/ February 16, 2018/ సంచికలు/ 0 comments

ముందు మాట

 

“సంగీతమిచ్చేది అలౌకికానందం

పోగొడుతుంది ప్రతి దుఖం

వ్యాధులను చేస్తుంది దూరం

నొప్పులను తగ్గిస్తుంది కొంచెం

విషమైనా, వ్యాధయినా

దీని ముందు తలొంచి తీరుతుంది”

 

సంగీతం ఆనందదాయిని

సకల దుఃఖ హారిణి

సర్వరోగ నివారిణి

సకల బాధా భంజని

తగ్గించివేస్తుంది ఎంత తీవ్రమైన

విషమైనా, వ్యాధయినా ……

 

– జాన్ ఆర్మ్ స్ట్రాంగ్ (1709 – 1779)

“ది ఆర్ట్ ఆఫ్ ప్రిజర్వింగ్ హెల్త్” (బుక్ IV)

 

సంగీతం తనలో నిబిడమై ఉన్న వ్యవస్థాత్మకత మరియు క్రమబద్ధత ద్వారా వినేవారిలో ఒక రకపు ఆరోగ్యకరమైన మానసిక మరియు భావోద్వేగభరితమైన ఆనందాన్ని కలిగిస్తుందనటంలో ఎట్టి సందేహమూ లేదు. ఈ విధమైన క్రమబద్ధత మనకు ప్రకృతి లో కూడా కానవస్తుంది. పైకి వెలువరించలేని భావాలకు ఈ విధమైన సమ్మేళనం ద్వారా సంగీతం ఒక సాఫీ మరియు శక్తివంతమైన భావవ్యక్తీకరణ ఇస్తుంది. దీనివల్ల మానవుడు తానెదర్కుంటున్న వాస్తవాలను, సందిగ్ధతలనుంచీ కొంత ఉపశమనాన్ని అనుభవిస్తాడు. వెలివేయబడిబనట్టు దూరంగా మసులుతూ జీవించేవారు, అమానవీయ పరిస్థితులలో జీవించేవారు సంగీతం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని మరియు మనోధైర్యాన్ని పొందవచ్చు.

 

వయసు పైబడిన వారు, శారీరికంగా బలహీనులు, పిల్లలకు, వికలాంగులకూ సంగీతాన్ని మించిన మద్దత్తునిచ్చే తోడూ లేదు. కేవలం గర్భస్థ శిశువులకే కాక సమయానికి పుట్టిన శిశువులకు పెరగటానికి సంగీతం వినటం వలన సహాయం లభిస్తుందని వైజ్ఞానికంగా నిరూపించబడింది.

 

ప్రాచీనకాలంలోని రాగ చికిత్స అంటే, శరీరానికి, ఆత్మకూ కలిగే వ్యాధులతో రాగాల ప్రయోగం ద్వారా పోరాడే విధానమని చెప్పవచ్చు. అనేక వైజ్ఞానిక ప్రచురణలు, ఇటీవలి కాలంలో ముఖ్యంగా సంగీత శాస్త్రజ్ఞులు, ఇమ్యునాలజిస్లులు, న్యూరాలజిస్ట్లు మరియు సైకాలజిస్ట్ లు వంటి బహుళ క్షేత్ర నిపుణులు నిస్సందేహoగా సంగీతపు మోతాదులను కూడా మన దైనందిన జీవితంలో భాగంగా చేసుకోమని సూచిస్తున్నారు.

 

నాడీ సంగీత శాస్త్రం 

 

