ప్రపంచపు మరొక కోణాన్ని చూపడం ద్వారా పత్ర సమర్పకులు విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాను కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

కళాశాల ప్రధానోపాధ్యాయురాలు ఆచార్య వి. లక్ష్మి, సంచాలకులు రాజేంద్ర నాయుడు, ఆచార్య నిర్మల పళనివేల్ తదితరులు పాల్గొన్నారు.

కళాశాల తెలుగు విద్యార్థిని రోజా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

 

****************************************************

 

అమలాపురం లో త్యాగరాజ 171 వ ఆరాధనోత్సవం

శ్రీ త్యాగరాజ ప్రబ్రహ్మ 171 వ ఆరాధనను పురస్కరించుకుని స్థానిక రేకపల్లి కాంప్లెక్స్ నందు శ్రీ భారతీ గాన సభ, లయన్స్ క్లబ్ – వశిష్ట సంయుక్త ఆధ్వర్యంలో అయ్యగారి శ్యామసుందరం గారి వీణా వాదన కచేరీ జరిగింది. శ్రీ భారతీ గాన సభ వ్యవస్థాపకులు రేకపల్లి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ అన్నమయ్య, రామదాసుల తర్వాత త్యాగరాజు సంగీతం ద్వారా భక్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లారని త్యాగరాజు కీర్తిని కొనియాడారు.

త్యాగరాజు రచించి, గానం చేసిన ‘ ఎందరో మహానుభావులు ‘ కీర్తనతో ప్రారంభమయిన ఈ వీణా వాదన శ్రోతల మనస్సులను రంజింపజేసింది. అయ్యగారి శ్యామసుందరం వీణావాదన ద్వారా సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ‘ వైణికా వతంస ‘ బిరుదు నిచ్చి సత్కరించారు. డా. గోదశి అనంతాలక్ష్మి, లయన్స్ క్లబ్ – వశిష్ట అధ్యక్షురాలు మాకిరెడ్డి వి. ఎన్. ఎస్. పూర్ణిమ, కోనసీమ మహిళా మండలి అధ్యక్షురాలు అనంతాలక్ష్మి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పాలగుమ్మి వినాయక్ శ్యామసుందరాన్ని, మృదంగ సహకారం అందించిన పేరి రఘునాధ్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోచినపెద్ది కామసత్యనారాయణ, రేమెళ్ళ రామ సూర్యనారాయణ, శిష్టా రామగోపాల్, మంగళంపల్లి జవహర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

 

 

భక్తి జ్ఞాన వైరగ్యాల త్రివేణీ సంగమమే ధూర్జటి కవనం

శివకవులలో అగ్రగణ్యుడైన ధూర్జటి మహాకవి సాహిత్యలోకానికి అందించిన శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం చెప్పుకోదగ్గ రచనలని, శివభక్తిని ప్రజ్వలింపజేసే రచనలని ‘ పద్యకవి తిలక ‘ డా. ఎస్. వి. రాఘవేంద్రరావు అన్నారు.

రేకపల్లి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన స్థానికీ రేకపల్లి కాంప్లెక్స్ లో సాహితీ మిత్రమండలి, ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రసంగ భారతి సభలో రాఘవేంద్రరావు మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం, శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యముల గురించి ప్రసంగించారు. భక్తి జ్ఞాన వైరగ్యాల త్రివేణీ సంగమంలా నడిపిన ఈ రచనలు ఆథ్యాత్మిక భావాలను పెంచి పోషించి ముక్తిని ప్రసాదించే ఆణిముత్యాల్లాంటి గొప్ప కావ్యాలని, వాటి పఠనం అందరికీ శ్రేయోదాయకమని రేకపల్లి అన్నారు.

గరిమెళ్ళ స్వామీప్రసాద్, కొండేటి నాగేశ్వరరావు, సీరెడ్డి వెంకట సత్యనారాయణ, రేమెళ్ళ రామసూర్యనారాయణ, డా. ఎస్. వి. రాఘవేంద్రరావు ని దుశ్శాలువతో సత్కరించారు.

అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కవులు గోలకోటి శ్రీనివాస్, జాన దుర్గా మల్లిఖార్జునరావు, బి. వి. వి. సత్యనారాయణ, తమ స్వీయ కవితలు చదివి అలరింపజేశారు.

ఈ కార్యక్రమంలో భమిడిపాటి కృష్ణమూర్తి, అయ్యగారి శ్రీహరిరావు, గోకరకొండ కృష్ణ బలరామ గోవిందం, కందాల శ్రీనివాస్, వి. వి. పరసాదరావు, సీరెడ్డి సుగుణ, శ్రీగిరి పద్మావతి, సంగాడి రవికిషోరే తదితరులు పాల్గొన్నారు.

……. 11. ఆనందవిహారి01                                                                                                                                                                 12. వార్తావళి…….