12_009 ఉగాది శుభాకాంక్షలు

 

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రచయితలు, పాఠకులు, శ్రేయోభిలాషులు అందించిన శుభాకాంక్షల సందేశాలు…

 

 

               కనకదుర్గ 

              అమెరికా

 

శోభకృత్ ఉగాది!

 

వసంతంలో కోయిలల కుహుకుహు

గానాలు,

చలికాలంలో వలసపోయిన పక్షులు

తిరిగి వచ్చే కోలాహలంతో

సందడిగా వుండాలి!

 

భరించలేని కాలుష్యం, వేడి ఎక్కువయి,

సిటీలో పెరిగిపోతున్నఅద్దాల

ఆకాశహర్మ్యాల్లో

ప్రతిబింబిస్తున్నపచ్చటి మాయాలోకాలు

ఆహ్వానిస్తుంటే,

గాజు కిటికీలకు కొట్టుకుని

వలసనుండి తిరిగి వచ్చే

పక్షిసంపదను కోల్పోతున్నాం!

 

వృక్షసంపదను నాశనం చేసి పెద్ద

అపార్ట్మెంట్లు, కార్పోరేట్ ఆఫీస్లు,

కొత్త కొత్త మాల్స్ కడ్తుంటే,

వుండడానికి ఆశ్రయం లేక, తినడానికి

ఆహారం లేక కొంత,

పొలాల్లోకి, సిటీల్లోకి వచ్చి అపాయంలో

చిక్కుకుని కొంత,

జంతువుల చర్మం, కొమ్ముల కోసం

వేటాడి మరి కొంత జంతు సంపదను

కోల్పోతూనే వున్నాము!

 

ప్రపంచం నలుమూలలా

ఆశ్రయం కోల్పోయి, కాలుష్యం వల్ల

గాయాలయ్యి,

ప్రాణాపాయ స్థితిలో ఉండి తల్లులను

పోగొట్టుకున్న పక్షులను,జంతువులను,

చేరదీసి ఎంతో ప్రేమతో తమ

బిడ్డలుగానే పెంచుతున్న

ప్రేమమూర్తుల సంఖ్య పెరగాల్సిన

అవసరం ఎంతైనా వుంది!

 

కుల పిచ్చి, మతపిచ్చి, జాతి పిచ్చి

ఎక్కువయి,

ముందుకు వెళ్ళాల్సిన వారం,

వెనక్కి వెనక్కి వెళుతున్నామెందుకు?

చిన్నా, పెద్దా భేదం లేకుండా

బాలికలపై, స్త్రీల పై అత్యాచారాలని

ఆపలేకపోతున్నారెందుకు?!

 

ప్రతి ఏడాది ఉగాదికి అన్నీ సమస్యలు

చక్కబడాలని కోరుకుంటాము,

ఒకమనిషి ప్రక్క మనిషి మంచి గురించి

ఏనాడు ఆలోచించడం మొదలెడతాడో

ఆనాడే అందరికీ నిజమైన ఉగాది!

 

ఈ ఉగాదితో మనిషి ధనం కంటే

బంధాలకు ప్రాముఖ్యతనివ్వాలి,

ప్రకృతితో స్నేహం చేసి వృక్షసంపద,

పక్షిసంపద, జంతుసంపదను

ముందుతరాల కోసం కాపాడాలని,

కంకణం కట్టుకోవాలి!

 

అందరికీ ఆరోగ్యం, ఆనందం, జయం,

స్ట్రెస్సులో, డిప్రెషన్లో కొట్టుకుపోతున్న

మానవజాతికి

మానసిక ప్రశాంతతని కల్గించాలని

ఉగాది శుభాకాంక్షలతో

శోభకృత్ ని మనసారా

కోరుకుందాం!

 

*********************************




            తటవర్తి జ్ఞానప్రసూన

              హైదరాబాద్

 

స్వాగత గీతం

 

కోయిల కూసింది

మామిడి కొమ్మలు చిగురించాయి

వేపచెట్టు పులకరించింది

దూరతీరాలనుంచి

చిరుగాలి వీచింది

పరుగులెత్తే మానవాళికి

పండుగ ఒక హెచ్చరిక

ఒక చైతన్య స్రవంతి

ఉగాదిపండుగ ఒక మైలురాయి

కొత్త అడుగు – కొత్త నడక

చేసిన తప్పులు చేయొద్దు

ధర్మంచేయి విడువవద్దు

మానవత్వం మరువద్దు

మాట ఇచ్చి వెనుతిరగొద్దు

మన సంస్కృతి, మన సాహిత్యం

మన భాష మన దేశం అన్నిటిని

కాపాడుదాం, గౌరవిద్దాం

ఉన్నత శిఖరంపై వెలగాలని

ఊపిరున్నంతవరకు శ్రమిద్దాం

నలుదిక్కులవారు రండి

నడుం కత్తి నిలబడండి

భారతదేశం మనది

మనం భారతీయులం 

 

********************************* 

 

 

కూచి 

చిత్రకారుడు, హైదరాబాద్ 


 

శోభల బ్రహ్మోత్సవం

 

నునులేత గోరింటవేళ్ళు

తంబురా తీగల్ని

మీటఖ్ఖర్లే!

అలసి సొలసి నిర్వాహకవర్గం

తెరవెనుక హంగామాని

ప్రదర్శించక్ఖర్లే!