సంగీతానికి గల చికిత్సాత్మక యంత్రాంగం అనాదిగా గుర్తించబడి ఉన్నప్పటికీ, ఇది ఇటీవలి కాలం వరకూ విజ్ఞానానికి అవగాహనలోకి రాలేదు. మన పౌరాణిక గాథలలో, పురాతన శాస్త్రాలలో దీనిని ఎంతగానో కొనియాడినప్పటికీ ఇది ఇటీవలి కాలం వరకూ విజ్ఞానానికి అవగాహన లోనికి రాలేదు. మన పౌరాణిక గాథలలో, పురాతన శాస్త్రాలలో దీనిని ఎంతగానో కొనియాడినప్పటికీ, ఇప్పటికీ మనం సందేహాలూ మరియు తొలిదశలో ఉండే బాలారిష్టాల అంధకారంలో వెలుగురేఖలకై కొట్టుమిట్టాడుతున్నాం. కానీ గత కొన్ని దశాబ్దాలు మనసు మరియు శరీరం పై సంగీతానికి గల ప్రభావాన్ని గురించిన వైజ్ఞానిక సమాచార విస్ఫోటానికి ప్రత్యక్ష సాక్ష్యాలను కనుగొన్నాయి. దీనికి కారణం న్యూరో ఇమేజింగ్ విధానాల్లో విజ్ఞానం వేసిన అనేకమైన ముందంజలు తత్ఫలితంగా జన్మించినదే నేడు “న్యూరోమ్యూజికాలజీ” అనే పేరుతో పిలువబడుతున్న సరిక్రొత్త వైజ్ఞానిక శాఖ సంగీతంలో దాగి ఉన్న చికిత్సా యంత్రాంగం, దానికి గల రక్షణా పూరిత గుణం వంటి అంశాలపై అవగాహనా, పరిశోధనలూ ఇంకా ఎంతగానో కొనసాగవలసి ఉన్నప్పటికీ మనకు ఇప్పుడు మార్గం స్పష్టంగా కానవస్తోంది. దిశా నిర్ధారణలో ఎటువంటి సందేహాలూ లేవు. రాబోయే ఏళ్ళలో సంగీతం తనకు ఆపాదించబడిన “మిథ్యా వైద్యం ” అనే చెడ్డ పేరును తొలగించుకుని, ఎనేస్తీషియా, జీరియాట్రిక్స్, హోమియోపతీ, థెరపీ,  పునరావాసం, సర్జరీ మొదలైన ప్రముఖ మెడికల్ శాఖల సరసన ” పరిపూరక వైద్యం ” గా గౌరవనీయమైన స్థానాన్ని పొందగలదని మనం ఆశించవచ్చు.

 

శబ్దాల బౌతిక ప్రభావం

 

హాన్సా జెన్నీ అనే స్విస్ ఇంజినీర్ శబ్దాలు రూపొందించగల ఆకృతులుసునిశితమైన రేఖా చిత్రాలు, ఆకారాలుఆనే అంశాలపై అధ్యయనాన్నిసైమాటిక్స్లో చేశారు

శృతి పెంచటం, సంగీత తరంగాలలో మాధుర్యం వంటివి మార్చటం ద్వారా ప్రకంపనాలకు బట్టి అనేకమయినా ఆకారాలు మరియు ఆకృతులూ రూపొందించవచ్చనీ, దీనివల్ల కణాలు, కణజాలాలు మరియు అంగాలపై శబ్ద తరంగాలకు  గల ప్రభావాన్ని ఇది వక్కాణిస్తుందనీ అయన కనుగొన్నారు. ఈ ఆవిష్కరణలపై ఆధారించి గత కొద్ది సంవత్సరాలలో ఆర్త్రైటిస్, కీళ్ళ వాతం, నడుం నొప్పి, ఆపరేషన్ అనంతరం కోలుకోవటం, క్రీడలలో తగిలే దెబ్బలు, ఎముకలు విరగటం మరియు కండరాలు దెబ్బతినటం వంటి పరిస్థితులలో సహాయపడగల ఒక చికిత్సా విధానం అభివృద్దిపరచ బడింది. నొప్పిని తగ్గించటంతో బాటు ఈ ప్రయత్నాలు వీరి కదలికలను కూడా మెరుగు పరిచాయని తెలియవస్తోంది.

 

భావోద్వేగ సంక్షేమానికి సంగీతం 

 

భావాలను సంగీతం ద్వారా వ్యక్తీకరించటం అనేది అనాదిగా మానవ జాతి ప్రారంభం అయిన దగ్గరనుంచీ వాడుకలో ఉన్న విధానమే. తల్లి పాడే  జోలపాట, చెంచులు, గిరిజనులు వాడే డప్పులు, నావికులు, బోయవారు లేక కూలి జనాలు పాడుకునే పాటలు, పదాలు, ప్రేమికుడు వాయించే మురళి – ఇవన్నీ కూడా ఏదో ఒక భావోద్వేగాన్ని ప్రకటిస్తాయి : విషాదం, ఆనందం, ప్రేమ, బాధ, పిపాస, శృంగారం, ఆశ్చర్యం ఇలా ఎన్నెన్నో.

 

అణిచివేయబడిన భావోద్వేగాలు మానవ వ్యక్తిత్వాన్ని బాగా దెబ్బ తీస్తాయి. ప్రవర్తనలో కూడా సమస్యలు కూడా కలిగిస్తాయి. సంగీతాన్ని ఇటువంటి వ్యక్తిత్వ సమస్యలను పరిష్కరించటానికై అద్భుతమైన పరికరంగా వాడటానికి అనేక సంభావనలు ఉన్నాయి. భావోద్వేగాలు ” బైటికి  వెలువడే” భావాలు కావటాన, సంగీతాన్ని భావాలకు జోడిస్తే, ఆ భావాలు బైటికి ప్రకటితమయ్యే అవకాశం ఉంటుంది. మనసులో గూడు కట్టుకుని గడ్డ కట్టిన భావాల సంక్షేమాన్ని దెబ్బతీసే సంకోచం, కరిగి భావాల రూపేణా బైటికి ప్రవహిస్తాయి. సంగీతంలో సున్నితమైన రకాల నుండి  ఉద్రేకపూరితమైన వాటివరకూ అనేకం ఉన్నాయి. కోమలమైన మొట్జార్ట్ (Mozart పేరును ఈ విధంగా పలకాలి) సొనాటా వింటున్నప్పుడు మనలో కలిగే స్పందన, లేదా వివాల్డీ (ఫోర్ సీజన్స్) లో  ఉధృత నాదం విన్నప్పుడు కలిగే స్పందనా గమనించదగినవి, ఆసక్తిదాయకమైనవి.

