13_009 శాస్త్రాన్ని శోధించాలి – డా. పప్పు వేణుగోపాలరావు

 

సంగీత శాస్త్రాన్ని శోధించాలని మ్యూజిక్ అకాడమీ కార్యదర్శి పప్పు వేణుగోపాలరావు అన్నారు. ఆంగ్లం, తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ పట్టా పొందిన ఆయన వంద పరిశోధనా పత్రాలు, సంగీతనృత్యాలకు చెందిన పలు గ్రంథాలు రచించారు. సంస్కృతం, ఉర్దూ భాషల్లో నృత్య నాటకాలు, అనేక పుస్తక సమీక్షలు, అనువాదాలు చేశారు.

“ సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు సోదరుడు సుబ్బరాయ దీక్షితులు. తమిళుడైనా ఆయన తెలుగులో ‘సంగీత సాంప్రదాయ ప్రదర్శిని’ అనే గ్రంథం రచించారు. దీని తమిళ అనువాదాన్ని అకాడమీ ఇదివరకే ప్రచురించింది. అకాడమీ కార్యదర్శిగా ప్రస్తుతం నేను ఆ గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నాను. గ్రంథం రెండో భాగాన్ని నా సంపాదకత్వంలో విడుదల చేశాం. విషయాన్ని శాస్త్రబద్ధంగా తెలియజేస్తూనే పాఠం చెప్పినట్టుగా కాక విద్యార్థుల అభిరుచినిబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధానంలో రూపొందించాం. చిన్నచిన్న మార్పులు చేర్పులు చేశాం. నోట్స్, వ్యాఖ్యానం రాశాం. డాక్టరు ఎన్. రామనాథన్, డాక్టర్ ఆర్ ఎస్ జయలక్ష్మి, టి.ఎం. కృష్ణ, ఆర్కే శ్రీరాం కుమార్ ప్రొఫెసర్ రీటారాజన్, విజయ్ శివ, సంగీత కళానిధి, ఆర్. వేదవల్లి తదితరులు ఈ బృహత్కార్యంలో పాల్పంచుకున్నారు. రెండు వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న సంస్కృతం, తెలుగు భాషల్లోని గ్రంథాలను ఆంగ్లం తదితర భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఉంది.

కొత్త పరిశోధకులు రావాలి

ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథస్థం చేసే బృహత్ కార్యం కోసం, ఆ జ్ఞానాన్ని ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు కొత్తతరం ముందుకు రావాలి. ఆసక్తి ఉన్నవారు సంగీత కళాప్రదర్శనలో ఒక స్థాయికి వచ్చాక శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. లక్షణ గ్రంథాలను పరిశోధించాలి. రాగం, లయ, కాల ప్రమాణం, చరిత్ర వంటి విషయాల లోతుపాతులను తెలుసుకోవాలి. గ్రంథాలను వెలువరించి వాటి సారాన్ని విద్యార్థులకి, రసికులకి అర్థమయ్యేలా ప్రాయోగికోపన్యాసాలు చేయాలి. సంగీత జ్ఞానప్రవాహాన్ని కొనసాగించాలి. ఇలా తృష్ణతో తపస్సు చేసే వారి గానంలో కూడా పరిపక్వత.. గోచరిస్తుంది. ఇప్పటి యువ విద్యాంసులలో పంతుల రమ, టి.ఎం. కృష్ణ, సంజయ్ సుబ్రమణ్యం, ఆర్కే శ్రీరాంకుమార్ వంటివారు సంగీత, శాస్త్రం రెండింటినీ సాధన చేయడం ముదావహం ” అన్నారు డా. పప్పు వేణుగోపాలరావు గారు.

 

***************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page