ఓ గుప్పెడు వేపపూలగాలి,

ఏటవాలు మావికొమ్మ ఊయల..

గొంతులో పూసంత ఓంకారం ఉంటే…

ప్రపంచానికి వసంతాల వెల్ల!

గుమ్మాల సప్తస్వరాల తోరణ!

అరే!ప్రొద్దు ప్రొద్దుటే

కొమ్మగుబురు పొదల్లో

పూసిన తాజా

నల్లటి పువ్వు కదూ కోకిల!

చెరుకుతీపి నాదాన్ని

నాదాన్ని చేసుకు రతిప్రియుడు

కోకిలగొంతునుంచి

కుకూ శంఖారావం పూరించి…

జగతికి వసంతాలభిక్ష

పెట్టే వేళ…

ఈ ఆకుపచ్చ అమృతోత్సవం…

గుండెగుండెకూ..

శతానేక శోభల బ్రహ్మోత్సవం!

********************************* 

 

 

కాళీపట్నం సీతా వసంతలక్ష్మి 


శాస్త్రీయ సంగీత గాయని

గుర్ గ్రామ్

 

శుభాకాంక్షలు

 

శిరాకదంబం పాఠకులకు ఈ శోభకృత్ నామ సంవత్సరం ఆయురారోగ్య, సుఖ సంపదలు  చేకూర్చాలని ఆ సర్వేశ్వరుణ్ని వేడుకుంటున్నాను.

 

*********************************

 

 

దశిక శ్యామలాదేవి 

రచయిత్రి, అమెరికా

 

“శిరాకదంబం ప్రచురణ కర్త రామచంద్ర రావు గారికి, సంపాదక వర్గానికి, పాఠకులకు శ్యామలాదేవి-రామకృష్ణ దశిక అందిస్తున్న శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!”

*********************************

 


ద్విభాష్యం నగేష్ బాబు



రచయిత, వీణ విద్వాంసులు

కాకినాడ

 

ఉగాది – కోయిల

_______

మా మామిడి చెట్టుపై కోయిల  వాలి…

అదే పనిగా కూసేది.

ఉగాది వస్తోందర్రా.. అని అమ్మ అంటుండగానే….

ఇంటి ముందు  గుర్రబ్బండి ఆగేది.

పరుగులు పెట్టి…

అత్త,మావయ్యల చేతులు పట్టుకొని… ఇంట్లోకి లాక్కొచ్చేవాళ్ళం.

ఆ వెనుకే నల్లకళ్ళద్దాల మామ్మగారు…

కట్టుడు పళ్ళ తాతగారు…

ట్రంకు పెట్టెతో…

గంపెడు మనవల్ని వెంటేసుకొని దిగేవారు.

పిల్లలమంతా ఇల్లు పీకి….

పందిరి సిద్ధం చేసేవాళ్ళం.

ఉగాది ప్రవేశించేది.

నూతి చప్టామీద ..వరుస తలంట్లు..

కొత్త బట్టలు..పులిహోరలు..బొబ్బట్లు..

మొహమాటాలు…మారు వడ్డనలు!

ఇల్లంతా భిన్నదృశ్యాల సమాహారం!

బుడగ బూరాలు..గాలి చక్రాలతో…

అమ్మవారి గుడిదగ్గర జాతర ..

ఇంట్లోకి ప్రవేశించేది.

 

వీధి గదిలో …

కళావర్ రాజు కొట్టిన కౌంటుదెబ్బకు..

బావ బికారయ్యేవాడు.

కేరమ్స్ బోర్డుమీద …

రెడ్ కాయిన్ వెయ్యడానికి ప్రయత్నించి…

అన్నయ్య వెనక్కి …

 

********************************* 

 

కాంత గుమ్ములూరి 

ముంబై





********************************* 



కె. నాగకుమారి

హైదరాబాద్  

శోభకృత్ నామ సంవత్సరమా స్వాగతం

 

ఉగాది అనగానే పరవశించే ప్రకృతి సొగసులు

లేతమామిడి చిగుళ్లను తిని పంచమ స్వరంలో

గానం చేసే కోయిల కుహు కుహు నాదాలు

చిలుకల ముద్దు పలుకులు తుమ్మెద ఝంకారాలు

వికసించే పువ్వుల నవ్వుల జల్లులు

వినిపిస్తాయి కనిపిస్తాయి

కమ్మని వేపపూల పరిమళాలు

మరుమల్లెల మంచి సుగంధాలు

కవుల హృదయాన్ని రంజింప చేసే

మధుర భావ తరంగాలు

తేట తెలుగు గీతాలు

గాలికి అలవోకగా కదిలే

ఆడపిల్లల పమిట కొంగుల రెపరెపలు

అమ్మ చేతి ఆరు రుచుల పచ్చడి

చిత్రకారుడు తన కుంచెతో

ఆకస్మికంగా, అద్భుతంగా

ఆవిష్కరించే చిత్రపటం

అనిర్వచనీయమైన ఆ అనుభూతులు ఇకలేవా ?

ఆ దినమంతా సందడిగా ఆలయాల్లో

జరిగే పంచాంగ శ్రవణాలు దూరమా ?

ప్రతి ప్రాణి ప్రకృతికి తలవంచాల్సిందే

అని నిరూపించింది శుభకృతు

శోభకృతు కు శోభయమానంగా

స్వాగతం పల్కుదాం రండి ! రండి !!

 

*********************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

Please visit this page