 

సంగీతం తనంతగా ఎటువంటి హామీలనూ ఈయలేనప్పటికీ జబ్బుపడిన వారికీ, ఒంటరివారికీ మరియు వెలివేసి నట్టుండే  వారికీ  మాత్రం ఒక గొప్ప తోడు. ఇది ఒక ఆరోగ్యకరమైన మరియు ఫలదాయకమైన సంభాషణ రూపాన్నిదాలుస్తుంది, ముఖ్యంగా ఆదరణ కరువై సంభాషించేందుకు ఎవరూ లేనివారికి! సంగీతం వినే వారికి తప్పకుండా జీవితం పట్ల ఒక ఆరోగ్యవంతమైన మరియు సకారాత్మక దృక్పథం కలిగి తీరుతుంది. అసహాయంగా, విషాదంగా కృంగిపోతూ విరక్తిగా ఉండే సమయాల్లో సంగీతం ఒక ఆధారపడ తగ్గ దన్నుగా నిలిచి ఉంటుంది. ఆత్మస్థైర్యం పెంపొందించి మనసును పునరుత్తేజితం చేసి `తన వెంట ఎంతో ఉజ్వలమైన కాంతి పుంజాలను తెచ్చుకొస్తుంది.

 

మానవ సంస్కృతికి సంగీతం ఆత్మలాంటిది. ప్రకృతి శక్తిని చూసి భయపడిన ఆది మానవులనుండి తనకు తానే శత్రువుగా మారుతున్న ఆధునిక మానవుని వరకూ సకల మానవ జాతికీ సంగీతం ఒక మానసిక నేస్తం. సంగీతం “మనోధర్మ సంగీతం” (ఇవల్యూట్) గా మరియు “కల్పిత సంగీతం” (ఇవాల్వ్ద్) లేదా “పరిణత సంగీతం” గా కానవస్తూ ఉంటుంది.

 

మనసు యొక్క లోతునూ వైశాల్యాన్ని సంగీతం ప్రతిబింబిస్తుంది. అన్ని చర్చలనూ వాదనలనూ  అధిగమించే సహజ జ్ఞానం ( అనగా అంతర్గతంగా అర్థం చేసుకోగల అవగాహనా శక్తి (లేదా అంతరజ్ఞానం) సంగీతంతో విడదీయలేని  సంబంధం కలిగి ఉంది. ఈ అంతరజ్ఞానమే ప్రతి వ్యక్తికీ తమదిగా భావించగల అనుభవం – సంపూర్ణంగా స్వకీయం అయిన అనుభవాన్ని అందచేస్తుంది. ఇదే మరో మాటలో చెప్పాలంటే ఒక “ఆధ్యాత్మిక అనుభవం”. అంతరజ్ఞానమే ఆత్మజ్ఞాన సాధనకు తోడ్పడుతుంది.

 

సంగీతానికి ఎన్నో సద్గుణాలు ఉన్నాయి. ఇవి దైవత్వానికి సమానమైనవి. సంగీతం విశ్వజనీనం, నిరాకారం, సృజనాత్మకం. ప్రముఖ పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం ఆలీ తాను పాడినప్పుడల్లా భగవంతునితో సంభాషించినట్టు ఉంటుందని ఒకసారి అన్నారు.

 

