13_009 సాక్షాత్కారము 12

బ్రతుకుపై రోసి క్రొ

వ్వాడి బాణ మ్మట్టె

తనగుండె డుస్సిపో

వగ కొట్టుకొని “శివా!

హరహరా !” అని అట్టె

అవని కొరగెను బోయ!

ఆకిరాతునికి క

న్నీటితర్పణ మిచ్చి

పారావత మ్మొక్క

పరి పైకి ఎగిరినది !

పారావత మ్మొక్క

పరి పైకి ఎగిరినది.

ఆశగా తమగూటి

కై అందు వెదకినది!

కట్టుకొన్నగూడు లేదు!

జట్టు కట్టుపిట్ట లేదు !

దిగాలు పడి ఒక్కసారి

ఎగిరి వచ్చినది క్రిందికి!

తన ప్రాణములో ప్రాణము

తన్ను విడిచి యుండ లేక

అగ్నిజ్వాలలనడుమన

ఆహుతి యైపోతున్నది!

ఒక్కసారి కనుగోనల

ఉబికి వచ్చుకన్నీటికి

కను లున్నను లేనట్లై

కటకట లాడినది పక్షి!

తన అంతము చూడ లేక

తనకన్నను ముందుగనే

తనువును ౘాలించిన ఉ

త్తమురాలిని తలచి కుమిలి

“అయ్యయ్యో! ప్రియా! ప్రియా!

భూతదయామయీ! ప్రియా!

నీౙ౦టను నన్ను విడిచి

నీవొకతెవె ౘన్నావా?

నీఆత్మీయత కర వై

నే నెలాగు నిలిచేది ?

నీవుతోడు లేకుండగ

నే నెలాగు బ్రతికేదీ?

నను దిక్కు లేనివా

నిగ చేసి పోయి తే?

ప్రాణేశ్వరీ!” అనుచు

వా విడిచి యేడ్చినది!

“ఇంతపని చేయు” మన

ఎంతపని చేసితివి?

బోయౘలి పాపితివి

ప్రాణాల నిచ్చితివి!

త్యాగమున కీవు పర

మావధివి – అది సరే!

నీవు లేనిజగాన

నే నెట్టు లుందు నే?

తనువు లివి వే ఱయ్యు

మనసు లొక్కటి చేసి

ఆదర్శదంపతుల

మై యుంటి మిన్నేళ్లు!

అనుకొన్నది నాౘా – వది అబద్ద మైనది కానీ –

అనుకోనిది నీౘా – విది అయ్యో! నిజమైన దేమి?

చూశావా? హతవిధి మన

నొసట నెలా వ్రాశాడో!

ఒకేప్రాణ మైనౙ౦ట

నేవిధి విడదీశాడో!

అనుకొన్న వొకప్డు ౙరగ –

వనుకోలే దని మానవు!

అదే అదే కాబోలును

అవనిబ్రతుకులో మర్మము.

ఎఱగక యేజన్మలోన

ఏౙ౦టను విడదీశానో –

ఎఱిగి యెఱిగి ఆపాపము

నిప్పు డనుభవిస్తున్నాను!

కాలయముడు వేటగాడు

కనికరించి విడిచెను పో!

నీవు లేని లోకములో

నేను నిలువగల నట వే

మృత్యుతటమున కివల

నేనును ఆవలితీరమునందు నీవును –

ఇరువురము నొక చోట నుండియు

ఇద్దరికి ఇపు డెంతదూరమొ!

            లేదు లేదు. – అలా జరుగు

            వీలు లేదు ప్రాణసఖీ!

            మృత్యువు గిత్యువును మనకు

            అడ్డు నిలువలేదుసుమీ!

ఈవియోగపునరక

మిక భరింపనెలేను!

ఇప్పుడే ఈక్షణమె

యిదె వచ్చుచున్నాను!

శివుని అనుగ్రహమే ఉన్న

చేరువయే నీకు నాకు!

జగన్మాతకృపాదృష్టి

సతీ! లభించెడును నీకు !

“హరహరా!” అనుచు నీ

ప్రాణాలు విడిచితి వె!

నీవరుగుకై లాస

గిరికె వస్తున్నాను!

ప్రాణమ్ములో ప్రాణ

మా! ఆగు మొక్కింత;

నీకు వెనువెంటనే

నే వచ్చుచున్నాను!

అగవే! ఒక్కక్షణ

మాగవే ప్రేయసీ!

ఆగవే! నాకోస

మాగు ప్రాణప్రియా!

ఓమహోజ్జ్వలమూర్తి !

ఓపావక స్వామి!

అంజలింతును నీకు

అగ్నిహోత్రస్వామి!

స్వాహావధూటితో

సర్వదా జతగూడి

ఎడబా టెఱుంగని

భాగ్యశాలివి నీవు!

ఇల్లాలి నెడబాసి

ఎఱుగనయ్యా! నేను!

ఆమె లేనిజగాన

ఏమిపని నా కింక?

ఆమెతో ననుగూడ

ఐక్య మొందింపగా

అగ్నిహోత్రస్వామి !

నన్ను లోగొను మంచు

“శివ ! శివా !” అనుచు తా

నగ్ని దూకెను పక్షి !

స్తంభించిపోయినది

జగమెల్ల నొకక్షణము !

పిట్టల సందడులు లేక

చెట్టు చిన్న బోయింది!

చిన్నబోవుచెట్టు నరసి

అడవి విన్న బోయింది !

ఆత్మీయులు గతించిన

ట్లడవియెల్ల ఏడ్చింది !

ఆకుకన్నుకొసల మంచు

కన్నీరే మిగిలింది !

తరువాయి వచ్చే సంచికలో….

*************************** 

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

Amazon లో మీకు కావల్సిన వస్తువుల కోసం ఈ పేజీని సందర్శించి కొనుగోలు చేయండి. ఈ పేజీలో లేని వస్తువుల amazon లింక్ మాకు పంపి మా ద్వారా order చేయగలరు….. Please visit this page