సంస్కృత పదమైన “స్వరం” మూలాలు కూడా, తనంత తానుగా శృతులను, అందులోని స్వర సంగమాలనూ నిర్వహించుకోగలగటం వైపుకే సూచిస్తున్నాయి. సనాతన వ్యవస్థ అయిన “నాద యోగం”, బ్రహ్మాండాన్ని చుట్టుముట్టి ఎన్నో ప్రకంపనలున్నాయని తెలుపుతోంది. ఇది మానవ శరీరం లోపలా బైటా కూడా గల లయలను గుర్తించింది. ఈ లయలు మానవేంద్రియ శక్తుల శ్రేణికి మించి ఉన్నాయి. మానవ శక్తి పరిమితం మరియు పరిధులమయం. అపారమైన సాధనతో శారీరిక బంధాలను, ఇంద్రియశక్తులనూ అధిగమించితేనే అట్టి  ప్రకంపనాలను అనుభవించ వచ్చు. జీవశాస్త్రంలో మన శరీరంలో నిరంతరం కొనసాగే జీర్ణప్రక్రియ నుంచి, స్వరగ్రహణ విధానం వరకూ జరిగే కార్యం అంతా లయబద్ధంగా, కొన్ని వినపడేవి, కొన్ని నిశ్శబ్ద మైనవి అయిన లయల ప్రకారం జరిగిపోతాయి. వాయుప్రసరణ, రక్త  ప్రసరణ, పెరుగుదల, మార్పులు – ఈ ప్రక్రియలన్నీ కూడా కొన్ని శబ్దాలను ఉత్పత్తి చేస్తాయి. శ్రవణ శక్తిని బట్టి అవి వినపడటం లేదా వినపడక పోవటం జరుగుతుంది.

 

సంగీతం లేదా నాదం ఒక విశిష్టమైన యిన్-యాంగ్  ఆకృతిని ప్రదర్శిస్తుంది. ఇది జగత్తులో గల అన్ని ప్రాణుల్లోనూ సామాన్యంగా కానవస్తుంది. ఇక్కడ శబ్దం మరియు నిశ్శబ్దం అనే రెండు పరస్పర విరోధ అంశాలు ఒకదానిని మరొకటి మ్రింగివేయగలవే; కానీ ఇవి రెండూ ఒకే అద్భుతమైన చత్రచాయలో బంధించబడి ఉండి, ఒకదానితో మరొకటి సమ్మిళితమై ఒక విచిత్రమైన ఐక్య శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కేవలం ధ్వని తరంగాల దృష్ట్యా అయితే దీనిని కేవలం ఒక శబ్దంగా (లేదా ఒక ప్రత్యేక పౌనఃపున్య శ్రేణి గా) గుర్తించిన సంగీత కళాభిమానులు ఒక అద్భుతంగానూ భావించవచ్చు. ఒక నాదయోగి దృష్ట్యా, ఇది సంపూర్ణంగా భగవదంశ లేదా “బ్రహ్మన్” అనవచ్చు. ఈ శబ్దం మరియు నిశ్శబ్దం యొక్క అద్భుత సమ్మిశ్రణమే ఈ బ్రహ్మాండం అనే కట్టడానికి పునాది రాయి గా భావించబడుతోంది.

 

భారతీయ తత్వ చింతన కేవలం ఇంద్రియాల ద్వారా ఆర్జించిన జ్ఞానం “మిథ్య” అనీ, అంతర్ జ్ఞానమే “నిజమైన జ్ఞానం” లేదా “సర్వోత్తమ జ్ఞానం” అనీ తెలియ చెప్తోంది. జ్ఞానాన్ని తరుచూ ఆద్యంతాలు లేనిదిగానూ మరియు ఇట్టి అంతర్ జ్ఞానమే సత్యమనీ, ఈ అంతర్ జ్ఞానం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి సర్వాంతర్యామి లేదా బ్రహ్మన్  పొందవచ్చనీ బోధిస్తుంది. అంతర్ జ్ఞానం అభివృద్ది చెందని మనిషి అలా కేవలం ఒక మేధావిగానే  మిగిలిపోతాడు.   గ్రహించే శక్తి ఉండదు. అసలైన సాంస్కృతిక అభివృద్ది కేవలం అంతర్ జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమౌతుంది గాని మేధ వలన కాదు.

 

పురాతన భారతీయ నాగరికతలో మనసును “అదుపు” లో ఉంచుకోడానికి ధ్యానం చేయమని సూచించబడింది. తద్వారా చైతన్యంలో ఉన్నత శిఖరాలను మనసు అధిరోహించగలదు, నిబిడీకృతమైన సంగీత శక్తిని సంపూర్ణంగా వెలికి తేగలదు. అలౌకిక భావనలు మరియు సాధన, ఏవైతే “నాదయోగం” లేదా “లయయోగం”లో ప్రముఖ జ్ఞాన అంశాలుగా ఉన్నాయో, అవి కేవలం “ఆహత” (వినబడే ) శబ్దాలే కాక “అనాహత” (వినబడని) అంటే కేవలం ప్రకంపనలపై కూడా ఆధారపడి ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క లక్ష్యం ఈ పురాతన జ్ఞాన భండాగారాన్ని ఆధునిక సంగీత చికిత్సానేపథ్యం లో పునరావిష్కరించటమే.

 

టీవీ సాయిరాం 

‘ రాగచికిత్స ‘ ప్రారంభం వచ్చే సంచికలో…...

…. 2. భారతీ తీర్థ స్వామి వినతి                                                                                                                                                       4. మేఘదూతం…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>
*
*